ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సగం కలలోంచి నడిచి వచ్చిన…అజంతా!

Like-o-Meter
[Total: 1 Average: 4]

“ఓహ్, ఈయన మా బెంజిమన్ మాస్టరులాగా వున్నారే!”

– అనుకున్నాను అజంతా గారిని  మొదటి సారి చూసినప్పుడు!

చిన్నప్పుడు  చింతకానిలో రోజూ సాయంత్రం మా నాన్నగారితో స్టేషన్ దాకా నడుచుకుంటూ వెళ్ళడం అలవాటు. అక్కడ ఆయన ప్లాట్ ఫారం బెంచీ మీద కూర్చొని  వొకరిద్దరు మిత్రులతో కబుర్లు చెబ్తూ వున్నప్పుడు  ఆ స్టేషన్ మాష్టరు బెంజిమన్ గారు నన్ను తన ఆఫీసులోకి తీసుకువెళ్లి, కూర్చొబెట్టుకునేవారు. నా కోసం మిరపకాయ బజ్జీలు తెప్పించి, “ఒరేయ్ అబ్బాయ్! ఈ స్టేషన్ నీదేరా! నీ రాజ్యం!’ అనే వారు. అప్పుడు అక్కడ వున్న అన్ని యంత్రాలూ శల్యపరీక్ష చెయ్యడం నాకు ఇష్టమయిన కాలక్షేపాల్లో వొకటి. ఆ విధంగా నా లోపల వొక డిస్కవరీ చానల్ కి స్విచాన్ చేసిన తొలివ్యక్తులలో ఆయనా వొకరు.

అలా  “ఒరేయ్ అబ్బాయ్!” అని పుష్కరం  తరవాత నన్ను పిలిచిన ఇంకో వ్యక్తి అజంతా గారు. బెంజిమన్ మాస్టరు ఎప్పుడూ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటూ నల్ల బెల్టుతో టక్ చేసుకుని వుండే వారు. ఆయనేమో  కారునలుపు. నవ్వు మల్లె తెలుపు. అజంతా గారిని కూడా నేను ఎప్పుడూ ఆ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటులోనే, మల్లె నవ్వులోనే  చూసేవాణ్ని. అజంతా గారు మా బెంజిమన్ మాస్టరులాగే కొంచెం నలుపు! కానీ, నవ్వినప్పుడు ఆ నవ్వు సాయంకాలపు తోటలో  తెల్లగా మల్లెపూలు గుంపుగా విచ్చుకున్నట్టుగా వుండేది. పైగా, చప్పుడు చెయ్యని నవ్వు!

బెంజిమన్ మాస్టరు మాదిరిగానే అజంతా గారు కూడా తన యంత్ర నగరి (మంత్ర నగరి కూడా!) రహస్యాలు నా కళ్ల ముందు అలా పరిచేసే వారు. బెంజిమన్ గారు తన స్టేషనులో యంత్రాలు చూపించినట్టే, అజంతా గారు కలిసినప్పుడల్లా  విదేశీ కవిత్వ పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. “ఒరేయ్ అబ్బాయ్! ఇదిగో మిలాన్ కుందేరా! ఈ పుస్తకం నీదేరా!” అనే వారు.  నేను ఆ పుస్తకం  మైకంలో పడిపోయి కళ్ళు తేలవేసినప్పుడు, వొకటికి పది సార్లు ఆ రచయిత గురించి, అతని/ఆమె వాక్య విన్యాసం గురించి చెబ్తూ వుండిపోయినప్పుడు, అంతా విని, నిశ్శబ్దంగా నవ్వి, నోటికి నిలువుగా చూపుడు వేలు ఆడిస్తూ, “ ఒరేయ్ అబ్బాయ్! నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత మంది కవుల్నీ మహాకవుల్నీ కలిసినా,  నీ పుస్తకం నీదేరా! నీ కవిత్వం నువ్వే రాయాల్రా!” అనే వారు. అలా కచ్చితంగా మా చిన్నప్పటి బెంజిమన్ రైల్వే మాస్టరులాగే, ఇంకో డిస్కవరీ చానల్ లోంచి  నిగూఢమయిన కవిత్వ గుహల్ని నా చేతి వేళ్ళతోనే  తెరిపించిన వ్యక్తిత్వం – అజంతా.

2

అజంతాని కలవడానికి ముందే కొన్నేళ్ళ తరబడి ఆ కవిత్వ వాక్యాల మత్తులో తూగుతూ వున్నా.  ఖమ్మంలో చిత్రకారుడు  ‘కాళ్ళ’ దగ్గిరకు ఆయన కవితలు నడుచుకుంటూ వచ్చిన కాలం, 1979 అనుకుంటా. అందరూ శ్రీశ్రీ “మహాప్రస్థానం” గురించి తెగమాట్లాడుతూ వుంటే, మన రూటు కొంచెం సపరేటు అనుకోని నేను “ఖడ్గసృష్టి” గురించి మాట్లాడడం మొదలెట్టిన కాలం. అసలు శ్రీశ్రీ ఆ “మహాప్రస్థానం”లో కాదు, ఈ “ఖడ్గసృష్టి”లో వున్నాడు చూడండి అని నోరు చేసుకుంటున్న దశ. అప్పటికి నేను ఖమ్మంలో చాలా ఉత్సాహంగా పని చేస్తూ వున్న  ప్రజా రచయితల సమాఖ్యలో “ఖడ్గసృష్టి” అనుకూల వాదంతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్న ఉద్విగ్న ఉద్యమ క్షణాలు అవి. అప్పుడు కాళ్ళ దగ్గిర అజంతా కవితల పేపర్ కటింగ్స్ చూశాను మొదటి సారి.

చదవగానే ‘ఇదిగో నేను వెతుక్కుంటున్న అసలు సిసలు కవి దొరికిపోయాడు, యురేకా’ అని కేకలు వేయడం మొదలెట్టాను. శ్రీశ్రీ “మహాప్రస్థానాన్ని” కాదని, “ఖడ్గసృష్టి” ని అవునని – ఆ దారిలో నా ప్రతివాదాన్ని పదునెక్కించడానికి అజంతా కవిత్వం నాకు అనువుగా దొరికింది. అంటే, ముందు వొక “వాదం” కనిపెట్టి, తరవాత ఆ పట్టాల మీద అజంతా అనే రైలుని ప్రయోగాత్మకంగా ఎక్కించడం మొదలెట్టానన్న మాట. అజంతాని చదివే ముందు శ్రీశ్రీ “ఖడ్గసృష్టి” కారణంగా వొక పిచ్చిపట్టినట్టుగా అధివాస్తవిక వాద చరిత్రనీ, ఆ తరహా కవిత్వాన్ని తలకెక్కించుకుని, ఆ తరవాత “ఖడ్గసృష్టి”నీ, అజంతా కవిత్వాన్ని తల మీద పెట్టుకుని తిరగడం మొదలు పెట్టాను. అప్పుడు తెలియదు ఇంకో తొమ్మిదేళ్ల తరవాత ఆ కవిని నేను నా కళ్ళారా చూస్తానని, ఆ కవితోనే నేను బెజవాడలోని అనేక మధుశాలలు సంచరిస్తానని!

3

“పుస్తకం తిరగేసి – అంటే వెనక నించి ముందుకు – చదువు” అన్నది మా  మొదటి  సమావేశంలో ఆయన చివరి మాట నాతో- అదెలా సాధ్యం అన్నది నా మట్టి బుర్రకి అందని సంగతి. కానీ తరవాత్తరవాత ఆయనతో కబుర్ల మధ్య తేలిన విషయం – ఆయన మాట్లాడుతున్నది “వినిర్మాణం” (deconstruction) గురించే అని! చాలా మంది కవులకి మూడో పెగ్గు తరవాత పట్టపగ్గాలుండవు. కానీ, మొదటి పెగ్గు నించి చివరి పెగ్గు దాకా వొక్క మాట కూడా తూలకుండా/ వొళ్ళు అసలే మాత్రం పూనకం రాకుండా వొక అద్భుతమయిన శక్తి లోపలి నించి ప్రవహిస్తున్నట్టు మాట్లాడే ధోరణి అజంతాది. అయితే, ఆయన మాట్లాడే వాక్యాలు అతి మామూలుగానే కనిపిస్తూ గాఢమయిన అధివాస్తవికత తో నిండి వుండేవి. అజంతాతో మాట్లాడడం అంటే “మామూలు” విషయం కాదు అనిపించేది అప్పటి నా లేత బుర్రకి.

ఆయన కవిత్వం మాదిరిగానే, ఆయనతో మాట్లాడి వచ్చిన ప్రతిసారీ నేను ఆయన మాటల్ని పదేపదే మననం చేసుకుంటూ వీటి అర్ధం ఏమయి వుంటుందా అని లోలోపల శోధనలో పడేవాణ్ణి. కచ్చితంగా ఈ లక్షణమే ఆయన కవిత్వ లక్షణం కూడా! ఆయన కవిత్వం రాసే పద్ధతి కూడా! వొక వాక్యాన్ని – అది మాటల్లో కానివ్వండి, రాతల్లో కానివ్వండి- వొకే అర్ధం వచ్చేట్టు కాకుండా, అదే వాక్యాన్ని భిన్న సందర్భాల్లో విన్నప్పుడు/ గుర్తు చేసుకున్నప్పుడు/చదివేటప్పుడు  భిన్న అర్ధాలుగా విస్తరించే లక్షణం అజంతా ముద్ర అనుకుంటాను. ఈ అర్థాలన్నీ వొకే వాక్యంలోని  పది రకాల positive interpretations ని భిన్న కోణాల నించి తెరుస్తాయి. అది చాలా స్పష్టంగా అధివాస్తవిక లక్షణమే! వాస్తవికత కేవలం వొక అర్ధాన్నే సూచిస్తుందని మనం చాలా సార్లు పొరబడతాం. నిజానికి, వాస్తవికత కి వున్నన్ని అర్ధ చ్చాయలు కాల్పనికతకి వుండవు! ఈ రహస్యం బోధపడితే, అజంతా గుహల్లోకి మన నడక అందంగా వుంటుంది. మా ఇద్దరి అనేక సమావేశాల తరవాత అజంతానీ, ఆయన కవిత్వాన్ని నేను అర్ధం చేసుకున్న పద్ధతి అది!

ప్రతి కవికీ తనదయిన రచనా విధానం వున్నట్టే, ప్రతి పఠితకీ తనదయిన పఠన విధానం కూడా వుంటుంది. అజంతా రచనా విధానం ఎంత ఉత్కంఠభరితమో, ఆయన పఠన పద్ధతి కూడా అంతే ఉత్కంఠ! బెజవాడలో వున్నంత కాలం ఆయన నెలకోసారి కలవడానికి వచ్చినప్పుడు నా కోసం వొక పుస్తకం తప్పకుండా తెచ్చేవారు. కబుర్లన్నీ అయ్యాక చివరలో మళ్ళీ కలుద్దాం అనే మాట వచ్చినప్పుడు – అప్పుడు, ఆయన ఆ పుస్తకం నాకు ఇచ్చేవారు, ఆ పుస్తకం గురించి కానీ, రచయిత గురించి కానీ వొక్క ముక్క కూడా చెప్పకుండా-  ఆ తరవాతి సమావేశంలో నేను ఆ పుస్తకం వాపసు ఇచ్చేవాణ్ణి. అప్పుడు మా సంభాషణ ఆ పుస్తకంతో మొదలయ్యేది. “తిరగేసి చదివావా లేదా, చెప్పు?!” అన్నది ఆయన మొదటి ప్రశ్న. ఆ “తిరగేసి చదవడం” అన్న ప్రక్రియ అప్పుడప్పుడే నాకు అర్ధమవ్వడం మొదలయ్యింది కాబట్టి, ఆ ప్రశ్నకి నేను సిద్ధంగా వుండే వాణ్ని.

ఒకసారి:

నేను: ‘మీరొక పుస్తకాన్ని ఎన్నిసార్లు చదవగలరు? నేను రెండోసారి చదవగలిగే పుస్తకాలు తక్కువ వుంటాయి’

అజంతా: ‘పుస్తకం నిన్ను చదవాలి. వొక్కసారికే అవతలకి విసిరేసేవి చాలా వుంటాయి. నేను అవీ చదువుతాను. కానీ, నేను వొకటికి పదిసార్లు చదివే పుస్తకాలూ వున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో నా ప్రమేయం తక్కువ. కానీ, నాకు అర్ధమయ్యేట్టు చదవడం అంటే, ఆ రచయితని నేను కాస్త శంకిస్తూ కూడా చదవాలి. అది తిరగేసి చదవడంలో వొక పద్ధతి.”

ఇంకో సారి ఆయన వొక పుస్తకం తెచ్చి అందులో వొక కవిత తీసి :

‘ఒరేయ్ అబ్బాయ్! ఇదిగో ఈ కవిత నేను చదువుతాను. నువ్వు విను. ఆ తరవాత నువ్వు మళ్ళీ చదువు. నేను వింటాను.’

అది ఆయన నన్ను పరీక్షించే పద్ధతి. నేను దాన్ని ఎట్లా వింటానో ఆయన సునిశితంగా పరిశీలించే వారు. శ్రోతగా నాకు మార్కులు వేసేవారు. ఆ తరవాత నేను చదువుతున్నప్పుడు, ఆయన కళ్ళు మూసుకొని వినేవారు. శ్రోతగా ఆయనకి ఎన్ని మార్కులు వస్తాయో చెప్పమనే వారు. ఇది వొక కఠోరమయిన పరీక్ష. చాలాసార్లు ఆయన చూపుడు వేలు నోటికి అడ్డంగా వూపుతూ చిలిపిగా నవ్వేవారు నా సమాధానాలకు.

వొకసారి నేను అలా సమాధానాలివ్వడంలో అట్టర్ ఫ్లాపయ్యాను. ఆయన బారులోంచి బయటికి రాగానే, “ఒరేయ్ అబ్బాయ్! ఇప్పుడు నీకు ఇంకో క్విజ్” అంటూ తన ప్యాంటు జేబులో చెయ్యి పెట్టి, “ నా జేబులో ఏముందో చెప్పు” అని అడిగారు.

“ఏముంటుంది? మీ పర్సూ…మీ కర్చీఫు…!’ అన్నాను .

‘అక్కడే పొరపాటు చేస్తున్నావ్! జేబులో పర్సులూ కర్చీఫులే వుంటాయని అందరూ అనుకుంటారు. అట్లా అందరూ మామూలుగా వూహించనివి కొన్ని ఇక్కడ వున్నాయి” అన్నారాయన.

‘అట్లా వూహకి అతీతమయినవి చెప్పడం  కష్టం!’ అన్నాను.

“హా…ఒప్పుకున్నావ్ కదా! అంతే, పుస్తకంలో కూడా అదే జరగాలి. అందరూ అనుకునేవి కాకుండా, రచయిత కూడా అనుకునేవి కాకుండా, పుస్తకంలో ఇంకా ఏమయినా అర్ధాలున్నాయా? అని వెతకాలి. సరే, ఇప్పుడు చూడు, నా జేబులో ఎమున్నాయో?’ అంటూ ఆయన తన జేబులోంచి నాలుగు అందమయిన స్పూన్లు బయటికి తీశారు.

‘అమ్మో! ఇవి ఆ బారు వాడివి!’ అనగానే, ‘హుష్…నిశ్శబ్దం…నిశ్శబ్దం” అంటూ ఆయన వొక స్పూను నాకు ఇచ్చి మూడు స్పూన్లు మళ్ళీ తన జేబులో వేసుకుని గూడు రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు చక్కా!

అతి గంభీరంగా, అత్యంత మౌనంగా  కనిపించే ఆయనలో వొక పసివాడు రహస్యంగా వున్నాడనుకున్నాను. అట్లా తన జీవిత కాలంలో ఆయన ఎన్ని వందల స్పూన్లు బార్ల నించి అపహరించారో లెక్కలేదు! కానీ, ఆ స్పూను అడ్డం పెట్టుకుని ఆయన ఆ రాత్రి చెప్పిన పాఠం నాకు అద్భుతమయిన తాళం చెవుల గుత్తి!

4

ఆ రోజుల్లో బెజవాడ అంటే, లబ్బీపేట మసీదు వీధిలో వుండే  పురాణం గారి ఇంటి మేడ మీద  నెలకి వొక సారి జరిగే ‘సాక్షి’ సాహిత్య సమావేశాలు! ఆ సమావేశాలు నా విశ్వవిద్యాలయాలు! బెజవాడకి ఎవరొచ్చినా పురాణం గారు ఆ సమావేశాలకి అతిధిగా పిలిచే వారు. కానీ, వొక డజను మంది మాత్రమే ఆ సమావేశాలకు శ్రోతలుగా ఆహ్వానితులు. ఆ డజను మందిలో నేనూ వొకణ్ణీ.

ఆరుగంటలకు మొదలయ్యే ఈ సమావేశాలు వొక్కో సారి అర్ధరాత్రి కి ముగిసేవి. ఆ సమావేశాలకి అజంతా గారు ఠంచన్ గా వచ్చే వారు. సమావేశంలో వున్నంత సేపూ ఆయన అతిధి చెప్పింది వినడం, అందరూ మాట్లాడేది వినడం తప్ప వొక్క ముక్క మాట్లాడే వారు కాదు. నేనూ డిట్టో! “వొక్క ముక్క అయినా మాట్లాడండి బాబూ! లేకపోతే, జనాలు భయపడి ఛస్తారు!’ అని పురాణం గారు నా మీదా/ అజంతా గారి మీదా జోకులు వేసే వారు. అయినా, మేము చలించని కొండల వలె, మూగ మొద్దుల వలె, మౌనంలో వొకరికొకరం పోటీ పడే వాళ్ళం!

ఆ సాయంత్రం ఇస్మాయిల్ గారి కవిత్వ పఠనం! ఈ కవిత్వ పఠనం, ఆ తరవాత జరిగిన చాలా సంగతులు నేను మరచిపోలేని స్మృతులు! ఈ సమావేశం తరవాతి కబుర్ల లోనే ఇస్మాయిల్ గారికీ, ఈ మధ్యనే కన్ను మూసిన “మో” కీ పెద్ద వాగ్యుద్ధం జరిగింది. (నాకు తెలిసీ, దీని తరవాతనే వాళ్ళిద్దరి సంబంధాలూ కాస్త చెడిపోయాయి.  “మో… అమ్మో, “మో”ని భరించడం చాలా చాలా…. చాలా కష్టం. మీరెట్లా వేగుతున్నారు వేగుంటతో?” అని ఇస్మాయిల్ గారూ అనేశారు. సాధారణంగా ఆయన ఇలాంటి వ్యాఖ్యల్ని నిగ్రహించుకుంటారు.)

ఇస్మాయిల్ గారి కవిత్వ పఠనం తరవాత రాత్రి వొంటి గంటకు అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. అప్పటికే అజంతాగారు మంచి మూడ్ లోకి వచ్చేశారు. ఆ ఉత్సాహం ఆయన శరీరంలో కనిపిస్తోంది కానీ, మాటల్లో కాదు. ఈ స్థితిలో ఈయన వొంటరిగా ఇల్లు చేరగలరా అని నేను సంశయిస్తూ వుండగానే, “ఒరేయ్ అబ్బాయ్! మనిద్దరం వేరే మాట్లాడుకుందాం రారా!” అంటూ నన్ను తనతో పాటు మేడ కిందకి తీసుకువచ్చారు. ఆయన్ని వీలయినంత త్వరగా ఇల్లు చేర్చాలన్న ప్రయత్నంలో నేను వెంటనే వొక రిక్షావాలాని పిలిచాను. ఇక మొదలయ్యింది మా రిక్షా ప్రయాణం! ఏ లెక్క ప్రకారం ఎంత నిదానంగా వెళ్ళినా, రిక్షా వొక అరగంటలోపు అజంతా గారి ఇంటి ముందు ఆగాలి. కానీ, రాత్రి వొంటి గంటకి రిక్షా ఎక్కిన మేము తెల్లారే నాలుగు గంటల దాకా ఇల్లు చేరలేదంటే, ఈ మధ్యలో ఏం చేసినట్టు?!

ఆ అర్ధరాత్రి నించి తెల్లారే దాకా అది నిజంగా అధివాస్తవిక ఘడియ.

“ఒరేయ్ అబ్బాయ్! నీకు శమంతక మణి తెలుసా?” అన్న ప్రశ్నతో మొదలయ్యింది అన్వేషణ.

‘లేదు’ అన్నాను అనుమానంగా – ఆ శమంతక మణి ఏదో వాస్తవ పాత్ర అన్నంత అనుమానంగా, ఆ గాంధీనగర్ వీధుల్లో ఎక్కడో నిజంగానే వుందేమో, ఆమె కోసం ఆయన వెతుక్కుంటూన్నారేమో అని లోలోపల అనుకుంటూ. ఆ నాలుగు గంటలపాటూ ఆయన ఆ “మణి” గురించి రకరకాలుగా కథలు కథలుగా చెబ్తూనే వున్నారు. అవన్నీ కొన్ని అధివాస్తవిక వాక్యాల సమూహాలు! అందులో కొన్ని నాకు అర్ధమయ్యాయి, కొన్ని కాలేదు. కానీ, శమంతక మణి మాత్రం నాకు గుర్తుండి పోయింది. అదంతా వొక కవి సమయం – అజంతా కవి సమయం- అని నాకు అర్ధమయ్యింది. నిజానికి ఆయన వెతుకుతున్నది నిజంగానే ఆ పౌరాణిక శమంతక మణి గురించి! అజంతా మాటల్లోనూ, కవిత్వంలోనూ పురాణ ప్రతీకలూ, పాత్రల ప్రత్యక్ష/పరోక్ష ప్రమేయం చాలా వుంటుంది. (ఈ విషయం గురించి సుమనశ్రీ గారు ఇంకా బాగా చెప్పగలరు. కొన్ని ఉదాహరణలకు, సుమనశ్రీ గారి “అజంతా లిపి” (1999) చూడండి) అజంతా కవిత్వ శిల్పాన్ని పట్టుకోడానికి ఈ పురాణ ప్రతీకలు – సుమనశ్రీ గారు చెప్పినట్టు , ముఖ్యంగా గరుడ పురాణం – వొక మంచి రిఫరెన్సు.

అజంతాగారిలో ఇద్దరు మనుషులున్నారు: వొకరు మనల్ని ఎంతో ఎత్తులకి తీసుకువెళ్లే అధివాస్తవిక అజంతా అయితే, ఇంకొకరు లోకంలోని కుచేలత్వాన్ని చూపించే పేద బ్రాహ్మడు పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి!

ఆ ఇద్దరికీ మధ్య నిజానికి పెద్ద దూరం లేదు. తన కుచేలత్వంలోని వాస్తవికతని తిరగేసి స్వప్నిస్తూ, ఎప్పుడూ ఆ స్వప్నంలోనే సంచరిస్తూ, అప్పుడప్పుడూ ఆ స్వప్నవాస్తవంలోంచి  రోడ్డు మీదికి గభాల్న దూకి చరచరా నడుచుకుంటూ వెళ్లిపోయే అధివాస్తవికుడు ఆయన!

ఆ తెల్లా తెల్లారుజాము రిక్షా ప్రయాణంలో నేను ఆ ఇద్దరినీ చూశాను!