ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆవకాయకు ఆరో పుట్టిన రోజు

Like-o-Meter
[Total: 0 Average: 0]

‘విజయదశమి’కి – ఆవకాయకు అవినాభావ సంబంధముంది. నేడు ఆవకాయ.కామ్ కు ఆరో పుట్టినరోజు. 2007లో ఈరోజునే ఆవకాయ రూపుదిద్దుకుని మీ ముందుకు వచ్చినది. ఈ ఐదేళ్ల ప్రయాణంలో ఎన్నెన్నో మరపురాని మైలురాళ్ళని చేరుకుని, దాటుకుని, సాగుతోంది ఆవకాయ. గత విజయదశమి నుండి నేటి విజయదశమి వరకూ సాగిన ప్రస్థానాన్ని ఒకసారి సమీక్షించుకుంటే కొన్ని అపురూపమైన ఘటనల సమాహారం ఆవిష్కృతమౌతోంది.


ఫిబ్రవరి 18, 2011 న కొత్తరూపంతో వచ్చిన కొత్తావకాయ నాటి నుండి నేటి వరకూ 130 పైగా కొత్త సభ్యుల్ని చేర్చుకుంది. 600 పైగా కొత్త రచనల్ని అందించింది. 8,21,246 పేజ్ వ్యూస్‍ను పొందింది. ఉచిత ఈ-బుక్స్ మరియు ఆడియో ప్లేలిస్ట్స్ వంటి కొత్త శీర్షికల్ని పరిచయించడం జరిగింది.

రచనల విషయానికి వస్తే 14 శీర్షికల క్రింద 723 రచనల్ని అందించడం జరిగింది. ఇందులో 160 కవితలు ఉండడం విశేషం. అలానే సమకాలీన రాజకీయ, సామాజిక సంఘటనలపై వచ్చిన వ్యంగ్య రచనలు 80 దాకా ఉన్నాయి. బహుశా ఏదేనీ ఒక వెబ్‍సైట్‍లో అత్యధిక సంఖ్యలో వ్యంగ్య రచనలు లేవేమో! 40కి పైగా ఉన్న సినిమా సంబంధింత రచనలు రొటీన్‍కు భిన్నంగా గాసిప్పుల కతీతంగా ఉంటూ ఆరోగ్యకరమైన, పాఠకులకు ఉపయుక్తకరమైన సమాచారాన్ని అందించాయి. భక్తి సాహిత్యానికి వస్తే ‘కోవెల’ శీర్షికన 44 రచనలను ప్రచురిస్తే, భక్తికావ్యాలు/శతకాలు శీర్షికన గీతగోవిందం, కృష్ణశతకం వంటి ప్రాచీన సాహిత్యాన్ని పొందుపరచడమైనది.

అఫ్సర్, ఇక్బాల్‍చంద్ వంటి ప్రసిద్ధ కవులు, నిడుదవోలు మాలతి గారి వంటి పరిశోధకులు, డా. కల్లూరి శ్యామల గారు, డా. కే. మల్లీశ్వరి వంటి ఆధ్యాపకరంగ నిష్ణాతులు తమ తమ రచనలతో ఆవకాయకు కొత్త రంగుల్ని దిద్దారు. అఫ్సర్ గారు తమ గతస్మృతుల నుండి వెలికితీసి గుదిగ్రుచ్చిన సమాహారమాలికల వంటి రచనలు ఆవకాయ యొక్క పాఠకపరిధిని మరింత విస్తృతపరచాయి. డా. మల్లీశ్వరి గారి తెలుగు నవల ‘జీవితానికో సాఫ్ట్‍వేర్’కు డా. కల్లూరి శ్యామలగారి ఆంగ్లానువాదాన్ని ప్రచురించడమే గాక ఈ-బుక్ రూపంలో ఆ నవలను అంతర్జాల పాఠకులకై విడుదల చేయగలిగే అరుదైన అవకాశాన్ని ఆవకాయ పొందింది.

ఈ సందర్భంగా శ్రీఅదిభట్ల కామేశ్వరశర్మ గారి గురించి రెండు మాటలు. ‘దత్తోదాహరణ కావ్యము‘ వంటి క్లిష్టతరమైన పద్యప్రక్రియను సులభంగా నిభాయించిన శర్మగారు ‘ఆ.శ. గీతాలు‘ అన్న లలితగీతాల గుచ్ఛాన్ని అందంగా పేర్చారు. ఆ రెండింటినీ ఆవకాయ పాఠక-శ్రోతలకు అందించగలగడం ఆవకాయ.కామ్ కు దక్కిన అరుదైన గౌరవం.

గత వినాయకచవితి సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ-బుక్స్ శీర్షిక క్రింద ఇప్పటిదాకా 11 పుస్తకాల్ని పొందుపరచగా ఈ వ్యాసం వ్రాసే సమయానికి ఆసక్తివున్న పాఠకులు ఈ పుస్తకాల్ని 1557 సార్లు డౌన్‍లోడ్ చేసుకున్నారు. అనగా ప్రతి పుస్తకం సరాసరి 147 డౌన్‍లోడ్స్‍ను సాధించిందన్న మాట.

బినాకా గీత్‍మాలా వంటి గతకాల వైభవాల్ని ఆడియో ప్లేలిస్ట్ రూపంలో శ్రోతల అందుబాటుకు తేగలగడం చెప్పుకోదగ్గ మైలురాయి. దీనితో బాటే గీతగోవిందం ప్లేలిస్ట్ కూడా మరో ప్రధానాంశం. ఇవేగాక March of Ten Thousand, The Queen Sheba’s Belt, Ghost of Downhill వంటి ఆంగ్ల నవలల ఆడియో బుక్స్ అందించడం జరిగింది.

వీటితో బాటే ఇమేజ్ గ్యాలరీ, డిస్కషన్ ఫోరమ్‍లను అందించినా ఎందుకో అవి నెటిజనులను ఆకట్టుకోలేకపోయాయి. ఫేస్‍బుక్, ఆర్కుట్ వంటి సుప్రసిద్ధ సోషియల్ నెట్‍వర్క్స్ ముందు ఆవకాయలోని ఈ ఫీచర్స్ వెలవెలబోయాయి.

మొత్తానికి గతసంవత్సర కాలంలో రచయితలు, పాఠకులు, అభిమానుల తోడ్పాటుతో ఆవకాయ తన ఆరో సంవత్సరంలోకి ఉత్సాహంగా అడుగుపెట్టింది. ఇనుమడించిన అభిమానాన్ని చూరగొంటూ ఇబ్బడిముబ్బడిగా ఎదగాలన్న ఆవకాయ.కామ్ ఆశయానికి ఎప్పటిలానే మీ తోడ్పాటు ఉంటుందని ఆశెస్తూ…

నమస్సులతో
ఆవకాయ.కామ్ బృందం