ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వెండితెర నారదుడు జీవన్

Like-o-Meter
[Total: 3 Average: 4.7]

 

1.

“నారాయణ!  నారాయణ!” అని విన్నప్పుడల్లా ఎవరు గుర్తు వస్తారు? కలహ భోజనుడు నారదుడు కదా!

ఎప్పుడూ మెళ్ళో వీణను వేసుకొని, చిడతలకు పట్టుకొని, లోకాలన్నీ చుడ్తూ, ఎన్నెన్నో సమస్యల్ని సృష్టిస్తూనే పరిష్కరిస్తూ…అబ్బో ఇల్లా ఎన్నెన్నో పన్లు చేసే నారదుడ్ని వెండితెర మనకు పరిచయం చేసింది.

ఐతే ఈ “నారాయణ  నారాయణ” అనే డైలాగుని ఎవరు సృష్టించారో తెలుసా ?

హిందీ వెండితెర నారదుడు – జీవన్.

హిందీ సినిమాల్లో మొదటి తరం విలన్లలో  జీవన్ చాలా ముఖ్యమైనవాడు. తన చేతులతోనూ ముఖ  కవళికలతోనూ, డైలాగ్ చెప్పే పద్దతితో విలక్షణంగా నటించేవాడు.

 

2.

జీవన్ అసలు పేరు  ఓంకార్ నాథ్ ధర్. కశ్మీరీ పండిట్.

24-10-1915 న పుట్టాడు. 10 జూన్ 1987 న గతించాడు.

కెమేరామ్యాన్  అవుదామని బొంబాయి వచ్చాడు.చివరికి కాశ్మీర్ వెళ్ళి కెమేరా స్టూడియో పెట్టుకొందామని అనుకొన్నాడు. అనుకోకుండా నటుడయ్యాడు.

ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.




 
 

3.

హిందీ తెర మీద ప్రతికథానాయకుడిగా కొన్ని వందల చిత్రాల్లో నటించాడు.అయితే ఇది కాదు అతని ప్రత్యేకత.

మరి ఏమిటీ ?

పౌరాణిక చిత్రాల్లో తను ఉన్నకాలంలో నారదుడి పాత్రను కేవలం జీవన్ మాత్రమే పోషించాడు.ఎన్ని సినిమాల్లో నటించివుండచ్చని అనుకుంటున్నారు?

ఓ పది? ఇరవై?

కాదు కాదు ఏకంగా 60 చిత్రాలు, నాటకాలు, ఇతరత్రా ప్రదర్శనలలో నారదుడిగా నటించాడు. ఇందులో సినిమాల సంఖ్యనే 49.

బహుశా ఇది ఒక ప్రపంచ రికార్డ్.

“నా నారద పాత్ర రికార్డ్ ఉన్నా, ఊడినా, తుడిచిపెట్టుకుపోయినా నాకు బాధలేదు. ఇన్ని సినిమాల్లో ఆ మహాముని పాత్రను జనరంజకంగా పోషించానన్న గుర్తింపు చాలు. ఒక మరాఠి పత్రిక నా నారద పాత్ర గురించి వ్రాస్తూ – ఒకవేళ నిజమైన నారదుడే భూలోకాని వచ్చి “నారాయణ-నారాయణ” అని జీవన్ లా అనకపోతే బహుశా మనమందరం అతన్ని నకిలీ నారదుడని అనేస్తామేమో – అని చెప్పారు. ఇంతకంటే నాకేం కావాలి” అని ఒకానొక ఇంటర్వూలో అన్నాడు జీవన్. 

అంతేమరి.

నారాయణ్! నారాయణ్!

*****