ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అమితాబ్ పొడుగు హాస్యం

Like-o-Meter
[Total: 0 Average: 0]

అతడేమో సన్నగా, రివటలా ఉన్నాడు, ఇతడేమో నహా పొట్టి. “గడకర్రలాగా- ఇంత పోడుగు, ఇతనేమిటీ, సినిమాలలో హీరోనా?” అని అప్ప్పట్లో హిందీ సినీ విశ్లేషకులు లుప్చలు కొడుతూ అనుకున్నారు. అతనే అమితాబ్ బచన్ (Amitabh Harivansh Bachchan- Born on 11 October 1942).

1967 లో “ప్యార్ కీ కహానీ” తీస్తున్నారు. దీనికి మాతృక తమిళంలో సంవత్సరము పాటు థియేటర్ లలో ఆడి, ఎన్నో రికార్డులను నిలిపిన “పాశమలర్”. తెలుగులో “మరపు రాని కథ”- సావిత్రి నటించిన పాత్రను వాణిశ్రీకి ఇచ్చారు. ఈ తెలుగు మూవీ తో వాణిశ్రీ దశ తిరిగింది. అప్పటిదాకా కమెడియన్, చిన్నా చితకా పాత్రలతో కొట్టుమిట్టాడుతూన్న వాణిశ్రీని అకస్మాత్తుగా ‘తిరుగులేని కథానాయిక గా’ తారాపథంలోకి దూసుకుపోయింది.

మళ్ళీ అమితాబ్ బచన్- వద్దకు వద్దాం!

తెలుగులో క్రిష్ణ నటించిన హీరో పాత్రకు ఇతను సెలెక్ట్ ఐనాడు. ఆ వామన రూపుని నామం “గణేశ్”. అమితాబ్ బచన్ కి గణేశ్ మేకప్ అసిస్టెంట్. అమితాబ్ బచన్ మోకాళ దాకా కూడా కాదు, కిందకే ఉన్నాడు గణేశ్.

ఈ మరుగుజ్జు మేకప్ మ్యాన్, నేటి మన అగ్ర కథానాయకుడు అమితాబ్ బచన్ కి టచప్ ఇవ్వాల్సి వచ్చేది కదా మరి!

గణేశ్ హీరో వదవారవిందానికి టచప్ ఇవ్వడానికని వచ్చేవాడు. ప్రతిసారీ అమితాబ్ బచన్ అతణ్ణి రెండు చేతులతో తన ముఖం వద్దకు వచ్చేలా ఎత్తుకునే వాడు. గణేశ్ టచప్ క్లాత్ తో సుతారంగా అమితాబ్ బచన్ మోముపై ఒత్తేవాడు. ఆ దృశ్యం అందరినీ పక పకల నవ్వులలో ఓలలాడించేది.

ఒక మారు, ఒక్కో సారి వామన గణేశ్ ని క్రేన్ పైన కూర్చుండబెట్టి, ఆ క్రేన్ తన face దగ్గరికి వచ్చేలాగా తోయించి, అమితాబ్ బచన్ టచప్ చేయించుని, అచ్చటి సిబ్బందిని నవ్వించే వాడు. “ఆతది దగ్గరి గుడ్డను తీసుకుని, మీరే అద్దంలో చూసుకుంటూ మొహాన్ని అద్దుకోవచ్చును కదా!?” ఆ సలహాకు అమితాబ్ బచన్ ప్రత్యుత్తరం ఇది- “అది మామూలే! కానీ ఇందులోని తమాషా, ఆనందం, నవ్వుల్ నవ్వులూ ఎక్కడ్నించి వస్తాయి?”

ఈ సమాధానం హాస్య స్ఫూర్తికి దోహదం చేసే అమితాబ్ బచన్ వ్యక్తిత్వానికి నిదర్శనం. అన్నట్టు ఆ జవాబును అమితాబ్ బచన్ తెలుగులో చెప్పేరు అనుకునేరు….హిందీలోనే చెప్పాడు లెండి!