ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆనంద్ – ఒక బాబు మోషాయ్ కథ

Like-o-Meter
[Total: 0 Average: 0]

1970లో వచ్చిన “ఆనంద్” సినిమా అప్పటికీ, ఇప్పటికీ కూడా పెద్ద హిట్. రాజేష్ ఖన్నాకు, అమితాబ్ బచ్చన్ కు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిందీ సినిమా. ఈ చిత్రం టైటిల్స్ లో “Dedicated to Raj Kapur & people of Mumbai” అని వస్తుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.


చిత్రకథ వ్రాసి, దర్శకత్వం వహించిన హృషీకేశ్ ముఖర్జీ, ప్రముఖ నటుడు రాజ్ కపూర్ కు చాలా దగ్గరి మిత్రుడు. రాజ్ కపూర్ ముఖర్జీని “బాబూ మోషాయ్” అని పిలిచేవాడు. ఒకసారి రాజ్ కపూర్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతను బ్రతుకుతాడో, లేడోనన్న అనుమానాలు హిందీ చిత్రరంగంలో అలుముకున్నాయి. కానీ రాజ్ కపూర్ కోలుకొన్నాడు. ఆ పరిస్థితుల్లో, ప్రాణమిత్రుని చావు, బ్రతుకుల పోరాటాన్ని చూసిన ముఖర్జీ “ఆనంద్” పాత్రను సృష్టించాడు. ఆ విధంగా “ఆనంద్” ఒక అజరామరమైన సినీ పాత్రగా చరిత్ర సృష్టించింది.

ఆనంద్ పాత్రకు మొదట రాజ్ కపూరునే అనుకొన్నాడట హృషీకేశ్ ముఖర్జీ. కానీ అప్పుడే తీవ్రవ్యాధినుంచి కోలుకున్న తన ప్రాణమిత్రుణ్ణి చనిపోయే పాత్రలో నటింపజేయడం ఇష్టంలేక మానుకొన్నాడు. తర్వాత రాజ్ కపూర్ తమ్ముడైన శశి కపూర్ ను అడిగాడు. అతను ఆసక్తి చూపలేదు. తర్వాత అప్పటి కుర్రకారు పడిచచ్చే రాజేష్ ఖన్నాను అడిగాడు. అతను సరేనన్నాడు. అలా రాజేశ్ ఖన్నా తన సినీజీవితంలోనే అపురూపమైన పాత్రను పోషించి, ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. రాజ్ కపూర్ తనను ఎప్పుడూ పిలిచే “బాబూ మోషాయ్” అన్న పిలుపునే ఆనంద్ పాత్ర ద్వారా పలికించాడు హృషీకేశ్ ముఖర్జీ.

అమితాబ్ బచ్చన్ కు ఇది రెండో సినిమా. ఇందులో అతను సహాయ నటుడు మాత్రమే. కానీ అప్పటి ప్రముఖ హాస్యనటుడైన మెహమూద్ సలహాతో ఆ పాత్రను పోషించడానికి ఒప్పుకున్నాడు. నిర్వీర్యమైన సమాజం పట్ల బాధ, చిరాకు, అసహనాన్ని ప్రదర్శించే సహృదయుడైన డాక్టర్ పాత్ర యొక్క భావాల్ని
తన గంభీరమైన గొంతులోపలికించి రాజేశ్ ఖన్నాకు దీటుగా నటించాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో అమితాబ్ ప్రయాణం ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే!

ఈ సినిమా ద్వారా మరో ఇద్దరికి సినీజీవన దానం జరిగింది. అందులో ఒకరు సంగీత దర్శకుడైన సలీల్ చౌదురి. రెండోవారు గీత రచయిత యోగేశ్. సరైన కమర్షియల్ హిట్లు లేక సినీప్రస్థానం దాదాపు ముగిసిపోయిన వీళ్ళిద్దరీ మళ్ళీ బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. మన ప్రఖ్యాత సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ఈ సలీల్ చౌదురి శిష్యుడే!

ప్రాణాంతకమైన “లింఫోసర్కోమా” అన్న వ్యాధితో, అనుకోని అతిథిలా ఢిల్లీ నుండి ముంబై వచ్చిన ఆనంద్ సైగల్ అనే యువకుడు తనను ఆదరించిన ఇద్దరు డాక్టర్లు, వారి కుటుంబాల్లో ఎంత తీపిని మిగిల్చివెళ్ళాడన్న విషయం చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా కథ. అంతే కాదు, జబ్బు ఉందని, అది తగ్గేది కాదని, తను కొన్ని నెలల్లో చనిపోతానని తెలిసినా కూడా జీవితాన్ని హాయిగా గడిపే ధీశక్తిగల యువకునిగా రాజేశ్ ఖన్నా అద్భుతంగా నటించాడు.

ఈ సినిమాలో కథనంలో వాడిన ఎత్తుగడ చాలా బావుంటుంది. ఎలాగైతే ఆనంద్ కు తన చావు గురించి ముందుగానే తెలుసో, అదేవిధంగా సినిమా ప్రారంభంలోనే ఆనంద్ చనిపోయిన విషయం ప్రేక్షకులకి తెలిసిపోతుంది. చావును గ్లోరిఫై చేయడం కంటే ప్రతికూల పరిస్థితుల్లో జీవితాన్ని ఎలా గడపాలన్న విషయాన్ని గొప్పగా చూపించాలనేది హృషీకేశ్ తాపత్రయం. అందుకనే, మొదటి సీన్లోనే, రెండు నిమషాల్లో ఆనంద్ చనిపోయినట్టుగా చెప్పేసి, అతను ఎలా బ్రతికాడన్నదాన్ని రెండు గంటల పాటు చూపిస్తాడు దర్శకుడు.


చక్కటి కథ, రక్తి కట్టించే సన్నివేశాలు, కరుణరసం నిండిన సాత్విక నటన, మాటలు, పాటలు, సంగీతం వున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. జీవితోత్సవం అంటే ఏమిటో తెలుసుకోదల్చినవారు మరీమరీ చూడాలి. ఈ వీకెండ్ మీరూ చూస్తారు కదూ!

ఇప్పుడు మీకోసం ఒక అందమైన, అమాయకమైన భావుకుడైన ఆనంద్ సైగల్ (రాజేశ్ ఖన్నా) పాడుకొన్న పాట!

pay per click