మన దేశంలో పౌరాణికాలు తెలుగువారే వారసత్వంగా అంది పుచ్చుకున్నారు. పౌరాణిక నాటకాల నుంచి సినిమాల వరకూ మన తెలుగువాళ్ళు చేసిన కృషి దేశంలో మరెవరు చేసి కూడా ఉండరు. అసలు పౌరాణిక సినిమాలు తీయటమే చాలా కష్టం. ప్రేక్షకులకు తెలిసిన కధే కాబట్టి, దర్శకుడికి ఇది కత్తి మీద సాము వంటిది. దానికితోడు, సంగీత సాహిత్యాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. సరైన పాత్రల్లో సరైన నటులు కూడా దొరకాలి. అంతా బాగున్నా పాటలు పద్యాలు బాగోలేకపోతే ప్రేక్షకులు ఆదరించరు. ఎందుకంటే, పౌరాణికాలకు పాటలతోపాటు పద్యాలే ప్రాణం.
తెలుగువాళ్ళుగా మనం మాత్రం పద్యాలు లేని పౌరాణికాలు ఊహించలేము. బహుశా అందుకేనేమో, రామాయణ భారతాలు టీవీ సీరియళ్ళుగా వచ్చినా, హిందీ పౌరాణికాలు చూసినా, మన సినిమాలలోని పద్యాలతో కలిగే కిక్కు మాత్రం వాటిట్లో దొరకదు. “చెల్లియో.. చెల్లకో…“, “ధారుణి రాజ్యసంపద….“, “బావా ఎప్పుడు వచ్చితీవు….“, “ఇంతకు బూని వచ్చి….“, చెప్పుకుంటూ పోతే అసలు ఈ పద్యాలే పౌరాణికాలకు తలమానికాలలా అగుపిస్తాయి.
మరి పద్యాలు లేని పౌరాణికాన్ని బాపు ఎలా ఊహించారో అనే అనుమానం నాకు కలిగింది. తొడలు కొడుతూ, మీసాలు మెలేసే పాత్రల్లో బాలకృష్ణని చూసినా, ఈరోజుల్లో తను శ్రీరాముడుగా సరిపోతాడనే నమ్మకం ఉన్నా ఎక్కడో అనుమానం. గ్లామర్ డాల్ గా ఇన్నాళ్ళూ కనిపించిన నయనతార సీతగా న్యాయం చేయగలదా అనే మరో పెనుభూతం. వీటన్నిటి మధ్యా బాపును నట్టనడిమధ్య వదిలేసి వెళ్ళిన రమణ! బాపు గీయబోయిన బొమ్మ మీద ఇలా చాలాచాలా అనుమానాలు రేకెత్తాయి.
ఏదైతే అదయ్యిందని సకుటుంబ సమేతంగా నవీముంబాయి సినీమాక్స్ లో ఈ సినిమా చూసాను. కుదురుగా కూర్చొని వేస్తేనే కాదు, బాపు కుంచె అలా అలా విదిలించినా అదో అద్భుతమౌతుందని అర్ధమయ్యింది. ఇప్పటికే అందరూ ప్రశంసించినట్లు ఈ సినిమాలోని ప్రతి ఫ్రేము బాపు గీసిన బొమ్మలానే కనిపిస్తుంది. బాపు బొమ్మకు తోడైన గ్రాఫిక్స్ సినిమా మొత్తానికి వన్నె తెచ్చింది. వందల కోట్లు ఖర్చుపెట్టామని చెప్పుకునే “రా వన్”లు “శ్రీరామరాజ్యం” నుంచి చాలానే నేర్చుకోవాలి.
ఈ చిత్రానికి హైలైటుగా నిల్చేది మాత్రం ఇద్దరే. సీతారాములుగా నయనతార, బాలకృష్ణ – తమ పరిధుల్లో చాలా చక్కగా నటించారు. బాలకృష్ణ చాలా సంయమనంతో, పాత్రోచితంగా, హుందాగా నటించాడు. ఈ తరం నటుల్లో ఈ పాత్రలో మరెవరినీ ఊహించుకోలేమనేవిధంగా నటించాడంటే అతిశయోక్తి కాదు. నావరకూ ఈ పాత్రతో బాలకృష్ణ పరిపూర్ణ నటుడుగా ఎదిగాడనే చెప్పాలి. నా అభిప్రాయంలో పౌరాణిక పాత్రలు ధరించి మెప్పించనంతవరకూ దిలీప్ కుమారైనా, అమితాబ్ బచ్చన్ అయినా పరిపూర్ణ నటులు మాత్రం కాలేరు.
గ్రాంధిక భాష కాకుండా, రమణ గారు సరళంగా వ్రాసిన మాటలే, మురళీమోహన్ నుంచి శ్రీకాంత్ వరకు ఆపసోపాలు పడుతూ చెబుతుంటే, పద్యాలు లేకపోవటం కూడా ఒకందుకు మంచిదే అనిపించింది. అక్కినేని, బాలకృష్ణ, నయనతార, లవకుశులు చెప్పిన డైలాగులు చాలా సహజంగా ఉండి ఏమాత్రమూ ఎబ్బెట్టుగా లేవు. మరెందుకో శ్రీకాంత్, మురళీమోహన్, తదితర పాత్రలు డైలాగులు చెబుతుంటే చాలా ఎబ్బెట్టుగా అనిపించాయి. పౌరాణికాలకు కావల్సిన “ఈజ్” ఇంకా వారిలో లేనట్లే కనిపించింది.
ఇక పాటలు, సంగీతం కూడా ఆ సమయంలో ఆ సందర్భంలో బాగున్నట్లే అనిపించినా గుర్తుచేసుకునేట్లు మాత్రం లేవు. వేటూరి లేకపోవటం, సినారే వ్రాయకపోవటం చాలా వెలితిగా అనిపించింది.
బాపు తర్వాత, తెలుగు తెరపై పౌరాణిక చిత్రాలు గీయగలిగేదెవరన్నది ఇప్పుడు ఎదురౌతున్న ప్రశ్న!
“అమ్మా, సీతాదేవి కడుపుతో ఉన్నప్పుడు హనుమంతుడు చిన్నపిల్లాడిగా మారువేషం వేసుకొచ్చాడు కదా, మరి తర్వాత లవకుశులు పెద్దవాళ్ళయినా, హనుమ జేజి అలానే ఉండిపోయాడే! సీతాదేవికి అనుమానం రాలేదా?” శ్రీరామరాజ్యం చూసొచ్చిన తర్వాత మా అమ్మాయికి వచ్చిన అనుమానం.