ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నాగయ్యకు ఘంటసాల గాత్రదానం!

Like-o-Meter
[Total: 0 Average: 0]

తెలుగు సినీ నిర్మాణం తొలి దశలో నటీనటులు తమ డైలాగులను తామే చెప్పుకునేవారు. తమ పాటలను తామే పాడేస్తూండేవారు.

ఆంధ్ర చలనచిత్ర రంగం అందించిన మహానటుల్లో ఒకరైన చిత్తూరు నాగయ్య కూడా స్వంతంగా పాటలు పాడేవారు. చక్కటి గాత్రంతో బాటు ఆజానుబాహువు కావడంతో అందరినీ ఆకట్టుకునేవారు. మంచి నటుడు కూడా కావడం అతిత్వరలోనే సూపర్‍స్టార్‍గా ఎదిగారు.

నాగయ్య కర్ణాటక సంగీతంలో దిట్ట. ఆయన తాను నటించిన సినిమాలలో ఏ అరువు గొంతునూ వాడకుండా తనకు తానే  “డబ్బింగు”ను చెప్పుకునేవారు . తన పాటలను తానే పాడేవారు. అజరామరమైన కృతులనూ, కీర్తనలనూ, లలితగీతములనూ సినీలోకానికి అందించారు నాగయ్య.

1968లో విడుదలైన “రాము” సినిమాలో నాగయ్య “రా!రా! క్రిష్ణయ్యా! రా!రా! క్రిష్ణయ్యా” అనే పాటలో అత్యద్భుతంగా నటించారు. ఐతే ఈ పాటను పాడింది నాగయ్య కాదు. ఘంటసాల మాస్టారు.

ఒకనాటి సూపర్ స్టార్, సూపర్ సింగర్ అయిన నాగయ్యకు ప్లేబాక్ పాడాలంటే అప్పటికి కుర్రవాడైన ఘంటసాల భయపడ్డరంట.

 

“మీవంటి గొప్ప గాయకునికి నా గొంతును వాడటమా!?” అంటూ వాపోయారంట ఘంటసాల. నాగయ్య ఆయన భుజం తట్టి “ఏమీ ఫర్వాలేదు. నీ గొంతు అద్భుతమైనది. కాబట్టి నువ్వు పాట పాడితే చక్కగా ఉంటుంది” అన్నారు.

 

‘రాము’ సినిమాలో ఘంటసాల వెంకటేశ్వర రావు ఎంతో ఆర్ద్రతో పాడిన “రా రా కృష్ణయ్యా” పాట ఆనాటికి, ఈనాటికీ సూపర్ హిట్ పాటగా నిలిచిపోయింది. శాంతరసం, కరుణరసం కలిసిన భావాలను పలికిస్తూ చిత్తూరు నాగయ్య చేసిన నటన కన్నీళ్ళు తెప్పిస్తుంది.

ఒకప్పటి మహానటుడు, గాయకుడు అయిన నాగయ్య వేరేవాళ్ళు పాడితే నేను పెదవులు కదిలించాలి కదా అని బాధపడలేదు. ఇన్ఫీరియారిటీ ఫీల్ అవలేదు. వేణుగోపాలస్వామిని మనసారా కీర్తిస్తూ, భక్తులను కరుణించమని అడుగుతూ అడుగుతూ, ఆ స్వామిని నోరారా పిలిచే మహాభక్తుడి పాత్రలో ఆ మహానటుడు లీనమైపోయారు. ఒక మహానటుడు, ఓ గంధర్వగాయకుడు కలిసి ప్రేక్షకులకు కృష్ణదర్శనం చేయించారు.
 

*****