ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

హీరోయినా? వ్యాంపా?

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఒకానొక సమయంలో తెలుగు చలన చిత్రాల్లో కథా నాయిక అంటే గొప్ప గౌరవం ఉండేది. అందుకు ముఖ్య కారకురాలు సావిత్రి అని చెప్పొచ్చు. ‘మిస్సమ్మ’, ‘మాయా బజార్’, ‘గుండమ్మ కథ’, ‘మంచి మనసులు’ వంటి చిత్రాల్లో ఆమె నటన నభూతో నభవిష్యతి. ఇతర నాయికలు సైతం తక్కువేమీ కాదు. ‘కన్యా శుల్కం’ లో మహానటి సావిత్రి పోషించిన మధుర వాణి పాత్ర ద్వారా ఆవిడ అభినయ కౌశలం బయట పడుతుంది. కేవలం హావ భావాల ద్వారా, వాచికం ద్వారా ఆ పాత్ర నైజం తెలుస్తుందే తప్ప, ఆహార్యం ద్వారా కాదు.

ఇక కలర్ సినిమాల శకం మొదలయ్యాక పౌరాణిక చిత్రాల్లో కూడా నాట్యగత్తెల పాత్రల ద్వారా సౌందర్య (పద ప్రయోగానికి క్షమించాలి. దీన్నే సౌమ్యంగా ‘అవయవ’, లేదా మొరటుగా ‘అంగాంగ ప్రదర్శన’ అంటారు) ప్రదర్శన మొదలైంది. మొదట్లో సెన్సార్ కి భయపడి స్కిన్ కలర్ డ్రస్సులు వేయించిన వారు, నెమ్మది నెమ్మదిగా అవి తీయించేసి, ‘ఇంతైతే ఫరవాలేదు’ అని కొద్ది కొద్దిగా సెన్సార్ వారికీ, ప్రేక్షకులకీ అలవాటు చేశారు.

ఇక 80లూ, 90ల్లో అయితే నాయికకీ, కేబరే డాన్సర్ కీ దుస్తుల విషయంలో తేడా లేకుండా పోయింది. ఇక్కడే పరభాషా నటీమణుల దిగుమతి మొదలైంది. ‘విశాల దృక్పథాలు’ గల కథానాయికలు డబ్బు కోసం కొద్ది కొద్దిగా దిగజారడంతో, పాపం తెలుగు నాయికలే కరువయ్యారు.

పర భాషా నాయికలకు పాపం పదాలకూ, పాటలకూ అర్థం కూడా తెలియక పోవడం మరో సౌలభ్యం. ద్వంద్వార్థపు డైలాగులూ, పాటలూ సర్వసాధారణమై పోయాయి.

ఇప్పుడు మొదలైన మరో ట్రెండు ఏంటంటే, హీరోయిన్లు మొత్తంగానే ‘వ్యాంపు’ ల స్థానాన్ని ఆక్రమించేశారు. దుస్తుల విషయంలో ఎలాంటి ఆక్షేపణలూ లేక పోవడంతో నిర్మాతలూ, దర్శకులూ కూడా ఒకే పారితోషికంతో (అదీ ఏం తక్కువ కాదు) పోతుందని సర్దుకున్నారు.

కానీ, చరిత్ర పునరావృతమవుతుందని పెద్దలన్నట్టూ, కొందరు బోల్డ్ డైరెక్టర్ల కారణంగా మళ్ళీ వ్యాంపులు పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఏ లెవల్లో అంటే, వారిని నమ్ముకుని ‘వ్యాంప్-ఓరియంటెడ్’ చిత్రాలు తీస్తున్నారు. ఈ వ్యాసం ఉద్దేశ్యం ఆ పాత్రల్ని వేస్తున్న వారిని కించపరచడం కాదు. తెలుగు సినిమా రంగం ఎటు పోతుందోనన్న వ్యధ మాత్రమే!

సినిమా విజయవంతం కావాలంటే నాలుగు ఫైట్లు, మూడు పాటలూ, ఒక కేబరే డాన్సూ కాదు. మంచి కథ! మనం అనుసరించాల్సిన బాట వేరు. సినిమాలకి సంబంధించిన వారు ఆలోచించాలి మరి!

 

pay per click