చిత్తూరు నాగయ్యగా సినిమా ప్రియులకు సుపరిచితులైన నాగయ్య పూర్తి పేరు ఉప్పలపాటి నాగయ్య(28 మార్చి 1904 – 30 డిసెంబరు 1973). నాగయ్య గారి జీవితము ఎన్నెన్నో మలుపులు తిరిగినది.
1945లో, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి హీరోయిన్‍గా నటించిన “మీరా” అనే హిందీ సినిమాలో హీరోగా వేశారు. గొప్ప కృష్ణభక్తురాలైన మీరాబాయ్ జీవితచరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఇది.
మీరాబాయ్ భర్త పాత్రను చేయడానికి ఆనాటి గొప్ప నటులైన సి.హొన్నప్ప, భాగవతార్, పి.యు. చిన్నప్ప, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యమ్ మొదలైనవారి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కానీ చివరకు నాగయ్యను ఎంచుకున్నారు. ఆజానుబాహువు, గాంభీర్యం ఉన్న నాగయ్య ఆవిధంగా మీరాబాయ్ భర్త అయిన కుంభరాణగా వెండితెరపై రాణించారు. ఇలా నాగయ్యకు హిందీ చిత్రరంగంతో పరిచయం కలిగింది.
ఆపై ఆయన నిర్మాతగా మారి “భక్తరామదాసు” అనే చిత్రాన్ని నిర్మించి, నటించారు కూడా. ఈ సినిమాలో కబీర్ పాత్రకు ప్రసిద్ధ హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ పాటలు పాడారు.
భక్త రామదాసు సినిమాలో మొత్తం 18 పాటలు ఉంటే, వాటిలో మూడు పాటల్ని రఫీ పాడారు.
“రామ్ రామ్ సే…”, “కాహే కో రోనా..” మరియు “దిల్ కో హమారే చయన్ నహీ హై” అనేవే ఆ మూడు పాటలు.
అయితే, దురదృష్టవశాత్తు సినిమా పూర్తి కాకముందే నాగయ్య గారి చేతిలోని డబ్బు ఖాళీ అయింది. దాంతో విడుదలకు నోచుకోకుండా ఉండిపోయింది.
ఈ విషయం తెలిసిన రఫీ వెంటనే నాగయ్యతో మాట్లాడారు. మూడు పాటల కోసం నాగయ్యగారు ఇచ్చిన పారితోషికాన్ని వెనక్కు ఇచ్చేసారు. అంతేకాదు “సినిమాను పూర్తి చేయండి. నాకు ఎంత కుదిరితే అంత డబ్బు సర్దుతాను” అని చెప్పారు.
రఫీ సాబ్ ఉదారతను చవిచూసిన నాగయ్యగారు మరింత డబ్బుల కోసం ఆయనను వేధించలేదు. ఎలాగో తిప్పలు పడి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసారు. సినిమా ఆడిందా? ఆడలేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే – ఇద్దరు గొప్ప కళాకారులు కులమతాలకు అతీతంగా కేవలం కళ కోసం తాపత్రయపడడమనేది మనం తెలుసుకోవలసిన అసలు విషయం.
*****