1968లో నందమూరి రామారావు, జమున ప్రధాన పాత్రధారులుగా వచ్చిన “రాము” సినిమాకు మూలం ఏదో తెలుసా?
1964లో వచ్చిన హిందీ చిత్రం – “దూర్ గగన్ కీ ఛావోం మే”.
ఈ చిత్రాన్ని ప్రముఖ నేపధ్య గాయకుడు కిషోర్ కుమార్ నిర్మించి, స్క్రిప్ట్ వ్రాసి, దర్శకత్వం & సంగీత దర్శకత్వం వహించడమే కాక ప్రధాన పాత్ర (సైనికుడు శంకర్) లో నటించాడు కూడా. శంకర్ కొడుకు పాత్రలో కిషోర్ స్వంత కుమారుడు అమిత్ కుమార్ నటించడం ఈ చిత్రంలో మరో విశేషం. ప్రమాదవశాత్తూ మూగవాడైన కొడుకు పట్ల ఓ తండ్రి చూపే అభిమానాన్ని, ఆవేదననూ చక్కగా ఆవిష్కరించడంలో కృతకృత్యుడయ్యాడు కిషోర్.
“ఈనా మీనా డీకా” అనో, “సీ ఏ టీ క్యాట్, క్యాట్ మానే బిల్లీ..” అంటూనో, “గానా న ఆయా, బజానాన ఆయా దిల్ బర్ కో అప్నా బనానాన ఆయా” అంటూ తిరిగే టపోరీ పాత్రల్ని పోషించిన కిషోర్ ఇంతటి సున్నితమైన, సీరియస్ సినిమా తీయడం సినీ చరిత్రలో చూడదగ్గ ఒక విచిత్రమే!
వియత్నాం యుద్ధం నేపధ్యంలో ఇలాంటి మానవీయ సంబంధాల్ని చిత్రిస్తూ వచ్చిన అనేక అమెరికా సినిమాల కంటే చాలా ముందే వచ్చిన ఈ చిత్రంను ఒకసారన్నా చూడాలి.
“రాము” చిత్రంలో ఘంటసాల మాష్టారుగారి అమరగాన స్వరఝురిలోనుంచి జాల్వారిన ఒక సుమధుర గీతికా బిందువు….