అసలు సంగతేమిటంటే, ఈ సినిమా కు “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు. అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా సంభాషణలు బీపులుగాను, బొమ్మలు బూజరగాను అయ్యాయంటే, ఆ సినిమా దర్శకుడు ఎంత బీపో ప్రేక్షకులకు అర్ధమౌతుంది. లేదంటే, ఎన్ని బీప్ లు, బూజరలు ఉంటే, సినిమా హిట్టయ్యే అవకాశాలు అంత పెరుగుతాయనేది మన దర్శకుడి అభిప్రాయమేమో! దర్శకుడే ఈ సినిమాకు సంభాషణలు అందించాడట! బూతులు ఉంటే ఖచ్చితంగా కత్తెర వేయబడతాయని తెలిసినా దర్శకుడు సిద్ధమైపోయి, బీప్ లతో సరిపుచ్చటం ఏమిటో ప్రేక్షక బీప్ లకు అర్ధం కాదు.
సాధారణంగా ఇటువంటివి సెన్సారు వారు కత్తెర వేసేస్తారు. మరి సెన్సారు వారు బీప్ లకు బూజరలకు అభ్యంతరం వ్యక్తం చేయకుండా, ఉదార హృదయంతో సినిమా విడుదలకు అనుమతి ఇచ్చేయటం ప్రేక్షక బీప్ లకు అర్ధం కాదు. అడల్టు సినిమాలకు బీప్ లు బూజరలు ప్రత్యేక లక్షణాలుగా మన సెన్సారు బీప్ వారు పరిగణిస్తున్నారేమో! చూస్తుంటే, మిగతా దర్శకులు కూడా ఈ పంధాలోనే హిట్ల కోసం, సెన్సారువాళ్ళని, ప్రేక్షకులను పెద్ద బీప్ లుగా చేసే రోజులు వచ్చేసినట్లున్నాయి.
గమనిక : ఈ వ్యాసంలో “బీప్” బదులు “పిచ్చి పుల్లాయ్” అని చదువుకోవలసిందని మనవి.