ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మత్స్య పురాణం లోని అక్షయ తృతీయ వ్రత విశేషాలు

Like-o-Meter
[Total: 4 Average: 5]

మత్స్య పురాణం లోని అక్షయ తృతీయ వ్రత విశేషాలు

 

మత్స్య పురాణాన్తర్గత అక్షయ తృతీయ వ్రత వివరాలు:

ఈశ్వర ఉవాచ:-

అథాన్యామపి వక్ష్యామి తృతీయాం సర్వకామదామ్‌|
యస్యాం దత్తం హుతం జప్తం సర్వం భవతి చాక్షయమ్‌ || 1

ఈశ్వరుడు పార్వతితో: సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతము గురించి చెబుతాను. ఈ తృతీయా దినమున చేసిన దానము, హోమము, జపము ఏదైనా సరే అక్షయఫలప్రదమవుతుంది.

వైశాఖ శుక్లపక్షే తు తృతీయా యాముపోషితః|
అక్షయం ఫలమాప్నోతి సర్వస్య సుకృతస్య చ || 2

సా తథా బ్రమ్మణోపేతా విశేషేణతు పూజితా|
తత్ర దత్తం హుతం జప్తం సర్వమక్షయముచ్యతే || 3

వైశాఖ శుక్ల తృతీయ తిథి బ్రహ్మదేవునితో కలిసివుంటుంది. అందువల్ల విశేషించి పూజ్యమయినది. కనుక ఈనాడు ఉపవాసం (నిరాహారం) ఉండి ఏ పుణ్యకర్మను ఆచరించినా ఆ కర్మ అక్షయ ఫలాన్ని అందిస్తుంది.

అక్షయానన్తతిస్తు స్యాత్తస్యాం సుకృతమక్షయమ్‌|
అక్షయైః పూజ్యతే విష్ణుస్తేన సాప్యక్షయా స్మృతా || 4

ఈ తిథినాడు క్షయము లేని శాశ్వతోపాసకులచే విష్ణువు పూజింపబడతాడు. కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు.

అక్షతైస్తు నరస్స్నాతో విష్ణోర్దత్వా తథాఽక్షతా|
విప్రేషు దత్వా తానేవ తథాసక్తాంత్సుసంస్కృతా || 5

తదన్నభుఙ్మహాభాగ ఫలమక్షయమశ్నుతే|
ఏకామప్యుక్తవత్కృత్వా తృతీయాం విధివన్నరః || 6

ఈనాడు అక్షతోదకముతో స్నానము చేసి వాటిని విష్ణునిపై ఉంచి అర్చించి, వాటిని చక్కగా సంస్కరించి బ్రాహ్మణులకు దానము చేసి వాటి అన్నమునే తిన్నచో ఈ చెప్పిన ఫలము తప్పక లభించును.

అక్షతలు అనగా ఏ మాత్రము విరుగక, శక్తి తరుగక నిలిచియున్న బియ్యము అని అర్థం. ఈ బియ్యం వరి ధాన్యము నుండి కాని యవ[బార్లీ] నుండి కాని లేదా గోధుమల నుండి కాని తీసినవి కావచ్చును. ఇలా వరిబియ్యముతో కాని యవ లేదా గోధుమ పిండితో కాని సిద్ధపరచిన ఆహారాన్ని అక్షతాన్నము అని అంటారు.

ఏతా మను తృతీయాయాం సర్వాసాంతు ఫలం లభేత్‌|
తృతీయాయాం సమభ్యర్చ్యసోపవాసో జనార్దనమ్‌ |
రాజసూయఫలం ప్రావ్య గతిమగ్ర్యాం చ విన్దతి || 7

ఇలా ఒక వైశాఖ శుక్ల తృతీయ నాడైనా మానవులు యథావిధిగా పై చెప్పినట్లు చేసి దాని తరువాత వచ్చు ప్రతీ శుక్ల తృతీయ రోజున అనగా 12 మాసముల శుక్ల తృతీయ తిథిలో ఉపవసించి, విష్ణువుని అర్చించినచో రాజసూయ యాగము చేసినంత ఫలాన్ని పొంది తదనంతరం ముక్తిని పొందగలరు.

 

||ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే అక్షయ తృతీయ వ్రతకథనం నామ పఞ్చషష్టితమోఽధ్యాయః||

||ఇది శ్రీమత్స్యమహాపురాణమున అక్షయ తృతీయ వ్రత కథనమను 65వ అధ్యాయము||