ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అన్నము – మరిన్ని విశేషములు

Like-o-Meter
[Total: 2 Average: 5]

అన్నము – భారతీయ సనాతన దృక్పథము పై వచ్చిన ప్రతిస్పందనలు చూచి, ఎస్వీకే20012 అను పాఠకుడు అన్నము అనగా బియ్యముతో వండిన పదార్థమని పొరబాటుపడినట్టే ఇతరులకు, జిజ్ఞాసువులకు  ఆ వ్యాసములో వదిలివేసిన వివరములను చెప్పడముద్వారా ఉపయుక్తముగా ఉంటుందన్న ఉద్దేశ్యముతో ఈ వ్యాసమును వ్రాయడము జరుగుతోంది.
 
భారతీయ సనాతన సంప్రదాయములో అన్నము (ఆహారము)నకు గల ప్రాముఖ్యతను క్రితం వ్యాసంలో వివరించడము జరిగినది. నేటి వ్యాసములో ఆ ప్రాముఖ్యతను ఇచ్చుటకు గల లౌకిక మరియు ఆధ్యాత్మిక విశేషములను తెలుసుకొందాము. ఇక్కడొక ప్రార్థన – లౌకిక వివరములు వివరించునపుడు అనివార్యముగా స్త్రీలకు చెందిన కొన్ని దైహిక సూక్ష్మవిషయములను చెప్పవలసివస్తుంది. పాఠకులు ఆ వివరణలను సహృదయముతో స్వీకరించగలరు.

లౌకిక విశేషములు:

ఏడవ శతాబ్దమునకు చెందిన ప్రముఖ వైద్యాచార్యుడైన వాగ్భటుడు తాను రచించిన “అష్టాంగ హృదయము” అన్న ఆయుర్వేద గ్రంథములో ప్రథమాధ్యాయమైన “శారీరము”లో మానవ శరీరము ఏర్పడుటకు పూర్వము తల్లి గర్భములోను మరియు తండ్రి దేహములోను ఏర్పడు “ఆర్తవము” (శోణి) మరియు “శుక్లము” (వీర్యము)ను సవిస్తరముగా వివరిస్తాడు.
 
“రసము” అని పిలువబడే శరీరధాతువుల వల్ల ఉత్పన్నమయ్యేదే రక్తము (రసాద్రక్తం). స్త్రీ దేహములో ఈ ధాతురక్తము కాక “ఆహార రసము”చే ఉత్పత్తియగు “రసజ” అని పిలుబడే మరో రక్తము ఉత్పత్తియగును (మాతృశ్చాహార రసజైఃక్రమాత్కుక్షౌ వివర్ధతే). ఈ రక్తమే ఋతుకాలములో స్రవించబడుతుంది. ఈ రక్తమును ఆయుర్వేద పరిభాషలో “ఆర్తవము” అంటారు. తండ్రి దేహములో గల వీర్యము ఈ “ఆర్తవము”తో కలినపుడే పిండోత్పత్తి జరుగును. ఎలాగునైతే చెరువు గట్టున ఉండెడి పైరు చెరువునీటినే ఆధారము చేసికొని పెరుగునో, ఆవిధముగా ఈ “రసజ” లేక “ఆర్తవము”ను ఆధారము చేసుకొని పిండము వృద్ధి చెందును.
 
వీర్యము మరియు ఆర్తవము రెండూ స్త్రీపురుషులు స్వీకరించు ఆహారమువల్ల ఉత్పత్తియగుచున్నవి. అంతేగాదు “మాతృజం హ్యస్య హృదయం; మాతుశ్చ హృదయేన తత్” – తల్లి సేవించిన ఆహారమే బిడ్డ యొక్క మనసుగా మారుతుందని వాగ్భటుడు చెబుతున్నాడు. కావున తల్లిదండ్రులిద్దరూ శుద్ధ, సాత్విక ఆహారమును తప్పక సేవించాలి.
సాత్వికబలముతో కూడిన వీర్యము మరియు ఆర్వతముల ద్వారా పుట్టబోవు బిడ్డలు ఆరోగ్యవంతులై, సుజ్ఞానముతో వెలుగుదురు. దుష్టము, రోగగ్రస్తములైన వీర్య, ఆవర్తములు బలహీనులు, అనారోగ్యవంతులు, అజ్ఞానులగు సంతానమును కలుగజేయును. కావునే, మన ఋషిమునులు సాత్వికాహార సేవనమును విధిగా పాటించమని నొక్కి చెప్పారు. మనుష్యులు క్షణకాల సుఖమైన “నాలుక రుచి”కి లోనుగాక, బహుకాలవ్యాప్తమైన మంచి సంతానమును సంఘములో పెంపొందించడానికి ఉద్యుక్తులవ్వాలని ఋషుల తాపత్రయము.
 
మొదటిసారిగా తల్లిదండ్రులవబోతున్న యువజంటలు తాత్కాలిక సుఖాన్నిచ్చే నిరుపయోగ పదార్థాలను సేవించి తమ దేహాలను నిర్వీర్యము చేసుకోరాదు. ఆహార సేవనములో పూర్వీకులు ఎంతో అనుభముతో చెప్పిన సూక్ష్మములను సహృదయముతో అర్థము చేసుకోవాలి. పెద్దలు చెప్పినవన్నీ మూఢనమ్మకాలే నన్న భావన నుంచి బయటకు రావాలి. శాస్త్రములతో పరిచయము పెంచుకొని, వాటి ఉపదేశాల్ని శ్రద్ధగా గమనించాలి. పెద్దలు చూపించిన దారిలో నడిచి ఉత్తమైన సంతానమును పొంది, ఉత్తమమైన సమాజ నిర్మాణములో ప్రధానపాత్ర పోషించాలి.  

 

ఆధ్యాత్మిక విశేషములు:

ప్రపంచములో ఆహారోత్పత్తికి మూలకారణములు పంచభూతములు అనగా గాలి, నీరు, నిప్పు, నింగి మరియు నేల. వీటి ప్రమేయము లేకుండా పంటలను పండించుట అసాధ్యము. ఒక్క నేలను ఉదాహరణగా తీసుకొని దాని గొప్పదనమేమిటో చూచెదము.
 
మానవకోటికి సరిపొవునంతగా పంటలను పండించుట నేలతల్లి దయతోనే సాధ్యము. ఇంతమందికి సరిపోవు తిండిదినుసులను ప్రయోగశాలలో పండించవలెనన్న సులభమా? అటువంటి భూమిని శాస్త్రములు “సర్వసార” అని పొగుడుతున్నవి.
ఒకే భూమిలో నాటిన మామిడి, వేప, మల్లె మరియు గరికలు వాటివాటి గుణముల ప్రకారము వికాసమును పొందుతున్నాయి. మామిడిపండులోని తీపి, వేపకాయలోని చేదు, మల్లెపువ్వులోని సుగంధము, గరికలోని పవిత్రత – ఇవన్నియూ నేలలోనే ఉన్నవి. నాటిన విత్తనమును చూచికొని, ఆయా రసములను, గుణములను వాటిలో ప్రవేశింపజేసి పెంచుతున్నది నేలతల్లి . ఆధునిక సైంటిస్టులు కనిపెట్టక పూర్వమే మన పూర్వీకులు భూమి యొక్క గొప్పదనాన్ని”సర్వసార” అన్న ఒక్క నామములో నిక్షిప్తం చేసారు. 
 
మృత్తికా సూక్తము అను ఋగ్వేద భాగములో, మట్టి యొక్క గొప్పదనాన్ని “మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్టితమ్” అని వర్ణిస్తారు. “ఓ మట్టి! నీలోనే సర్వమూ నిలచియున్నది. మాకు శక్తిని ప్రసాదించమని వేడుకొంటున్నాను” అని అర్థము. 
 
“నీలోనే సర్వము ఉన్న”దన్న మాటలో ఎంత సత్యమున్నదో చూడండి. మట్టి గట్టిగా లేకపోతే భవనాలు, కట్టడాలు నిలబడవు. నేలలో సత్తువ లేకపోతే పంటలు పండవు. నేలకు తృప్తి లేకపోతే నదీజలములు మనకు మిగలవు. నేలలో సహనము లేకపోతే భారములైన పర్వతాలు కృంగిపోగలవు. పర్వతాలు లేనిచో వర్షములు కలుగవు.
నేలకు, మట్టికిగల ఈ గొప్ప గుణములు మానవులు ప్రవేశపెట్టినవి కావు. కనుకనే మన పూర్వీకులు మట్టిని కూడా దేవతాస్వరూపముగా భావించి స్తుతించారు. మన పూర్వీకులకు ప్రకృతిపై గల గౌరవాభిమానములు మాత్రమే స్తుతులు, సూక్తముల రూపంలో ఉన్నాయి. నాస్తికులు ప్రచారము చేస్తున్నవిధంగా అవి మూఢనమ్మకాలు కావు. ఉన్న గుణమును ఉన్నట్టుగా వర్ణించడము మూఢనమ్మకమా? కాదు కదా! ఇది తెలిసీ వేదములన్నీ మూఢనమ్మకములని ప్రచారం చేయుట సరియైనదేనా? ఇది ఆరోగ్యకరమైన తర్కమా? యని ప్రజలు ఆలోచించగలరు.

అన్నమును సాత్వికముగా మార్చుడము ఎలాగా?

మానవులు సుఖముగా బ్రతుకుటకు పంచభూతములు, పంచతన్మాత్రలు మొదలైనవాటిని సర్వశక్తుడైన భగవంతుడు నిర్మించి ఇచ్చినాడు. ఈ శక్తుల నిర్మాణములో మానవ జోక్యము కించిత్తైననూ లేదు. ఈ శక్తులను తమకు అనుకూలముగా వాడుకొనుటకు మానవులకు అవసరమైన జ్ఞానము కూడా భగవంతుడు ఇచ్చినదే. కావున నిజమైన “అన్నదాత” భగవంతుడే. అతడే మనకు సుఖప్రదాత మరియు రక్షకుడు.
అలాంటి భగవంతునికి మన సుఖములను, దుఃఖములనూ నివేదించాలి. కానీ ప్రజలు దుఃఖాలను మాత్రమే వానికి చెప్పుకొంటారు. స్వల్పసుఖము దొరకగానే వానిని మర్చిపోతారు. అలాకాకుండా, అడుగడుగునా భగవంతుని స్మరించుకోవాలన్నదే మన పూర్వీకుల అభిమతము. అందుకనే గుడులు, గోపురాలు, వ్రతాలు, నియమాలూ మొదలైనవాటిని ఏర్పరిచారు. మాస ధర్మములను విధించారు. నిత్య, నైమిత్తిక విధివిధానాలను తయారుచేసారు. అటువంటి నిత్య విధిలో భాగమే దేవతార్చన, నైవేద్య నివేదన.
 
ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి, స్నానంతో దేహాన్ని శుభ్రపరచుకొని, మానసిక శుచిని సాధించుటకు దేవుణ్ణి పూజించాలి. ఎవరెవరికి ఏది పూజావిధానమని పెద్దలు చెప్పారో ఆవిధంగా చేయడము ఉత్తమమైనది. పూజలో భాగంగా నైవేద్య సమర్పణ చేయాలి. మన స్వశక్తితో సంపాదించిన ఆహారపదార్థాలను భగవంతునికి నివేదించడమే నైవేద్యం. వానికి అర్పించిన పిదప అది ప్రసాదమవుతుంది.
సాద” అనగా శుభ్రమైన, నిర్మలమైన అని అర్థము. “ప్రకృష్టేన సాదతి ఇతి ప్రసాద” అన్న వ్యుత్పత్తి మేరకు అత్యంత శుభ్రమైనదానికి “ప్రసాద“మని పేరు. కావున మనం భక్తితో నివేదించిన ఆహార నైవేద్యాన్ని భగవంతుడు తన కృపాదృష్టితో చూడడంవల్ల దానికి అలౌకికమైన శుద్ధత్వము వచ్చి ప్రసాదముగా రూపాంతరము చెందుతుంది. ఇది చాలా సూక్ష్మమైన రూపాంతర క్రియ. అందువల్ల మనం నివేదించిన పదార్థములలో కంటికి కనబడు మార్పులేవీ ఉండవు.
 
అజ్ఞానానికి, సంతోషానికి, కోపానికీ ఒక రూపాన్ని చూపమంటే మనం చూపలేము. కంటికి కనబడని ఆ స్పందనలు మనల్ని ప్రతిక్షణం నడిపిస్తూనేవుంటాయి. అలానే భగవంతుని ప్రసాదము కూడా అత్యంత సూక్ష్మమైన రీతిలో శుద్ధీకరింపబడి నిత్యమూ స్వీకరించడం ద్వారా మనలో సుజ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. ఆ సుజ్ఞానము మన చర్యలలో ప్రతిఫలిస్తుంది. మన చర్యలు మనతోబాటు సమాజములోని అందరికీ తెలుస్తాయి. “Seeing is believing” అన్న ఆంగ్లేయుని మాటలను ఇక్కడ గుర్తుకుతెచ్చుకోవచ్చు.
 
ఈవిధముగా శుభ్రమైన పాత్రలలో, దైహిక-మానసిక శుచిత్వముతో భగవంతునికి సమర్పించు ఆహారపదార్థములు సూక్ష్మమైన మార్పులకు లోనై మనలో మంచి భావనలను పుట్టిస్తాయి. అలాంటి సాత్వికాహార సేవనము వల్ల దేహములోని అంగాంగాలూ శుద్ధములౌతాయి. ఈ శుద్ధత్వము పుట్టబోవు బిడ్డల్లోకి కూడా ప్రవేశిస్తాయి. దానినే వంశపారంపర్యము అంటారు. మనమే గాక మన రాబోవు తరములు కూడా ఉత్తములై, ఆరోగ్యవంతులై ఉండాలంటే నేటితరమువారు తమ పెద్దలను గౌరవించాలి. వారు చెప్పిన హితోక్తుల్ని త్రోసిపారవేయక, వీలైనంతగా ఆచరించాలి. ఈ సులభసూత్రాన్నే “ధర్మో రక్షతి రక్షితః” అని వేదం చెబుతోంది.
 
కావున, నేటి యువతీయువకులు సుఖసామగ్రులతో బాటు శాస్త్రవచనాలను శ్రద్ధతో అర్థముచేసుకొన్ననాడు భారతదేశములో ఉత్తమప్రజలకు లోటువుండదు. అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు లేకుండును. తల్లిదండ్రులను, పెద్దలను ఆదరించు సత్ప్రవర్తన పెరుగును. చిన్న కలతలకే కూలిపోవు కాపురములుండవు. విడాకులు, కోర్టు వ్యాజ్యములు ఆగిపోగలవు. మన చుట్టూ గల ప్రకృతిని ప్రేమించి, ఆదరించు స్వభావము పెరుగును. భౌగోళిక సంపత్తులు నీరసించక, రాబోవు తరముల వారికీ మిగులగలవు. ముఖ్యముగా “అంతా నాకే కావలెన”ను ఘోర స్వార్థము నశించును.
నేటి సామాజిక రుగ్మతలకు మన ప్రాచీన శాస్త్రకారులు చెప్పిన మాటలే మందు. ఆచరించుట మాత్రమే మనం చేయవలసినది.

“గోటితో పోవుదానికి గొడ్డలి అవసరమా?” – యుక్తిమంతులు ఆలోచించగలరు.

||సమస్త సన్మంగళాని భవంతు||


<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>