శంకర భగవత్పాదుల విరచిత భజగోవిందము – విద్యాప్రకాశ వర్ణితము
శ్రీ వెంకటేశ్వర ప్రేరిత రమాకాంత ఆంధ్రానుసారము
అంకితము శ్రీవారి పాద పద్మములకు
——————————————–
శ్రుతి స్మృతి పురాణానమ్ ఆలయం కరుణాలయం|
నమామి భగవత్ పాదం, శంకరం లోక శంకరం||
ఓం శ్రీ వేంకటశ్వరాయనమః
విశ్వేశ్వర ఓ వెంకట నాయక !
విశ్వాధార ! విష్ణు స్వరూప !
విమల జ్ఞానము విభుదుల కొసగెడి
గోవిందము నా కంఠము నిమ్మా!
లంబోదర ఓ అంబాతనయా !
గంగాధర సుత జ్ఞాన గణేశ !
మోదక హస్తా ! మంగళ దాయక !
శంకర గేయము సాగగ నిమ్మా!
చదువుల తల్లి చంపకవల్లి !
మృదు నీ కరమును మాపై మోపవే !
ఆత్మజ్ఞానము అవగతమవగ
దీవెనలిచ్చి దయలను జూపవే!
భజగోవిందము – నివేదనము
శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు
వేద వేదాంగముల విహిత విఙ్ఞానులు
విద్యాప్రకాశులు విశ్వ గురువులు వీరు
వీరి పదములయందు వాలి ప్రార్ధించిన
విశ్వఙ్ఞానము యెల్ల విదితమగు తధ్యము.
జీవియనే యీవిహంగానికి భక్తి, జ్ఞానము అనేవి రెండు, యిరు రెక్కల లాంటివి. ఇవి రెండూ బలంగా ఉంటే గాని యీ జీవన విహంగం భగవత్ ముఖంగా పయనించ లేదు. ఒక రెక్కతో యీ ప్రయాణం సాగలేదు. అందుకే శంకర భగవానులు జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యం యిచ్చారో, భక్తికి అంత ముఖ్యతను కూర్చారు. ఆకారణంగానే స్వామి ఎన్నో స్తోత్రాలను రచించి మనకందించారు.
యీ సంసార మోహంలో పడ్డ జీవి జీవితం యొక్క పరమార్ధం మరచి, దారి తప్పి గమ్యం మరచి పోతాడు. సంపదల సముపార్జనే జీవిత పరమార్ధంగా భావించి ఎన్నో అకృత్యాలకు పాల్పడు తాడు. యీ సంసారంలో ప్రతి ప్రాణి చేస్తున్న జీవ కార్య భాగాలు పుట్టుట, పెరుగుట, ఆహర సంపార్జన, తినుట, త్రాగుట, నిద్రించుట, క్రీడించుట, శరీర సుఖము, సంతానోత్పత్తి చేయుట. మానవుడు యీజీవులకన్నా యింకొక మెట్టు దిగజారి ‘సంపాదన’ అనే దుర్ వ్యసనంలో చిక్కుకొని పరమార్ధం పూర్తిగా మరచిన దయనీయ స్ధితికి చేరాడు. చివరకు జర, వ్యాధుల పాలై అన్ని జీవుల లాగే మరణిస్తూమరలా జన్మిస్తూ యీ జీవిత చక్రంలో మరల పడుతున్నాడు. కేవలం జన్మ జన్మకు ధరించే శరీరము మాత్రమే వేరు. ప్రతి ప్రాణి ఒకే విధమైన జీవ కార్యాలు చేస్తుంటే మనిషికి, మానుకు, మృగానికి తేడా ఏమిటి ? అన్ని జీవులకు లేనిది, మనిషికి మాత్రమే ఉన్నది, కేవలం జ్ఞానం. అది లోపించినపుడు మనిషికి మృగానికి తేడా లేదు. మనిషికి తన అస్తిత్వం తెలిసేలా జేసేది కేవలం జ్ఞానం మాత్రమే! అలామనిషి తన అస్తిత్వం తెలుసుకోలేనపుడు మానవ జన్మకు సార్ధకత ఏమిటి ?
గోవిన్దం భజ మూఢమతే !
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞకరణే
మూర్ఖుడా! ఓ వృద్ధుడా! గోవిందుని స్మరింపుము, ఈ తరుణంలో యీ అవసాన దశలో యీ వృద్ధావస్థలో యీ వ్యాకరణ గ్రంధము “డుకృఞకరణే” పఠనం, మననం, కంఠస్థం నీబ్రతుకును ఉద్ధరించదు. నీ కంఠానికి యమపాశం ఏక్షణం లోనైనా తగలొచ్చు, అప్పుడు యీ వ్యాకరణ పాఠం నిన్ను రక్షింపజాలదు. తస్మాత్ జాగ్రత! యని ప్రభోదించారు.
శ్రీ ఆది శంకరుల, మరియూ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వార్ల పాద పద్మాలకు యీరచన సమర్పిస్తున్నాను యిందు గల సద్గుణములన్నీ శ్రీ ఆది శంకరులవి, వారి రచనను వివరించిన శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారివి, లోపములన్నీ నావి. సాధు పురుషులు సహృదయంతో తప్పులు మన్నించ ప్రార్ధన.
సత్పురుషులందరు దీనిని చదివి, పాడుకొని ఆనందిస్తారని, స్వాములవార్లు చెప్పిన మాటలు చెవిన బెట్టుకొని జీవితాలను సార్ధకం చేసుకొంటారని ఆశిద్దాం!
భజగోవిందము – ఆశీర్వచనములు
మీరు పంపిన భజగోవిందం అనువాదంతో గూడిన గ్రంధం అందింది. చాలా బాగుంది. తెలుగు పద్యాలు, వ్యాఖ్యలతో ఆపివేయక, ఇవి తెలియని వారికి ఆంగ్లంలో కూడా భావం తెలియచేసేట్లు వివరణ చాలా బాగుంది.
మనసున్న ప్రాణి మానవుడొక్కడే! దానిని చక్కగా వాడుకో గలిగితేనే మానవుడికి గుర్తింపు. మనసు వాడుకోగలిగిన వ్యక్తి, జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, తన చుట్టు ప్రకృతినీ, చివరకు పరమాత్ముని గూడా పరవశింప జేయ గల్గుతాడు.
ప్రేమ రసార్ద్రమైన హృదయంతో భగవంతుని శరణు జొచ్చి నిజమైన జీవనంలో ముందుకు సాగాలనేదే శ్రుతి శిరస్సుల సారం. దాని కెదురయ్యే అవరోధాలను తొలగించుకొనే ‘శక్తిని’ గూడ వాడే యిస్తాడు. అవేవి ? ఎలా తొలుగుతాయి. దానికి మనమెలా ఆగోవిందుని శరణు వేడాలి ? మన మనస్సు దాని యందే చెదర నీయక నిల పడడ మెలా? అనేవన్ని అందంగా పాడుకొనే వీలుగ సామాన్యులకు అందుబాటులో ఉండేట్లుగ, ధీమాన్యుల కైనా మనోరంజక మయేట్లుగ, బ్రహ్మ విద్య ఇదే అన్నట్లు, 32 బ్రహ్మ విద్యలకు ప్రతీక లన్నట్లు 32+1 = 33 శ్లోకాలతో శ్రీ ఆది శంకరాచార్యుల వారు కూర్చిన సుందరమైన స్తోత్ర రాజమే ‘భజగోవిందం’.
ఆ అందాలను అనుభవిస్తూ, పెద్దలందించిన వ్యాఖ్యానుసారం ఇమిడేట్లుండే అందమైన పద్యాలతో మీరు కూర్చిన ఈ కూర్పు సహృదయు సంతర్పణ కాగలదని ఆశిస్తూ మీకు అనేక మంగళా శాసనములు చేస్తున్నాం.
చిన్న జియర్ స్వామి.
శ్రీ శ్రీ శ్రీ స్వామి విద్యా స్వరూపానంద స్వామి.
పీఠాధీపతి, శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమము,
శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమము ఫీ ఓ
శ్రీ కాళహస్తీ 517640
శ్రీమాన్ చాకలకొండ రమాకాంతరావు గారికి – నారాయణ స్మరణలు.
పవిత్రాత్మ స్వరూపా! మీరు భక్తి శ్రద్ధలతో పంపిన మీరచన “భజగోవిందము” ఆంధ్రానువాద రచన చేరినది. దానిని పరిశీలంచితిమి. మీ అనువాద రచన భక్తి రస భరితమై చాలా ఆహ్లాద కరముగ నున్నది. అచట చట వివరణ సుందరముగ వున్నది. 2 వ శ్లోకం, 7 వ శ్లోకం, 8 వ శ్లోకం, 9 వ శ్లోకం, 18 వ శ్లోకం వగైర చోట్ల, మీ ఆంధ్రానువాద వివరణ చాల సుందరంగా కండ్లకు కట్టి నట్లుంది. 3 వ శ్లోకం, ‘నారి ..’ అనే చోట మీ ఆనువాదం శంకరుని అభిప్రాయాన్ని తేట తెల్లంగా అందిస్తూ అదే సమయంలో అసభ్య పదజాలాన్ని వాడకుండా చాల సంస్కార వంతంగా అనువదించారు. మెత్తం మీద మీ రచన చాలా ఇంపుగ, సొంపుగ, అందరికి అర్ధమయ్యే రీతిలో హృదయాన్ని హత్తు కొనే టట్లుంది. చాలా సంతోషం.
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఇటువంటి రచనలను ఇంకను మీ చేత రచింప జేయుగాక. భగవంతుడు, సద్గురువులు మిమ్మల్ని అనుగ్రహింతురు గాక!
స్వామి విద్యా స్వరూపానంద.
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృఞకరణే
స్మరించు హరిని, స్మరించు హరిని,
స్మరించు హరిని, సుగుణ మతీ,
భజించు హరిని, భజించు హరిని,
భజించు హరిని, బుద్ధిమతీ. || స్మరించు||
కాలము చెల్లిన కడపటి వేళ,
కాలుని గాలము తగిలిన వేళ,
రావు రావు రక్షింపను నిన్ను
భువి సంపదలు భోగములు ||స్మరించు||
పరమాత్మ స్వరూపా! ఓ బుద్ధిమతీ! ప్రాపంచిక విషయ వాసనా జాలములోపడి భగవంతుని విస్మరించకుము. మనకున్న ధన, ధాన్యాది సంపదలు, పదవులు, భౌతిక విద్యలు, నైపుణ్యాలు, అంత్య కాలములో మనలను రక్షింపలేవు, అవసాన దశలో మనలను ఆదుకొనేది, శ్రీహరి ధ్యానము ఒక్కటే!. కనుక శ్రీహరిని స్మరింపుము, ఏమాత్రము ఆలస్యము చేయకుము. చివరి క్షణముల వరకు వేచిన, ఆ చివరి దశలో మనకు హరి నామకీర్తన అవకాశము దొరకునో లేదో తెలియదు. పొట్టకూటికి పనికి వచ్చే యీ విద్యలేవియు, చివరి దశలో మనకు అక్కరకు రావు, మనలను రక్షింపలేవు. కనుక తక్షణమే హరి నామ స్మరణ ప్రారంభించుము. హరి నామ స్మరణకు ఒక సమయము, పద్ధతి, నియమాలేవియు లేవు. సర్వకాల, సర్వావ్యస్థలయందు భజింప దగినది హరి నామం. ప్రతి క్షణము, ఏ పనిలోనున్ననూ శ్రీహరి స్మరణను మరువకుము. కాలుని జాలము నుండి అదే నిన్ను కాపాడ గలదు. యీ కాయము విడనాడు సమయమున, మరణాన్ని సుఖమయము, నిర్భయము చేసి, సంతోషముగా యీ శరీరాన్ని విసర్జింప జేసి, శ్రీహరి సన్నిధిని చేర్చగలిగిన ఆ శుభ నామాన్ని నిరతము ధ్యానింపుము. తినుచున్నా, త్రాగుచున్నా, పనిలో వున్నా, నిదురించు చున్నా, క్రీడించుచున్నా, మనసున హరి ధ్యానమును మరువకుడు.
యల్లభసే నిజ కర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తమ్ అర్ధము కొఱకు వ్యర్ధము చేయకు
మానవ జన్మము మూర్ఖమతీ,
పరమార్ధము పరమాత్ముని చరణము,
సంపాదించుము శీఘ్రగతి
ధన సంపాదన ధ్యేయము వదలి,
తృప్తిని ఎదలో గడించుము,
ఆశలు వీడిన హృదయము లోన,
ఆనందమెగ మధుర గతి
లక్షలకొలది ఆర్జన చేసిన,
లావుకాదు నీ లలాటము
లాలస వీడి లక్ష్మీపతిని
లోచన చేసిన వివేకము
ఉన్నదానితో తృప్తిని పొందే
వివేకవంతుడే ఉత్తముడు,
మోహము వీడిన ముముక్షువే హరి
ముంగిట చేరే సమర్ధుడు.
కలుష కర్మలతో కట్టిన మూటలు,
కాటికి వచ్చునా కౄరమతీ ?
పాపపు పుట్టలు పెరుగుటే గాని,
పొందిన దేది పున్నె మతీ ? ||స్మరించు||
హృదయమున తృప్తిలేని వారికి ఎంతయున్నను సుఖము, సంతోషము రావు. ధన సంపాదనలో చిక్కిన జీవికి, ఆశ వదలదు, ఆశ వదలనిచో తృప్తి చేకూరదు, తృప్తి లేనిచో ఎంత గడించిన సంతోషము రాదు. కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమగును. కోట్లు గడించినా కాటికి చిల్లి గవ్వరాదు గదా, ఆ సంపాదనకు చేసిన కౄర కర్మల వల్ల పాపపు మూటలు పెరిగి, ఆవి మాత్రము మనతో వచ్చును. కనుక ఉన్న దానితో తృప్తి పడుచు, బ్రతుకుటకు మాత్రము ఎంత గావలెనో అంత మాత్రమే సంపాదించుచూ, మనసు భగవధ్యానము పై మళ్ళించిన వాడే, నిజమైన ధన్య జీవి. లక్షలు గడించిన మాత్రమున నీ ప్రభావము అధికము గాదు, నీ కీర్తి చిరస్థాయిగా మిగులదు. ఎందరో రాజులు, ప్రభువులు, కోటిశ్వరులు, లక్షాధికారులు ఎంతమందో కాల గర్భములో కలసి పోయారు. వారి పేర్లు, వూర్లు గూడా ఎవరికి తెలియదు. మరి త్యాగధనులు, హరి దాసుల పేర్లో, అవి ఆచంద్రార్కము భువిలో చిరస్థాయిగ మిగులుట లేదా? అందుకే పోతన గారు అన్నారు:-
‘కారే రాజులు, రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం బొందరే
వారేరి, సిరి మూట గట్టుకొని పోవంజాలిరే, భూమి పై పేరైనం గలదే … `
యీనాడు మనం కళ్ళార చూస్తున్నాము, కండ, అండ, ధన, మద బలంతో, మంచి వారిని అణగ ద్రొక్కి, అధికార పగ్గాలను చేత బట్టి, అరాచకాలు సృష్టిస్తూ, ధనాన్ని సంపాదిస్తున్న ఎందరో, అదే రీతిలో అకాల మరణాల పాలై, ఎంత దైన్య స్థితినొందు చున్నారో ! బ్రతికి వున్నా వారికి శాంతి లేదు, ఎప్పుడు ఎవరి వల్ల అపకారం జరుగుతుందో అని ప్రతిక్షణము భయ పడుతూ బ్రతుకుతారు, అత్యంత హీన మైన చావు చస్తారు. కనుక, సంపాదనకు, సమయము వృధా చేయక, హరి ధ్యానము పై మనసును మళ్ళించుము.
ఏతన్మాంస వసాదివికారం, మనసి విచిన్తయ వారం వారమ్
కామిని అందము కాంచిన వేళ
మోహము చెందకు మందమతీ,
రమణి సొంపుల రమ్య శరీరము
రుధిర మాంసముల రోతమయం.
పొంగులు అన్నీ కృంగిన వేళ
కంకాళమె యీ శేష కాయము,
నిజమిది మదిలో నిత్యము తలచి
మోహము తృంచుము ముదితమతీ.||స్మరించు||
స్త్రీల అందమైన సుందర భాగాలను గని మందమతివై భ్రమించకుము. యందాలు యనుకొనే ఆ శరీర భాగాలు, రక్తము, మాంసము, క్రొవ్వు, మొదలగు జుగుప్సా కరమైన పదార్ద నిర్మితములే! వయసు మళ్ళగా, వృధాప్యము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును. ఈ శరీరము, పుడమి, జలము, అగ్ని, వాయువు ఆకాశము అను పంచభూత నిర్మితమై, నశ్వరము, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్ప బడిన తోలు తిత్తి. దానిని, ఆపంచ భూతములే గాక, రోగము, వృధ్ధాప్యము గూడా నాశము చేయగలవు. కనుక ఆశరీరపు టందములు చూచి మోస పోయి, వానిని బడయవలననే ఆశా, మోహముల నొందకుము. సప్తవ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం. దాని వల్ల మానవ జాతికి ఎన్నో కష్ట, నష్టాలు జరిగినవి. వ్యక్తికే గాక, సమిష్టికి గూడా స్త్రీ మోహము వల్ల ఎన్నో ఆపదలు కలిగాయి. కనుక యీవిషయము ఎల్ల వేళలా గుర్తుంచుకొని సన్మార్గగాములం అగుదాం.
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం, లోకం శోకహతం చ సమస్తమ్ బుద్బుద ప్రాయము బ్రతు కస్ధిరము
నీటి బుడగే యీనర జీవితము
తామర దళము పై జలముకు మాదిరి
జారును నేలకు చంచలము.
చిన్నది బ్రతుకు, చితుకును తుదకు
క్షణములోన యమ పాశము జిక్కు,
ఆలు బిడ్డలు, ఆస్తులు పాస్తులు
ఆఖరి క్షణమున అక్కర రావు
సంసారము యిది సంకటమయము
సంతాప, శ్రమ, సంభరితం,
శ్రీహరి పంచన స్ధిరముగ చేరి
సద్గతి నొందుము సుగుణమతీ ||స్మరించు||
పరమాత్మ స్వరూపా! యీ మాయా జగజ్జాలములో చిక్కిన మనకు, యీ అనుబంధములు, సంపదలు, సుఖములు శాశ్వతమైనవి అనే అపోహ కల్గును. కాని నావి, నావి యని భావించు యీ బాహ్య వస్తువులే కాదు, యీ శరీరమే మనకు సొంతము గాదు. ఒక్క క్షణములో అవి మనలను వదలి పోవును. తామరాకు పై నీటి జలము ఎంత అస్థిరమో, మన బ్రతుకు కూడా అంత చంచలము, అస్థిరము. ఏ క్షణమునైన అది జారి పోవును. నీటి బుడగలా రాలి పోవును. కనుక యీ బాహ్య వస్తువులను నమ్ముకొని వాని వెనుక బడుట, ఎండ మావుల వెనుక పడి దాహము తీర్చు కొన ప్రయత్నించిన దానితో సమానము. అందుకే పామరులు, బాహ్య వస్తు సముదాయముపై మోహము పెంచుకొని, వానిపై అను బంధము నేర్పరుచు కొని, అవి ఉన్నంతవరకు సంతోషము, అవి దూరమైనపుడు అత్యంత శోకము అనుభవిస్తున్నారు. కాన వస్తు సముదాయములు శాశ్వతమైన సంతోషమునందింప జాలవు. నిత్యమైన ఆనందము కావలెనన్న, దేహాభిమానము వదలి, భక్తి, జ్ఞాన, ప్రపత్తుల నవలంభించి, వైరాగ్య భావనతో, పరతత్వ సాధనలో శాశ్వతానందము బడయుము. శరణాగతితో శ్రీహరి చరణ కమలములు కోరి శాంతి నొందుము.
పశ్చాజ్జీవతి జర్జరదేహే, వార్తాం కోపిన పృచ్ఛతి గేహే
ధనసంపాదన చేసెడి వరకే
భార్యా బిడ్డల గౌరవము,
తదుపరి నిన్ను సరిగా చూతురె,
బంధువులు నీ స్నేహితులు ?
పదవులు తెచ్చును మద మధికారము,
సంఘము నందలి గౌరవము ,
తీరిన పిమ్మట తలపరు ఒకరూ,
సేవకులే, నీ సంగతులు.
బంధు చులకనలు, ఛీత్కారములు
యింటా బయట తుస్ కారములు !
వృధ్ద్దాప్యములో వీనుల యందు
కల్గించును అతి ఘీంకారములు!
సిరి సంపాదన చేసెడి వరకే
స్వీయుల, సుతుల ప్రేమ లభించు,
ఆపరి శ్రీహరి చరణము దప్ప
ఎవ్వరి ప్రేమ యింత లభించును.
పరమ భయానక భవసాగరమిది
తరణము చేయుట దుస్తరము
దేవ దేవుడా దేవకినందను
భజనమె తరణకు సాధనము ||స్మరించు||
దయామయుడు ఆ తిరుమల నాధుని
శరణము గోరుము శ్రీఘ్రగతి
శ్రీహరి నామ స్మరణను నావతో
తరణము జేయుము సులభగతి. ||స్మరించు||
సుగుణమతీ! నీవు పదవులలో ఉండి ధనము సంపాదించు సమయమున, నీ భార్యా బిడ్డలు నీపై అతి ప్రేమ కురిపించెదరు. నీ బంధువులందరు నిన్ను అతి మర్యాదగ చూతురు, సేవకులు, సహోద్యోగులు నిన్ను గౌరవింతురు. దానికి కారణము నీ గొప్ప గాదు, నీ వల్ల వారికి జరిగే ప్రయోజనమో, లేదా నీ వల్ల వారికి హాని జరుగ కుండ యుండు నటుల వారు అలా నటింతురు. ఒక్క సారి ఆపదవి పోగానే, నీలో ధనార్జన శక్తి సన్నగిల్లగనే, నిన్ను ఎవ్వరూ పట్టించుకొనరు. యింట, బయటా, నీకూ గౌరవము లభించదు. నీకు వేళాకోళములు, హేళనలు, ఎగతాళులు, చులకనలు ఎదుర్కొనే దుస్థితి కలుగు తుంది. కనుక తెలివిగా యిప్పుడే కనులు తెరచి, ప్రేమ స్వరూపుడైన ఆ పరబ్రహ్మ ఆదరణకు పాత్రుడవగుటకు ప్రయత్నించుము. కరుణా మూర్తి యైన ఆ పరబ్రహ్మ అభిమానము చూరగొనవలె నన్న, యీ వస్తు సంపదలపై మోహము విడనాడి, దేహ సంబంధులైన వ్యక్తులపై మమతను వీడి, మనసును మాధవునికి అర్పణ జేసుకొనుము. భవ సాగర తరణమునకు శ్రీహరి నామమన్న నావను ఆశ్రయించుము. అది అతి సులభముగ భవ సాగర యాత్ర జరిపించును.
గతవతి వాయౌ దేహోపాయే, భార్యా బిభ్యతి తస్మిన్కాయే. కాయము కట్టెగ మారిన క్షణమున
రారెవ్వరు దరి ప్రియ బంధువులు
ఆలే భయపడు ఆయువు తీరగ
కాయము దగ్గర కొంచము ఉండను.
శ్వాసలు గుండెలొ సాగిన వరకే
అందరు స్థితి గతి అడుగగ వత్తురు,
ప్రాణము పోయిన పది నిముషములే,
ఆపరి ఒకరూ వూసే యెత్తరు.
పంచ భూతముల పాకము తోటి
పుట్టిన దేహము ప్రకృతి నైజము,
రక్త మాంస దుర్గంధ భరితము
దీనిపై దేనికి తీరని మోహము.
అశాశ్వతములీ వస్తు సంపదలు,
వీడు వానిపై వ్యర్ధ మోహము,
శాశ్వతమైనది శ్రీహరి సన్నిధి
సంగతి మరువకు శాంతి మతీ. ||స్మరించు||
నేర్పరీ ! శరీరంలో యీహంస సాగిన వరకే, బంధువులు, మిత్రులు, నీ క్షేమ సమాచారములు అడుగగా వత్తురు. నీపై అతి ప్రేమ, వాత్సల్యము కురిపింతురు. అది అంతా నీ గుండెలలో ప్రాణ వాయువులు సాగు వరకే. ఒక్కసారి ఉఛ్ఛ్వాశ నిశ్వాసములు ఆగి, నీవు విగత జీవుడవై నేల బడియుండ, నీ భార్య కూడా నీదరి చేరను భయపడును. నీ వారందరు నీ శరీరము తాకను గూడా శంకింతురు. నీవు తనువు చాలించిన కొలది క్షణముల వరకే అందరూ శోకము ప్రదర్శింతురు, ఆపై నీ వూసును గూడా ఎవ్వరూ ఎత్తరు. అందమైనదని ఊహించుకోనే మన యీ శరీరము, రోగముతో రోతతో, మలిన గంధ భూయిష్ఠమగును. శరీరమున ప్రాణ వాయువులు ఆగి పోవగనే, అది పనికిమాలినదై పోవును. ఎంత త్వరగా దానిని వదలించుకొందమా అని అందరు భావింతురు. పంచ భూతములతో నిర్మతమైన యీ దేహం, చివరకు పంచ భూతములలోనే కల్సి పోవలె! అట్టి యీ హీన శరీరం పై మమతలు యేల? వస్తువులపై వ్యామోహము వదలి, శ్రీహరి సన్నిధికై చిత్తమును మళ్ళించుము.
పుత్త్రాదపి ధనభాజాం భీతిః, సర్వత్రైషా విహితా రీతిః
ఆస్తులు దక్కెడి క్షణముల వఱకే
ఆత్మీయులు నిను ఆదరింతురు,
ఆపై ముసలీ ఆవలయుండని
అందరిలో నిను అవమానింతురు
మోసము తోటి మూటలు గట్టి
దాచుట కడ్డ దారులు తొక్కి,
చివఱకు చెంతకు చింతగ చేరి
ధనమే తెచ్చును ధరణిన దైన్యము
కూడబెట్టిన కోట్ల కాసులే
కాలనాగులై కాటు వేయును,
మించిన ధనమే ముంచును నిన్ను
కాలకూటమై తుంచును నిన్ను
కలిమి, కనకములు కొండలు కాగా
పాప కార్యములు పర్వతమవగ,
కొని పోయెడి నీ గూఢ సంపద
గుండు సున్నయని గ్రహింపు జీవా.
వక్రమార్గమున విత్తము చేర్చి
వేలు గడించిన విహ్వలుడు,
తృష్ణతీరక ధనదాహముతో
తామసమొందిన తృషితుండు
తామస మొదలి తిరుమలనాధుని
చరణ సంపదల భాగ్యము కొనుము,
హరి నామముల ఆహార్యముల
భూషణ చేయుము బుద్ధిమతీ ||స్మరించు||
పరమాత్మ స్వరూపా! మోసము తోటి, కపటము తోటి ఎన్నో అడ్డ దారులు త్రొక్కి, కూడ బెట్టిన ఆస్తే చివరకు నీకు కష్టమును కల్గించును. అధికమైన సంపదల వలన నీకు నీ బంధువుల వలన, మిత్రుల వలన, సేవకుల వలన, కడకు నీ సొంత బిడ్డల వలన కూడా అపాయము జరుగ వచ్చును. మొదట ధనము సంపాదించుటకు అవస్థలు బడి, తరువాత దాచుకొనటకు అవస్థలు బడి, చివరకు, నీ ప్రాణము రక్షించుకొనుటకు అవస్థలు బడవలసి వచ్చుచున్నది. అట్టి ధనములో చింతా కంత గూడా నీవు నీతో తీసుకొని పోలేవు. నా బిడ్డలు, నా వాళ్ళు అని స్వార్ధముతో నీవు దాచిన ధనము వలన నీకు ప్రయోజనమేమిటి ? అంతే గాదు, ఆ ధనము నీవు సంపాదించి వారికి పెట్టువరకే నీకు మర్యాద, దానిని సంపాదించ లేనపుడు నీ సంగతి ఎవ్వరూ పట్టించు కొనరు. ధనము వారికి దక్కగనే, నీ విలువ తగ్గి పోవును, పిమ్మట నీ యోగ క్షేమములు ఎవ్వరూ పట్టించు కొనరు సరిగదా నిన్ను ఉదాసీనముగా చూతురు. ధన హీనుడివైన నీవు నలుగురిలో అపహాస్యపు పాలు గూడ అగుదువు. ధన దాహము ఊబి వంటిది, అందు చిక్కినచో బయటకు రాలేరు. కనుక ధనము వలన నీకు ఎప్పుడూ సుఖము లేదు. నీవు నీ నిజ జీవితములో చూచుచునే వుందువు. ఎందరో ఆ ధన వ్యామోహములో పడి, ఆప్యాయతలు, ప్రేమలు, మైత్రి, మానవత్వము మరచి ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో! చివరకు వారు జీవితం లో పడ్డ సుఖము, చివరకు వారి అంతము గూడా ఎటుల జరుగునో నీకు విదితమే! కనుక ధన చింతన మాని, సమయము దైవ చింతనకై ఉపయోగించి జీవితము సఫలము జేసుకొనుము.
వృద్ధస్తావచ్చిన్తాసక్తః, పరమే బ్రహ్మణి కోపిన సక్తః బాల్యము అంతా ఆటల మయము,
యౌవనమున స్త్రీ లంపటము,
వయసు ముదిరిన వ్యర్ధ చింతనమె
ఎపుడో శ్రీహరి పద సేవనము ?
చిన్నతనములో చపలత్వముతో
చెలిమికాండ్లతో చెండు లాడెదవు,
తెలిసీ తెలియని అజ్ఞానముతో
తిరుమల నాధుని తల్చనె తల్చవు.
విద్య గడించను, విలాసములకే
యౌవన మంతయు వ్యర్ధము చేతువు
పొట్టకూటికై నేర్చిన విద్దెలు,
పరమార్ధము కై పనికే రావు.
తదుపరి బ్రతుకున ధన సంపాదన
పడతీ బిడ్డల ప్రేమలు లాలన
క్షణమైనను ఆ లక్ష్మీ పతికై
చింతాకంతయు శోచన చేయవు.
వయసు మళ్ళగా,వ్యాధులు సోకగ
హృదయములో ఆరాటము తీరక,
తహతహ తో మది తపించి పోవుచు
తత్వము పైన తలపులు నిలుపవు.
అమూల్యమగు యీ మానవ జన్మను
ఆరాటముతో వ్యర్ధము చేయకు,
ఆత్మనాధుని ఆశ్రయమోందే
అవకాశము చేజార విడువకు
ఆత్మజ్ఞానము అత్మ నిగ్రహమే
హరిని చేర్చెడి సాధనము
అచంచలమ్మగు అచ్యుతు భక్తే
ఆదుకొనేటి ఆయుధము.
తామస మదితో తాత్సారముతో
దినములు గడపకు దివ్యమతీ
సదవకాశమిది చే జార్చకుమీ
సమయమిదే ఓ సుగుణమతీ || స్మరించు||
తత్వమసి! వివరముగా యిది విచారించుము, బాల్యములో, తెలిసీ తెలియని వయసులో, సమయమునంతా ఆట పాటలకు వ్యర్ధము చేసుకొను చున్నాము. పిమ్మట యుక్త వయసు రాగనే, స్త్రీ వ్యామోహములో పడి కామ క్రీడలకు సమయము వృధాచేయు చున్నాము. ఆపిమ్మట వృధ్ధాప్యములో ధన, కాంతా, కనకాల పై ఆసలు తీరక, జర, వ్యాధి బాధలతో చింతాగ్రస్తులమై ఆ చివరి క్షణములు వృధా చేయుచున్నాము. యింక భగవంతుని పై తలపు ఎప్పుడు. జీవితకాలమంత యిటుల వృధాయైన సాధించిన దేమి ? కాన కర్తవ్యము నెరిగి, పరమాత్ముని పై మనసు నిలిపి, గోవింద స్మరణతో జీవితము పునీతము చేసు కొనుము. భగవంతుని పొందుటకు సాధనము హరి పై నిర్మల భక్తే! ఆత్మ నిగ్రహము తో పరతత్వ జ్ఞానము బడసి, భక్తి సాధనముతో భగవంతుని చేరుము. నేడు రేపు అని రోజులు గడపకుము. మానవ జన్మము మహాదుర్లభము, భగవంతుని జేరుటకు సదవకాశము. యిది చేజార్చుకొనకుము. యిదే మంచి సమయము. వెంటనే కార్య దీక్షతో ముందుకు సాగుము.
కస్య త్వం వా కుత ఆయాతః, తత్త్వం చిన్తయ తదిహ భ్రాత:
ఎవ్వరు భార్య, ఎవ్వరు పుత్రులు
పెండ్లికి ముందు, పుట్టుక ముందు,
ఎవరీ జీవికి అగుదురు సొంతము
పుడమిన ప్రాణిగ పుట్టక ముందు.
ఎవరికి ఎవరీ వింతగు జగతిన
ఎంత నిజము యీ దేహ బంధములు,
ఏమిటో మాయ ఎఱిగిన వారికి
యిహ లోకములో ఏమిటి బాధలు.
ఎవ్వరు తల్లి, ఎవ్వరు తండ్రి,
ఎవరు అక్కలు, అన్నదమ్ములు
ఎవరీ ఆత్మకు అనుంగు మిత్రులు
ఎవరికి ఎవరో ఎరుగగ లేము
ఎచ్చటనుండి వచ్చిన వాడవు
ఎచ్చటి కావల వెళ్ళెడి వాడవు
ఏమిటి జీవికి యిహ బంధములు
ఎఱగి మెలగుమీ యధార్ధ జ్ఞానము
వీడుము భ్రాంతి దేహాభిమానము
వేడుము శ్రీహరి పాద కమలము
పాడుము నిత్యము శ్రీపతి నామము
కూడుము శ్రీహరి దాసుల సంఘము
మాయామోహము మదిలో గ్రమ్మి
బ్రతుకు బంధములె స్ధిరమని నమ్మి,
ఆశాపాశపు అడుసున చిక్కి,
శోకము నొందకు సుగుణమతీ ||స్మరించు||
ఓయి సుమతీ! కొంత ఆలోచించుము. ఆత్మ స్వరూపులమైన మనమందరము, యీ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము. నీవు పుట్టక ముందు, నీ తల్లి దంద్రులతో ఏమి నీకు సంబంధము. అలగే నీకు పుట్టిన బిడ్డలతో, వారి జన్మకు ముందు నీ కేమిటి బంధము ? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీ వెవరు ? యీ భవ బంధములేవి, పుట్టుక మునుపు లేవు, మరణము తర్వాత వుండవు. కనుక యీ భవ బంధములు శాశ్వతములని నమ్మి, వ్యామోహములో బడి చింతనొందకుము. యీ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడు నంతవరకు మన పాత్రల భాంధవ్యములు వేరు. అదే విధముగా యీ జీవన్నాటకము గూడా! అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వఱకు, నా భార్య, బిడ్డలని వ్యాకుల పడుతూ, వారి కొఱకు, నీ సమయము వృధా చేయకుము. ఉన్నదానితో తృప్తి పడి వారిని పోషించుము, మిగిలిన సమయము భగవన్నామ స్మరణలో గడుపుము. సత్య హరిశ్వంద్రుడు ఏమన్నాడు “ మాయామేయ జగంబె నిత్యమని సంభావించి, …..”. మనందరము పుట్టక మునుపు ఎక్కడ వున్నాము, మరణము తర్వాత ఎక్కడకు పోతాము ? ఎవరు నేను, ఎక్కడికి నా గమ్యము, ఏమిటి యీ జీవన యానము ? యీ విధమైన ప్రశ్నలతో మదిలో తర్కించి, గురువుల నడిగి తెలుసుకొని, ఆత్మ జ్ఞానము బడసి, భ్రాంతిని, దేహాభిమానము వీడి, మనసులోని శారీరిక బంధములపై అభిమానము వీడి, మనసు పరమాత్మ పై లగ్నము జేసి, కృత కృత్యుడవు గమ్ము.
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః
జ్ఞాన భక్తి వైరాగ్యము లబ్బును,
ఆత్మ తత్వము అవలోకనమై
జీవన్ముక్తి చక్కగ దొరకును.
సుజనుల సంగతి శ్రీఘ్రమే గొనుము
వారి మాటె వేదాంత సారము,
వారు చెప్పెడి వాక్కులె ధర్మము
వారల జ్ఞానమె వర ప్రసాదము
అమృత పురుషుల నాలకించిన
ఆత్మ మోహము అంతరించును,
అనుభవజ్ఞుల అమూల్య బోధతో
ఆత్మజ్ఞానము అవగతమగును.
మంచి మాటలు మదిలో నిలచిన
మమకారముల మోకులు తెగును,
నిస్సంగత్వము నొందిన హృదయము
నరహరిపైన నిశ్చల మగును.
మోహమయము ఈ మానవ జన్మము,
నశ్వరమెల్లయు నిజము యిది,
నిత్యము సత్యము నరహరి సన్నిధి,
నిజమెఱుగుము ఓ నిశితమతీ ||స్మరించు||
ఓయి సుమతీ! సజ్జన సాంగత్యము వలన నీకు ప్రాపంచిక విషయముల గురించి నిజము తెలియును. దాని వలన వానిపై వ్యామోహము నశించును. దాని ఫలితముగా నీకు అజ్ఞానము అంతరించును. అజ్ఞానము అంతరించిన హృదయములో ఏకాగ్రత కలిగి, భగవంతునిపై మనసు నిలచును, తత్ ఫలితముగ నీకు ముక్తి చేకూరును. కాన సత్ సంగములకు వెళ్ళుట, సత్ పురుషులను కలయుట చాలా ముఖ్యము. సువాసన గల వనములో నడచిన యా సువాసన నీకు లభించినట్లే, సాధు సాంగత్యము వలన మంచి చేకూరును. అందుకే అన్నమయ్య అన్నారు:-
నీ దాసులున్న చోట నత్య వైకుంఠమే,
వేదకు వేరొక చోట వెతకనేల,
…..
వారల తోటి మాటలు, వడి వేదాంత పఠన,
సార బట్టి చదువులు చదవనేల ?
యీ విషయాన్నే ఎందరో మహాను భావులు ఎన్నెన్నో రీతులుగా చెప్పారు. ఎన్నో విషయములు, మనకు, పెద్దలవలన, వారి అనుభవముల బట్టి తెలియును. కనుక గురువులు, పెద్దలు, ప్రజ్ఞావంతులను గౌరవించుచూ, వారి సేవ చేయుచూ, వారి సాంగత్మములో మంచిని తెలుసుకొని, మాయను వీడి, భగవన్ముఖముగా మనసు మళ్ళించి విముక్తి బడయుము.
క్షీణే విత్తే కః పరివారో, జ్ఞాతే తత్త్వే క స్సంసారః
మదన వికారము, మాసి పోవును,
యౌవనుడై వైరాగ్యము నొందిన
విబుధుడె ధన్యుడు ఉత్తమ పురుషుడు.
వైరాగ్యాంబుధి జలముల తోటి,
తత్వజ్ఞానమను తీవ్ర కృషితో,
కామ కలుషమును కడిగి వేయుము.
వదలి వేతురు వలదని మిత్రులు
నీరు నిండగనే కప్పలు చేరు,
ఎండిన చెరువున ఏమిటి తీరు.
భవ బంధములే సమసిపోవును.
ఆపరి తత్వము నెఱుగట సులభము,
మోక్షము నొందుట మహా సుగమము ||స్మరించు||
ఓయీ ! సద్గుణమతీ! తనువులో శక్తి నశించి, నడుము వంగి, ఇంద్రియముల పటుత్వము తగ్గినపుడు, కామ వికారాలు తగ్గుటలో విచిత్రమేమి ? దేహ పటుత్వము నశించినపుడు, నరములలో నీరసము వచ్చినపుడు కామ క్రీడల పై ఆసక్తి నశించుట సహజము. నీరన్ని ఇంకి పోయిన పిమ్మట యిక చెఱువనేది ఎక్కడ ? అనగా అశక్తుడవైనపుడు కామ క్రీడలయందు అనాసక్తుడ వగుటలో గొప్ప యేమి ? వయసులో ఉన్నపుడు, మనో వికారముల నదుపుజేసి పరమాత్ముని పై లగ్నము జేసిన వాడు గొప్పవాడు. అనగా ఎప్పుడో వృధ్ధాప్యములో అన్ని అంగములు ఉడిగినపుడు వాని పై అయిష్టత గలిగినను, మనసు మాత్రము యింకా వాని వెనుకే పరుగులిడు చుండును. వయసు లో ఉన్నపుడే ఆత్మ నిగ్రహము పొందిన, శరీరము మనసు స్వాధీనములో నుండి, ఏకాగ్రత చేకూరును. కాన భగవత్ చింతన పిన్న వయసు నుండే ప్రారంభించ వలెను. మనకున్న ధనము నశించగనే, ఒక్కోక్కరూ మిత్రులు మనలను విడనాడుదురు. సుమతి శతకములో చెప్పినట్లు –
ఎప్పుడు సంపద గలిగిన
అప్పుడు బంధువుల వత్తు రది యెట్లన్నన్,
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.
కనుక ధన సంపత్తుల పై వారికి ప్రేమ గాని నీపై గాదు. కనుక బంధ విరహితుడవై, ఆత్మ తత్వము తెలుసు కొనుము. అది యెఱిగినచో ఇక అశ్వాశ్వతములైన తను బంధములపై, ధన సంపదలపై మనసు పోదు, అప్పుడు నిర్వికారుడవై, తామరాకుపై నీటి బొట్టు వలె, అంటి ముట్టనట్లు జీవితము గడుపుచూ, నీ ధర్మము నీవు నిర్వర్తించుచునే, పరమాత్మను గురించి చింతించుచూ, పరమ సుఖము ననుభవించ గలవు.
తత్వ విచారణ చేసిన యీ భవ బంధములు, నశ్వర పదార్ధ జగతిని గురించి నిజా నిజాలు తెలియును. అప్పుడు ఆత్మానుభూతి సిద్ధించును. తద్వార శోకము, చింత, అశాంతి, తపన, వ్యధ మొదలగు దుఃఖములు నశించి పరమ శాంతి చేకూరును. ఆ దశల ఆత్మానందముతో, ఆనంద సాగరములో తేలి పోగలవు.
మాయామయమిద మఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా
ధన పరివారము తరగని ఆస్తులు,
యౌవన అందము, బలమని తలచిన
సర్వము సమయును క్షణములలోనే
నిముషములోనే నాశన మగును,
నావీ నావని భ్రమసినవన్నీ
నీటిపాలగు నిక్కము నమ్ముము
ప్రాజ్ఞత తోటి ప్రవర్తించుము
ఆత్మైక్యతతోఅమృతానందము
అతి సులభముగా అగు నీ సొంతము
అస్ధిర ధన, పద సంపద సర్వం,
అస్ధిర బంధు, భార్యా బంధం,
అస్ధిర జగతిపై ఏలీ మోహం
సత్యం, నిత్యం భగవన్నామం,
భవ తాప శ్రమ దుఃఖ విదూరం
భగవత్ భక్తే ముక్తికి మార్గం ||స్మరించు||
ఓ జ్ఞానమతీ! యీ ప్రపంచములో అందరి కన్నా నీకు మొదటి శత్రువు గర్వము. ఎప్పుడు మనసున గర్వము చేరినదో, అపుడే మనిషికి పతనము ప్రారంభమైనదని అర్ధము. గర్వము అజ్ఞానమునకు సూచన. గర్వము గల్గిన వ్యక్తి, తాను ధన వంతుడిననో, అందగాడిననో, పదవిలోనో, పలుకు బడిలోనో ఉన్నతుడననో, లేక జ్ఞానిననో, మంత్రోఛ్చారణలో దిట్టననో ఊహించుకొని, ఊహాగానాలు చేసుకొని, స్త్రీ, జ్ఞాన వృధ్ధులు అన్న తార తమ్యములు మరచి అందరిని అవమానిస్తాడు. ఈ అజ్ఞానమునకు కారణము అసంపూర్ణత. మనము వినియే వుంటాము, నిండు కుండ తొణకదని. కాన పూర్ణ జ్ఞాని నిశ్చలంగా, నిదానంగా ఉంటాడు. అసంపూర్ణ వ్యక్తులే అసందర్భ ప్రేలాపనలతో, అతిశయముతో కూడిన భాషణలతో తమ కాలము, యితరుల కాలము వ్యర్ధము చేస్తుంటారు.
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముఞ్చత్యాశావాయుః
రేయింబవళ్ళు రయముగ దొర్లును
ఋతు మాసములు ఏళ్ళుగ మారి
ఆయువు వేగమే అంతరించును
కాలుని గాలము తగులును ఎప్పుడో
అత్తరి ఎంతగ విచారించినా
ఫలితము యేమిటి పున్నెమతీ ?
కట్టుము నడుము కేశవ సేవకు
నెట్టుము ఆవల యితర కార్యములు
పెట్టుము పూజకు ప్రథమ తిలకము
వాయిదాలతో ఏళ్ళను నెట్టి
విశ్వనాధుని విమల సేవను
ఆదమరచకు అమల మతీ ||స్మరించు||
ఓయీ సుజనా! మానవ జీవిత పరిమితి వంద సంవత్సరములు. అందులో మన దురలవాట్ల వల్ల, రోగముల వల్ల, వ్యాధుల వల్ల, ఆపదలవల్ల ఆజీవితకాలము ఎంతో తరగి పోవు చున్నది. అందులో సగభాగము మనము నిద్రలో గడుపు చున్నాము. మిగిలిన సగభాగములో జీవన కార్యక్రమములకై గడుపు చున్నాము. తిండి, క్రీడలు, వినోదములకు చాలా భాగము వినియోగించు చున్నాము. ఆ మిగిలిన కొంత భాగమైనను భగవంతుని సేవకై వినియో గించక, పర దూషణలు, నిందలు, కామ క్రీడాది కార్యక్రమములకై వినియోగించుచున్నాము. ఈ విధంగా మన జీవిత కాల మంతయూ గడచి పోవుచున్నది. స్వామి సేవ రేపు, మాపు అనుకొంటూ లేని పోని సాకులతో కాల యాపన జేయు చున్నాము. ఈ విధంగా గంటలు, రాత్రింబవళ్ళు, రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు గడచి పోవు చున్నవే గాని, భగవత్ ధ్యానానికి ఒక క్షణము వెచ్చించుట లేదు. ఈ విధంగా మనకు ఎన్నో జన్మలు గడచినవి, గడచును కూడా! మనము యీ జనన మరణ చక్రములో యిదే విధంగా అవస్థల పాలు కావల్సిందేనా? అందుకే కంచర్లవారు యిలా సెలవిచ్చారు:
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్
గప్పినవేళ మీస్మరణ గల్లునో గల్గదో నాటికిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరధీ కరుణా పయోనిధీ!
మానవ జన్మము బహు దుర్లభమైనది, అది చేజారిన మరల దొరకుట కష్టము. కాన ఉన్న కొలది సమయమునైన, భగవత్ చింతనలొ గడిపి, జీవితము సఫలము జేసుకొనుము. ఈ ప్రాపంచిక విషయములు శాశ్వతములు గాదు. కాన వాని నుండి మనసు మరల్చి దైవ ముఖముగా మనసును మళ్ళించుము. ప్రయత్నించి ఆశ, వ్యామోహములకు కళ్ళెము వేసి, వానిని అదుపుజేసి, మనసు దిట్టము జేసుకొన్నచో పరబ్రహ్మ సాక్షాత్కారము పొందవచ్చును.
ఉపదేశో భూద్విద్యానిపుణైః శ్రీమచ్చజ్కరభగవచ్చరణైః తత్త్వ సుగంధ సుపుష్పరాజముల
ద్వాదశ శ్లోక దివ్యగుచ్చ మిది
సర్వశాస్ర్త సంక్షిప్త సారము,
శంకర భగవత్ పాద విరచితము
మోహ తిమిరమును అంతము చేసెడి
భాను తేజమీ భజగోవిందము
ముముక్షువులకిది మహా గ్రంధము
జిజ్ఞాసువులకు శాస్త్ర సారము
శ్రద్ధాసక్తుల పఠనము చేసిన
భక్తిగ భావము మననము చేసిన
భవరోగములకు దివ్యౌషధమై
శాంతి నిచ్చు నీ శంకర శ్లోకము ||స్మరించు||
అజ్ఞానముతో, వృధాప్యము దాపరించినను, సన్మార్గము నెరుగని వృద్ధ బ్రాహ్మణుని పై కరుణతో “భజగోవిందం” అను పల్లవితో ప్రారంభించిన శ్లోకము గాక, పై పన్నెండు శ్లోకములను శ్రీ ఆదిశంకరులవారు చెప్పిరి. అవిగాక చివరి మూడు శ్లోకములను గూడా శ్రీ ఆదిశంకరులవారు చెప్పిరి. పై పన్నెండు శ్లోకములు పరతత్వ పరిమళ గంధముతో విరాజిల్లే అందమైన పద పద్మముల పూమాల, భవరోగములను బాపు దివ్య వనమూలికల ఔషధరాజము. కైవల్య కాముకులు యీ శ్లోకములను భక్తిగా చదివి అర్ధము జేసుకొని, తమ అవగుణములు, అలవాట్లు, లోపములు సవరించుకొని, పరమ శాంత మనస్కులై, పరమాత్మ శ్రీ చరణాల నందుకొనెదరని ఆశిద్దాం. వీని తర్వాత శ్లోకములను శ్రీ శంకరుల వారి శిష్యుల చెప్పిరి.
త్రిజగతి సజ్జన సఙ్గతి రేకా, భవతి భవార్ణవతరణే నౌకా.
చింతలు యేల చలపతి వుండగ
చింతలు వదలి చిత్తములోన
ఇంతి రమామణి పతినే నిలుపుము
శాసించెడి శ్రీ పురుషుడు వుండగ
శోక, క్లేశముల శ్రమ లింకేల
శ్రీహరి చరణము శరణము జొచ్చి
శాంతి సౌఖ్యముల సంపద నొందుము
కాంతా, కనకము కల్మష జనకము
ఎంతగ పెంచిన అంతటి శోకము
సొంతము కావవి వృధాభిమానం
కొంత వీడితే ఎంతో శుభము
మహాపురుషుల మాటలు వినుము
ధన, కనకముల ఆశలు వదలుము
ఎనలేని హరి శరణము నొంది
మనుజ జన్మకు మన్నిక తెమ్ము.
సంసారార్ణవ తరణ సాధనము
నామ సహస్రము నాస్తి అన్యము
శ్రీహరి దాసుల సత్సంగములో
నిశిత జ్ఞాన నిక్షేపము కొనుము ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ పద్మ పాదాచార్యులవారు. ఓయీ! పరాత్పరుడైన భగవంతుడు లేడా! అతడు కరుణామయుడు. నారు వేసిన వాడు నీరు పోయడా! పుట్టించిన వాడు పూట గడపడా! ఎందుకు నీకు చింత. అయ్యో! నేను లేకున్న నా భార్యా, బిడ్డల గతి యేమిటి అని చింతిచకుము. దయా స్వరుపుడైన ఆదేముడు అందరికి తిండి, గుడ్డ, నీడ తప్పక యిచ్చును. కాన యీ విషయములపై చింతించుట మాని, మనసు పరమాత్మపై లగ్నము జేయుము. సమయమును వృధాచేయక, సత్ సాంగత్యము చేగొని, వారి వలన ధర్మాధర్మములు, మంచి చెడ్డలు తెలుసుకొని, సన్మార్గమును గుర్తించి, భవ సాగరములో జీవిత నావను చక్కగా భగవత్ గమ్యమునకు తీసుకొని పొమ్ము. శ్రీహరి నామ సహస్రము భవసాగరమును దాటించగల చక్కని నౌక.
పశ్చన్నపి చ న పశ్యతి మూఢో, హ్యుదర నిమిత్తో బహుకృతవేషః నుదుటన బొట్టు, నామపు పెట్టు,
కమండలము కాషాయపు కట్టు,
ఆత్మ జ్ఞానిని, యోగిని చేయునా ?
వేషములా విజ్ఞతకును దీటు ?
కామ క్రోధములు త్రుంచని వాడు,
ఇంద్రియ లోలుడు, ఇచ్ఛా పరుడు,
మనసు నధీనము చేయని వాడు,
ముని వేషముతో మోక్షము నొందున?
బాహ్య వేషములు భక్తే గావు,
భక్తికి కట్టూ బొట్టూ లేదు,
పొట్ట కూటికే వేషము గానీ
పర సాధనకు పనికే రాదు ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ తోటకాచార్యులవారు. వేష, భాషలు భక్తి, జ్ఞానముకు కొల మానములు కావు. బోడి తల చేసుకొని, నామములు పెట్టుకొని, కాషాయ వస్త్రములు ధరించిన మాత్రమున అజ్ఞాని జ్ఞాని కాజాలడు. బాహ్య వేషములు మోసమునకే గాని, మోక్షము సాధించుటకు పనికిరావు. జ్ఞానమునకు చిహ్నములు ఇంద్రియ నిగ్రహము, శాంతము, ప్రేమ, దయ, మనోస్థిరత మొదలగునవి. వల్లె వేసిన వేద మంత్రములు పఠించుచుండి, మనసు భగవంతునిపై లగ్నము గానపుడు ఆపూజలు నిరర్ధకము. పరమార్ధము తెలుసుకొన లేని వ్యక్తి యే వేషము వేసినను వ్యర్ధమే. జ్ఞాని మనో వాక్కాయ కర్మలు భగవంతుని పై లగ్నము జేయును. అట్టి మహోన్నతుడు, సహనము, ప్రేమ, దయ వంటి ఉత్తము గుణ సంపన్నుడై వుండును. సాటి వారిపై తను అతి కరుణతో ప్రవర్తించును. కోపగించుట, పరులను నిష్కారణముగా దూషించుట, అవమానించుట అనునవి రాక్షస గుణములు. అట్టి అవగుణములకు సత్పురుషులు దూరముగావుందురు. అప్పుడు వారిని దైవాంశ సంభూతులుగా మనము గౌరవించెదము. అంతేగాని గౌరవము వేష, భాషలు, మంత్రపఠనా పాటవము వల్ల కలుగదు. ఆవేషములు ఉదర పోషణకే గాని దైవ కార్యములకు పనికిరావు.
వృద్ధో యాతి గృహీత్వా దణ్డం, తదపిన ముఞ్చత్యాశాపిణ్డమ్ వయసులు ముదరిన వాసన వదలదు,
తలలు నెరసినను తపనలు తీరవు,
అంగమ్ములు అణగారి పోయినా
ఆరాటములీ జీవికి తీరవు
ఆశలు వీడక ఆయువు తీరగ
కాలుని జాలము కంఠము తగలగ
ఎవరొత్తురు నిను ఉద్ధరించుటకు
వివరముగా యిది విచారించుము
ఏకాగ్రత మది స్ధిరతను కూర్చు
సాధనతో సంయమనము వచ్చు
కోరికలకు అది కళ్ళెము కట్టు
శ్రీహరి చెంతకు చక్కగ చేర్చు
సాధన చేసిన సమయును మోహము,
మోహనాశమే ముక్తికి మార్గము,
తామస తిమిరము తీరిన క్షణమే
తత్వమార్గమది తేట తెల్లము ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ హస్తామలకాచార్యులవారు. తలవెంట్రుకలు నెరసినను, చర్మము ముడతలు బడ్డనూ, నడుము వంగి వృద్ధాప్యముతొ కఱ్ఱ పట్టుకొని నడచు చున్ననూ, మనసులో మార్పు రానిదే ఆశలు వదలవు. అనగా శరీరము మార్పులు చెందిననూ, మనిషి యాలోచనా విధానము మార నంతవఱకు యజ్ఞానము, మోహము వదలదు. అందుకే అన్నారు “ తలలు బోడులైన, తలపులు బోడులా అని”. కనుక మనసులో మౌలికమైన మార్పు రావలెను, ఆలోచనా విధానము మారవలెను. అది మార నంత వఱకు బుద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుండు నన్నట్లు, అరిషడ్వర్గ భూయిష్టమై, ఆశా మోహముల అడుసులో నానాటికి మునిగి పావుచూ, పరతత్వానికి దూరమగుచుండును. కాన మానసిక సాధన ద్వార అట్టి దుష్ట బుద్ధులను లొంగ దీసుకొని, కోరికలకు కళ్ళెము వేసి, ఏకాగ్రతను సాధించి, పర బ్రహ్మను మదిలో ప్రతిష్ఠాపించి ముముక్షువులు గావలెను.
18. అగ్రే వహ్నిః పృష్ఠే భానూ, రాత్రౌ చుబుకసమర్పితజానుః
దుర్గుణ త్యాగమే అత్యవసరము
చిత్తములోన దోషము తొలగిన
భక్తీ, ముక్తీ దక్కును తధ్యము
చేతిన మాలా చక చక తిరుగును
నారాయణ అని నాలుక పలుకును
మూడు లోకములు మనసు తిరుగుచూ
చేసిన పూజలు సున్నగ మిగులును
పాదార్చనలు పూజలు సేవలు
మూడు వేళల మంత్రోచ్చరణలు
ఆలయాలలో అభిషేకములు
అంతరంగమున అసూయ జ్వాలలు
శాంతము, సౌమ్యము, సాధు వర్తనము
స్నేహము, ధర్మము, సత్యపాలనము,
సర్వ జీవ సమ భావ వర్తనము,
సాధు పురుషులకు స్వభావ సిద్ధము
అట్టి వారే యీ జీవకోటిలో
అందరి కన్నా ఆత్మ జ్ఞానులు,
బ్రహ్మ చింతన పూనిన జీవే,
బ్రహ్మానందము పొందెడి భోగి
నిర్మల జ్ఞానము, నిత్య ధ్యానము,
నారాయణ నుతే నిజమగు యోగము,
నర సేవే నారాయణ సేవని
ఎఱిగిన వాడే నిజమగు యోగి ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ సుబోధాచార్యుల వారు. మోక్షాసక్తులు వదల వలసినది వాసనలు, వ్యామోహము, ఆశలు గాని, వస్తు సముదాయములు గాదు. భౌతిక వస్తువులు త్యాగము చేసినంత మాత్రమున మోక్షప్రాప్తి జరుగదు. కొందరు ఇండ్లు వదలి, బైరాగులై, భిక్షాటనతో పొట్ట గడుపు కొనుచూ, ఏ చెట్టు క్రిందనో జీవించుచూ, చలి, ఎండ, వానలు భరిస్తూ మోక్షము వచ్చునని కలలు గందురు. కాని బాహ్య వస్తువులు, సుఖముల నన్నింటిని త్యాగము చేసినా, వారు మనసుకు పట్టిన ఆస, అరిషడ్వర్గములు, మానసిక దోషములు, కోపతాపములు, వాసనలు వదలు కొన లేక పోవుచున్నారు. ఆ కారణము వలననే వారికి మోక్షము గగన కుసుమము అగును. మనసు మాధవుని పై లగ్నము చేయక, కేవలము పెద్దగా సంసృత మంత్ర పఠనము, ఆడంబరమైన పూజలు, గుళ్ళ యందు అర్చనలు, అభిషేకములు, వ్రతములు, ఉపాసనలు, భగవత్ గీత, భాగవత పఠనలు, మోదలగు బాహ్య కార్య కలాపములు చేయుచూ, తాము భక్తులమని, గురువుల మని, అందరి కన్న ఉత్తముల మన్న భ్రమలో బడి, మోక్ష ప్రాప్తి నాశింతురు. కాని భగవంతునిపై ఏకాగ్రత, స్థిర చిత్తము లేక యీ కార్య కలాపములు కేవలము నటనలగునే గాని, మానవుని బంధ ముక్తుని చేయలేవు. మనసు మాధవుని పై స్థిరముగా లేక వెయ్యి సార్లు విష్ణ్ణుసహస్రనామ పఠనము కన్నా, ఒక్కసారి భక్తిగా మనసు పెట్టి గోవిందా అని తలపోసిన గొప్ప ఫలితము దక్కును. కాన బాహ్య ఆడంబరములకన్నా, వస్తు త్యాగములకన్నా, దుర్వ్యసనా త్యాగము, హృదయ స్థిరత్వము మోక్షదాయకములగును.
జ్ఞాన విహీన స్సర్వమతేన, ముక్తిం న భజతి జన్మ శతేన.
గంగా నదిలో గంటలు మునిగిన,
కొండ గుహలలో వాసము చేసిన
వ్రత దానములు విరివిగ చేసిన
దొరకదు దివ్య జ్ఞాన రత్నము
నూరు జన్మలు తపముల చేసిన
మంత్రములెన్నో మననము చేసిన
ఆత్మజ్ఞానము అబ్బని వానికి
మోక్షఫలము మృగతృష్ణే గాదా ?
వనవాసమున ఒంటరిగుండిన
భిక్షాటనతో పొట్టను నింపిన
ఆశలు వీడని హృదయములోన
ఆత్మజ్ఞానము అంకురించునా ? ||స్మరించు||
సర్వ పరిగ్రహ భోగత్యాగః, కస్య సుఖం న కరోతి విరాగః
హరినే హృన్మందిరమున నిలిపి
ఏకాగ్రతతో ధ్యానము జేసి,
ఆశాపాశమునంతము జేసిన,
మోక్షము గాదా ముంగిటి ఫలము
ఆత్మానందమే అద్భుత సుఖము,
వైరాగ్యమె సుమ వివేకి గమ్యము,
ఆత్మచింతనే అనూన వ్రతము,
పరభావనయే పరమ సౌఖ్యము ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ నిత్యానందాచార్యుల వారు. శుద్ధ మనస్కులై, ఆశా పాశములు విడనాడి, ఏకాగ్ర చిత్తముతో హరి ధ్యానములో గడుపుచూ, వస్తు త్యాగము చేసి, భూతల శయనముతో, సాధారణ వస్త్రములతో జీవించునో వానికి మోక్షప్రాప్తి తధ్యము. ఆత్మ శుద్ధితో, దైవచింతనతో, వస్తు విరాగులై, వైరాగ్య కాముకులై, సుఖ సంతోష మనస్కుడైన వ్యక్తి, పరిపూర్ణతను బొంది, కైవల్య ప్రాప్తినొందును. మనస్సును బాహ్యవస్తువుల నుండి మరల్చి, అంతరంగమును అంతర్ముఖముగా మరల్చి ఆత్మ చింతన చేయువారికి మహోత్తర ఆనందము సమకూరును. మానవునికి అట్టి ఆత్మ సుఖము బడయుటే జీవిత గమ్యము గావలెను. వైరాగ్యము, ఆత్మచింతన అనునవి పరమ సుఖానికి ముఖ్య కారణములై యున్నవి. కాన సంపూర్ణ, అత్యంత సుఖము ననుభవించ వలెనన్న, వైరాగ్యమును ఆశ్రయించక తప్పదు.
యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నన్దతి నన్దతి నన్దత్యేవ ఎవ్వని ఎదలో శ్రీహరి వుండునో
వానికే నిత్యానందము దక్కును,
యోగ, భోగ, సంయుక్తుడైననూ,
వానికే దక్కును విహితానందము
హరి నెఱిగినచో హరమగు దుఃఖము
చెఱ బట్టెడి యీ చింతలు తొలగును,
పరమాత్ముడి పద సన్నిధే నరునికి
అవలంబనము, అంతిమ గమ్యము ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ ఆనన్దగిరి ఆచార్యులవారు. ఆత్మజ్ఞానముతో పరబ్రహ్మ స్వరూపమునెఱిగిన వ్యక్తికి ఎచ్చట వున్ననూ, ఏప్పుడైననూ హృదయములో సంపూర్ణ ఆనందము నిండి వుండును. అట్టి ఆనందము సాంసారిక సుఖముల వల్ల ఎన్నటికిని లభించదు. వస్తు విషయముల వచ్చు ఆనందము అసంపూర్ణము, అనిత్యము. కాని పరతత్వ జ్ఞానము వల్ల లభించిన ఆనందము పరిపూర్ణము, నిత్యము. అట్టి ఆనందము పొందు వ్యక్తి, యోగ యుక్తుడుగా నుండిననూ, భోగ యుక్తుడిగా యుండిననూ, లేక సంసార బంధములలో కూరు కొని యుండినన ఆ ఆనందము పొందుచునే వుండును. అనగా తామరాకు మీది నీటి లాగా తాను ఎచ్చట వుండిననూ, వానితో మనసు ముడి పెట్టుకొని వుండక, తన కర్తవ్యము తాను నిర్వర్తించుచూ, మనసు భగవంతునిపై లగ్నము జేసి ఆ తన్మయత్వములో పరమానంద భరితుడై వుండును. విధివసాత్ తాను ఎన్ని భౌతిక సంపదల మధ్య వున్ననూ వాని పై ఏవిధమైన సంబంధము పెట్టుకొనక, నిర్లిప్తముగా వాని మధ్య జీవించుచునే మనసు దైవముపై నుంచి సంపూర్ణానందమున తేలియాడుచు వుండును.
సకృదపి యేన మురారి సమర్చా, క్రియతే తస్య యమో పిన చర్చామ్
భగవద్గీత కంఠము నుండిన
గంగా జలము గొంతున నిండిన
విఠలుని నామము ఒక పరి పల్కిన
యముని భయము యిక ఎవరి కుండును ?
మనసా వాచా కర్మతో భువిన
త్రికరణ యోగము తెల్పిన రీతిన
సాధు పురుషుడు సాధన చేసిన
కాలుడు కూడా దరికే రాడు ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ దృఢ భక్తాచార్యులవారు. భగవత్ గీత కొంచమైననూ పఠించిననూ, గంగా జలము కొంచము గొంతున త్రాగిననూ, భక్తితో భగవన్నామము ఒక పరి పల్కిననూ, యముడు కూడా వాని జోలికి పోడు. సత్కార్యములు చేయుచూ, మనసు మాధవుని పై లగ్నము జేసి జీవించు సాధువుకు ఎవ్వరూ కీడు చేయలేరు. శ్రీమత్భగవత్ గీత భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ముఖమునుండి వెలువడిన మహా గ్రంధము, దానిని కొంచమైననూ శ్రద్ధగా పఠించిన మోక్షప్రాప్తి కల్గును. త్రికరణ శుద్ధిగా, అనగా మనసా, వాచా, కర్మణా, భగవంతుని పై మనసు నిల్పి, సత్కార్యము లాచరించుచూ బ్రతుకు వ్యక్తికి మోక్ష ప్రాప్తి తధ్యము.
ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహిమురారే.
మాటికి మాటికి చచ్చుట పుట్టుట
మాతా గర్భా వాసము చేయుట
ఎడ తెగనిది యీ భవసాగరము
తరణ మసాధ్యము తిరుమల నాధా!
ఎన్ని మారులు చచ్చి పుట్టె దవు
మూత్ర మలినముల మధ్య గడిపెదవు
ఎన్ని మారులవకాశము యిచ్చిన
ఏల మోహమున వదలు కుందువు ?
యిహ లోకముల సుఖముల కొఱకు
ఏల పరమును పరిత్యజింతువు ?
ఏల బోధనలు వీనుల కెక్కక
గురువుల మాటలు గణన చేయవు ?
ఏల శ్రీహరి పాదయుగముపై
శిరమును పెట్టి శరణము కోరవు
నీవు తప్ప నారాయణ ! నాకు
దిక్కు లేదని దైన్యము చెందవు ?
తరణము చేయుము తిరుమల నాథా!
ఈద లేను యిక శక్తి హీనుడను
నీ దయ నాపై చూపగ రావా!
ఈ విధి శ్రీహరి ప్రార్ధన జేయుము
పరిపరి ఆతని పదములు పట్టుము
ఒక పరి శ్రీహరి శరణము నొందిన
జన్మ దుఃఖములు అంతము గావా ! ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ నిత్యనాధాచార్యులవారు. యీ సంసార సాగరములో చిక్కి, మాయా మోహమను అంధకార బద్ధులైన మనకు, పుట్టుట, చచ్చుట, మరల తల్లి గర్భమందు తొమ్మిది నెలలు వాసము జేయుట, అను సుడిగుండములో జన్మలకు, జన్మలు గడుపు చున్నాము. ఈ అపార దుఃఖ సంసార సాగరమునుండి వెలువడు మార్గము కానక కడు శోకచిత్తులమైన మనకు శ్రీహరి పాదార విందములు తప్ప అన్య మార్గము లేదు. మన ప్రయత్నముగా, కడు భక్తితో హరిని ధ్యానించుచు, జ్ఞాన, వైరాగ్య సాధనలతో తత్వమునెఱగి, శరణాగతితో హరి కరుణకు ప్రాప్తులము గావలెను. అంతకు మించి యీ మాయను ఛేదించి, జనన మరణ సుడిగుండమునుండి బయలు వెడలు మార్గము వేరు లేదు. జ్ఞాన, వైరాగ్యములు, తత్వ సాధనకు సరియగు మార్గమును తెల్పును. కాని వాని వలన మాత్రమే మోక్ష ప్రాప్తి చేకూరదు. మోక్ష ప్రాప్తికి అవి రెండు ఉపకరణములు మాత్రమే! దానికి అనువైన సాధనము భక్తి. శరణాగతితో గూడిన భక్తితో భగవంతుని కరుణ పొందవచ్చును. ఒక్కసారి పరమాత్ముని దయ గల్గినచో మోక్షము ముంగిలిలో పూవులా చాలా సులభమగును. కనుక మోక్షాసక్తులైన భక్తులు ఆత్మ విచారణ, భగవత్ప్రార్ధన మున్నగు చర్యలను చేపట్టవలెను.
యోగీ యోగని యోజిత చిత్తో, రమతే బాలోన్మత్తవదేవ. బ్రహ్మము పైన మనసును నిలిపి
బ్రహ్మానందము పొందెడి వాడు
వస్తు విషయముల యోచన చేయడు
దేని పైన తన దృష్టి మరల్చడు.
వేసెడి వస్త్రము ఉండెడి వాసము
తినెడి తిండి పై దృష్టి మరల్చడు
దొరకిన బట్టతొ, చిరిగిన గుడ్డతో
ఉన్మత్తుడి లా ఉండు మహాత్ముడు.
ఆత్మ నియతి గల చిత్తములోన
ఇతర చింతలకు తావు నీయడు
అంతర్ముఖుడై అంతరంగమున
హర్ష డోలికలు వూగుచునుండు.
ద్వంద్వ జగత్తుకు తానతీతుడై
యోగవీధి విహరించుచు నుండు
పరబ్రహ్మ పద ఆరాధనలో
పరమానందము నొందుచు నుండు. ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ యోగానందాచార్యులు. ఆత్మజ్ఞానమునొందిన వ్యక్తికి యీ సంసార విషయములపై ధ్యాసే ఉండదు. ఏమి తినుచున్నాడో, త్రాగు చున్నాడో, ఏవస్త్రములు ధరించుచున్నాడో గూడా అతనికి తెలియదు. ఆ స్థితిలో అతడు ఒక ఉన్మత్తుడువలె, బాలుడి వలె చూచు వారికి కనిపించును. చిరిగిన వస్త్రములతో, మాసిన ఆకృతితో అతడు కనిపించ వచ్చును. దానికి కారణము వానికి యీ సంసార విషయములపై ఏ మాత్రము ఆసక్తి లేక పోవుట. అట్టి వానికి మనసు నిశ్చలమై, వ్యవహార ప్రపంచములో మంచి చెడులకు అతీతుడై వ్యవహరించును. మనసు నిర్మలమై, యోగములో నిమగ్నమై, ఆత్మానందమును చెందుచుండును. అన్ని ఆనందముల కన్ననూ మిన్నగు ఆత్మానందము ననుభవించుచూ అతడు పరమోన్నత స్థితిలో పరమాత్మకు చేరువగా యుండును.
ఇతి పరిభావిత నిజ సంసారః, సర్వం త్యక్త్వ స్వప్న విచారః
ఏమీ జగత్తు ? ఎచ్చటి వారము
ఇచ్చట యివ్విధి నేమి కార్యము
ఈ రీతిగ మది విచారించుము
వారి బంధములు నాతో యేమి
అత్మ రూపులు అందరు జీవులు
ఆత్మకు ఆత్మకు బంధము యేమి ?
ఏల వీనిపై వ్యాకులత్వము ?
మనుషుల బ్రతుకు మహన్నాటకము
మనో కల్పిత మాయా స్వప్నము.
నిజము కాదు నాటకము సర్వము
నిజము గానిదీ నర జీవితము
ఏల ఎదన ఎడ బాయని మోహము ? ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ సురేంద్రాచార్యుల వారు. ప్రతి ఒక్కరూ తమ తమ మనసులలో యీ విధముగా ప్రశ్నించుకొన వలెను. నేను ఎవడను, ఎక్కడ నుంచి వచ్నిన వాడను ? యీ జగములో నేను ఏమి చేయుచున్నాను. నాకు తల్లి , తండ్రి, భార్య, బడ్డలు, బంధువులు, శత్రువులు, మిత్రులు, సేవకులు, గురువులు యీవిధమైన పలు సంబంధములతో నాతో ఉన్న వీరందరూ ఎవరు ? వారితో నా ఆత్మకు సంబంధ మేమి ? ఆ బంధము ఎంత పురాతన మైనది, ఎంత కాలము నుంచి కలదు, యింకెంత కాలము వుండును. యీ తనువు తదనంతరము యింకనూ అట్టి బంధము వుండునా ? లేకున్న వారే మగుదురు? నేనేమగుదును. యీ దేహము ఎచ్చట నుండి వచ్చినది, తిరిగి ఎచ్చటకు పోవును. నాయొక్క నిజస్వరూపమేది? యీ విధముగా సంసారమును గూర్చి విచారించవలెను. అప్పుడు మన ప్రశ్నలకు మనకే సమాధానము దొరుకును. ఆ సమాధానములతో ఆత్మ తత్వము అవగతమగును. సంసారము ఒక కల వలె తోచును. మన బంధములన్ని ఒక మిధ్య యని, యీ తను బంధములన్నీ జీవన్నాటకములో మనము ధరించిన పాత్రలని అర్ధమగును. దాని వలన మనసులో అలమిన మోహము నశించి, మమకారము, వ్యామోహము, వస్తు ప్రపంచముపై ఆశా పాశములు నశించి ప్రశాంత చిత్తము కల్గును. దాని మూలముగా బంధ విముక్తులమై పరమానందము బడయగలము. బ్రతుకు యొక్క అశాశ్వతత్వము, తను బంధముల క్షణికత, బుద్బుద ప్రాయమగు జీవితమును గురించి ఎందరో ఎన్ని విధములుగానో చెప్పరి. అన్నమయ్న యిలా అన్నారు:-
కానక కన్నది కైవల్యము.
పుట్టుటయు నిజము పోవుటయు నిజము,
నట్టనడిమి పని నాటకము,
యెట్ట నెదుటకల దీ ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము.
భవ సమ చిత్తస్సర్వత్రత్వం, వాఞ్ఛ స్య చిరాద్యది విష్ణుత్వం
అణువణువున అదృశ్యరూపుడై
సర్వ ప్రాణులలో సమముగ వెలసి
విశ్వమంత తా వెలిగెడి వాడు.
అందరిలో అలరారును అతడే
జడ, చరాచర జీవ కోటిలో
జితముగ నిల్చును జగన్నాధుడు.
ఇతరుల జూచి ఈర్ష్యలు యేల
ప్రతి ఒక్కరు పరమాత్మ రూపులే
పరుల పైన పైశాచములేల ?
అన్యులపై అసహనము యేల
సరస జ్ఞానముతో సంభావించక
కోపతాపముల కారణమేల ?
అందరినీ దూషింతువు యేల
ప్రేమ భావమును ప్రక్కకు నెట్టి
దయా హీనముగ దూరెద వేల ?
స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము
మానవ సేవే మాధవ సేవగ
దైవత్వముతో దయతో మెలగుము. ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ మేధాతిధి ఆచార్యుల వారు. ప్రపంచమున ప్రతి జీవి యందు శ్రీమన్నారాయణుడున్నాడు. అందుకే నర సేవ నారాయణ సేవ అందురు. ప్రతి ఒక్కరిలో పరమాత్మగలడు. అందుచేత సహనముతో, కోప తాపములు వీడి అందరిని సమభావముతో, ప్రేమతో జూచుకొన వలెను. మనలను మనము ఎంత ప్రీతితో, ప్రేమతో, జాగ్రత్తతో చూచుకొందుమో, పరులను గూడా అదే భావముతో చూడ వలెను. పరమాత్ముడు సర్వవ్యాపి, అందరు జీవులు అతని రూపులే! యీ సత్యము తెలిసిన వ్యక్తి నిష్కారణముగా యితరులును దూషింపడు, నిందింపడు. సమరస జ్ఞానము లేని మంద బుద్దులే యితరుల పై కోప తాపములు చూపుదురు. మనము ఎన్ని మంత్రములు పఠించ గలము, ఎన్ని గంటలు పూజలు చేయ గలము, ఎంత సేపు భగవంతుని గురించి ఉపన్యాసములు యివ్వగలము, యిత్యాదులు, యీ సమరస భావమునకు కొల మానములు కావు. యితరులతో ఎంత ప్రేమ, దయ, సహనము చూప గలము, మనలో ఎంత మానవత్వమున్నది అను విషయములే మన సమగ్ర జ్ఞానమునకు నిదర్శనములు.
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తేపచ్యన్తే నరకనిగూఢాః కామ క్రోధములే కలుషపు కోరలు
లోభ మోహములు లేలిహానములు
మద మత్సరములే మిక్కిలి విషములు
ప్రాణము తోడే పాశపు తాళ్ళు
మనసులోని మమకారము వీడిన
వికారములు నీ వద్దకు రావు
నిర్వికారమగు నిశ్చల చిత్తమే
నారాయణుడి నిర్మల వాసము
ఆదమరచి యీ ఆత్మజ్ఞానము
నరక యాతనల నొందును జీవుడు
మరి మరి పుట్టుచు మరలా చచ్చుచు
జన్మ చక్రముల చిక్కును దైన్యుడు.
కామ క్రోధముల కలుషము కడుగుము
ఆత్మజ్ఞానమున తేజరిల్లుము
పరమాత్ముని ప్రతి బింబము నీవని
ఎరిగి శ్రీహరిన లీనము గమ్ము ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ భారతివంశాచార్యులవారు. మనిషిని పీడించు శత్రువులు ఆరు మంది, ఆ ఆరుమంది ఎచ్చటనో లేరు, మనలోనే ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. వీరారుగురు ఒకరికి ఒకరు మంచి సన్నిహితులు,చుట్టాలు, మిత్రులు గూడా. వీరిలో ఏ ఒక్కరూ మన హృదయములో చేరిన, మిగిలిన వారందరూ, పిలువకనే వచ్చి తిష్ఠా వేస్తారు.
సర్వ వికారములు తమంతట తాము వైదొలగును. లేనిచో అవి విజృంభించి, మన మనసు శరీరమును తమ అధీనము జేసుకొని, మనలను బానిసలు చేసుకొని, అజ్ఞానులుగా, నీచ స్వభావులుగా తీర్చి
దిద్దుతాయి. కనుక మోక్షకామియైన మానవుడు వీనిని అణగదొక్కవలెను. అపుడు, మనసు నిర్మలమై, ‘సోహం’ అనగా, ‘నేను పరమాత్మ స్వరూపుడను’ అను భావము మనసులో కలిగి, ఆత్మజ్ఞానము
పొందగలడు. ఒకసారి ఆత్మజ్ఞానము కల్లిన, జీవుడు సంసార బంధనములనుండి విముక్తుడై, మోక్షప్రాప్తి పొందగలడు.
కోప తాపములు శరీరముకు, మనసుకూ చేటు చేయును. కోపము వలన, రక్త ప్రసారము పెరిగి నరముల, గుండెల జబ్బులు వచ్చుటయే గాదు, శరీరములో విషపదార్దములు జనించి శరీరమునకు హాని చేయును. అంతేగాదు కోపము వలన విచక్షణా జ్ఞానము నశించి ఎన్నో పొరపాట్లు చేయగలము. దాని వలన ఎంతో అనర్ధము కలుగ వచ్చును. అంతే గాదు, కోపములో మనము మంచివారికి హని చేయ గలము, చెడ్డ వారితో వైరము పెంచుకొనగలము. మనకు శత్రువులు పెరిగిన మనకే హానియైన కలుగ వచ్చును. కనక కోపమే మనకు ప్రధమ శత్రువు. అందుకే అన్నారు “ తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష” అని. కనుక సుమతులారా! మనలో దాగివున్న ఆ ఆరుమంది శత్రువులను వెంటనే తుద ముట్టించి, సన్మార్గగాముల మగుదాం.
నేయం సజ్జన సఙ్గతి మనిశం, దేయం దీనజనాయ తు విత్తమ్ నామ సహస్రము నుతులను చేయుము
గీతా గ్రంధము పఠనము చేయుము
శ్రీహరి రూపము ఎదలో నిల్పుము
సతతము శ్రీపతి స్మరణను చేయుము
మృగతృష్ణలకై పరుగులు తీయక
మనసు నధీనము చేసుక మసలుము
మహితాత్ములపై మనసును పెట్టి
నిర్వికారునిగ నతిశయించుము
పేదవారిపై పరమ దయాళువై
శక్తి కొలది ధన ధాన్యము లిమ్ము
దానము జేసి పుణ్యము బడసి
చిత్తశుద్ధితో చక్రిని కొల్వుము ||స్మరించు||
యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ సుమతాచార్యులవారు. సర్వశాస్త్రసారము శ్రీమత్ భగవత్ గీతలో గలవు, అలాగే సర్వ మంత్ర సారము శ్రీ విష్ణు సహస్రనామములో గలదు. వీనిని పఠించు వారికి సర్వ మంత్రములు, సర్వ శాస్త్రములు పఠించిన ఫలము దోరకును. వీనిని ప్రతి దినము, వీలైనచో త్రికాలములలో పఠించిన మంచిది. వీనిని పఠించి, వానిలో అర్ధము తెల్సుకొన్నచో విశ్వజ్ఞానమంతయు వారికి అవగతమైనట్లే! కేవలము పఠించుటయే గాదు, ఆ భావము మననము చేసుకొని, త్రికరణ శుద్ధిగా ఆచరించ వలెను. అనగా మనసులోను, వాక్కులోను, కర్మ లోను ఆదివ్యబోధలు ఆచరణలో పెట్టవలెను. మనసును నిర్మలము చేసుకొని, పరమాత్మనందు నిలపి, పర తత్వమువైపు మనసు మళ్ళించ వలెను. మంచి వారు, జ్ఞానులు, గురువులతో స్నేహము చేసి, వారి సాంగత్యముతో మనకున్న జ్ఞానము పెంచుకొన వలెను. బీదలు, అనాధల యెడ దయ, కరుణ కల్గి, వారికి అన్న, ధన , విద్యా దానములొసగవలెను. యీ విధముగా పుణ్యము సంపాదించుకొని పరమాత్మకు చేరువ కావలెను.
సర్వస్మిన్నపి పశ్యాత్మానం, సర్వత్రోత్సృజ భేదాజ్ఞానమ్ అందరి పైన ప్రేమను చూపుము
అందరి పై ఆప్యాయత చూపుము
అందరి మనములు ప్రేమతో దోచి
అందరిలో ఆ హరినే గాంచుము
శత్రువు నైన, మిత్రుడ నైన
పుత్రుడనైన, బంధువు నైన
కలహము చేయక, కూర్మిని చూపి
శత్రు భావమును సంహరించుము
యితరుల పైన కోపము చేసిన
నిన్ను నీవె కోపించిన తీరు
నీలో శ్రీహరి అందరి నుండ
యితరుల నేల దూషణ చేతువు ?
అందరిలోన ఆత్మ ఒక్కటే
అందరి బాధలు, నొప్పులు ఒకటే
అది ఎఱిగిన ఓ ఆత్మ రూపుడా
ఇతరుల పైన అలిగెద వేల ? ||స్మరించు||
యీ శ్లోకము సాక్షాత్ శ్రీ శంకరులవారే చెప్పిరి. భగవంతుడు సర్వ వ్యాపి, జడ చైతన్య వస్తు, జంతు పదార్ధములందు శ్రీమన్నారాయణుడు వున్నాడు. చిన్న చీమ నుంచి, పెద్ద ఏనుగు వఱకు సమస్థ జీవులయందు స్వామి ఆత్మరూపములో వెలయుచున్నాడు. జంతువులు, పక్షులు, క్రిములు, మానవులు, వన్యమృగములు, చెట్లు, చేమలు మున్నగు భూ, జల, వాయు నిలయ సమస్త జీవులు శ్రీహరి ప్రతిరూపములే! అన్ని ఆత్మలూ పరమాత్మయగు హరి రూపములే! అద్దములో ప్రతిబింబము వలె, ప్రతి ప్రాణి, విశ్వమనే అద్దములో పరమాత్మ ప్రతిరూపములే! రూపములు, రంగులు, భావములు వేరైననూ సమస్త జీవులు దేవుని ప్రతిరూపములే. భగవంతుడు సూక్ష్ముముగా జీవులలోను, ఊర్జముగా పంచభూతములలోను నిక్షిప్తుడై ఉన్నాడు. పూమాలలో దారమువలె, తీగలో విద్యుత్తు వలె సమస్త జీవులలో శ్రీహరి వ్యాపించి వున్నాడు. అందుచే అన్ని జీవులను సమభావముతో చూడవలెను. ఎవ్వరిపై కోప, తాపములు చూపరాదు, ఎవ్వరితో కలహించరాదు. అందరిని ప్రేమతో, దయతో చూడవలెను. ద్వేష, విరోధ భావములను రూపు మాపి, శాంతి, సహృదయము అలవరచుకోవలెను. శత్రువులైననూ, మిత్రులైననూ, పుత్రులైననూ, బంధువులైననూ అందరిని ఒకే తీరు ఆదరించ వలెను. సహనము, శాంతే మైత్రిని, ప్రేమను చేకూర్చును. భేధ భావము చూపుట కేవలము అజ్ఞానమే. కాన సమ సమాన హృదయముతో మంచిని సాధించుము.
యద్యపిలోకే మరణం శరణం, తదపిన ముఞ్చతి పాపాచరణమ్ ఇంద్రియ సుఖములు ఎన్నడు తీరవు
కామ వాంఛలే కాల సర్పములు,
మితి మీరిన మన్మధ సౌఖ్యములు
రోగ దేహమను రోతే మిగుల్చు.
దేహ సుఖములను తీర్చిన కొలది
అగ్నికి ఆజ్యము పోసిన తీరే
తిరిగి తిరిగి అవి తీరని కోర్కెలై
ప్రజ్వలించి పరితాపము తెచ్చు.
కామ వాంఛలు కాల నాగులు
తియ్యగ విషమును తిన్నగ దూర్చు
మనిషికి చివరకు మరణము తథ్యము
అయినను వదలడు పాపాచారము ||స్మరించు||
యీ శ్లోకము, తర్వాతి శ్లోకము లన్నియూ శ్రీ ఆది శంకరులవారే చెప్పిరి. మితి మీరిన ఇంద్రియ సుఖము, కామ వాంఛలు రోగములు, అనర్ధములకే దారి తీయను. ఈ సత్యము పండితులకైననూ, పామరుల కైననూ, సమస్త ప్రజలకూ తేట తెల్లమే! వస్తు సుఖములు అశాశ్వితములగుటయే గాదు, వాని వలన అనేక అనర్ధములు, కష్టములు కల్గును. అజ్ఞాని అటు వంటి దృశ్యపదార్ధముల వెనుక బడి, అందే ఆనందము గలదని భ్రమించి, శాశ్వత మైన , పరిపూర్ణ మైన, అపరిమితమైన పర సుఖములను మరచి నానా కష్టముల పాలగుచున్నాడు. పార్ధివ సుఖములు, రోగములు, క్లేశములు, అశాంతి, భయము, దఃఖము, మృత్యవును చేకూర్చునే తప్ప శాశ్వతమైన సుఖము నందించలేవు. మృత్యువు పచ్చగడ్డిలో పచ్చని పాము వలె పొంచి వున్నది. అది ఏ క్షణములో నైననూ శరీరమును కబళించును. కాన శరీర సుఖములపై మోహము వదలి, భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములలో సాధన చేసి, పాపమును కడగి వేసి, ఆత్మానుభూతితో జీవితము సఫలము చేసుకొనవలెను.
జాప్యసమేత సమాధి విధానం, కుర్వవధానం మహదవధానమ్
అష్టసాధనలు అవలంభించు
అంతర్ముఖముగ మనసును నిలుపు
ఏకాగ్రతను సంపాదించిన
పరమశాంతి, పరమార్ధము దక్కు
ఏకాగ్రతను పొందిన స్థితిలో
నిర్వికల్పమగు నిశ్చల దశలో
శాంతము నొందిన సమాధి దశలో
ఆనందము నీ సొంతము అగును ||స్మరించు||
మానవుడు, తెలివిగా నిత్య, అనిత్య వస్తువులేవియో, ఏమి పొంద వలెనో, ఏమి విడువ వలెనో వివేకముతో తెల్సు కొన వలెను. అష్టాంగ మార్గమును అవలంభించ వలెను. ఆత్మ సాక్షాత్కారము బడయుటకు ఎనిమిది సాధనలు గలవు. అవి – యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధారణ, ధ్యాస, సమాధులు. ప్రత్యాహారమనగా మనసును బాహ్య వస్తువులనుండి మరలించి, అంతర్ముఖముగా ఆత్మలో లగ్నము చేయుట. ప్రాణాయామమనగా శ్వాసలు నియంత్రించి, శరీరము, మనసుపై ఆధిపత్యము సంపాదించుట. యీ క్రమములో సమాధి చివరి దశ, ఆస్థితికి చేరుటకు ఎంతయో ఏకాగ్రత అవసరము. కనుకనే ఏకాగ్రత యొక్క ప్రాముఖ్యము పై శ్లోకములో నొక్కి చెప్ప బడినది. యీవిధముగా చివరి స్థితికి చేరిని జీవికి నిర్వకల్ప ఆత్మానుభవము కలిగి, పరమ ఆనందము, శాంతి, సుఖము లభించి ఆత్మ పరమాత్మలో ఐక్యము అగును.
సేన్దియ మానస నియమా దేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్ధం దేవమ్
సద్గురువులను ఆశ్రయించుము
వారి కరుణతో విబుధుడవగుము,
జ్ఞాన భాస్కరుడు గురు బ్రహ్మను
నిరతము మదిలో నారాధింపుము
గురు, గోవిందులు ప్రక్కనే వున్న
గురు చరణములే మ్రొక్కెద మొదలు
గోవిందుని చూపించిన ఘనుడు
గురుడే నాకు ప్రధమ వంద్యుడు.
గురువే బ్రహ్మ, గురువే విష్ణువు
గురుదేవుడే ఆ పరమేశ్వరుడు
గురు బోధలువిని వాసి కెక్కిరి
రమ్య పురుషులు రామ, కృష్ణులు
ఇంద్రియముల పై నిగ్రహముంచి
మనసును గురుచరణమ్ముల నుంచి
భవ బంధములు త్యాగము చేసిన
హృదయవాసి ఆ హరిని గాంచెదవు ||స్మరించు||
ప్రపంచము నందు ఎన్నో తెలియని విషయములుండును. వానిని తెల్సుకొనుటకు మానవునకు ఒక జీవితము చాలదు. అందులోనూ ఆధ్యాత్మిక విషయములు గురు ముఖము గా విన్నగాని అవగతము గావు. కనుక సత్ గురువు నాశ్రయించి, మనసును గురు పాద పద్మములపై లగ్నము జేసి, అత్యంత గౌరవము, భక్తితో సేవించిన, గురు కృపకు ప్రాప్తుడై, అచిరకాలములో అజ్ఞానము వీడి, సంసార బంధముక్తుడై, సాధన మార్గము నెఱగి, ఇంద్రియ నిగ్రహము, మనస్సుపై జయము సంపాదించి, ఆత్మసాక్షాత్కారము పొంద గలడు. కనుక శ్రీఘ్రముగా పరమాత్మను చేర వలెనన్న సత్ గురువు యొక్క కృప ఎంతయో అవసరము. అందుకే కబీరు దాసు గారు ‘ గురు గోవింద దోవు ఖరే, కాకే లాగూ పాంయ్, బలిహారీ గురు ఆప్ నే జిన్ గోవింద దియో బతాయ్ అన్నారు’. అనగ గోవిందుడు, గురువు ఎదుట నిల్చిన, మొదట గురువుకే నమస్కరిస్తాను. ఏలన యీ గురువు గారి వల్లనే ఆ గోవిందుడు ఎవరో నాకు తెల్సినది’. కాన జీవులు, ఇంద్రియ సుఖములు విడనాడి గురు ముఖముగా, సన్మార్గము తెల్సుకొని, ఆ మార్గములో సాధనతో ఆత్మ నిగ్రహమలవరచుకొని తద్వారా ఆత్మాను భూతిని బడసి జన్మను సార్ధకము చేసుకొన గలరు.
శ్రీమచ్ఛఙ్కర భగవచ్ఛిష్యైః, బోధిత ఆసీచ్ఛోదిత కరణైః అంధకారమును అంతము జేసి
శాంతి సుఖములను తెచ్చెడి పలుకులు,
బ్రతుకు బాసటై వెలుగుల నిచ్చే
గురు శంకరుల జ్ఞాన బోధలు
విని సుఖించుము, వెలుగులు బడయుము
అజ్ఞానమును అంతము చేయుము
మూఢ మతికి జ్ఞానామృత మొసగిన
భజగోవిందము పఠనము చేయుము
శ్రీ శంకరుల పాదకమలములు
పరి పరి మ్రొక్కెద, ప్రార్ధన చేసెద
తప్పొప్పల యీ తామసి వ్రాతను
పరమ దయగొని పరిగ్రహింపగ.
విద్యాప్రకాశులు వేద వేత్తలు
స్థితప్రజ్ఞులు జ్ఞాన సూర్యులు,
కరుణాచంద్రులు కృపామూర్తులు
వారి చరణముల వాలి మ్రొక్కెద.
శాంతి, సౌఖ్య, సౌభాగ్యదాయకము
భజగోవింద పఠనము, శ్రవణము
అర్ధము తెలిసి ఆచరించిన
జన్మ ధన్యము, జయము, సుఖము. ||స్మరించు||
యీ విధముగా శంకరుల వారు కృపతో అజ్ఞానముతో ప్రాపంచిక విషయవాసనలలో చిక్కిన వృద్ధ బ్రాహ్మణునికి, తన బోధనలతో జ్ఞాన దీపము వెలగించి ఆజీవిని ఉద్ధరించారు. శిష్య సమేతంగా వారు చెప్పిన బోధనలు విని, ఆచరించి అజీవి తన జన్మను సార్ధకము చేసుకొనెను. ఆ బోధనలు మనమూ విని, పఠ్ఠించి, మనసున నిలుపుకొని, అజ్ఞానము తొలగించుకొని, సంసార సుఖముల క్షణికత గుర్తించి, బంధ ముక్తులమై, మనసులోని మలినములు శుభ్రము జేసుకొని, సాధు మానసులమై, జగత్ గురువులు శ్రీ శంకరులు తెలిపిన సన్మార్గములో, జీవితము నడిపించి, పర దైవమైన శ్రీ వెంకటేశుని కృపా ప్రాప్తులమై కైవల్యము పొందుదాం. మనకు ఇంతటి సత్ బోధ నందిచిన శ్రీ ఆది శంకరుల పాదారవిందములకు, వారి బోధల సారం మనకు వివరించిన సత్ గురువులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి చరణార విందములకు సాష్టాంగ వందనములు సమర్పించుకొందాం.