ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

లక్ష్మీ వైభవం

Like-o-Meter
[Total: 3 Average: 4.7]

 

 

లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. ఆమె స్మరణ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. అయితే అమ్మవారు జ్ఞానానికి ప్రతినిధి. వేదాలకు అభిమాని. ఆమె అనంతానంత రూపాలను ధరించి, ఎన్నెన్నో ధర్మసూక్ష్మాలను మానవులకు బోధించింది. ఈ పవిత్ర శ్రావణ మాస సందర్భంగా అమ్మవారి అవతార విభవాన్ని, విశేషాలను తెలుసుకుందాం.

 


 

“సర్వలోక జననీ కమలా యా  దేశ కాల వితతా రమణీ తే

సాతిమృద్ వతసికా కుసుమాభోత్ సంగగాపి తవ హృత్కమలస్థా”

“ఓ శ్రీనివాసా! ఎల్ల లోకాలకు తల్లి, అన్ని దేశాలలోను, అన్ని కాలాలలోనూ నిన్నే అనుసరిస్తూ, నీ హృదయ కమలంలో నివసిస్తూ, ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించే, నీ అర్ధాంగి – లక్ష్మీదేవికి నా నమస్సులు”

నారాయణ తత్వము ఎంత ఉన్నతమైనదో, లక్ష్మీతత్వం కూడా అంతే లోతైనది. సర్వ దేవతలకు, సర్వ లోకాలకు, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, శుభాన్ని ప్రసాదించే దయార్ద్ర హృదయురాలు శ్రీ లక్ష్మీ తాయారు.

 

దేవీసూక్తం అని కూడా పేరుపొందిన అంభ్రణీ సూక్తం ఋగ్వేదంలోని ఒక భాగం. ఈ సూక్తం మహాలక్ష్మీతత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది.

అంభ్రణీ సూక్తమ్ అమ్మవారే మనకు చెబుతున్నట్టుగా ఉత్తమ పురుషలో సాగుతుంది. “నేను ఎవరినైనా సరే చతుర్ముఖ బ్రహ్మగాను, మహారుద్రుడిగాను మార్చగలను. చతుర్ముఖ బ్రహ్మ శిరస్సును ఖండించిన రుద్రుణ్ణి సంహరించడానికై ధనస్సును ధరించాను” అని అమ్మవారే స్వయంగా చాటారు. కనుక, సాధకులు శ్రుతిప్రతిపాద్యమైన లక్ష్మీతత్వంను తప్పక తెలుసుకోవాలి.

*****

శ్రీ లక్ష్మీదేవి –ఎప్పుడూ శాశ్వతమైన ఆనందంతో కూడివుండే నిత్యముక్తురాలు. పంచభూతాల వల్లా, తాపత్రయాల వల్ల, కామ-క్రోధ-లోభ-మొదలైన అరిషడ్వర్గాల వల్లా, కలిగే ఎలాంటి దోషాలు లేని దోషదూరురాలు. ఐహిక, ఆముష్మిక మనే రెండు విధాలైన కోరికలను కోరే భక్తులకు అభయదానం చేసే అభీష్టదాయిని. క్షణమైనా వీడకుండా తన పతియైన శ్రీమన్నారాయణుని సేవలో తరించే హరిపాదసేవోద్యమి. భక్తులకు పాలిట చింతామణి. దుష్టులపాలిట దుర్గారూపిణి. శ్రుతిప్రతిపాద్యురాలైన రమారమణి.

*****

శ్రీ మహాలక్ష్మి గుణాలను తెలుసుకోవడంతో బాటు అమ్మవారి రూపాన్ని కూడా ధ్యానించాలని శ్రుతిస్మృతులు చాటుతున్నాయి.

పరమకరుణాసింధువు, భక్తబంధువు అయిన శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన తిరుమల ఆనందనిలయంలో అమ్మవారు మూడు రూపాలతో భక్తులకు దర్శనమిస్తారని ఆదిత్యపురాణం బోధిస్తోంది.

హర్షాత్ శ్రీరూపిణీ వామే భూరూపా దక్షిణే స్థితా

దుర్గారూపో అగ్రభాగస్థా త్రిరూపా నేత్రషట్కతః

ఆనందనిలయంలో అమ్మవారు, స్వామివారికి ఎడమవైపున శ్రీదేవిగాను, కుడివైపున భూదేవిగాను, పైభాగంలో దుర్గాదేవిగానూ నిలచివుంది. ఇలా, తిరుమల క్షేత్రంలో ఎవరు అమ్మవారి మూడు రూపాలను స్మరిస్తూ, స్వామివారిని దర్శిస్తారో వారికి జ్ఞానము, భక్తి, వైరాగ్యమనే మూడు ఐశ్వర్యాలు దక్కుతాయి.

ఆనందనిలయంలో, ఆనందప్రదాయకుడైన, ఆనందమూర్తిని  మూడు రూపాలు, ఆరుకన్నులతో వీక్షిస్తోంది లక్ష్మీదేవి. అనంత వేదాలలోని, అనంతానంత మంత్రాలతో స్వామివారిని నిత్యం కీర్తిస్తోంది” అని ఎవరు నిత్యం లక్ష్మీదేవిని ధ్యానిస్తారో వారి తాపత్రయాలు పరిహారమవుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. ఐహిక సుఖాలతో బాటు ఆధ్యాత్మిక ఆనందం కూడా లభిస్తుంది.

 

లక్ష్మీదేవి, లోకరక్షణార్థమై, ఎన్నెన్నో అవతారాలను స్వీకరించింది. సర్వోత్తముడయిన శ్రీహరిని అనుసరించింది. ధర్మసూక్ష్మాలను, ధర్మాచరణ పద్ధతులను, సాధనా మార్గాలను స్వయంగా ఆచరించింది. మానవులకు సన్మార్గాన్ని ఉపదేశించింది.

*****

దుష్ట హిరణ్యాక్షుణ్ణి సంహరించి, ఉగ్రరూపంతో విహరిస్తున్న నరసింహస్వామిని, చెంచులక్ష్మిగా శాంతపరచింది.

సీతాదేవిగా శ్రీరామచంద్రుణ్ణి వరించింది. వనవాసం నెరపింది. అగ్నిపునీత ప్రభవించింది. పట్టాభిరాముని పట్టమహిషిగా వెలుగొందింది.

శ్రీకృష్ణావతారంలో రుక్మిణిగా, సత్యభామగా  – రెండు రూపాలతో ఆ నల్లనయ్యను సేవించింది. జాంబవతీ, మిత్రవిందా మొదలైన షణ్మహిషులలో తన అంశను నిలిపి, వారిచేత హరిసేవాకైంకర్యాన్ని జరిపించింది.

ఆకాశరాజ తనయ పద్మావతిగా అవతరించి కలియుగప్రత్యక్షదైవాన్ని వరించింది. పవిత్ర పద్మపుష్కరిణీ తీరంలో భక్తులపాలిట కల్పవృక్షమై వెలసింది.

రాబోయే కల్కి అవతారంలో తానే పంచకళ్యాణీ అశ్వమై దుష్టసంహారక్రీడలో ప్రధాన భూమికను పోషించనుంది.

*****

ఇంతటి వైశిష్ట్యపూర్ణమయిన లక్ష్మీదేవిని అర్చిండానికి అనువైన సమయమే – శ్రావణ మాసం. ఇప్పుడు శ్రావణ మాస వైశిష్ట్యాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం!

సనాతన సంప్రదాయం ప్రకారం ఒక సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసాలకు ప్రత్యేక విశిష్టతలు ఉన్నాయి. వీటిలో ఐదవ మాసమైన శ్రావణ మాసం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. శ్రవణా నక్షత్రం పేరు మీద ఏర్పడినదే శ్రావణ మాసం. జ్యోతిష్య శాస్త్రం రీత్యా శ్రవణ నక్షత్రం జ్ఞానార్జనకు సూచకం. వేదాంతపరంగా కూడా జ్ఞానాన్ని సంపాదించడానికి సహకరించే నవవిధభక్తి మార్గాలలో ’శ్రవణ’మే తొలి మెట్టు. ఈ విధంగా శ్రావణ మాసం జ్ఞాన సంపాదనకు అనువైన మాసం.

ఈ మాసంలోనే జంధ్యాల పౌర్ణమి నాడు వేదవిద్యలో కొత్త పాఠాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఈ మాసంలోనే గరుత్మంతుడు అమృతాన్ని సాధించి తెచ్చి తన తల్లిని దాస్య విముక్తురాల్ని చేసాడు. ఈ మాసంలోనే జ్ఞానానందమయుడయిన హయగ్రీవుడు అవతరించాడు. ఈ మాసంలోనే సర్వసంపదలను అనుగ్రహించే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.

మోక్షప్రదాయిని అయిన లక్ష్మీదేవి తత్వాన్ని, ఆ మహాదేవి ప్రకటించిన అష్టలక్ష్మీ రూపాలను, ఆ అవతారాల పరమార్థాన్ని తెలుసుకున్నాం కదా! ఆ అష్టలక్ష్ములూ కలికల్మషాలను తొలగించి, ఐహిక సుఖాలతో బాటు పారమార్థిక జ్ఞానాన్ని మీ అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.

*****