ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నదులంటే ఏమిటి?

Like-o-Meter
[Total: 1 Average: 4]

కేదారనాథ్ లోని విధ్వంసకాండాన్ని పత్రికల్లోనూ, దృశ్యమాధ్యమాల్లోనూ చూసిన తరువాత కరుగని మనసు, మారని మనిషి ఉండబోరని నా నమ్మిక. నిజానికి బదరీనాథ్, కేదారనాథ్‍ల యాత్రలు సులభసాధ్యములు కావు. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, వాటి నుంచి తరచూ రాలి పడే రాళ్ళు, మరోవైపు వందల అడుగుల లోతున్న లోయ, ఆ లోయలో ఒక్కొక్క చోట ఒక్కో నామధేయముతో వ్యవహరింపబడుతూ హోరుమని ప్రవహించే గంగానది. ఈ యాత్ర పూర్తికాగానే “భగవంతుడున్నాడు!” అన్న నమ్మకము తప్పక కలుగుతుంది.

ఇంతకూ మన పుణ్యభూమిలో ప్రవహిస్తున్న పావన నదులు తమ తమ గమనాన్ని ఎలా నిర్దేశించుకొన్నాయి?

దీనికి విజ్ఞానశాస్త్రము (Science) కొన్ని వివరణలను ఇస్తుంది. అవేవనగా “నదీమూలము (River source) నుండి నదీముఖము (River mouth) వరకూ సాగుటకు నదులు అనేక రకములైన మార్గాలను అవలంబించవచ్చు. దిక్చక్రము (Compass) సూచించు అన్ని దిశలకూ నదులు పారవచ్చును. సాధారణముగా ఎగువ ప్రాంతముల నుండి పల్లపు ప్రాంతముల వైపుకు నదులు పరుగులుపెట్టి చివరకు సముద్రలలోకి చేరుతాయి.”

ఈ వివరణలన్నియూ కంటికి కనబడు దృశ్యాలను చూచి నిర్ధారించుకొని చెప్పినటువంటివి. కాబట్టి వీటిపై ఎలాంటి విమతత్వమూ లేదు.

అశేష విజ్ఞానభాండారములైనటువంటి సనాతన ధర్మము యొక్క ప్రాచీన గ్రంథములలో పై వివరణలకు మీరి, సాధారణ మానవ మేధస్సు కల్పనలోకి రాలేని మహత్తర విషములను వివరించారు పూర్వీకులు. నదుల యొక్క గమనములు ఎలా నిర్దేశింపబడ్డాయో, మన ప్రాచీన ఆచార్యుల వివరణలేమిటన్నవి తెలుసుకోదగ్గ విషయములు.

పురాణములలో నదులు

మానవులు, ఇతర జంతుజాలములు, వృక్షములు బ్రతుకవలెనన్న వర్షము, నదుల యొక్క అవసరము ఎంతైననూ కలదు. ఈ అంశముపై భారతీయ ఆధ్యాత్మిక వైజ్ఞానికులు దృష్టిని సారించినంత లోతుగా ప్రపంచములో మరే ఇతరులూ చేసివుండలేదన్నది నిర్వివాదాంశము.

మనకు గల పద్దెనిమిది పురాణములలోనూ నదుల ప్రసక్తి ఉన్నది. కొన్ని వందల నదుల యొక్క ప్రశంసలున్నవి. స్నానము చేయునప్పుడు “గంగే చ యమునే చైవ” అని సంక్షిప్తముగా నదుల స్మరణ చేసే ఆచారము నేటికీ కొనసాగుతున్నది. ఈ స్తోత్రములు, ప్రశంసలు, ఆయా నదులకు ఆపాదింపబడ్డ మహత్తులూ – ఇవన్నియూ మనలో నదుల పట్ల భక్తిభావమును, ఆరాధనా బుద్ధిని పెంపొందించేందుకే. తద్వారా మానవులు నదులను పాడు చేయక, అతిగా వాడుకొనక, కొన్ని హద్దులకు లోబడి ఉండవలెనని వారి ఉద్దేశ్యము. కానీ నేడు పెచ్చరిల్లుతున్న నాస్తికవాదము, వ్యక్తివాదము, స్వార్థము మొదలైన వాటి వల్ల నదుల పట్ల గౌరవము తొలగిపోయినది. ఒకప్పుడు పాపధ్వంసినిలుగా పూజలందుకొన్న నదులు నేడు మురికికూపాలుగా, వ్యర్థవాహినినులుగా మారిపోయాయి. ఎప్పుడైతే వాటి పూజనీయతను మనం అపహసించామో, అవి కూడా ప్రతిస్పందించక పోవు. ఎందుకనగా, నదులు దేవతల యొక్క భౌతిక రూపాలే గానీ జడ పదార్థములు కావు. కనుక వాటికి కూడా స్పందన, ప్రతిస్పందనలు కలవు. ఇది గురుతెరిగి మసలుకొనుట మానవులకు క్షేమదాయకము.

నదుల దిశానిర్దేశముల పై పురాణ వివరణము

నదులు తమతమ ప్రవాహ దిశను ఎలా నిర్దేశించుకొన్నాయన్నది అత్యంత ఆసక్తికరమైన విషయము. ఈ విషయమును పురాణములు తేటతెల్లముగ చెప్పివున్నాయి. “సుతీర్థపాదాయ, సుతారకాయ” అని వాయు పురాణములోని ఒక ఉల్లేఖన. నారాయణుడిని వర్ణించే ఈ స్తోత్రములో శ్రీహరిని “తీర్థపాద” అన్న పేరుతో పిలవడమైనది. మీ అందరకూ వామనావతారము తెలిసేవుండును. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ వామనుడి పాదాన్ని వియద్గంగాజలములతో చతుర్ముఖ బ్రహ్మ అభిషేకించాడన్న కథ కూడా అందరికీ తెలిసేవుండును. ఆవిధముగా దేవనదిగా, స్వర్గలోకములోనే ఉన్న గంగాజలము మొదటిసారిగా భూమిపైకి జారివచ్చినది. అదే ఈ భరతఖండములోని సమస్త నదుల పుట్టుకకు మూలము. అందువలన నారాయణుడిని “తీర్థపాద” అన్న అభిదానముతో పురాణములు పిలిచాయి. ఈ విషయమునే “త్రివిక్రమం తీర్థపాదం నత్వా సర్వాఘనాశనమ్” అని వామన పురాణము కూడా పేర్కొంటున్నది.

ఈ శ్లోకముల వల్ల మనకు తెలిసేది ఏమనగా, శ్రీహరి పాదమే సకల తీర్థములకూ పుట్టినిల్లు. అతని అంగుష్టము నుండి గంగానది పుట్టినదని మాత్రమే చెప్పుట ఒక దృష్టాంతము మాత్రమే. సమస్త నదులలోకీ గంగానది శ్రేష్టము గనుక, ఆమె హరిపాదోద్భవి అని చెప్పినప్పుడు ’ఛత్రిన్యాయము’ ననుసరించి గంగాది సమస్త నదులూ హరిపాదోద్భవాలేనన్నది శాస్త్రసమ్మతమైన నిరూపణ.

తీర్థపాద” అన్న హరి రూపము భూగతమై అనగా భూమిలోని రహస్యభాగములలో ఉండి, ఒక మహత్తరమైన మెరపువలే అమితమైన వేగముతో భూకోశమును చీల్చుకొనుచూ పోవుచుండును. ఈ మెరుపు శాఖోపశాఖలుగా విభజింపబడి పోవుచుండును. ఈ మెరుపు యొక్క ఒక్కో శాఖనూ అనుసరించుచూ భూతలము మీది నదులు పోవుచుండును. సర్వజగన్నియామకుడైన నారాయణుడి “తీర్థపాద” రూపము ఏయే ప్రాంతములను ఏయే నదుల నీటితో పునీతము చేయగా ఎంచునో ఆయా నదులు, ఆయా ప్రాంతములను తాకుతూ, శ్రీహరి యొక్క భూగతమైన తటిల్లతా రూపమును అనుసరించూచూ తమ దిశలను మార్చుకొనుచూ ప్రవహించుచున్నాయి.

నారాయణుని అన్ని అవతారములూ అనంత పద్మనాభ రూపము నుండి బయలుదేరినవి. ఆ పద్మనాభుడే అనంతశయనుడు, సముద్రశయనుడు. కనుక “తీర్థపాద” రూపము కూడా అన్ని అవతారముల వలనే సముద్రశాయిలోనికి లీనమవుతున్నది. కనుక, తీర్థపాదను అనుసరించిన నదులన్నియూ చివరకు సముద్రములలోనే లీనమవుతున్నవి.

నదులను పూజించండి

ఏ మహానారాయణున్ని ఈశోపనిషత్తు “తేన త్యక్తేన” అన్న ఉత్కృష్టవర్ణనతో పొగిడిందో అలాంటి నారాయణుడే నదుల అంతర్యామియై ప్రవహించుచున్నాడు. మనం నదులకు చేసే అవమానాలు, అపచారాలన్నీ శ్రీహరికే చేయడమవుతోంది. నారాయణుడి స్థితికర్తయే కాదు లయకర్త కూడా. గీతలో ఈ మాటను “కల్పక్షయమును, కల్పసృష్టిని చేయువాడిని నేనే”నని స్పష్టంగా చెప్పాడు.  కనుకనే మనం చేస్తున్న అపచారాలు హద్దులు మీరినపుడు బుద్ధి కలిగివుండడని హెచ్చరించడానికి నదులను పొంగిస్తాడు. ఏ నదులనైతే కాలుష్యపంకిలాలుగా చేసి విర్రవీగుతున్నామో, ఆ నదుల్లోనే ఆస్తులు, అంతస్తులు చివరకు ఐనవాళ్ళను సైతము పోగొట్టుకోవలసి వస్తుంది.

“భయం తత్వవిమర్శనాత్” అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కనుక తత్వ నిశ్చయం కోసం అప్పుడప్పుడూ నదులు భయపెడుతుంటాయి. ఆ వికోపాల వెనుకవున్న వైజ్ఞానిక కారణాలతో బాటూ సూక్ష్మములు, సహేతుకములూ అయిన ఆధ్యాత్మిక కోణములను కూడా పరిగణలోనికి తీసుకొన్నప్పుడే మన దేశం ప్రకృతి యొక్క వికృతల నుంచి రక్షించుకోగలదు. మన జాతి మూలములైన ఆస్తికత, పరదుఃఖదుఃఖిత్వము, ప్రకృతి ఆరాధన మొదలైనవాటిల్ని తృణీకరించినపుడు మృత్యువే మన తలవ్రాత, తుది మజిలీ.

||సర్వే జనా సుఖినో భవంతు||

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>