లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||
సంస్కృతంలో “లక్ష్మి” అన్న పదానికి మూల ధాతువులు – లక్ష్ – పరిశీలించుట, గురి చూచుట [1]. ఇదే ధాతువును “లక్ష్యం” అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః – అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది.
నిత్యముక్త ఒక్క జగన్మాత శ్రీ మహా లక్ష్మియే. ఈమె ప్రళాయానంతరం శ్రీ(నిత్యానపాయని అయిన మహాలక్ష్మి) భూ(భూదేవి) దుర్గ (దుర్గమమైన చీకటి) గా రూపాంతరం చెందుతుంది. వటపత్ర శాయిని పునః సృష్టి చేయమని మహాలక్ష్మి ప్రార్ధిస్తే పద్మనాభం నుంచి ఉద్భవించిన వాడే బ్రహ్మ. అట్టి బ్రహ్మ సృష్టి లో వచ్చిన వాళ్ళే మాహా రుద్రుడు, ఇంద్రుడు ఆదిగా గల దేవతలు, ఈ జగత్తూ ఇందులో ఉన్న మనమూ!
వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా). అట్టి ఈ తల్లి విష్ణు ప్రియ !
యజుర్వేదం పురుష సూక్తం లో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం , వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.
తిరుమల లో విష్ణు కుమారుడైన బ్రహ్మ ఆనందం తో అయ్యవారికి తొమ్మిది రోజుల ఉత్సవాలు చేస్తుంటే, భారతావని మొత్తం అమ్మవారిని నవరాత్రులలో నవ దుర్గలు గా కొలుస్తోంది. మొత్తం మీద ఈ నవరాత్రులు శ్రీ లక్ష్మీ నారాయుణులకు అత్యంత ప్రీతి పాత్రమైనవి.
@@@@@