ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నీకే కృష్ణ!

Like-o-Meter
[Total: 0 Average: 0]

అదియు నీకే కృష్ణ, ఇదియు నీకే

కారంపప్పు నీకే, బెల్లం ముక్క నీకే

దాగుడుమూతల, ఊగుడు బల్లల

మూగేటి పిల్లల గోలలందు ఆ

సాగేటి అల్లరి చిల్లరందు
మోగేనె నీ కాలి గజ్జెలిపుడు!


అన్న బలరాముడు నిను చిన్నబుచ్చేనని

కన్నుల్లో నీరును నింపబోకు, ఆ వెండి

గిన్నెల్లో నీరు నింపబోకు, నా

కన్నుల్లో కలతను పడనీయకు!

లేగదూడలు చుట్టు మూగలేదని

అలిగి పిల్లనగోవిని వీడకోయి, నీ

చల్లని పాటను ఆపకోయి, మా

కళ్ళల్లో నీళ్ళను నింపకోయి!

రక్కసిమూకలో ఒక్కరైనా మిగిలి

తొడగొట్టి నీ ఎదుట పడలేదని, తమ

అక్కసు చూపగ రాలేదని, నీ

చక్కన్ని మోమును దాచకోయి!

ఉట్టిలో దాచిన గట్టి పాలు, పెరుగు

చిట్టి నీ చేతుల్లో పడలేదని, పెను

కట్టే బట్టుకు గోపి నిలిచిందని

పట్టు పరదా వెనుక దాగకోయి!

ఎన్నెన్నో లీలలు, అన్నెన్నే గోలలు

హన్నా ! నీ రూపము తెలియకుండే, బహు

ఘనుడి మహిమల లోతు తెలియకుండే

చెన్నకేశవ నాకు తెలియకుండే!