ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పోతనగారి భాగవతం – కొన్ని ఆణిముత్యాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

శ్రీమన్నామ! పయోధ

శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా!

రామాజన కామ! మహో

ధ్దామ! గుణస్తోమధామ! దశరధరామా!


భిల్లీ భల్ల లులాయక

భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ

ఝిల్లీ హరి శరభక కిటి

మల్లాద్భుత కాక ఘూకమయ మగు నడవిన్


తలగవు కొండలకైనను

మలగవు సింగములకైన మార్కొను కడిమిం

గలగవు పిడుగులకైనను

నిల బలసంపన్న వృత్తి నేనుగుగున్నల్


వల్లభలు వారి మున్పడ

వల్లభమని ముసరిరేని వారణదానం

బొల్లక మధుకరవల్లభు

లుల్లంబుల బొందిరెల్ల యుల్లాసంబుల్


తొండంబుల మదజలవృత

గండంబుల కుంభములను ఘట్టన సేయం

గొండలు దలక్రిందై పడు

బెండుపడున్ దిశలు సూచిబెగడున్ జగముల్


తొండంబుల బూరింపుచు

గండంబుల జల్లుకొనుచు గళగళ రవముల్

మెండుకొన పలుదకడుపులు

నిండన్ వేదండకోటి నీరుం ద్రావెన్


కరి దిగుచు మకరి సరసికి

గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్

కరికి మకరి మకరికి గరి

భరమన నిట్లతల కుతల భటు లదిరిపడన్