ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పుజా పుష్పాలు – వాటి వివరాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

మన ఆచార, సాంప్రదాయాలలో పూలకు విశిష్టస్థానము ఉంది. ఆ పుష్పవిలాసమును తెలుసుకొందాము.

శివ పూజ, విష్ణు పూజకు వాడవలసిన పూల గురించి  ఇంతకముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దేవి పూజకు  కావలసిన పూవుల  గురించి  చెప్పుకుందాం.

పూలమాలలు కట్టుట 64 కళలలో ఒకటి.  వివిధ వర్ణములు వివిధ జాతులకు చెందిన పుష్పములతో కలగలిపి కట్టిన మాలలు మూడు రకములు:

  1. హృదయము వరకే ఉండే పొట్టి మాలలను రైక్షికములు అంటారు ఈ మాలలు ఆనందమును కలిగిస్తాయి.
  2. నాభి (బొడ్డు) క్రిందకు ఉండే మాలలు సాధారణియములు. ఈ మాలలు ఆనందమును రెట్టింపు చేస్తాయి.
  3. పాదపద్మములపై పడే వానిని వనమాల అంటారు. ఇది అన్ని మాలల కన్నా ఉత్తమమైనది.

మాలలు – యాగ/పుణ్య ఫలాలు

పైన చెప్పబడిన పూలతో అమ్మను భక్తీ శ్రద్దలతో పూజించిన అమ్మ మన సమస్త కోరికలు తీర్చును. సంపెంగ, మల్లె, జాజి, తామర, కలువ, మరువం, దవనం మొదలగు పూలతో పూజించిన పుణ్యం నూరు రెట్లు అధిక మగును.

అమ్మవారికి మొగ్గలు, పక్వం కాని పండ్లు, అకాల పక్వ పండ్లు, పురుగు తొలచిన పూలు, పండ్లు నివేదించరాదు. తెలియక అత్యంత భక్తితో  నిషేధిత పూలతో, పండ్లతో అమ్మను పూజించినా భక్రి ఒక్కటే అమ్మ స్వికరించును. తెలిసి కావాలనే, అశ్రద్దతో నిషేధిత పూలతో, పండ్లతో అమ్మను పూజించిన అమ్మ ఆగ్రహించును.

జాజి పూలతో భుక్తి, మల్లెతో లాభము, నల్ల కలువతో బలము, పద్మము శాంతిని ,ఆయుర్వృద్దిని, కమలము సుపుత్రులను, వరి వెన్ను సౌభాగ్యమును, సన్నజాజి వాక్శుద్ధిని, నాగ కేసరము రాజసము, సంపెంగ బంగారమును, మొల్ల కీర్తిని, కలువ కవిత్వాన్ని, మరువము విజయప్రాప్తిని, గరిక ధనధాన్యసంపదను, మోదుగ పూలు పశు సంపదను వృద్ధి చేయును. తెల్లని పూలు సామాన్య కోరికలు తీర్చును. 

అమ్మవారిని ఒక నెల జపా పుష్పములచే పూజించిన అమ్మవారి అనుగ్రహము కలుగును.తెల్లని పూలతో ఒక నెల పూజించిన ముప్పది జన్మల పాపం నశించును. మంకెన పూలతో ఒక నెల పూజించిన సర్వ పాపములు తొలగి పోవును తామర పూలు, మారేడు దళములతో ఒక నెల ప్రసన్నబుద్ధితో పూజించిన అన్ని పాపములు నశించి మంత్రి పదవి పొందుదురు. మల్లె, జాజి, తెల్ల కలువ, తామరలతో ఒక నెల పూజించిన వంద జన్మల పాపం తొలగును. బ్రహ్మ హత్యా పాతకం తొలగును. వాక్శుద్ధి కలుగును.

పూజించు పూల యందు వెంట్రుకలు  ఉన్న మానసిక వ్యాధులు కలుగును. పురుగులు కలగిన పూలు ఉపయోగించిన రాజ దండనము, మహా భయము కలుగును. అందుకని అమ్మవారికి ప్రియమైన పూలను ఉపయోగించి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుదాం.

శుభమస్తు.      

 

రచన :- పి .పద్మావతి శర్మ, ఎం .ఎ . తెలుగు పండిట్ 

రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు