ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సంవత్సరాది ఉగాది

Like-o-Meter
[Total: 3 Average: 4.3]

చైత్రే మాసి జగద్ బ్రహ్మా – ససర్గ పథమే అహని; 

వత్సరాదౌ వసంతాదౌ  రవిరాద్యే తథైవ చ

అని శాస్త్రాలు ’ఉగాది’ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తున్నాయి.

ఆద్యంత రహితుడైన భగవంతుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాది. జగత్తును సృష్టించే బ్రహ్మదేవుడు తన సృష్టికి అనుకూలమైన మంచి ముహూర్తంగా చైత్ర శుద్ధ పాడ్యమిని నిర్ణయించాడు. అదే ’వత్సరాది’ అని, ’యుగావర్తనం’ అని పిలువబడుతోంది. సంస్కృత పదమైన ’యుగాది’ తెలుగులో ’ఉగాది’గా మారింది.

భారతీయుల కాలమానంలో ’ఉగాది’కొక ప్రత్యేక స్థానముంది. ఐతే తెలుగు నాట, తెలుగువారి లోగిళ్ళలో జరిగే ఉగాది పండుగకు విశిష్ఠ స్థానముంది. గడచిపోయిన కాలం గురుతుల్ని చెరిపివేస్తూ కొత్తదనాల సరికొత్త యుగాన్ని నిర్మించే రోజే యుగాది.  తలంటు స్నానాలు, కొత్త బట్టలు, పిండివంటలతో బాటు ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం తెలుగువారి ఉగాది వేడుకల్ని సుసంపన్నం చేసే అంశాలు.

పంచాంగ శ్రవణం

సనాతన ఋషులు ప్రభవ, విభవ వంటి అరవై సంవత్సరాలను నిర్ణయించారు. ప్రతి సంవత్సరాన్ని ఆయనాలు, మాసాలు, వారాలు, దినాలుగా విభజించారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము – ఈ ఐదింటిని కలిపి ’పంచాంగం’ అని పిలుస్తారు.

ఒక సంవత్సర కాలంలో వచ్చే పండుగలు, శుభాశుభ ముహూర్తాలు, లగ్నాలు, హోరలు మొదలైనవే కాకుండా వ్యవసాయ, వాణిజ్య రంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రారంభించడానికి అనువైన దినాలు కూడా ఈ పంచాంగం ద్వారానే నిర్ణయించడం జరుగుతోంది. పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలయ్యే మొదటి రోజును ’ఉగాది’గా వ్యవహరిస్తారు.

ఉగాది రోజు పొద్దున్నే పంచాంగ శ్రవణం చేయడం సర్వ శుభదాయకమని ప్రాచీన విశ్వాసం. పంటలు-పండుగలు-ఉపద్రవాలపై ముందుగానే సమాచారాన్ని అందించి మానవ జీవనం సుఖంగా, సంతోషంగా, ఈతిబాధలు లేకుండా గడవడానికి కావలసిన కాలవిజ్ఞాన్ని ’ఉగాది’ పండుగ మనకు అందిస్తోంది.

ఉగాది పచ్చడి

సుఖం-కష్టం, సంతోషం-దుఃఖం ఒకదాని వెంట ఒకటి వస్తూ ఒక చక్రంలా తిరిగితే అదే మానవ జీవితం అవుతుంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే తొందరలో జీవిత సత్యాలను మర్చిపోకూడదని చాటి చెప్పేదే ’ఉగాది’ పండుగ. కొత్త బెల్లం, కొత్త చింతపండు, పచ్చి మామిడి, వేపపూత – ఇలా ఆరు రుచులను కలిపి తినడం ’ఉగాది’ నాడే జరుగుతుంది.

ఉగాది పచ్చడిని ’నింబ కుసుమ భక్షణం’గా శాస్త్రాలు పిలిచాయి. చేదైన వేపపూతను తియ్యనైన బెల్లంతో కలిపి తినడంలో జీవితంలోని ఎత్తుపల్లాలను గుర్తుకు తెచ్చుకొని జాగ్రత్తగా మసకోవాలన్న సందేశాన్ని ఇమిడ్చారు మన పెద్దలు. అంతేగాక, ఉగాది పచ్చడిని అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా కూడా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి.

ఈ ’ఉగాది’ మీ జీవితాల్లో కొత్త వెలుగుల్ని నింపాలని, మీకు సమస్త జయాలను కరుణించాల్ని ప్రార్థిస్తున్నాం.

 

శుభాకాంక్షలతో

ఆవకాయ బృందం