ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శ్రీమద్రామయణ గొబ్బిపాట

Like-o-Meter
[Total: 2 Average: 5]

శ్రీమద్రామయణ గొబ్బిపాట

రామాయణం జనశ్రుతిలో అనేక రూపాలలో వ్యాపించింది అనడానికి ఈ శ్రీమద్రామయణ గొబ్బిపాట ఒక చక్కటి నిదర్శనం. చిన్నదైనా గొప్ప ఫలాన్నిచ్చే గొబ్బిపాటను తప్పక చదవండి.

ఆరభి రాగము – ఆది తాళము

1. శ్రీ రఘురాముని దివ్య చారిత్రామృతరసము

సార యశోదాయకము గౌరవ సంధాయకము ||

 

2. ధారుణిమండలమందు దనరారు నయోధ్య

సూరకులోర్వీపతులు సొంపుగ నేలుదురందు||

 

3. ఆ నగరం బదువదివే లబ్దంబుల్ దశరథుడు

పూనిక బాలన చేసి పుత్త్రుల నల్వుర బడసెన్ ||

 

4. దశరథ భూకాంతునకు దనయుండై రాఘవుడు

శశిధరుని విలుద్రుంచి జానకినిం బెండ్లాడె ||

 

5. జనకుని వాక్కును పరిపాలన సేయంగను రాముం

డనుజునితో జానకితో జనుదెంచెన్ వనమునకు||

 

6. కైకేయీ నందనుడు కాకుత్థ్సాగ్రణి జేరి

సాకేతం బేలుమని సన్నుతిచే రాఘవుని||

 

7. భరతుని ప్రార్థనమునకు బద్మాక్షుం డియ్యకొని

భరతున కానందముగ బాదుకలన్ దానిచ్చె||

 

8. అన్నకు మారుగ వాని నతిభక్తి నెన్నుచును

బన్నుగ బట్టముగట్టి భరతుడు రాజ్యమునేలె

 

9. రక్కసి యా శూర్పణఖ రాముని మోహించగను

గ్రక్కున రామానుజుడు కామిని భంగముజేసె||

 

10. దానవి భంగము రీతిన్ దానవనాథుండు విని

జానకిపై మోహముతో గాననమునకు వెడలె

 

11. వాసిగ నా రావణుడు వేసమును ధరియించి

భూసుత యొంటరినుండ మోసముచే గొనిపోయెన్ ||

 

12. ఆ లలనామణి రీతినంత జటాయువు దెల్పి

కూలగనే సంస్కారం బోలిని రాముడు చేసెన్ ||

 

13. వనరుహ లోచనుడపుడు కనకాంగిన్ కనిపెట్ట

వనమధ్యంబున నేగి హనుమంతున్ గనెనంత ||

 

14. చని సుగ్రీవుని సఖ్యంబున వాలిన్ దునుమాడన్

దన యాజ్ఞన్ హనుమంతుండును సీతన్ గనె లంకన్ ||

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

 

15. అంతట మారుతి లంకన్ అగ్నికి నాహుతిచేసిన

కాంతను వీడ్కొని రాజకాంతుని సన్నిధి జేరెన్

 

16. అంచితవందనములుగావించుచు భూకాంతునకు

గాంచితి బింబోష్ఠిని లంకాపురమందని పల్కెన్ ||

 

17. వారిజనేత్రను గనిన వర్తనమంతయు దెలిపి

వారిధిపై భూవరుడు వంతెనను గట్టించె ||

 

18. వానరసేనాయుతుడై భానుకులేశుడు రాగా

దానవులం బురికొల్పెన్ దనుజేంద్రం డనిసేయ ||

 

19. కనలుచు నంతట గుంభకర్ణుడు దా జనుదెంచి

మనుజేశు పై బడగా దునిమెను రాముడు వానిన్ ||

 

20. అత్తరుణంబున నింద్రజిత్తు మహాక్రోధముతో

హత్తుకొని పోరగ రామానుజుడు పరిమార్చెన్ ||

 

21. తక్కిన రాక్షసవీరుల్ గ్రక్కున యుద్ధమునందు

జిక్కుకొని దిగులొంది శీఘ్రములో హతులయిరి ||

 

22. సారసనేత్రుడు వింటన్ సాయకముల్ సంధించి

ఘోరరణ రంగమునన గూల్చెను నా దశముఖుని ||

 

23. సురవరు లా రామునిపై విరులను వర్షింపగను

పరగగ గంధర్వులును బాడిరి పెంపలరగను ||

 

24. ధరణీ నందన యగ్ని దానుబ్రవేశింపగను

సరగున వైశ్వానరుడు చల్లనివాడై మెలగె ||

 

25. అమరులు నా దశరథుడు నాకసమందున బొగడ

గమలాక్షిన్ గైకొనియెన్ గరుణను సీతావిభుడు ||

 

26. మోదముతో దాశరథి పుష్పక వైమానికుడై

వైదేహీ సహితుండై వచ్చె నయోధ్యకు దాను ||

 

27. ఇంపుగ వేంకటరాముండెంతయు ధ్యానింపగను

పెంపుగ రాముడు రత్నపీఠమునన్ గొలువమరె ||

 

28. వెలయగ శ్రీరాము కథన్ విన్న బఠించినగాని

యెలమిని గాంతురు భక్తు లిహపర సౌఖ్యంబులను ||

 

||శ్రీమద్రామాయణ గొబ్బి పాట సంపూర్ణము||