ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా? – 01

Like-o-Meter
[Total: 1 Average: 5]

గ్రంథకర్త పరిచయం:

“సుఖం – సుఖానికి సనాతన ధర్మం సహకారినా? వ్యతిరేకినా?” అన్న ఈ చిన్ని గ్రంథాన్ని నాకు గురువులైన శ్రీ పుష్కరప్రసాద్ ఆచార్యుల విద్యా గురువులైన శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు రచించారు.

శ్రీ దేవేంద్ర తీర్థ శ్రీపాదులు వేద, పురాణ, తర్క, మీమాంస శాస్త్రాల్లో నిష్ణాతులు. మూడుపదుల వయస్సులో సన్యాస దీక్ష స్వీకరించి మైసూరు పట్టణంలో నివసించారు. దాదాపు నాలుగు దశాబ్దాలు సన్యాసాశ్రమంలో గడిపి 1994వ సంవత్సరంలో హరిపాదాలను చేరారు. వారి బృందావనం కర్నాటక-ఆంధ్ర సరిహద్దులో ఉన్న “ముళబాగలు” లో కృష్ణదేవరాయల రాజగురువైన శ్రీ వ్యాసరాజ తీర్థుల గురువులైన శ్రీ శ్రీపాదరాజ తీర్థుల సాన్నిధ్యంలో ఉంది.

కన్నడంలో వారు వ్రాసిన ఈ చిరు పొత్తాన్ని తెలుగులో అనువదించాలని ప్రయత్నించాను. ఇందులో లోప, దోషాలన్నీ నావేనని, మంచి విషయాలన్నీ పరమ గురువులకే చెందుతాయని వినతి చేసుకుంటున్నాను.


శుభాన్ ధ్యాయంతి యే కామః | గురుదేవ ప్రసాదజాన్
తద్దితరాన్ ఆత్మ పాపోత్థాన్ | తేషాం విద్యాం ఫలిష్యతి


**********



ముందుమాట

జీవుల సుఖప్రాప్తికి, దుఃఖ నివృత్తికి సనాతన ధర్మం అత్యంత సహకారియే అయివున్నది. కానీ, ఈకాలంలో కొద్దిమంది భ్రాంతులై, ఈ ధర్మం సుఖానికి కారణం కాదని, దుఃఖానికే కారణమైనదని తాము భ్రమించడమే కాక ఇతరుల బుద్ధినీ ప్రభావితం చేస్తున్నారు. సరియైన జ్ఞానాన్ని పొందినవాళ్ళు ఉన్నప్పటికీ ఈ విరుద్ధ భావాల్ని తుడిచే ప్రయత్నాన్ని చేయడంలేదు. దీనికి కారణాలు సరిగ్గా తెలియరావడం లేదు. కాబట్టి, మాకు తెలిన మేరకు పరోపకారబుద్ధితో సనాతనధర్మం మహాసుఖప్రాప్తికి, సమస్త దుఃఖ నివృత్తికీ దోహదకారియని తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ గ్రంథాన్ని రచించ పూనుకున్నాం. ప్రతి ఒక్కరూ ఇలానే చెయ్యాలని కట్టడి చేయడానికి ఈ గ్రంధాన్ని వ్రాయలేదు.

పూర్వం మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుడు “యుద్ధం పాపానికీ, దుఃఖానికీ కారణమైన”దని శంకించినపుడు, శ్రీకృష్ణ పరమాత్మ ధర్మయుద్ధం క్షత్రియులకు పూర్వపుణ్యం వల్లనే దొరుకుతుందని, అది రాబోయే మహాపుణ్యానికి సాధనా మార్గమని, అందువల్లనే మహాసుఖానికీ కారణమని తెలిపాడు.

అర్జునుడిని యుద్ధం చేయమని ఎప్పుడూ భగవంతుడు బలవంతం చేయలేదు, అన్న తరువాత ఎవరు ఎవరినీ బలాత్కారం చేసేందుకు వీలులేదు. కాబట్టి మేము సనాతన ధర్మం మహాసుఖానికి కారణమైనదని చెప్పడానికి మాత్రమే పూనుకున్నాం. మా మాటల్లో ఏవైనా దోషాలు కనబడితే, విశేషజ్ఞానులు తెలుపగలరు. దీనివల్ల మాకూ దిద్దుబాట్లు చేసుకునేందుకు అనుకూలమౌతుంది. ఈ సదుద్దేశంతోనే ఈ గ్రంథాన్ని ప్రకటిస్తున్నాము.

శ్రీ దేవేంద్ర తీర్థ

**********

1. సుఖము యొక్క ప్రశంస మరియు దాని ప్రభేదాలు

లోకంలో ప్రజలు కోరే ధనం, ధాన్యం, ఇల్లు-వాకిలి, విద్య, అధికారం, కీర్తి, మర్యాద, పుణ్యం, బంధువర్గం మొదలైన నానా విషయాలన్నీ తమతమ సుఖానికేనని లేక దుఃఖ నివృత్తికేనని భావిస్తారు.

సుఖం స్వతహాగా సుందరమైనది. దానిని పురుషులు (జీవులు) కోరడం చేత అదే ముఖ్యమైన పురుషార్థమని చెప్పబడుతుంది. లోకప్రసిద్ధాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలు పురుషులచే(జీవులచే) కోరబడి, సుఖానికి కారణమైనప్పుడే వీటికి పురుషార్థాలని పేరు దక్కింది.

ఇంత ముఖ్యమైన పురుషార్థ శబ్ద వాచ్యమైన “సుఖ” లో (1) తాత్కాలిక సుఖం (2)దీర్ఘకాలిక సుఖం (3) పరలోక సుఖం మరియు (4) శాశ్వత సుఖం – అని నాలుగు విభాగలున్నాయి.

అవివేకులైన పిల్లలు మొదలైనవారు తాత్కాలిక సుఖాన్ని కోరుతారు. వివేకులు దీర్ఘకాలిక సుఖానికై ప్రయత్నిస్తారు. ఆస్తికులు దీర్ఘకాలిక సుఖాన్ని లెక్కించక పరలోక సుఖానికై ప్రయత్నిస్తారు. పరమ ఆస్తికులు కేవలం శాశ్వత సుఖానికే మహాప్రయత్నశీలురౌతారు.

“విచారించి చూస్తే, సుఖం అన్నది శరీరంలోని పదార్థమే కానీ శరీరానికి ఆవలనున్నది కాదు. సుఖం జీవి (soul) అంతఃకరణం యొక్క ధర్మమే అయివున్నది.”

కావున, సుఖాన్ని పొందగోరినవారు తమ అంతరంగం వైపుకు దృష్టి పెట్టక బాహ్య పదార్థాలను సంగ్రహించడం వైపే దృష్టి సారిస్తే, ఉత్తరదిక్కువా వెళ్ళవలసిన వారు దక్షిణదిక్కుకు ప్రయాణించడంలాంటి ఆభాసమే అవుతుంది.

సుఖమంటే తమకు అనుకూలమైనదనే భావించినప్పుడు, దాని ప్రతికూలమైనవన్నీ దుఃఖాలే. ఈ సుఖదుఃఖాలు మన వశంలో లేనివి. ఒకవేళ అవి మన అధీనంలోనే ఉన్నవైతే ఎవ్వరూ దుఃఖపడకూడదు. ఎల్లప్పుడూ సుఖభోగులయ్యే ఉండాలి. కానీ, అలా ఎవ్వరూ శాశ్వత సుఖభోగులు కానందువల్ల, శాస్త్రాలలో చెప్పిన విధంగా మనం అనుభవించే సుఖదుఃఖాలు మన అదుపులోలేనివని తెలుసుకోవాలి.

**********


మన మనోభావాల వల్లనే సుఖదుఃఖాలు ఉత్పన్నమౌతాయని కొందరి వాదన. మనం స్వతంత్ర్యులైనప్పుడు ఎలాంటి దుఃఖ భావమూ మనల్ని తాకకుండా జాగ్రత్త పడవచ్చు కదా? మన నాలుకను మనమే కొరుక్కుని, తద్వారా కలిగే నొప్పిని (దుఃఖానుభవాన్ని) నివారించుకోలేక పోవడం ద్వారా మనం స్వతంత్ర్యులం కామని, సుఖదుఃఖాలు మన అధీనంలో లేవని తెలుసుకోవచ్చు.

ఇలానే భోజనం మొదలైన సుఖసామగ్రులు అందుబాటులో లేనప్పుడు కూడా మనిషి మనసు ఒకొక్కప్పుడు ఉల్లాసంగా ఉండడం అనుభవైకవేద్యమే. అలానే అన్ని సుఖ కారక వస్తువులు(మంచి భోజనం మొదలైనవి) ఉన్నాకూడా మనసు విచారంలో మునిగి ఉండడం కూడా చూస్తాము. వీటన్నింటినీ చూసినప్పుడు సుఖదుఃఖాలు దైవాధీనాలని స్పష్టమౌతుంది. అంటే పదార్థాల ద్వారా లభించేదే సుఖమని నమ్మరాదు.

కాబట్టి దుఃఖ పరిహారాన్నీ, ఈ లోకపు అల్పసుఖాన్నీ, శాశ్వత మోక్షసుఖాన్నీ కోరేవారు,దైవానుగ్రహ సంపాదన చేయాలని, తద్వారానే జీవుల దుఃఖ నివృత్తి అవుతుందని వేదాది శాస్త్రాలు చెబుతున్నాయి.

                                       సశేషం…