ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తిరుమల బ్రహ్మోత్సవం – అంతరార్థం

Like-o-Meter
[Total: 0 Average: 0]

||నమో వేంకటేశాయ||

తిరుమల బ్రహ్మోత్సవం – అంతరార్థం

చిత్రకారుడు: కూచి సాయిశంకర్

1. బ్రహ్మోత్సవం

వేంకటేశ్వరునికి తిరుమల క్షేత్రంలో చతుర్ముఖ బ్రహ్మ మొదటిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ’బ్రహ్మోత్సవం’ అన్న పేరు వచ్చింది. 

కలియుగంలో భక్తుల్ని రక్షించే నిమిత్తం వైకుంఠం నుండి దిగి భూలోకంలోని వేంకటాద్రిపై ఉన్న ఆనంద నిలయంలోకి శ్రీ మహావిష్ణువు ప్రవేశించగా, ఆ మహత్తర ఘట్టాన్ని స్మరించుకునే నిమిత్తం బ్రహ్మదేవుడు సత్యలోకం నుండి దిగి వచ్చి తొమ్మిది రోజుల పాటు స్వామివారికి కైంకర్యాన్ని నిర్వహించాడు. అదే “బ్రహ్మోత్సవం” అన్న పేరుతో ప్రసిద్ధమైంది.

 

2. బ్రహ్మోత్సవం – వ్యాకరణం విశేషాలు

బ్రహ్మ + ఉత్సవం అనే రెండు పదాలను గుణసంధి ద్వారా సంధానం చేస్తే “బ్రహ్మోత్సవ” అన్న పదం ఏర్పడింది. 

అఘటనఘటనా సమర్థుడైన ఆ పరబ్రహ్మ అనంత గుణాలను లేశమాత్రంగానైనా వివరించే ఉత్సవమే బ్రహ్మోత్సవం.

ఈ “బ్రహ్మోత్సవ” పదాన్ని వివిధ విభక్తులను వాడి వివిధాలైన అర్థాలను సాధించవచ్చు. 

1.బ్రహ్మ గురించి జరుగు ఉత్సవము బ్రహ్మోత్సవము (ద్వితీయా విభక్తి
2.బ్రహ్మ చేత జరుగు ఉత్సవము బ్రహ్మోత్సవము (తృతీయా)
3.బ్రహ్మ కొరకు జరుగు ఉత్సవము బ్రహ్మోత్సవము (చతుర్ధీ)
4.బ్రహ్మ వలన జరుగు ఉత్సవము బ్రహ్మోత్సవము (పంచమీ)
5.బ్రహ్మ యొక్క ఉత్సవము బ్రహ్మోత్సవము (షష్ఠీ)
6.బ్రహ్మ నందు జరుగు ఉత్సవము బ్రహ్మోత్సవము (సప్తమీ)
 
పరమాత్ముని బొజ్జలో ఇమిడిన ఈ బ్రహ్మాండంలో అతని సంకల్పం వలన అతనికై అతని కుమారుని చేత జరపబడుతున్న ఈ బ్రహ్మోత్సవం మహత్తరమైనది.

3. పురాణాలు, ఇతర సాహిత్యంలో బ్రహ్మోత్సవాలు

•పద్దెనిమిది పురాణాల్లో పన్నెండు పురాణాల్లో వేంకటేశ్వర మహాత్మ్యం వర్ణించబడింది.
•పద్మ పురాణంలో కన్యామాసం, శ్రవణ నక్షత్రంలో వేంకటాద్రి మీద నారాయణుడు వెలసినట్టు ఉల్లేఖన ఉంది.
•వరాహ పురాణంలో బ్రహ్మోత్సవాల యొక్క ప్రస్తావన కనబడుతుంది.
•ఆ తర్వాత అనేక ప్రాచీన కావ్యాలలోనూ, భక్తులు చేసిన స్తోత్రాలలోనూ బ్రహ్మోత్సవాల ఉల్లేఖనలు ఉన్నాయి.

4. చరిత్రలో బ్రహ్మోత్సవం

తిరుమల బ్రహ్మోత్సవాల గురించి అందుబాటులో ఉన్న అత్యంత ప్రాచీన శాసనం 10వ శతాబ్దంకు చెందినది.

పల్లవ రాణి ’సమవాయ్’ భోగా శ్రీనివాసుని విగ్రహాన్ని దేవాయలయానికి సమర్పించి సంవత్సరానికి రెండు బ్రహ్మోత్సవాలు జరపించాలని కోరినట్టుగా దాఖలాలు ఉన్నాయి.

చోళ, గండగోపాల, యాదవరాయ, శంభువరియన్ మొదలైన రాజవంశాలు బ్రహ్మోత్సవాలకు విరివిగా దానాలు చేసినట్టు శాసనాలు దొరికాయి. (డా. ఎన్. రమేశన్ గారి The Tirumala Temple గ్రంథం).

 

5. వాహనాలు – ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

 

1. పెద్ద & చిన్న శేష వాహనం:

పెద్ద శేష వాహనం

 

చిన్న శేష వాహనం

 

శేష అంటే మిగిలినది అని అర్థం. కర్మశేషం వల్లనే ఆత్మ అనేక జన్మలు ఎత్తుతుంది. ఆదిశేషుడు రామావతారంలో తమ్ముడిగాను (లక్ష్మణుడు), కృష్ణావతారంలో అన్నగాను (బలరాముడు) అవతరించాడు. జీవి కూడా ఒకోసారి భక్తితోను, మరికొన్ని సార్లు విస్మృతితోను భగవంతుణ్ణి కొలుస్తాడు. ఈ హెచ్చుతగ్గుల శేషం పోయి నిశ్శేషమైన, అమలిన భక్తిని పొందిననాడే ముక్తి అని శేషవాహనం చెబుతోంది.

 

2. హంస వాహనం:

హంస వాహనం

హంస పాలను, నీళ్ళను వేరు చేయగల శక్తి కలిగినదని చెబుతారు.

అదే రకంగా మంచి చెడ్డలను వేరు చేయగల శక్తి ఉన్నవాడే యోగి. అందుకే సన్యాసాన్ని పరమహంస పరివ్రాజకత్వం అని పేర్కొన్నారు.

హంస తన వయ్యారి నడకతో అనేక సూక్ష్మజీవుల్ని చంపుతుంది. ఆవిధంగా హింసించే గుణాన్ని కూడా ’హంస’ అంటారు. జీవి కూడా తన జీవిక కోసం ఇతర జీవుల్ని హింసిస్తూ ఉంటుంది. ఈ అనవసర హింసా గుణాన్ని విడనాడాలని హంస వాహనం సూచిస్తోంది.

నారాయణుడిని కూడా ’హంస’ అన్న పేరుతో పిలుస్తారు. తన జ్ఞానోపదేశం ద్వారా సంసార దుఃఖాల్ని నాశనం చేస్తాడు గనుక భగవంతుణ్ణి హంస అని పిలిచారు. జ్ఞానము విద్య వల్లనే లభిస్తుందని చెప్పడానికి శ్రీనివాసుడు సరస్వతీ అలంకారంలో అలరిస్తాడు.

 

3. సింహ వాహనం:

సింహ వాహనం

హింసించే జీవిని సింహం అన్నారు. ఓ విచిత్రమైన అలవాటు కలిగిన మృగం సింహం. అది కొంతదూరం నడిచాక వెనుదిరిగి వచ్చిన దారిని చూసుకొంటుంది. దీన్నే సింహావలోకనం అంటారు. జీవి కూడా తను నడిచి సాగుతున్న జీవనమార్గాన్ని ఎప్పటికప్పుడూ సరిచూసుకోవాలన్న సందేశం సింహ వాహనంలో ఇమిడివుంది.

నారాయణుడు నరసింహావతారాన్ని ప్రహ్లాదుడి కోసం ధరించాడు.

 

4. ముత్యాల పందిరి:

ముత్యాల పందిరి వాహనం

ముత్యం (శుక్తి) స్వచ్ఛతకు, రాజసానికి ప్రతీక.

ముత్యాలు సముద్రం అడుగులో దొరుకుతుంది. అలానే తత్వరహస్యాలనే ముత్యాలను సంసారమనే సముద్రంలోనే ఏరుకోవాలి జీవులు.

 

5. కల్పవృక్ష వాహనం:

కల్పవృక్ష వాహనం

కోరిన కోర్కెలను తీర్చే దేవతా వృక్షాన్ని ’కల్పవృక్షం’ అని పేర్కొన్నారు.

ఐతే ఈ చెట్టు మోక్షాన్ని ఇవ్వలేదు. కానీ వేంకటేశ్వర స్వామి అన్ని కోర్కెలతో బాటూ మోక్షాన్ని కూడా ఇస్తాడు.

 

6. సర్వ భూపాల వాహనం:

సర్వభూపాల వాహనం

భూమిని పాలించే రాజును భూపాల అంటారు. ఐతే వారికి ఆ భూమిని ప్రసాదించినవాడు వరాహ స్వామి. అతడే వేంకటేశుడు. కనుక సర్వ భూపాలురకూ పాలకుడు అతడే. “న విష్ణుః పృథ్వీపతి” అని ఇందుకే అంటారు. రామ, కృష్ణావతారాల్లో ప్రజారంజకమైన, సర్వలోక క్షేమకరమైన పాలనా విధానాలను ప్రదర్శించి నేటి పాలకులకు ఆదర్శవంతుడై నిలచాడు ఆ పరంధాముడు.

 

7. మోహిని అవతారం:

మోహిని అవతారం

దేవతలకు, దానవులకు అమృతాన్ని పంచిన రూపం. పరమ శివుడిని కూడా మోహంలోకి లాగివేసిన లావణ్య రూపం. మోహాన్ని జయిస్తే మోక్షమనే అమృతం దొరుకుతుందని మోహినీ రూపంలోని సందేశ విశేషం.

 

8. గరుడ వాహనం:

గరుడ వాహనం

గరుత్ అంటే ప్రయాణించేవాడని అర్థం. అందువల్లనే గరుత్మంతుడు నారాయణుని వాహనమయ్యాడు.

 

గరుడుడు తన రెండు రెక్కల్నీ విదిలిస్తే వేదనాదం పుడుతుంది. అందుకనే అతన్ని ’సుపర్ణ’ అని పిలిచింది వేదం.

 

గీతలో “వైనతేయశ్చ పక్షిణాం” అని చెబుతూ గరుత్మంతునిలో తన విభూతి రూపం ఉందని పేర్కొన్నాడు కృష్ణుడు.

 

9. హనుమంత వాహనం:

 

“హను” అంటే జ్ఞానం అని అర్థం. ధనం ఉన్నవాడు ధనవంతుడైనట్టు, గుణం ఉన్నవాడు గుణవంతుడైనట్టు విశేష జ్ఞానమున్నవాడు హనుమంతుడు.

రామావతారంలో హనుమగా, కృష్ణావతారంలో భీమునిగా సేవ చేసిన హనుమంతుడు భావి బ్రహ్మగా కీర్తించబడ్డాడు.

దాసభావంలో ఉన్న గొప్పదనం ఒక “సుందరకాండ”మని చెప్పడమే హనుమ వాహనపు ఉద్దేశం.

 

10. గజ వాహనం:

గజ వాహనం

’గజ’ అంటే మదం అని అర్థం. మదించిన ఏనుగు చాలా ప్రమాదకరం.

ఏనుగు నీళ్ళలో స్నానం చేసినా వెంటనే మట్టిని మీద చల్లుకుంటుంది. ఆ విధంగా వ్యర్థప్రయత్నం చేయడాన్ని ’గజస్నానం’ అన్న పోలికతో చెబుతారు. అలాగాక మదాన్ని దమనం జేసి, వ్యర్థప్రయత్నాలకు స్వస్తి జెప్పి ముముక్షుత్వం వైపుకు దృష్టి పెట్టాలని గజవాహనం చెబుతోంది.

 

11. సూర్యప్రభ వాహనం:

సూర్యప్రభ వాహనం

లోకంలో కర్మల్ని ప్రేరేపించడం వల్ల ’సూర్య’ అని పిలువబడుతున్నాడు. జీవి చేసే కర్మలు అతని లోపల ఒదగివుండే “సాక్షి” చేసే విశ్లేషణలకు లోనవుతూ ఉంటాయి. “సాక్షి” అనుమతి పొందినవి సత్కర్మలు, పొందలేనివి దుష్కర్మలు. ఈ “సాక్షి” ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుని దివ్యరూపమే. ఆ అవ్యక్త రూపానికి ప్రత్యక్ష రూపమే కర్మసాక్షి ఐన సూర్యభగవానుడు.

ఒకటే గుర్రం, ఒక్క చక్రం, వికలాంగుడైన సారథి – ఇన్ని అడ్డంకులు ఉన్నా ఒక్కరోజు కూడా తన ప్రయాణాన్ని ఆపని వాడు.

సూర్యనారాయణ అన్న పేరుతో పిలువబడే శ్రీమన్నారాయణుడే రాముడిగా సూర్యవంశంలో ప్రభవించాడు.

 

12. చంద్రప్రభ వాహనం:

చంద్రప్రభ వాహనం

ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు గనుక ’చంద్ర’ అని పిలిచారు.

కృష్ణుడు చంద్రవంశంలో ప్రభవించాడు. కానీ సూర్యవంశంలో పుట్టిన రాముణ్ణి ’రామచంద్ర’ అని పిలుస్తారు.

జ్యోతిష్యంలో చంద్రుడు మనస్సును సూచిస్తాడు.

 

13. రథోత్సవం:

తిరుమల రథోత్సవం

రథ అంటే విహరించేది (వాహనం) అని అర్థం.

మానవ దేహాన్ని కూడా రథమని పిలుస్తారు. (శరీరం రథినం విద్ధి)

 

“రథంలో ఉన్న కేశవుణ్ణి చూస్తే పునర్జన్మ ఉండదు”

 

14. అశ్వ వాహనం:

అశ్వ వాహనం

అశ్వ అంటే వ్యాపించేది అని అర్థం. తన వేగంతో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం వల్ల గుర్రాన్ని ’అశ్వ’ అని పిలిచారు.

మానవుని మనస్సు కూడా వేగంగా వెళ్ళగలిగే స్వభావం ఉంది గనుక దాన్ని గుర్రంతో పోల్చారు.

దేవతలకు “హయగ్రీవుడు” జ్ఞానోపదేశం చేస్తాడు.

 

15. చక్రస్నానం:

చక్ర స్నానం

తృప్తిని కలిగించేదాన్ని ’చక్ర’ అని అంటారు.

శ్రీమన్నారాయణుడు అనేకమంది రాక్షసుల్ని చంపి దేవతలకు తృప్తి కలిగించింది ఈ చక్రాయుధంతోనే.

మానవదేహంలో ఆరుచక్రాలు ఉన్నాయి.

చక్రం మనస్తత్వానికి ప్రతీక. గద బుద్ధి తత్త్వానికి ప్రతీక.

@@@@@

ఈవిధంగా తొమ్మిది రోజులలో పదునాల్గు వాహనాలపై విహరిస్తూ అనేక రీతులలో జ్ఞానబోధను, హితోపదేశాన్ని, మనోవిజ్ఞానాన్ని పంచుతాడు మన కలియుగప్రత్యక్షదైవం. ఇలా అనుసంధాన దృష్టితో బ్రహ్మోత్సవాలను వీక్షించేవారికి “యంతరంగముననుండే అరచేతి దైవము” ఆ శ్రీనివాసుడు. మరే దైవమూ ఈ భువిపై ఇంతటి వైభవంతో, మరింతటి విజ్ఞానాన్ని పంచడం లేదు గనుకనే “వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్న పెను కీర్తికి పేరయ్యాడు.

||నమో వేంకటేశాయ||

@@@@@

Comments posted at the time of publishing the article:

#2 సుపర్ణ — kadambari piduri 2014-11-14 23:19

గరుత్ అంటే ప్రయాణించేవాడని అర్థం. అందువల్లనే గరుత్మంతుడు నారాయణుని వాహనమయ్యాడు.

గరుడుడు తన రెండు రెక్కల్నీ విదిలిస్తే వేదనాదం పుడుతుంది. అందుకనే అతన్ని ’సుపర్ణ’ అని పిలిచింది వేదం.

పాఠకులకు బోధపడే విధంగా మీరు ఇచ్చిన నిర్వచనములు బాగున్నవి. ధన్యవాదాలు.

 

#1 తిరుమల బ్రహ్మోత్సవం – అంతరార్థం — IVNS 2014-10-03 07:35

//లోకంలో కర్మల్ని ప్రేరేపించడం వల్ల ’సూర్య’ అని పిలువబడుతున్నాడ ు. జీవి చేసే కర్మలు అతని లోపల ఒదగివుండే “సాక్షి” చేసే విశ్లేషణలకు లోనవుతూ ఉంటాయి. “సాక్షి” అనుమతి పొందినవి సత్కర్మలు, పొందలేనివి దుష్కర్మలు. ఈ “సాక్షి” ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుని దివ్యరూపమే. ఆ అవ్యక్త రూపానికి ప్రత్యక్ష రూపమే కర్మసాక్షి ఐన సూర్యభగవానుడు./ /

మధ్వులు చెప్పిన బృహత్తరమైన ప్రత్యక్ష ప్రమాణం “సాక్షి” చాల చక్కని అన్వయం చేసారు గోపీనాథ గారు. అద్భుతం

//ముత్యాలు సముద్రం అడుగులో దొరుకుతుంది. అలానే తత్వరహస్యాలనే ముత్యాలను సంసారమనే సముద్రంలోనే ఏరుకోవాలి జీవులు.//

జగం మిథ్య అనే మిథ్యా వాదులకు ఇది కొన్నిపుటల వివరణ తో కూడిన సమాధానం తో సమానం. ఇది కాదని “అది” సాధించలేము !!

//ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు గనుక ’చంద్ర’ అని పిలిచారు. కృష్ణుడు చంద్రవంశంలో ప్రభవించాడు. కానీ సూర్యవంశంలో పుట్టిన రాముణ్ణి ’రామచంద్ర’ అని పిలుస్తారు. జ్యోతిష్యంలో చంద్రుడు మనస్సును సూచిస్తాడు.//

చాల పురాణాలు చాల మంది చెప్పగా విన్నాను రామ చంద్రుని ఎందుకు చంద్రుని తో పోల్చి చెబుతారో ఇప్పుడు అవగతమైంది. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం.

//తృప్తిని కలిగించేదాన్ని ’చక్ర’ అని అంటారు. శ్రీమన్నారాయణుడ ు అనేకమంది రాక్షసుల్ని చంపి దేవతలకు తృప్తి కలిగించింది ఈ చక్రాయుధంతోనే. మానవదేహంలో ఆరుచక్రాలు ఉన్నాయి.
చక్రం మనస్తత్వానికి ప్రతీక. గద బుద్ధి తత్త్వానికి ప్రతీక.//

చక్ర స్నానం చూపడం వరకే తమ విధి గా svbc వారు భావిస్తున్న ఈ రోజుల్లో మీరు అందించిన తాత్పర్యం బహుదా శ్లాఘనీయం.

//ఈవిధంగా తొమ్మిది రోజులలో పదునాల్గు వాహనాలపై విహరిస్తూ అనేక రీతులలో జ్ఞానబోధను, హితోపదేశాన్ని, మనోవిజ్ఞానాన్ని పంచుతాడు మన కలియుగప్రత్యక్ష దైవం. ఇలా అనుసంధాన దృష్టితో బ్రహ్మోత్సవాలను వీక్షించేవారికి “యంతరంగముననుండే అరచేతి దైవము” ఆ శ్రీనివాసుడు. మరే దైవమూ ఈ భువిపై ఇంతటి వైభవంతో, మరింతటి విజ్ఞానాన్ని పంచడం లేదు గనుకనే “వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్న పెను కీర్తికి పేరయ్యాడు.//

ఇలా మీరు వ్రాసిందే మరల వ్రాసి పరమానందాన్ని పొందాను చివరన మీరు ఇచ్చిన ఫలస్తుతి ఇంకా పరమానందాన్ని కలిగించింది.

svbc వారికి మీ సేవలు అత్యవసరం.