భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వేంకటేశ మాహాత్మ్యము లేక శ్రీనివాస కళ్యాణములో “అంజనాచల” ప్రసక్తి వస్తుంది. తన కూతురైన సీతకును, తన సోదరుని కుమార్తెలైన ముగ్గురు సోదరిలకు వివాహమెలా చేయడమని చింతాక్రాంతుడైన జనక మహారాజుకు “శ్రీనివాస కళ్యాణ” శ్రవణముతో ఆ కష్టం పరిహారమౌతుందని జనకుని గురువైన శతానందుడు చెబుతాడు. అందులో భాగంగా ’అంజనాచల’ ప్రశస్తి వస్తుంది. వేంకటాచల మాహాత్మ్యాన్ని వివరిస్తూ “అంజనాచల నామనిష్పత్తి” అన్న భాగంలో హనుమంతుని అవతార వర్ణన చేస్తారు వేదవ్యాసులు.
వేంకటగిరిని కృతయుగంలో ’వృషభాచలం” అని, త్రేతాయుగంలో ’అంజనాచలం” అని, ద్వాపరంలో ’శేషాచలం’అని, కలియుగంలో ’వేంకటాచలం’ అని పిలుస్తారు. త్రేతాయుగంలో కేసరి అనే కపిశ్రేష్టుని పత్నియైన అంజనాదేవి పిల్లలు లేని “అనపత్య దోషం”లో దుఃఖిస్తూ పంపా సరోవరం (నేటి హంపి) వద్దగల మాతంగ ఋషి ఆశ్రమానికి వచ్చి ఆ ఋషికి ఆశ్రయిస్తుంది. అప్పుడు మాతంగ ముని “పంపా సరోవరానికి తూర్పుగా ఐదువందల యోజనాల దూరంలో అహోబిల నృసింహ క్షేత్రమున్నది. దానికి దక్షిణాన నారాయణగిరి కలదు. ఆ పర్వతంలో ఉత్తరదిక్కున పవిత్రమైన స్వామి పుష్కరిణి కలదు. దానికి రెండున్నర మైళ్ల దూరంలో ఆకాశగంగ అనే విఖ్యాతమైన తీర్థమున్నది. ఆ తీర్థంలో పన్నెండు సంవత్సరాలు తపస్సును ఆచరించు. ఆ తపఃఫలంగా ఉత్తమమైన గుణాలతో కూడిన పుత్రుడు కలుగుతాడు” అని ఉపదేశిస్తాడు.
ఆవిధంగా తిరుమల పుణ్యక్షేత్రంలో గల ఆకాశగంగ పవిత్ర తీర్థ సన్నిధిలో భర్త అనుమతి తీసుకొని పన్నెండు సంవత్సరాల పాటు బాహ్యభోగాలనన్నింటినీ విడిచిపెట్టి, ఉపవాస దీక్షతో అంజనాదేవి కఠోర తపస్సు చేసింది. ఆ తపోకాలంలో ఆవిడ దేహం కాలిన కర్రవలే గోచరించేది. ఆవిడ దీక్షను మెచ్చిన వాయుదేవుడు ప్రతిరోజూ ఆవిడ ముందునున్న వృక్షం నుంచి ఒక ఫలాన్ని రాల్చేవాడు. దేవతాదత్తమైన ఆ ఒక్క పండుని తిని మళ్ళీ తపస్సు చేసేది. ఆవిధంగా పన్నెండు సంవత్సరాల దీక్ష తరువాత అంజనాదేవి గర్భవతియైనది. వాయుదేవుడే ఆవిడ గర్భజాతుడై అవతరించనున్నాడని దివ్యదృష్టిరో గ్రహించిన మునులు సంతోషభరితులైనారు. పదిమాసముల నంతరము అంజనాదేవి ఉత్తమ లక్షణాలతో కూడిన శిశువుకు జన్మనిచ్చినది. తేజోరాశిలానున్న ఆ బిడ్డడు మహాజ్ఞానియని తెలుసుకున్న మునులు “హనూమంత మిమం ప్రాహుః మునయో వీతకల్మషాః” – “ఇతడు జ్ఞానులలో శ్రేష్టుడు గనుక ’హనుమంతుడు” అని లోకములో ఖ్యాతిని పొందుగాక” అని ఆశీర్వదించారు. అప్పటి నుండి ఆ నారాయణగిరిని అంజనాచలమని పిలువసాగారు.
ఇంద్రుడు వజ్రాయుధంతో దవడపై కొట్టడంతో ’వాచిన దవడ’ కలిగిన వాడవడం వల్ల హనుమంతుడని పిలవబడ్డాడన్న అపభ్రంశపు కథ ఒకటి ప్రబలంగా వినబడుతుంది. కానీ పైన పేర్కొన్న భవిష్యోత్తర పురాణం మేరకు జ్ఞానశ్రేష్టుడనే అర్థంలో “హనుమంత” పదం వచ్చిందని తేటతెల్లమౌతున్నది. ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడంతో కోపము వచ్చిన వాయుదేవుడు వాయుసంచారాన్ని స్థంభింపజేయడం, లోకాలన్నీ గగ్గోలెత్తిపొవడం, బ్రహ్మ వచ్చి బాల హనుమని మూర్చ తేర్చడం వంటి కల్పితార్థ కథలు తెలుగు సినిమాల్లోనూ, నాటకాల్లోనూ, హరికథల్లోనూ ఉటకించేస్తుంటారు. వాయుదేవుడంటే ’గాలి దేవుడు’ అన్న అపోహ దీనికి కారణంగా కనబడుతున్నది.
మనల్ని తాకుతూ, మన చుట్టూ ఆవరించుకుని ఉన్న వాయువును “ప్రవాహ వాయు” అంటారు. వాయువ్య దిక్కుకు అభిమాని కావడం చేత అతన్నే “కోణ వాయు” అని కూడా పిలుస్తారు. కానీ ఆంజనేయుడు ఈ ప్రవాహ (లేక)కోణ వాయువు వల్ల జనించిన వాడు కాడు. ప్రవాహ వాయువు కంటే ఉత్తముడు, గుణాధికుడైన ’ముఖ్యవాయువు’ యొక్క ప్రత్యక్షావతారమే అతను. ఈ ముఖ్యవాయువు యొక్క ప్రశస్తి ఋగ్వేదంలో గల “బళిత్థా సూక్తము”లోనూ, “ముఖ్యప్రాణోపనిషత్తు” అనే ఉపనిషత్తులోనూ వస్తుంది. ఈ వేదోపనిషత్తులు ముఖ్యవాయువును జగద్గురువుగా కీర్తిస్తున్నాయి. అలానే “వాయునా జగదాయునా” (ఆనంద రామాయణం), “వాయుం స్వగురుం జగతాం గురుం” (ఆదిత్య పురాణం) వంటి పురాణ వాక్యాలు కూడా అతన్ని దేవతలకే గాక మనుష్యులకు కూడా పరమ ముఖ్య గురువుగా వర్ణిస్తున్నాయి. ఈ విశేషణాలన్నీ ’ముఖ్యవాయువు”కు చెందినవే గానీ “ప్రవాహ వాయువు”కు చెందినవి కావు. అందువలన ఆంజనేయుడు ముఖ్యవాయువు ధరించిన అవతారమని తెలుసుకోవడం సాధకులకు అత్యవసరం.
అపచారపూర్వకాలైన కథల్ని ఎవరు ప్రచారంలోకి తెచ్చినా వారికి స్థిరమైన పురాణ జ్ఞానం లేదన్నది స్పష్టమౌతోంది. భక్తులు వీలైనంతవరకూ ఇలాంటి కథలకు ప్రాముఖ్యతనివ్వడం తగ్గించాలి. దేవతల కథలను వ్యత్యస్తంగా తెలుసుకోవడము వారిని దూషించడంలాంటిదేనని గ్రహించాలి.
వక్త్రాంభోరుహ సక్త హస్త కమలం భక్తం భటాగ్రేసరమ్|
ఏకాంతే హనుమంత ముక్తి సుధయా సంతర్పయన్ సంతతం
రామః స్తంభిత వారిధిర్విజయతే ధానుష్క చూడామణిః||
(శ్రీ వాదిరాజ తీర్థ విరచిత “తీర్థ ప్రబంధ” శాస్త్ర కావ్యంలోని రామసేతు వర్ణన నుండి గ్రహించినది)
అర్థము: ఇరుప్రక్కలా సీతా లక్ష్మణులతో కూడి శోభిస్తూ, భక్తితో ఒదిగిపోయిన శరీరము కలవాడూ, కరకమలంను ముఖకమలానికి దగ్గరగా ఉంచుకున్నావాడు, భక్తుడూ, శ్రేష్టమైన భృత్యుడూ అయిన హనుమంతుని మాటలు అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ సంతోషపడుతున్నవాడు, సముద్రాన్ని స్థంభింపజేసినవాడై, ధనుర్ధారులలో అగ్రగణ్యుడైన శ్రీరాముడు సర్వోత్కృష్టుడై ఉన్నాడు.
పై శ్లోకంలో హనుమంతుని శ్రీరాముని పట్ల గల భక్తిప్రపత్తులు బహు చక్కగా చిత్రితమైనవి. భక్తితో ఒంగిపోయిన శరీరము, నోటికి అడ్డుగా చేయిని ఉంచుకునివున్న హనుమంతుని రూపాన్ని స్మరిస్తే చాలు పెద్దల వద్ద పిన్నలు ఉండవలసిన తీరు బొధపడుతుంది. పిన్నల నోటి ఎంగిలి పెద్దల పై పొరబాటుగా పడినా అది పాప సంగ్రహానికి దారితీస్తుంది. పెద్దల ఎంగిలి ఉద్దేశ్యపూర్వకంగా పన్నలపై పడినా అది ఆశీర్వాదరూపంగా మారుతుంది. అందువల్లనే పూర్వీకులు పెద్దలతో మాట్లాడవలసి వస్తే కుడిచేతిని తమ నోటికి అడ్డుగా ఉంచుకుని మాట్లాడేవారు. ఈ ధర్మసూక్ష్మాన్ని సూచించే విధంగా నోటికి చేతిని తన నోటికి అడ్డుగా పెట్టుకున్నాడు మారుతి. (తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన 2011 ఆంగ్ల సంవత్సరపు పంచవన్నెల క్యాలెండరులో (మే నెల) ఈరూపంలో ఉన్న హనుమంతుని విగ్రహపు ఫోటొ ఉన్నది.)
భక్తులెందరో తనను దేవునిగా భావించి పూజిస్తున్నప్పటికినీ సర్వోత్తముడైన శ్రీరాముని పాదకమల మధుపానాసక్త భృంగమువోలే తలవాల్చి కూర్చున్న హనుమంతుడు మనకు జ్ఞాన, భక్తి, వైరాగ్య, వినమ్రతల నిచ్చి కాపాడుగాక!