ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వేంకటేశ్వర (విన్నప) గద్యము

Like-o-Meter
[Total: 0 Average: 0]

చాణూర మర్ధన! మిమ్ము పేర్కొని పిలిచి మా యింటి లోపల పీటపై పెట్టి ఆవాహనంబు జేసి పూజించుచున్న వాడను. అది ఎట్లన్నచో, సముద్రునికి అర్ఘ్య పాద్య ఆచమనీయంబులు ఇచ్చినయట్లు, మేరుపర్వతమునకు భూషణంబు పెట్టినయట్లు, మలయాచలంబునకు గంధంబు సమర్పించినయట్లు, సూర్యునికి దీపారాధనంబు జేసినయట్లు, అమృతప్రదుండవైన మీకు ఈ నైవేధ్యంబు జేసినయట్లు, తొల్లి మత్స్యావతారమందు సత్యవ్రతుండనే రాజు మిమ్ము తోడుకొని వచ్చి మీరూపంబు దర్శింపడే, కృష్ణావతారమై యుండెడి వేళ కుబ్జ గంధంబొసగి సౌందర్యంబు బొందదే, మాలాకారుడు పూలదండల చేలు మన్నన బడయడే, విదురుడు విందుబెట్టి వెలయడే. ఇది జూచి మాకు పూజింప సిగ్గగుచున్నది. నీవు భక్త సులభుండవు గనుక, మేమేపాటి ఆరాధించిన ఆపాటి చేకొని రక్షింపవే శ్రీ వేంకటేశ్వరా!!

(మూల రచయిత పేరు తెలియదు)