ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

విశేషం గురురుత్తమః

Like-o-Meter
[Total: 7 Average: 5]

 

గురు అన్న పదానికి “గృణాతి ఉపదిశతి” అన్న అర్థాన్ని చెప్పారు పెద్దలు. గృ అనగా శబ్దము. జ్ఞానము శబ్దరూపములో ఉంటుంది.  అది ఉపదేశ రూపములో లభిస్తుంది. అలా శబ్దమును ఆధారముగా చేసుకొని  ఉపదేశాదుల ద్వారా జ్ఞానబోధను చేసేవారిని “గురు”వులని  గుర్తిస్తోంది శాస్త్రము.

శబ్దమునకు లిపి మరియు అర్థము అని రెండు ముఖాలు ఉన్నాయి. అర్థమును మళ్ళీ మూడు విభాగములుగా పేర్కొన్నారు పెద్దలు. అవి (అ) అముఖ్యార్థము (ఆ) ముఖ్యార్థము (ఇ) పరమ ముఖ్యార్థము. లిపి ద్వారా అముఖ్యార్థము మాత్రమే బోధపడుతుంది. కానీ అది మానవ జీవన లక్ష్యము కాదు. పరమ ముఖ్యార్థ సాధనమే అసలైన లక్ష్యము. ఆ పరమ ముఖ్యార్థములో మాత్రమే తత్వం దొరుకుతుంది. ఆ తత్వము వల్లనే మోక్షము ప్రాప్తిస్తుంది. అయితే అముఖ్యార్థాన్ని దాటి మిగిలిన రెండు అర్థాలను సాధించడం స్వప్రయత్నంతో సాధ్యపడదు. అందుకు గురువు యొక్క ఉపదేశం అవసరమవుతుంది.

అలా ఎందుకు అవసరం? అని ప్రశ్నించే వారికి శాస్త్రమే సమాధానమిస్తోంది.

 

మతి శ్రుతి ధ్యాన కాల విశేషం గురురుత్తమః

వేత్తి తస్యోక్తి మార్గేణ కుర్వతః స్యాద్ది దర్శనమ్

 

ఉత్తమమైన గురువు శ్రవణము మొదలైన నవ విధ భక్తి మార్గాల గురించి స్పష్టమైన అవగాహనను కలిగివుంటారు. శ్రుతులను చక్కగా అధ్యయనం చేసివుంటారు. ముఖ్యంగా కాలము గురించి లోతుగా తెలిసికొనివుంటారు. కనుక అన్ని విధాలుగా యోగ్యులైన గురువుల వద్ద ఉపదేశాన్ని పొందడం ద్వారా శబ్దాలకు ఉన్న అముఖ్యార్థాలను దాటి ముఖ్యార్థ, పరమ ముఖ్యార్థాలను తెలుసుకునే వీలు కలుతుంది. కనుకనే, గురూపదేశం వల్లనే తత్వం బోధపడుతుందని మన ప్రాచీనులు వివరించారు.

“గురూపదేశో బలవాన్ న తస్మాద్బలవత్తరమ్” – అనగా గురువు చేసే ఉపదేశమే నిజమైన బలము. ఇతరములన్నీ బలహీనములే అని అర్థం. కనుక స్వాధ్యాయము చేయడానికి పూనుకోవడానికి మునుపు తగినంత కాలము గురువు సాన్నిధ్యములో ఉండి, వారి ద్వారా శబ్దార్థాల సమన్వయ ప్రక్రియను తెలుసుకోవాలి. అలా కాక స్వయంప్రకటిత మేధావి వలే శాస్త్రాభ్యాసము చేస్తే అది ఆభాసము గానే మిగలగలదు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
“మహత్సేవాం ద్వారమాహుః” అని చెప్పడం ద్వారా పురాణరాజమయిన భాగవతం కూడా గురువుల వైశిష్ట్యాన్ని చాటుతోంది. “గురువు లేని విద్య గుడ్డెద్దు రీతిరా” అని వేమన్న పరిహసించాడు. “ఎందరో మహానుభావులు అందరికీ వందనము”లని త్యాగయ్య తన కంటే విద్యలోను, వయసులోను, వరుసలోను, సాధనలోను పెద్దలయిన వారిని  గురుతుల్యులుగా భావించి నమస్కరించారు.

ఈనాటి సామాజిక పరిస్థితుల్లో గురుపౌర్ణిమ ఆచరణ ఎంతైనా అవసరం. తల్లిదండ్రులు తమ కంటే పెద్దలను, పూజ్యులను ఈరోజు గౌరవించగలిగితే పిల్లలకు కూడా పెద్దల ఘనత తెలిసివస్తుంది. నేటి కాలపు పోకడల మేరకు లౌకిక పాఠాలను చెప్పే గురువులు విదూషకులుగాను, వేదవిద్యను నేర్పే గురువులు ఛాందసులు, మట్టిబుర్రలుగాను చిత్రీకరించడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విపరీత భావనలు పోయి, సద్విద్యాప్రదాయకాలైన సత్ప్రవర్తన కలగడానికి గురుపౌర్ణిమ, గురుపూజా ఎంతగానో తోడ్పడతాయి.

“ఉపాధ్యాయః పితా జ్యేష్ఠభ్రాతా చైవ మహీపతిః 

మాతులః శ్వశురస్త్రాతా మాతామహ పితామహౌ 

వర్ణజ్యేష్ఠః పిత్రువ్యశ్చ పుంస్యేతే గురవః స్మృతాః”

భావము: ఉపాధ్యాయుడు, తండ్రి, పెద్ద అన్న, రాజు, మేనమాన, పిల్లనిచ్చిన మామ, మనల్ని కాపాడినవారు, తల్లితండ్రి, తండ్రి తండ్రి, వర్ణజ్యేష్ఠులు – వీరు గురువులు.” అని శాస్త్రము గురుస్థానాపన్నులని చెబుతోంది.

కనుక ఈరోజున శాస్త్రము పేర్కొన్నట్టుగా ధార్మికులైన తల్లిదండ్రులు పైవారిని ప్రత్యక్షంగా గౌరవించడం ద్వారా పిల్లలకు సత్సంప్రదాయాన్ని నేర్పాలి అని కోరుకుంటున్నాను.

“తస్మై శ్రీగురవే నమః”

@ @ @ @ @