ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

హంపీ లో దీపావళి ఉత్సవాలు – చారిత్రిక విశేషాలు

Like-o-Meter
[Total: 1 Average: 4]

హంపీలో దీపావళి ఉత్సవాలు – చారిత్రిక విశేషాలు


ఉపోద్ఘాతం:

సనాతన హిందూ సంప్రదాయంలో పండుగలకు కొదవలేదు.

మూడున్నర శతాబ్దాల పాటు దక్షిణ భారతదేశాన్ని సుస్థిరం చేసిన విజయనగర సామ్రాజ్యంలో పండుగలకు కొదవ లేదు.

ఆ సామ్రాజ్య రాజధాని అయిన హంపీ మహాపట్టణంలో పండువ వైభవానికి అంతే లేదు.

సంవత్సరం పొడవునా ఉత్సవాలు. ఉత్సాహభరితమైన తిరుణాళ్ళే.

ఆనాటి భారతీయ రాజుల్లో అత్యంత బలిష్టులైనవాళ్ళల్లో విజయనగర చక్రవర్తులు ఒకరు.

వారికి సైనికశక్తి, ఆర్థికబలం, రాజ్యనిర్వహణా సామర్థ్యంతో బాటు ఆధ్యాత్మిక భావాలు కూడా ఎక్కువే.

అందుకనే హంపీ మహాపట్టణంలో నిత్యోత్సవమే. ఏ గడపకు చూసినా పచ్చతోరణమే.

రాజధానిలో జరిగే విశిష్టమైన పండుగల్లో మొట్టమొదటి స్థానం దసరాకు చెందుతుంది. రెండవ స్థానం దీపావళీదే.

ఈనాడు చిన్న, పెద్ద తేడా లేకుండా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే ఈ దీపావళీ పండుగను హంపీ పట్టణంలో రాజులు, ప్రజలు ఎలా జరుపుకునేవారో తెలుసుకుందాం.

హంపి దీపావళి ఉత్సవాలు వీడియోను అన్వేషి ఛానల్ లో చూడండి (ఈ లంకెను నొక్కండి)

*****

విజయనగర పాలకులు – పండుగలు – ఆధ్యాత్మిక, రాజకీయ కోణాలు:

 

హంపీ లో దీపావళి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో అంతఃపురంలో దీపాన్ని వెలిగిస్తున్న శ్రీకృష్ణదేవరాయలు

అమాయకుల్ని చెరబడుతున్న నరకాసురుణ్ణి సంహరించి, ధర్మసంస్థాపన చేసిన రోజుగా ఈ దీపావళి పండుగను హిందువులు వేళయేళ్ళుగా ఆచరిస్తున్నారు.

హంపి లో జరుగుతున్న దీపావళి ఉత్సవాలను చూస్తున్న విజయనగర ప్రజలుసత్యభామాదేవి నరకాసురుణ్ణి చంపింది సాయంత్రం వేళ కనుక ఆ సమయానికి దీపాలను వెలిగించడం ద్వారా అధర్మం పై ధర్మం విజయం సాధిస్తుందని ఈ పండుగ చాటుతుందని ప్రసిద్ధ చరిత్రకారుడు భాస్కర్ సాలెతోర్ తమ గ్రంథం The Social and Political Life in the Vijayanagara Empire లో చెప్పారు.

 

రాముడు రావణుడిని జయించిన దసరా పండుగను, సత్యాకృష్ణులు నరకుడిపై విజయాన్ని సాధించిన దీపావళి పండుగను విజయనగర పాలకులు విశేషంగా ఆచరించేవారు. రాజధాని హంపీలో ప్రత్యేకమైన కార్యక్రమాల్ని పెద్దఎత్తున నిర్వహించేవారు.

వీటిలో పాల్గొనడానికి దేశం నలుమూలలనుండి సామంతులు, సైన్యాధికారులతో బాటు ప్రజలు కూడా హంపీ పట్టణానికి వచ్చేవారు. ఈ పండుగల్ని భారీస్థాయిలో నిర్వహించడం ద్వారా తాము కూడా ధర్మబద్ధులమని ప్రజలకు చాటడం విజయనగర పాలకుల ఉద్దేశమని కొందరు చరిత్రకారులు వ్యాఖ్యానించారు.

*****

హంపిలో విదేశీ యాత్రికులు చూసిన  దీపావళీ ఉత్సవాలు

 

సంగమ వంశానికి చెందిన రెండవ దేవరాయలు పాలిస్తున్న సమయంలో ఇటలీ యాత్రికుడు నికోలో డె కాంటి విజయనగరానికి వచ్చాడు. సామాన్య శకం 1420లో అతను హంపీ పట్టణంలో ఉన్నాడు. ఆ సంవత్సరం జరిగిన దీపావళి వేడుకలను ప్రత్యక్షంగా చూసాడు. నికోలో కాంటి తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు:

“ఒకానొక పండుగరోజు ఈ పట్టణంలోని ప్రజలు తమ ఆలయాల్లోను, ఇంటి పైకప్పుల పైనా లెక్కలేనన్ని దీపాల్ని ఉంచుతారు. ఈ దీపాలను నువ్వుల నూనెతో వెలిగిస్తారు. ఈ దీపాలు రాత్రనక, పగలనక వెలుగుతూనే ఉంటాయి.”

కృష్ణదేవరాయల పాలనాకాలంలో హంపీకి వచ్చిన ఇటలీ యాత్రికుదు బార్బోసా, దీపావళి రాత్రి పట్టణ ప్రజలు బాణాసంచాను కాల్చారని చెప్పాడు.

కృష్ణదేవరాయల అన్న అయిన వీరనరసింహరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన లుడోవీకో వర్తెమా అనే విదేశీ యాత్రీకుడు విజయనగర ప్రజలు వివిధ రకాల బాణాసంచాలను తయారు చేయడంలో సిద్ధహస్తులని పేర్కొన్నాడు. అంతేకాదు వీరు తయారుచేసిన బాణాసంచా సుమాత్రా మొదలైన దక్షిణ ఆసియా ఖండపు ద్వీపాలకు ఎగుమతి అవుతుండేదని కూడా వర్తెమా చెప్పాడు.

*****

హంపీలో దీపావళి ఉత్సవాలు – వివరాలు:

 

దీపావళి పండుగకు కొద్దిరోజుల ముందుగానే అటు రాజమహళ్ళకు, ఇటు ప్రజల ఇళ్ళకు వెల్ల వేయడం జరిగేది. ఆలయాలు విశేషమైన అలంకరణలతో కనువిందు చేసేవి. రంగురంగుల వస్త్రాలను జెండాలుగా చేసి ఇళ్ళపైన, మహళ్ళపైన ఎగురవేసేవారు. మూడురోజుల పాటు జరిగే దీపావళి పండుగనాడు మహళ్ళు, ఆలయాలు, ఇళ్ళు పూల అలంకరణలతో కళకళలాడేవి.

పండుగ మూడునాళ్ళు హంపీ ప్రజలందరూ ఉదయాన్నే తుంగభద్రా నదికి పవిత్రస్నానానికని వెళ్ళేవారు. ఆ తర్వాత ఆలయాలను దర్శించుకునేవారు. మధ్యాహ్నం వేళకు పిండివంటలతో భోజనాలు చేసేవారు. ఆపై నగరంలో జరుగుతున్న రకరకాల వినోదాలను చూడ్డానికి వెళ్ళేవారు. ఈ వినోదాలలో సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనలు, గారడీ విద్యలతో పాటు కుస్తీ పోటీలు, ఎడ్లపందాలు మొదలైనవి ఉండేవి.

హంపి లో జరుగుతున్న దీపావళీ ఉత్సవాలను తిలకిస్తున్న విజయనగర సామ్రాజ్యం ప్రజలు

సాయంత్రం కాగానే నగరంలోని ప్రతి ఇంటి లోన, బయటా, ఇంటి పైభాగాన దీపాల వరుసల్ని ఉంచేవారు. రాజమహళ్ళతో బాటు అధికార కేంద్రాలు, ఇతర భవనాలను కూడా దీపాలతో అలంకరించేవారు. తోటలు, తుంగభద్రా నదీతీరంలోని స్నానాల ఘాట్లు మొదలైన బహిరంగ ప్రదేశాల్లో కూడా దీపాలను వెలిగించేవారు.

వస్త్రాలను నెయ్యి, నూనె మొదలైవాటిలో తడిపి పెద్ద పెద్ద కాగడాలను వెలిగించేవారు. వీటిల్ని ప్రధాన వీధుల్లోను, ప్రజలు గుమిగూడే బహిరంగ ప్రదేశాల్లోను ఉంచేవారు. ఈ భారీ కాగడాలను చూసిన ఇటలీ యాత్రికుడు లుడోవీకో వర్తెమా ఆశ్చర్యపోయాడు. “ఈ కాగడాలు తమ గొప్ప వెలుగుతో రాత్రిని పగలుగా మార్చేసా”యని తన డైరీలో వ్రాసుకున్నాడు.

ఈ కాగడాల వెలుగులో రాత్రిపూట పురాణ ఘట్టాలను ఆధారం చేసుకుని వ్రాసిన నాటకాలను ప్రదర్శించేవారు.

విజయనగర చక్రవర్తి, అతని కుటుంబసభ్యులు, అధికారులు, ఇతర నగర పెద్దలు ఈ ప్రదర్శనలను చూడ్డానికి వచ్చేవారు.

చక్రవర్తి రాగానే పెద్దయెత్తున బాణాసంచాను కాల్చేవారు. ఈనాటి రాకెట్లను పోలిన వాటిని మండించి గాల్లోకి ఎగరేసేవారు. రంగురంగుల వెలుగుల్ని విరజిమ్మే వివిధ రకాల మతాబాలు కాల్చేవారు. కోటల వంటి ఆకారాల్లో చేసిన వెదురు కట్టడాలలో మందుగుండును కూరి పేల్చేవారని హంపీ దీపావళీ వేడుకల్ని వర్ణించాడు మరో విదేశీ యాత్రీకుడు డొమింగో పేస్.

*****

భారతీయులు – మందుగుండు విజ్ఞానం:

 

గాల్లోకి ఎగిరేవాటిల్ని బాణాలు అని, కుండల్లో కూరి కాల్చేవాటిల్ని చంద్రజ్యోతి అని పిలిచేవారని ప్రొ. గోడే పేర్కొన్నారు.

 

వీటితో బాటు చక్ర అనే మరో బాణాసంచా ఉండేది. ఒక పొడవాటి వెదురు బద్దకు పైభాగాన మరో బద్దను అడ్డంగా కట్టి, ఆ చివర ఈ చివర బాణాసంచా నింపిన రెండు మట్టికుండలను కట్టి కాల్చేవారు. ఆ కుండలు మండుతూ, అడ్డంగా కట్టిన వెదురు బద్దను గుండ్రంగా తిప్పేవి.

వినోదం కోసం వాడే ఈ బాణాసంచాను మరింతగా అభివృద్ధి చేసి యుద్ధాల్లో వాడే విజ్ఞానాన్ని భారతీయులు కనిపెట్టారని ప్రొ. గోడే అంటారు.

15వ శతాబ్దానికి చెందిన కళింగ పాలకుడు ప్రతాపరుద్ర గజపతి కంటుక చింతామణి అనే సంస్కృతగ్రంథాన్ని వ్రాస్తూ అందులో రకరకాల బాణాసంచాలను తయారుచేసే విధానాలను పేర్కొన్నాడని ప్రొ. గోడే వ్రాసారు. అలాగే 14వ శతబ్దానికి చెందిన ఆకాశభైరవకల్ప అనే మరో సంస్కృతగ్రంథంలో కూడా బాణాసంచా తయారీ వివరాలు ఉన్నాయి ఆయన తెలిపారు.

నేటి multi barreled tubesను సుతలనిభనాళిక అని, cannon ballsను సుగోళికాతతి అని పిలిచేవారు. Gun ను నాళికా అని పిలిచేవారు.

16వ శతాబ్దంనాటి ఒక సంస్కృతగ్రంథం ప్రకారం ఆయుధపూజ నాడు విజయనగర చక్రవర్తి 32 రకాల ఆయుధాలను పూజించేవాడని చెబుతోంది. ఇందులో నాళికాస్త్రంగా పిలువబడే తుపాకి కూడా ఒకటి.

ఇలా విజయనగర సామ్రాజ్యపు ఉచ్ఛదశలో రాజధాని హంపీలో పండుగలు ఒకవైపు ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబిస్తూ, మరొకవైపు చక్రవర్తుల భుజబలాన్ని ప్రదర్శిస్తూ, సర్వజన మనోరంజనంగా సాగేవి.

వీటిలో దీపావళి తన దీపాల వెలుగులు, బాణాసంచా జిలుగులతో దేశవిదేశీయుల్ని విశేషంగా ఆకర్షించేదని చరిత్ర చెబుతోంది.

*****