ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తుంబరగుద్ది శాసనం చెప్పే కొత్త విషయాలు

Like-o-Meter
[Total: 6 Average: 5]

తుంబరగుద్ది శాసనం వ్యాసరాజ తీర్థ చరిత్ర

సమిష్టి వ్యవస్థకై పరితపిస్తున్నామని చెప్పేవారిని కమ్యూనిస్టులుగాను, ప్రజాస్వామ్యవాదులుగాను, ప్రగతిశీల శక్తులు గాను, అభ్యుదయ పిపాసులుగాను, నవ్యలోక నిర్మాతలుగాను ప్రచారం చేస్తుంటాయి వివిధ మాధ్యమాలు. 

అయితే, పైపేర్కొన్న వారిలో చాలామంది సమాజ విచ్ఛేద కార్యక్రమాలను విచ్చలవిడిగా నిర్వహిస్తుంటారన్నది సూర్యుని వెలుగులా చక్కగా కనిపిస్తోంది. కులాల పేరుతో, ఉపకులాల పేరుతో, రిజర్వేషన్ల పేరుతో, ప్రాంతాల పేరుతో, జాతుల పేరుతో – ఇలా నానా రకాల చీలికల్ని తెచ్చేవారిలో పై పేర్కొన్న బిరుదాంకితులు ముందు వరుసలో ఉంటారు.

తమ స్వార్థరాజకీయాల కోసం, సంకుచిత భావనా ప్రాచుర్యం కోసం, విదేశీ స్పాన్సర్స్ దగ్గర కనీస మద్దతుధరను గిట్టించుకోవడం కోసం వీరు తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా, బమ్మితిమ్మిని ’తిమ్మమ్మ మర్రిమాను’గా మారుస్తూ, విస్తరిస్తూ, విషం చల్లుతుంటారు. ఇలా వీరి చేతిలో పడి తన అసలు అస్తిత్వాన్ని కోల్పోయిన విషయమే ’మనదేశ చరిత్ర.’

పై పేర్కొన్నవారిలోని అతి బుద్ధివంతులు సదరు ’చరిత్ర’ను ఎన్ని రకాలుగా మానభంగం చేయాలో అన్ని రకాలుగా చేసి, మసిపూసారు. మారేడుకాయ చేసారు. అభూతకల్పనాబంధురమైన వారి స్వంతపైత్యాన్ని పాఠ్యపుస్తకాల రూపంలో, పరిశోధనల రూపంలో, వార్తా కథనాల రూపంలో సమాజం లోలోతుకు చేరవేసారు.

దేశ చరిత్ర ఎంత వక్రవాఖ్యానానికి గురయిందో అంతకంటే ఘోరంగా బలిచేయబడ్డవారు బ్రాహ్మణులు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY

ఒకప్పుడు వీరు శక్తిమంతులే. ప్రభావశీలమైన జాతివారే. మహారాజుల నుండి పౌరుల వరకూ తమ కాళ్ళకు దండాలు పెట్టించుకున్నవారే. అటువంటివారిలో కొన్ని కలుపుమొక్కలు ఉండకుండాపోవు. ఇది ఎలాగంటే ఈనాటి నేరస్తుల చిట్టాను తీస్తే అందులో అన్ని జాతులవారూ ఉన్నట్టుగానే. అటువంటి కొందరు అయోగ్య బ్రాహ్మణుల చేష్టలనే ఆ వర్గపు ఆద్యంత ధోరణిగా చిత్రీకరించడం ఒక ఘోరమైన వక్రీకరణ మాత్రమే.

’అనుకూల-ప్రతికూల’ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా చూపి, సమన్వయం చేయగలిగే వారే నిజమైన పరిశోధకులు. ఈ సిద్ధాంతానికి విరుద్ధంగా ’బ్రాహ్మణిజమ్’ అన్న పేరు పెట్టి దాని చాటున కుహనా మేధావులు వ్రాసిందంతా సత్యం కాదు. ఎందుకంటే, వారు ’యత్ అనుకూలం సుఖం’ అన్న ఒక్క వాక్యాన్ని మాత్రమే అనుసరించిన వారు. ’యత్ ప్రతికూలం దుఃఖమ్’ అన్న తదుపరి వాక్యాన్ని ప్రజల నుండి దాచిపెట్టిన దొంగలు. 

కనుక దళితవాదులు, కమ్యూనిస్టులు, ఇతర వివాదవాదులు చూపే ’బ్రాహ్మణిజమ్’ నిజంగానే పెద్ద బూచినా? అన్న ప్రశ్నకు ఓ చారిత్రిక సమాధానమే ఈ వ్యాసం. విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన ఒక తామ్ర శాసనం కుహనా చరిత్రకారులు దాచిపెట్టిన అనేక విషయాలను వెలుగులోకి తెస్తోంది. ఆ శాసనమేమిటి? అది చెప్పే సంగతులేమిటి? ఆ శాసన పాఠాన్ని ఈనాటి చదువరులు అవశ్యంగా ఎందుకు తెలుసుకోవాలి?

ఇక చదవండి.

తుంబరుగుద్ది శాసనం

 

పై కనబడుతున్నది “తుంబరుగుద్ది శాసనం“గా పిలువబడే కన్నడ తామ్రశాసనం. ఇందులో శ్రీవ్యాసరాయ మునీంద్ర అనబడే ఒక బ్రాహ్మణ సన్యాసి [పీఠాధిపతి] సాండూరు ప్రాంతానికి చెందిన తుంబరుగుద్ది అని, ’వ్యాసాపురం’ అని పిలువబడే గ్రామంలో ఒక చెరువును తవ్వించారని, ఆ త్రవ్వకానికి సహాయపడిన వివిధ వృత్తుల వారికి వంతులు వేసి సాగుభూమిని పంచారని ఉంది.

వ్యాసరాయ మునీంద్రుల ద్వారా లబ్ధి పొందిన వారిలో గ్రామాధికారులు కాకుండా కమ్మరి, కుమ్మరి, క్షురకుడు, వెట్టివారు మొదలైన వారు కూడా ఉన్నారని ఈ శాసనం చెబుతోంది. ఎవరెవరికి ఎంతెంత భూమిని వ్యాసరాయ మునీంద్రుడు పంచారన్న విషయం కూడా ఇందులో స్పష్టంగా నమోదు చేసారు. విజయనగర కాలం నాటి ’సామాజిక న్యాయం’ను మనకు పరిచయం చేసే ఒక ఋజువుగా ఈ తుంబరగుద్ది శాసనం గుర్తింపును పొందింది. కానీ ఈ శాసనాన్ని అముద్రిత శాసనంగానే మిగిల్చారు ప్రభుత్వంవారు.

ఈ శాసనంలోని ముఖ్య విషయాలకు వెళ్ళేముందు కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శాసనంలో నమోదు చేసిన శక సంవత్సరం గురించి. ఇప్పుడు దాని గురించి కొన్ని మాటలు.

ఈ తుంబరుగుద్ది శాసనం సాళువ నరసింహరాయలు విజయనగర చక్రవర్తిగా ఉన్న కాలం (1485-91)  నాటిదిగా పరిశోధకులు గుర్తించారు. శాసనంలో శాలివాహన శకము 1259 అని ఉన్నది. అనగా శాసన సంవత్సరం Common Era 1337 అని అవుతుంది. ఆ సమయానికి విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పటికీ శాసనంలో పేర్కొన్న ప్రముఖ వ్యక్తి శ్రీ వ్యాసరాయ మునీంద్రులు 15-16 శతాబ్దాల కాలానికి చెందినవారు కావడం వల్ల ఈ శకసంవత్సరం శాసనాన్ని చెక్కిన శిల్పి వల్ల దొర్లిన అక్షరదోషంగా పరిశోధకులు పరిగణించారు.

సంవత్సరాన్ని పేర్కొనడంలో తప్పు ఉండడం వల్ల ఇది ’కూట శాసనం’ [దొంగ శాసనం]  అని తోసిపారేయకుండా ఇందులో పేర్కొన్న ఇతర వివరాలు, అంటే శ్రీవ్యాసరాయ మునీంద్రులు, సాళువ నరసింహరాయలు, సాండూరు ప్రాంతంలోని ’వ్యాసాపుర’మనే పేరుగల తుంబరగుద్ది గ్రామం, అక్కడవున్న చెరువు మొదలైన ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నందువల్ల, వీటిల్ని ఈనాటికి కూడ పరీక్షంచవచ్చును కనుక, శిల్పి చేసిన పొరబాటును అడ్డుపెట్టుకుని శాసనంలో పేర్కొన్న verifiable facts ను విస్మరించకూడదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL – ACCESS FACTUAL HISTORY

వ్యాసరాయలు-సాళువ నరసింహరాయల మధ్యగల గురు-శిష్య సంబంధం గురించి వివరించే ’వ్యాసయోగి చరితం’ అనే ప్రాచీన గ్రంథంను నేటికీ మద్రాస్ ఓరియెంటల్ లైబ్రరీలో చూడవచ్చు.

ఈ వ్యాసయోగి చరితం అనే గ్రంథం వ్యాసరాయలు బ్రతికివున్నప్పుడే సోమనాథ అనే కవి వ్రాసాడు. ఇది వ్యాసరాయల వారి జీవిత చరిత్ర [Biography]. చారిత్రకంగా ఈ గ్రంథం ఎంతో అమూల్యమైనది. ఎందుకంటే, విజయనగర కాలం నాటి సామాజిక, ధార్మిక, రాజకీయ వాతావరణాన్ని సమగ్రంగా పరిచయం చేసే ఆనాటి సమకాలీన గ్రంథం ఇది.

ఇందులో సాళువ నరసింహుడు ఎంతటి గౌరవాన్ని, సన్మానాన్ని వ్యాసరాయలకు ఇచ్చాడనేది సుస్పష్టంగా ఉంది. కనుక ఈ గ్రంథం ఆధారంగా సాళువ నరసింహరాయలు తుంబరగుద్ది గ్రామాన్ని వ్యాసరాయలకు దానంగా ఇచ్చాడని భావించడంలో ఎటువంటి పొరబాటు లేదు. సదరు తుంబరగుద్దిని, దానానంతరం ప్రజలు ’వ్యాసాపురం’గా పిలువడం కూడా సమంజసమే [ఉదా: కృష్ణదేవరాయలు తల్లి పేరుతో నిర్మించిన నాగలాపురం నేటికీ అదే పేరుతో ఉంది].

ఇలా చక్రవర్తి దానం చేసిన గ్రామాన్ని వ్యాసరాయలు స్వార్థం కోసం వాడకుండా, ఆ గ్రామంలో బంజరుగా పడివున్న భూమిని సారవంతం చేసే నిమిత్తం ఒక చెరువును త్రవ్వించారు. ఈ నిర్మాణంలో సహాయపడిన కమ్మరికి, కుమ్మరికి, వెట్టివారికి భూమిని పంచిపెట్టారు. అంతేకాదు త్రవ్వకానికి వచ్చిన కూలీలకు క్షురకర్మ చేసిన క్షురకునికి కూడా భూమిని పంచారు.

దురదృష్టవశాత్తు ఈ శాసనంలో పేర్కొన్న మరికొన్ని వృత్తుల పేర్లకు అర్థం తెలియకపోవడం వల్ల కొద్దిమంది లబ్ధిదారుల్ని గుర్తించలేకపోయారు పరిశోధకులు.

ఇప్పుడు లబ్ధిదారుల వివరాలను చూద్దాం…

 

పేరు వృత్తి
సాదర చిక్కణ్ణ గ్రామాధికారి
తిమ్మరస గ్రామ కరణం
మడిగండల చెంగినాయక గ్రామ రక్షకుడు (పోలీస్)
మల్లోజ కమ్మరి
దోరోజ వడ్రంగి
వరూజ కంసాలి
నాగరాజ చాకలి
తిప్ప మంగలి
తిమ్మ కుమ్మరి
యల్లజ్జ మాదిగ

పై పేర్కొన్న లబ్ధిదారులకు చెరువు నిర్మాణంలో వారి సహకారం/ఉపకారంను అనుసరించి భూమిని పంచడం జరిగింది. ఆ పంపకం వివరాలు కూడా ఈ శాసనంలోనే ఉన్నాయి. కానీ అవి ఆనాటి కాలపు కొలతలలో ఉండడం వల్ల, ఆ కొలతల్ని నేటి విధానంలోకి మార్చడానికి సమయం పట్టడం వల్ల ఈ వ్యాసంలో ఆ భూమి కొలతల్ని చేర్చలేదు.

సామాజిక న్యాయం

లెక్కాజమల్ని పక్కన పెట్టి, అతి ముఖ్యాంశమైన ’సామాజిక న్యాయం’ కోణంలో ఈ శాసనాన్ని పరిశీలిస్తే, గ్రామభోక్త అయిన వ్యాసరాయ మునీంద్రులు ఒక బ్రాహ్మణ సన్యాసి. కానీ వారు తుంబరగుద్ది గ్రామాన్ని తన భోగ్యానికి వాడుకోక ఆ ఊరిలో వ్యర్థంగా పడివున్న భూముల్ని సాగులోకి తీసుకురాదలిచారు. అందుకు గాను ఒక చెరువును నిర్మించారు. ఆ నిర్మాణంలో సహాయపడిన వారికి వారి వారి యోగ్యతానుసారంగా సాగుభూముల్ని పంచారు. అందులో అన్ని వృత్తుల వాళ్ళు, ’కులా’ల వాళ్ళూ ఉన్నారు. ’ఆచంద్రతారార్కంగా, పుత్రపౌత్రాది వంశపరంపర’గా ఈ భూముల్ని లబ్ధిదారులు అనుభవించుకోవచ్చని కూడా ఆ సన్యాసి శాసనంలో వ్రాసి ఇచ్చారు.

ఒక చక్రవర్తికి గురువుగా వ్యవహరించిన వ్యాసరాజ స్వామివారి అధికార పరిధి, వ్యాప్తి ఎంత విస్తృతంగా ఉండేవో ’వ్యాసయోగి చరితం’ విస్పష్టంగా వివరిస్తోంది. అత్యంత ప్రామాణికమైన ఆ రచన ద్వారా వ్యాసరాయ స్వామి ఈనాటి రాయలసీమ ప్రాంతంలోను, నెల్లూరు సీమలోను, కర్నాటక మరియు తమిళనాడు సరిహద్దుల్లో ఎన్నెన్నో చెరువుల్ని త్రవ్వించినట్టుగా తెలిసివస్తోంది. తిరుపతి గోవిందరాజ స్వామి గుడిలో కృష్ణదేవరాయలు వేయించిన మూడు శాసనాల ద్వారా తిరుమలకు వచ్చే యాత్రీకులకు కులాలకు అతీతంగా ఆకలిని తీర్చడానికి వ్యాసరాయ స్వామి చేసిన ప్రసాద పంపిణీ ఏర్పాట్ల గురించి తెలిసుకోవచ్చు.

ఇలా సామ్రాజ్యాధినేతకు ధర్మప్రబోధ చేసే స్థాయిలో గల ఒక బ్రాహ్మణ సన్యాసి, క్షేత్రస్థాయిలో ’సామాజిక న్యాయం’ను అమలు పరచడమనే కీలకమైన చారిత్రిక సత్యాన్ని తుంబరుగుద్ది శాసనం ఆవిష్కరిస్తోంది. కులాల కట్టుబాట్లు కట్టుదిట్టంగా ఉన్న కాలంలోనే అన్ని కులాలకు, వృత్తులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన లాభాలను అందించిన వ్యాసరాయ స్వామివారి వివరాలు ఎక్కడా, ఏ తరగతి పాఠ్యపుస్తాకాల్లోనూ ప్రస్తావించకపోవడం ఒక నిష్టుర నిజం. కుహనా చరిత్రకారులు, కుత్సిత రాజకీయ నాయకులు, కుళ్ళిపోయిన విద్యావేత్తల ద్రోహబుద్ధిని తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.

కులాల మధ్య సయోధ్యను నిర్మించే ఇటువంటి చారిత్రిక సత్యాలకు పాతరవేసి, కులాల సంకుల సమరానికి బీజం వేసే విషమయ అంశాలను పిల్లలకు బోధిస్తున్న ఈనాటి విద్యావిధానం మారాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ప్రజలే నిలదీసి సాధించుకోవాలి. అలా జరగాలంటే, ప్రజల్లో సరైన చరిత్రజ్ఞానం ఉండాలి. ఈ దిశలో ’తుంబరగుద్ది’ గ్రామాన్ని, అక్కడున్న ప్రాచీనమైన చెరువును, వ్యాసరాయ స్వామి శాసనాన్ని ఒక ముఖ్యమైన మజిలీగా గుర్తించాలి. 

’ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం” అన్న శ్రీశ్రీ మాటల్ని వమ్ము చేసిన కుహనా చరిత్రకారుల ఉక్కుపిడికిళ్ళ నుండి చరిత్ర పాఠాలను తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుకువుంచుకోవాలి.

ఇదే వ్యాసరాయ స్వామికి చెందిన మరొక ’సామాజిక న్యాయం’ అంశాన్ని తదుపరి వ్యాసంలో వ్రాస్తాను. ఈలోపు పాఠకులు ఈ వ్యాసాన్ని విస్తృతంగా పంచుకోగలరని, తద్వారా గత చరిత్రలో మరుగునపడ్డ సత్యాన్ని అందరికీ చేరవేయాలని కోరుతున్నాను.

*****

ఆధార గ్రంథం:

ఎమ్. శ్రీనివాస్, బెంగళూరు తన ఎం.ఫిల్. డిగ్రీ కోసం సమర్పించిన “వ్యాసరాయల వ్యక్తిత్వం -ప్రభావం” అన్న పరిశోధనా పత్రం.