విజయనగరంలో మహారాజా వారి “హస్త బల్” అనే నాటకశాల, (hasti= elephant)ఉన్నది. ఆ స్టేజీ మీద ఆరుద్రకు సన్మానం వైభవంగా జరిగింది. ఆ సన్మాన సభలో దిగ్గజాల్లాంటి పండితులు మాట్లాడారు. “మహారాజా వారు ఏనుగులు కోసమని కట్టిన ఈ ‘హస్తబల్ ‘ స్థలంలో సాహిత్యంలో గజరాజు వంటి ఆరుద్ర గారికి సత్కారం జరగడం గొప్ప ఔచిత్యం.” అంటూ వక్తలు తమ ప్రసంగాలలో ఉటంకించారు.
అపరిమిత శ్రమతో అద్భుత పరిశోధనలను, అందించిన ఆరుద్ర మాట్లాడుతూ “మహారాజా వారికి ఏనుగులు లేవు. ఇక్కడ ఆయన ఏనాడూ ఏనుగుల్ని కట్ట లేదు. ఇది అశ్వశాల మాత్రమే! ’stable’ అంటే గుర్రాల శాల. తెలుగులో “ఇ” అని – ఇంగ్లీష్ లో S అనే letter ఆదిని ఉన్న పదాలకు ‘ఇ’ని చేర్చే పదాల పరిణామం ఉన్నది. ఉదాహరణకు ‘ఇస్కూలు ’ అని పలుకుతారు. అలాగే stable పరిణతి జరిగింది. స్టేబుల్, ఇస్టేబుల్, అస్తేబుల్, అస్తబల్ అయి, హస్త బల్ ఐనది.” అన్నారు.
చరిత్రను అంత నిశిత పరిశోధన చేసిన ఆరుద్ర మీద ప్రశంసల జల్లులు కురిశాయి.
కొన్ని సినిమాలకి తాపీ ధర్మా రావు, ఆరుద్ర సంయుక్తంగా రచనల పని చేసారు. వెండి తెర పైన “ తాపీ, ఆరుద్ర” అని వేసే వారు. అందుకు, ఆరుద్ర అందుకున్న చమత్కారం ఇది.
“ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా.”