ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆంధ్రులు ఆరంభశూరులా!

Like-o-Meter
[Total: 2 Average: 4]

కాలేజీలో చదువుకునే రోజుల్లో, ‘ముచ్చటగా మూడు నిముషాలు’ అనే వక్తృత్వ పోటీలో ‘ఆంధ్రులు ఆరంభశూరులా’ అని ఒక టాపిక్ తప్పనిసరిగా ఉండేది. ఆ అంశం వచ్చినప్పుడు, లేని మీసాన్ని తిప్పుతూ, తొడలు కొట్టినంత పనిచేస్తూ, ఆంధ్రులు నిజమైన శూరులు, వీరులు, ధీరులు అంటూ ఉపన్యాసం దంచి కొట్టేవాళ్ళు. అలా కొట్టినవాళ్ళల్లో నేనూ ఒకడినే! అప్పటి వయసుకు ఆవేశంలో ఏదేదో మాట్లాడామే కానీ, నిలకడగా ఆలోచిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది.

 

ఎందుకోగానీ, ఆంధ్రులలో చైతన్యం అంతగా కనిపించదు. చైతన్యమంటే, ఏవో మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకొని, విదేశాల్లో స్థిరపడటం గురించి కాదు. చైతన్యమంటే, ఏ సినిమాలో ఏ కులం హీరో ఎన్ని ఫైట్లు చేసాడు, హీరోయిన్ ఎన్ని చీరలు మార్చింది, ఏ కులపోడి సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది అన్న విషయాలలో కాదు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక చైతన్యం అస్సలు కనిపించదు. సాహితీ, కళా, క్రీడా రంగాలలోనైతే చైతన్య హీనులుగా, రసహీనంగా బతికేస్తున్నాం!.

 

ఆంధ్రులకి అన్వయించదగ్గ ఓ తమాషా విషయం ఉంది. అదేమిటంటే, ఇద్దరు ఆంధ్రులు కలిసే మూడు పార్టీలుగా విడిపోయుంటారు. నిజానికి ఆంధ్రులను మించిన అసమర్ధులు ఎవ్వరూ ఉండరేమో కూడా! ముఖ్యంగా రాజకీయ నాయకులు. వీరికి డబ్బు మీద, అధికారం మీద ఉన్నంత వ్యామోహం నీతి నిజాయితీల మీద ఉన్నట్లు కనిపించదు. కనీసమాత్రమైన ప్రాంతీయాభిమానం కూడా లేదు. రాజకీయంగా కూడా, అది వ్యాపరపరమైన చైతన్యమే కానీ, ప్రజల కోసం పోరాడాలనే నిజమైన దుగ్ధ, ఒక లక్ష్యం అస్సలు కనిపించదు. అందుకే, ఇందిరాగాంధి నుంచి నరేంద్ర మోడీ దాకా అందరూ ఆంధ్రులను వాడుకొని వదిలేసినవారే!

 

మనలని కులం నడిపిస్తున్నది. డబ్బు నడిపిస్తున్నది. ర్యాంకులు, మార్కులు, ఉద్యోగాలు నడిపిస్తున్నాయి. ఇవన్నీ మనలని నడిచే శవాలుగా తయారు చేసాయి. అభిమానం లేదు, ఆత్మ వంచన తప్ప.  రాష్ట్రం విడిపోవటానికి కూడా ఇవన్నీ కారణాలే. తెలంగాణా పోరాటానికి ధీటుగా సమైక్య పోరాటం జరగలేదు. ఇకపైగా, ప్రజల ఉద్యమంగా సాగిన తెలంగాణా ఉద్యమాన్ని ఎద్దేవా చేసాం. కేంద్రం పంచే కాంట్రాక్టులకు కక్కుర్తిపడ్డ మన నాయకులు సమైక్య ఉద్యమానికి ఉరి బిగించారు. ఉద్యమం సంగతి ఎలాగున్నా, కనీసం మాటవరసకైనా ప్రత్యేక ప్రతిపత్తి గురించి పోరాడుతామనే నాయకులే మనకు లేరు!

 

తెలంగాణా ఇవ్వనంత వరకూ తమ ప్రతాపంగా ప్రజలను మభ్యపెట్టిన ఆంధ్రా నాయకులు, ఇచ్చిన తర్వాత ముఖం చాటేసారు! కనీసం, విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కోసం పట్టుపట్టారా అదీ లేదు!! సరే, అదో ప్రహసనం. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ పిమ్మటే, ఎన్నికలొచ్చాయి. అప్పటి వరకూ అపర చాణుక్యుడని భుజకీర్తులు తొడుక్కున్న చంద్రబాబు, మోడీ నేతృత్వంలోని భా.జ.పా.తో పొత్తు పెట్టుకున్నాడు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ప్రత్యేక ప్రతిపత్తి గురించి ప్రస్తావించారు. ఎన్నికల సభలలోనూ ప్రజల చెవులు ఊదరగొట్టారు. పార్లమెంటులో వెంకయ్యనాయుడు కూడా అయిదు సంవత్సరాలు కాదు, పది సంవత్సరాల ప్రత్యేక ప్రతిపత్తికావాలని ఉపన్యాసం దంచేసారు.

 

ఎన్నికల ఫలితాలు రాగానే, అప్పటి వరకు తమ మద్దతు లేకుండా మోడీ పీఠం ఎక్కలేడని భావిస్తూ వచ్చిన మన అపర చాణక్యుల వారికి గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది. మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ మోడీకి దక్కింది.

 

అంతే, లెక్కలు మారాయి, ఎక్కాలు మారాయి, ‘వస్తే నీ ఇష్టం, రాకుంటే నీకే నష్టం’ అన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో పాలుపంచుకోవాల్సి వచ్చింది మన అ.చా. వారికి. ఈయన కాదంటే, అక్కడ కె.సి.ఆర్., ఇక్కడ వై.ఎస్.జె. రెడ్డి తయారుగా కూర్చున్నారు. పాపం ఏం చేస్తాడు! ఎన్నికల హామీ ఎలాగూ ఉంది కాబట్టి ఇవ్వాల్సిన పూచీ మోడీదే అన్నట్లు భావించుకున్నాడు. రాహువులని, కేతువులని తప్పించి ఓ బ్రహ్మాండ ముహూర్తంలో అమరావతి శంఖుస్థాపన చేయించాడు. పనిలో పనిగా ప్రజల ముందే మోడీని ప్రత్యేక ప్రతిపత్తి అడిగితే సరిపోయేది. కానీ ఈ అ.చా.వారు ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే అడిగి ఆంధ్రుల నోళ్ళల్లో మొదటి దుమ్ము కొట్టారు! ప్రజలు ఊరుకున్నారు, ప్రతిపక్షం ఉరుకుంది. కొన్ని పత్రికలే ఊరుకోలేదు. దాంతో, నాలుక మడతబడి, మాట తడబిడ పడిందని కక్కలేక, మింగలేక అవునూ కాదని అనిపించాడు ఈ అ.చా.వారు!

 

అసలు విషయం ఏమిటో ప్రజలకు ఇంతవరకు తెలియదు. ఇవ్వమని వీరు దేబిరించటం, ఇవ్వమని వారు దబాయించటం. చూస్తుంటే, మధ్యలో ప్రజలనేవారు, ముఖ్యంగా తమకు ఓట్లు వేసినవారు ఉన్నారన్న విషయం ఇద్దరూ మర్చిపోతూ ప్రజలను ఏమార్చేస్తున్నారు. ‘అంటుకోటానికి ఆముదం లేదు, మీసాలకు సంపెంగ నూనె ఎందుకని’ మోడీ వారు ప్రశ్నించినట్లు కొన్ని పత్రికలు కూసాయి. ‘మనమిచ్చిన సొమ్ముకు ఆయనకెందుకు సోకులని’ కొందరు భా.జ.పా.వారు ప్రశ్నించినట్లు మరికొన్ని పత్రికలు కూసాయి. ఎవరెలా కూసినా, ‘అల్లమంటే తెలియదా, బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది’ అని న.మో.వారు ఆంధ్రులకి సర్ది చెబుతున్నట్లు పార్లమెంటు సాక్షిగా జయంత్ సిన్‌హా అనే ఓ చిన్నమంత్రి ప్రకటించాడు! విభజన చట్టంలో ప్రత్యేక ప్రతిపత్తి లేదని, ఈ చిన్నమంత్రికి ఇప్పుడే తెలిసినట్లుంది. పార్లమెంటెక్కి ఇదే కూత కూసాడు. ‘ఆయనే ఉంటే మంగలి దేనికన్నట్లు’, విభజన చట్టంలో ఉంటే ఇంత ఏడుపూ దేనికంటా!

 

అయినా, ఇచ్చిన మాట నిలుపుకొని, మోడీ సార్వభౌముడు మాననీయుడు, మంచివాడు అన్న పేరు తెచ్చుకోకుండా, ఇస్తే అది చంద్రబాబు ఘనతగా ప్రజలు భావిస్తారని భా.జ.పా. అనుకోవటం మూర్ఖత్వం. 2019లో తె.దే.పా.తో పొత్తు ఉన్నా లేకపోయినా, ఒంటరిగా పోటీ చేసే ఆదను ఇందువల్ల దక్కుతుందని వీరికి ఎందుకు అర్ధం కావటంలేదో! ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోటీకి వచ్చే ఇతరరాష్ట్రాలు కారణమంటే నమ్మబుద్ధి వేయదు. నాకు తెలిసినంతలో ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఆంధ్రులు కాక, మరో అయిదు రాష్ట్రాలు అడుగుతున్నాయి. గాడ్గిల్-ముఖర్జీల కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రత్యేక ప్రతిపత్తికి ఆంధ్రప్రదేశ్‌కు అర్హత ఉంది. వాటికి తోడు, రాష్ట్ర విభజన ఈ అవసరాన్ని మరింత కలిగిస్తుంది. ఒకవేళ, మోడీకి నిండైన మెజారిటీ రాకుంటే, ఈపాటికే ఆంధ్రాకు ప్రత్యేక ప్రతిపత్తి ఖచ్చితంగా వచ్చి ఉండేది.

 

రాష్ట్ర పరిస్థితి దైన్యంగా ఉన్నదనే మాట వాస్తవం. ఒక్క ప్రత్యేక ప్రతిపత్తి లేకపోవటమే దీనికి కారణంగా భావించలేము. చంద్రబాబు కూడా ఆకాశానికి నిచ్చెనలు వేయకుండా, రాష్ట్రాభివృద్ధికి మంచి పునాదులు వేయాలి. పేరు అమరావతి కాబట్టి, ఇప్పటికిప్పుడు దేవనగరంగా తీర్చిదిద్దాలని ఆశించటం తగదు. అభివృద్ధి అనేది ఇప్పటికిప్పుడు ఆకాశం నుంచి ఊడిపడదని గ్రహించాలి.

 

ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒరిగేదేమీ లేదని భా.జ.పా. భావిస్తున్నదనేది వాస్తవం. ఇప్పటికే ఎన్నికల హామీలు నిలుపుకోలేకపోతున్న భా.జ.పా.కు 2019లో ప్రజలు గుణపాఠం చెప్పకపోరు. ఈ విషయంలో ఉద్యమాలు చేసిన నటుడు శివాజీని, వై.ఎస్.జగన్‌లకు సంఘీభావం తెలుపకుండా వారి ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం ఉస్సూరుమనిపించటం ప్రజలు గమనిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాన్ని గ్రహించి అందుకు అనుగుణంగా పావులు కదపాలి. తెగతెంపులు చేసుకోవాలంటే, 2019 దాకా ఆగినందువల్ల నష్టమే కానీ, ఉపయోగం లేదని గ్రహించాలి. ముందుగా కేంద్రం అందజేసిన, అందజేయబోతున్న నిధులపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. కేంద్ర సాయంలోని లోటుపాటులని పార్లమెంటులో చర్చకు పెట్టాలి.

 

అడిగినా పెట్టనప్పుడు, ఆరాటపడినా పెట్టనప్పుడు పోరాటమే మార్గం. మన హక్కుల కోసం చేసె పోరాటానికి ప్రజలు ఎప్పుడూ బాసటగా నిలుస్తారు. కావాలంటే, విశాఖ ఉక్కు పోరాటాన్ని స్ఫూర్తిగా మలుచుకుందాం. స్ఫూర్తి ప్రదాతలను స్మరించుకుందాం. ఆంధ్రుల అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి దేబిరించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని గ్రహించాలి. కనీసం మొదటి ప్రతిచర్యగా కేంద్రంలో మన మంత్రులను ఉపసంహరించాలి. బయటి నుంచి మాత్రమే మద్దతు ప్రకటించాలి. రాజ్యసభలో మెజారిటీ లేక ఉక్కిరిబిక్కిరౌతున్న భా.జ.పా.కు ముచ్చెమటలు పోయించాలి. యు.పి. ఎన్నికల తరుణంలో మద్దతు పూర్తిగా ఉపసంహరించాలి. పదేళ్ళకు కాకపోతే పాతికేళ్ళకు అభివృద్ధి బాటలు పరుచుకుందాం.