ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఉప ఎన్నికలు – అందని ద్రాక్షలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

“రాష్ట్రంలో నైతిక రాజకీయాలకు, హేతుబద్ధమైన వాదనలకు చోటు లేదు. ప్రజలు సరైన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించటం లేదు” – జయప్రకాశ్ నారాయణ్.

 

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లోక్ సత్తా అధినేత శ్రీ జయప్రకాశ్ నారాయణ్ గారి స్పందన ఇది. ఒక మేధావి నుంచి ఇటువంటి దిక్కుమాలిన స్పందనేమిటా అని ఆలోచించాల్సి వచ్చింది. నైతిక రాజకీయాలకు హేతుబద్ధమైన వాదనలకు రాష్ట్రంలో చోటు లేదని వాపోయారు…. బానే ఉంది. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు, ఓట్లేసే ప్రజలు సరైన ప్రత్యామ్నాయాం గురించి ఆలోచించటంలేదని ఆరోపణలు చేయటంలో అసలు ఉద్దేశ్యం ఏమిటి? ప్రజలు ఎవరిని గెలిపిస్తే, ఆయన మెచ్చుకొని ఉండేవారు? లోక్ సత్తానా? కమ్యూనిస్టులనా? తె.రా.స., భా.జ.పా., వైఎస్సార్ కాంగ్రెస్ మినహా ఎవరికి ఓటు వేసినా ఫర్వాలేదా?

తెలంగాణాలో ప్రజలు హేతుబద్ధంగానే ఆలోచించారు. తెలంగాణా పై కాంగ్రెస్ నాంచుడు ధోరణితో విసిగిపోయారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం పనికిరాదని తేల్చేసారు. ఇచ్చినా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదనే లోక్ సత్త ను గెలిపిస్తే ఉపయోగం లేదనే తీర్మానించారు. ఉద్యమంలో ఊగిపొవటమే కాని, ఉద్యమాన్ని ఊపే సత్తా సి.పి.ఐ.కి లేదనే నిర్ణయించారు. ప్రస్తుతానికి తెలంగాణాకు జాతీయస్థాయిలో మద్దతు ఇస్తున్న భా.జ.పా.ను, రాష్ట్రంలో తెలంగాణా పల్లకీలో ఊరేగుతున్న తె.రా.సా.ను మరోసారి మోద్దామనే నిశ్చయించుకున్నారు. తెలంగాణా కావాలనుకునే తెలంగాణా ప్రజలకు ఇక వేరే ప్రత్యామ్నాయం ఏముంది?

ఎవరికి ఎప్పుడు ఓటు వేయాలో, వేటు వేయాలో అన్నీ ఈయన చెప్పిన తర్వాతే ప్రజలు ఆచరించాలన్నట్లుగా ఉంది. ఆయన మాటల్లో అహంకారం తప్పా, నిజాయితీగా వెలిబుచ్చిన బాదైతే నాకేమీ కనిపించటంలేదు. అందని ద్రాక్షలు పుల్లనే కాబట్టి, ఆయన సంగతి పక్కన బెట్టి, ఉప ఎన్నికల ఫలితాలు ఓసారి విశ్లేషించుకుందాం.

అయిదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయింది కాంగ్రెస్ కు. యు.పి.లో సైకిల్, ఎ.పి.లోనూ సైకిలే అంటూ చంద్రబాబు కూడా చంకలు గుద్దుకోవటం మొదలేసారు. ఈలోపలే ఆంధ్రాలో ఉప ఎన్నికలు మొదలైనాయి. కార్యకర్తలకన్నా కూడా ఇనుమడించిన ఉత్సాహంతో ఉప ఎన్నికల్లో ప్రచారం చేసారు ఈయన. మధ్యంతర ఎన్నికల దిశలో దేశం పయనిస్తున్న సూచనలు కూడా తన మూడో కన్నుకు కనిపిస్తున్నాయని ప్రజలకు వివరించాలని ప్రయత్నించారు. అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పి.సి.సి. ఛీఫ్ బొత్సాలు కూడా చిటికెల పందిళ్ళు వేసి ఏడింట కనీసం నాలుగైనా గెలుస్తామన్న ధీమా ప్రకటించారు. చివరికి ఫలితాల్లో “గుండు” సున్నాలే మిగిలాయి ఈ రెండు పార్టీలకు. తెలంగాణాలోని ఆరు నియోజకవర్గాల్లో కనీసం చెరొకటైనా గెల్చుకొని ఉంటే, తెలంగాణా వాదమే లేదని, తె.రా.స.ను ప్రజలు తిరస్కరించారని మరిన్ని పందిళ్ళు వేసే అవకాశం దొరికేది. కనీసం ఆమాత్రంగానైనా అవకాశం కలిసిరాలేదు.

తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో తె.రా.స. గెలిచిందా, తెలంగాణా వాదం గెలిచిందా అన్న మీమాంస పక్కనబెడితే, ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం కన్నా, తె.రా.స.నే మరిన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని అనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం విషయంలో తె.రా.స. అనుసరించిన విధానం ప్రత్యేక తెలంగాణా ఉద్యమస్ఫూర్తికే విరుద్ధంగా ఉంది. మునుపు భా.జ.పా. తో రాసుకుపూసుకు తిరిగినప్పుడు లేని అభ్యంతరం మహబూబ్ నగర్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు మాత్రం దేనికి? ఐ.కా.స.లో భా.జ.పా.కు చోటిచ్చినప్పుడు మతవాదం గుర్తుకు రాలేదా? తెలంగాణా వరకు తన తర్వాతే మరే పార్టీ అయినా అనే దుస్సాహసంతో పెద్దన్న తరహా పిడివాదనతో తె.రా.స. ప్రవర్తిస్తున్న తీరు గర్హనీయం.

ఇంతవరకూ చాలాసార్లు ఒంటెద్దుపోకడలతో తెలంగాణా ఉద్యమాన్ని ఓ జోకులా మార్చేసిన కె.సి.ఆర్. కనీసం ఇప్పుడైనా సరైన విజ్ఞత ప్రదర్శించాలి. తె.రా.స.కు భా.జ.పా. అవసరమా కాదా అని కాకుండా, తెలంగాణా ఉద్యమానికి భా.జ.పా. ఏమేరకు అవసరమౌతుందనే ఆలోచించాలి. ఎందుకంటే, తెలంగాణాలోని ఆ ఆరు నియోజకవర్గాలలో భా.జ.పా. పోటీ చేసి ఉంటే తె.రా.స. పరిస్థితి ఏవిధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించాలి! అలా చేసి ఉంటే, ఖచ్చితంగా తెలుగుదేశం, కాంగ్రెస్ లకు మేలు జరిగుండేది.

తెలుగుదేశం విషయానికి వస్తే, ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కు తెలుగుదేశం సరైన ప్రత్యామ్నాయం కాలేకపోతున్నదనే మాట వాస్తవం. రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రినని, కేంద్రంలో చక్రాలు తిప్పేది, చేగోడీలు తినేది తానేనని సంబరపడిపోయారు చంద్రబాబు. దానికి కారణాలు యు.పి., పంజాబ్, గోవా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భంగపడటం, మూడో ఫ్రంటు ముసలి కాపు ములాయం సింగ్ యు.పి.లో అద్భుతంగా గెలుపొందటం. అక్కడ ఫలితాలు రావటమే ఆలస్యం, ప్రాంతీయపార్టీలతో మూడో ఫ్రంటు గురించి కూడా ముచ్చట్లు మొదలేసారు. ఇంత చేసీ, ఏడు చోట్ల పోరాడితే మూడు చోట్ల డిపాజిట్లు పోయి, అన్నిచోట్లా ఓడిపోవాల్సి వచ్చింది. కిందపడ్డా మీసాలకు మట్టి అంటలేదన్నట్లు, ఓడిపోయినా మునుపటి కంటే ఓట్లు ఎక్కువ వచ్చాయనే ఆనందబాష్పాలు ఈ అయ్యవారికి! కనీసం ఇప్పటి నుంచైనా ప్రతిపక్షంగా సరైన ప్రత్యామ్నాయంగా నిర్మాణాత్మక వైఖరితో వ్యవహరించకుంటే 2014 నాటికి కొంప కొల్లేరే అవుతుంది.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే, యు.పి.లో పృష్ఠ తాడనమైతే, ఏ.పీ.లో దంతభంగమయ్యింది! ఈ రెంటి మధ్యలో గుజరాత్, కర్ణాటక ఉప ఎన్నికల్లో గెల్చింది. ఏది వాపో ఏది బలుపో తెలుసుకోలేక కొట్టుమిట్టాడుతున్నది కాంగ్రెస్ అధిష్టానం. కొశ్శెన్ మార్కులో ఉన్నది యువరాజైతే ఓటమికి అందరూ బాధ్యత వహించేస్తారు కాంగ్రెస్ లో. కాకపోతేనే సమస్యల్లా! ఏదో మొహమాటానికి సి.ఎం. గా ఓటమికి బాధ్యత వహిస్తున్నానని చెబుతూనే, గడుసుగా నా వద్ద అద్భుతదీపాలేమీ లేవు, బాధ్యతలు ఒంటి చేత్తో మోసేవి కావని కూడా స్పష్టం చేసారు కిరణ్ కుమార్ రెడ్డి. పి.సి.సి. బాస్ బొత్సా మాత్రం తె.రా.స., వైయెస్సార్ కాంగ్రెస్ ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్నాయని కాబట్టి అవి గెలవటంలో విశేషం లేదని తేల్చేసారు! తనది కాకపోతే కాశీ దాకా దేకించే ఈ బాపతు ఆలోచనల వల్లే కాంగ్రెస్ కుంటి నడక నడుస్తున్నది రాష్ట్రంలో. కేంద్రంలోనూ అలాంటి ఆమాం బాపతే దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది.

వైయెస్సార్ కాంగ్రెస్ గురించి ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిందేమీ లేదు. చాప కింద నీరులా రాష్ట్రంలో ప్రవహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణాలో పోటీకి నిలబడకపోవటం మంచి ఎత్తుగడలా అనిపిస్తున్నది. భవిష్యత్తు ఎన్నికల కోసం తెలంగాణా దారులు తెరిచే ఉంచినట్లుగా తెలుస్తోంది.

రాబోయే మలివిడత ఉప ఎన్నికల తర్వాత ప్రజలు ఎటువంటి ప్రత్యామ్నాయం కోరుతున్నారో ఇంకా స్పష్టంగా తెలిసొస్తుంది.