సమయం సరిగ్గా ప్రొద్దున్న 8.00 గంటలు. ప్రాణం కంటే సమయం విలువైనదిగా భావించే మా గురువుగారు పాఠాన్ని ప్రారంభించారు. ఆయన పాణినీయ వ్యాకరణంలో తిమింగలం అయినప్పటికీ, తను ఒక బిందువు అని చెప్పుకొనే మహానుభావుడు. “యథాసంఖ్యమనుదేశః సమానామ్” అనే పాణిని సూత్రాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు వ్యాకరణంలో “ఇ, ఉ, ఋ లకు అచ్చులు పరమగునప్పుడు క్రమముగా య, వ, ర లు ఆదేశాలగును” అన్న దానికి సంస్కృత రూపం ఈ సూత్రం. సూత్రార్థం ఇలా ఉంది: వేటికైతే ఆదేశాలు చేస్తున్నామో అవి, మరియు వేటినైతే ఆదేశము చేస్తున్నామో అవి ఒకే సంఖ్యలో ఉంటే, క్రమముగా మొదటి స్థానికి మొదటి ఆదేశము, రెండవ దానికి రెండవది ఇలాగ. ఇది ఈ సూత్రము యొక్క సంక్షిప్తమైన అర్థము. ఇది బోధించిన గురువుగారు ఎదురుగా కూర్చున్న శిష్యుల్లో వ్యాకరణం పట్ల ఆసక్తిగల సాహిత్య విద్యార్థిని “ఏమయ్యా, మీరు ఇలాంటిదే ఒక అలంకారాన్ని చెబుతారు, తెలుసా?” అని ప్రశ్నించారు. సాహిత్యం లో ప్రాథమిక దశలో ఉన్న ఆ అబ్బాయి “అబ్బే! అలాంటి ఒక అల౦కారమే లేదండీ” అని బదులిచ్చాడు. గురువుగారు అతని వైపు నిశితంగా చూసారు. ఆపై వ్యంగాన్ని సూచించే చిరునవ్వు నవ్వారు.
@@@@@
అది పతంజలి మహర్షి ఆశ్రమము. అనంతమైన శబ్దరాశిని తన ప్రవాహ ధ్వనిలోనే పలికిస్తూ బిరబిరా సాగుతోంది నది. “శబ్దాల యొక్క వ్యుత్పత్తి ఎలా?” అని తెలిపే పాణిని సూత్రాలకు భాష్యంను తన శిష్యులకు బోధించాలనే మహత్సంకల్పము తో ఆన్హీకాన్ని ముగించి, కృష్ణాజినంపై ఆసీనుడై ఉన్నాడు పతంజలి. శిష్యులు వినమితగాత్రులై, విద్యాతురులై కూర్చునివున్నారు. వారి ముకుళిత హస్తాలు వారి వినయాన్ని తెలిపే చిహ్నాలు. మరి పతంజలి అంటేనే అదే అర్థం కదా! “పతంతః అంజలయః యస్మిన్ సః పతంజలిః” ఎవరి పాదపద్మాల వద్ద అంజలులు (నమస్కారాలు) వచ్చి వాలేవో అతనే ’పతంజలి.” కనుకనే ఆనాటి వారే కాదు ఈనాటి వ్యాకరణ విద్యార్థులు కూడా ’పతంజలి’ పేరు చెవిన పడగానే మనసులోనే నమస్కరిస్తారు. పతంజలి వాగ్ఝరి ప్రారంభమైంది. శిష్యుల సందేహాలను నివారిస్తు, వారికి తోచని సందేహాలను పుట్టిస్తు, వాటికి సమాధానాలు చెబుతూ పాణినీయ సముద్రంలోని ఒక్కొక్క బిందువునూ పరిచయం చేస్తూ సాగుతున్నది పతంజలి భాష్యం. ఇంతలో ఒక శిష్యుడు లేచి “ఊషా, తేరా, చక్రా, పేచా – ఇవి ఎక్కడా ఉపయోగించని శబ్దాలు. ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయి. వాడుకలో లేని ఇటువంటి శబ్దాలు ఎందుకున్నాయి? ఒకవేళ వ్యాకరణ విద్యార్థులుగా మేము తెలుసుకున్నా, తెలుసుకొని ప్రయోగించినా అవి సామాన్యులకు అర్థం కావి. మరి ఇలాంటి నిరుపయోగ శబ్దాలను, వాటి వ్యుత్పత్తులను ఇంకా తెలుసుకోవల్సిందే?” అని ప్రశ్నించాడు. పత౦జలి చూపు పదునెక్కింది. భృకుటి ముడి పడడంతో నుదుటి పై రేఖలు శివుని మూడో కన్నులా ఏర్పడ్డాయి. అంతలోనే తమాయించుకుని, చల్లటి నవ్వునొక్కటి నవ్వాడు పతంజలి. అతని ముఖ కమలం నుండి ఒక మధుధార వాక్యాల రూపాన్ని సంతరించుకుంది.
“సప్తద్వీపా వసుమతీ, త్రయః లోకాః, చత్వారో వేదాః, సా౦గాః సరహస్యాః, బహుధా విభిన్నాః, ఏకశత౦ అధ్వర్యుశాఖః, సహస్రవర్త్మా హి సామవేదః, ఎక వి౦శతిధా బహు ఋచ్యమ్, నవధా అథర్వణోవేదః, వాకోవక్య౦ ఇతిహాసః పురాణ౦ వైదిక౦ ఇతి ఏతావాన్ శబ్దస్య ప్రయోగ విశేషః. ఏతావన్త౦ శబ్దస్య ప్రయోగవిషయ౦ అననునిశమ్య సన్తి అప్రయుక్తాః శబ్దాః ఇతి వచన౦ కేవల౦ సాహసమాత్రమేవ.”
మూడు లోకాలు, దానిలో ఏడు ద్వీపాలతో కూడిన ఈ భూమి. షడ౦గాలతో, ఉపనిషత్తులతో కూడిన విభ్హిన్నమైన నాలుగు వేదాలు. ఒక వ౦ద యజుర్వేద శాఖ, వేయిశాఖల మహావృక్షం సామవేదము, ఇరవైయొక్క విధాలుగా ఋగ్వేదము, నవధా అథర్వణము. ఒక్కొక్క ప్రదేశములో ఒక్కో విధంగా ఇతిహాస పురాణాలు. ఇ౦తటి శబ్దరాశిని సరిగ్గా తెలియకు౦డా, ప్రయోగి౦పబడని శబ్దాలు ఉన్నయి అనడం హాస్యాస్పదం కాదా? అలా ఆ మాటలు పరిసరాల్లో మారుమ్రోగుతుండగా ఆశ్రమ మంతటా నిశ్శబ్దం పరచుకుంది. ముని చెప్పిన శబ్దరాశిని ప్రతిధ్వనిస్తున్న నదీప్రవాహఝరి చెవుల్లో మోగుతున్నయి. పత౦జలి మళ్లీ ఇలా ప్రార౦భి౦చాడు. – “నీ ప్రశ్నకు ఇ౦కా ప్రమాణం ఇవ్వలేదు. చక్రా అనే పదం ఎక్కడా ఉపయోగి౦పబడలేదు అన్నావు. ఇప్పుడు విను యథా నః చక్రా జరస౦ తనూనాం. ఇది ఋగ్వేదం లోని మ౦త్రం. ఇక్కడ చక్రా అన్న పదం వాడారు.” ఈవిధంగా శిష్యుడు ఉటంకించిన ఊషా, తేరా, పేచా పదాలు ఎక్కడెక్క ప్రయోగింపబడ్డాయో ఎత్తి చూపాడు ఆ శబ్దతపోధనుడయిన పతంజలి.
@@@@@
“తెలిసి౦దా? మనకు తెలియనిది ఈ లోకంలోనే లేవు అనడ౦ సమ౦జస౦ కాదు. క్రమాల౦కార౦ అని ఒక అల౦కార౦ ఉ౦ది. నన్నయ ఆంధ్ర భారతం యొక్క మ౦గళాచరణం మొదటి పాదం ఇదే అల౦కారాన్ని కలిగివుంది. శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే – ఇక్కడ లక్ష్మీదేవి (శ్రీ)ని వక్షఃస్థలంలో, సరస్వతీ (వాణీ) ని ముఖములో, పార్వతీ(గిరిజా) ని దేహములో ధరించిన విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులకు నమస్సులు అని చెబుతూ క్రమాలంకారాన్ని వాడడం గమనించవచ్చు.” అని ఆనాటి పాఠాన్ని ముగించారు.
@@@@@
గది ను౦చి బయటకు వచ్చిన నాకు పత౦జలి సదృశులైన గురువులు దొరికిన౦దుకు ఒక పక్క ఆన౦దం. ఇన్ని ఉన్నాయి అని చెప్పుకొనే స్థితి ను౦చి ఇన్ని ఉ౦డేవి అనే స్థితికి దిగజారిన నా తరాన్ని తల్చుకుని దుఃఖం కలిగింది. ఇన్ని ఉండేవి అన్న స్థితి నుంచి “ఇలాంటి అసలు లేవు” అని చెప్పుకునే భవిష్యత్తును ఊహించుఉని ఒళ్ళు జలదరించింది. ఇప్పటికైనా నేను మేలుకోకపోతే నా ముందు తరాలకి మిగిలేది…
@@@@@