ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పార్లమెంటు పంజరంలో ప్రజాస్వామ్యం బందీ

Like-o-Meter
[Total: 0 Average: 0]

***

ప్రజాస్వామ్యానికి, అధికారానికి, రాజకీయ పార్టీలకు పర్యాయపదమైన అవినీతి పీచమణచటానికి పటిష్టమైన ఓ వ్యవస్థ కావాలని ఉద్యమించిన అన్నాపై మన రాజకీయ పార్టీలు అన్నిరకాల దాడులు చేసాయి. అన్నాయే ఓ అవినీతిపరుడని కొందరు, అన్నా టీం సభ్యులందరూ అన్నాను వాడుకుంటున్నారని మరి కొందరు, అన్నా వెనుక ఆరెస్సెస్ లాంటి సంస్థల అండదండలున్నాయని మరి కొందరు ప్రజల దృష్టి మరల్చటానికి చేయని ప్రయత్నం లేదు.

అన్నా ఉద్యమంలో ప్రజా ప్రయోజనాల కన్నా, రాజకీయ ప్రమేయమే ఉన్నదని ఆరోపిస్తున్నారు. అన్నాకు ఆరెస్సెస్ తో ఉన్న సంబంధాలే దానికి కారణమట! ఈ ఉద్యమం వెనుక ఆరెస్సెస్ ఉంటే వచ్చిన సమస్య ఏమిటి? రాష్ట్రీయ స్వయం సేవకులు ఈ దేశ పౌరులు కాదా? వారికి ఉద్యమాలలో పాలు పంచుకునే హక్కు లేదా? ఆ హక్కు టోకెన్ సమ్మెలు చేసే రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితమా?

సరే, మాటవరసకు రాజకీయ కారణాలతోనే అన్నా ఉద్యమం చేసారనుకుందాం. మరి, ఏ కారణాలతో లోక్ పాల్ పరిధిలోకి సి.బి.ఐ.ను తీసుకురాలేమంటున్నది మన ప్రభుత్వం? ఆ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు లేవని, ప్రజా ప్రయోజనాలే ఉన్నాయని నిరూపించగలరా?

ప్రజలు ఎన్నుకోనిదే ప్రతినిధులు ఉండరు. ప్రతినిధులు లేనిదే చట్టసభలు ఉండవు. అటువంటప్పుడు, చట్టసభలలో చేసే చట్టాలలో ప్రజా ప్రమేయం ఉండరాదని మన ప్రతినిధులు ఎలా తీర్మానిస్తున్నారో ఎవరైనా వివరించగలరా? ఇకపైగా, నిరసనలు, ఉద్యమాల ద్వారా చట్టసభలపై ఒత్తిడి పెంచి పార్లమెంటు ప్రతిష్ట మసకబారుస్తున్నారని చేసే ఆరోపణల విలువెంత?

అసలు పార్లమెంటు ప్రతిష్టను దిగజారుస్తున్నది ఎవరు? ప్రజలా, ప్రజా ప్రతినిధులా? ప్రజాస్వామ్యానికి గుండె కాయ లాంటి పార్లమెంటు మీద 13-డిసెంబర్-2001 నాడు తీవ్రవాదుల దాడి జరిగింది. దశాబ్ద కాలమైనా కూడా నిందితుడికి శిక్ష అమలు జరపలేదు. దానివల్ల పార్లమెంటు ప్రతిష్ట ఎంత ఇనుమడించింది.

తీవ్రవాదాన్ని కట్టుదిట్టం చేసేందుకు ఒక ప్రభుత్వం అదే పార్లమెంటులో “పోటా” అనే చట్టాన్ని చేస్తే, ఆ తర్వాత వచ్చిన మరో ప్రభుత్వం అదే పార్లమెంటులో ఆ చట్టాన్ని పీకి పారేసింది. అంటే, ఆ చట్టం చేసిన ప్రభుత్వానిదైనా తప్పుడు నిర్ణయం అయ్యుండాలి, లేదంటే ఆ చట్టాన్ని తీసేసిన ప్రభుత్వానిదైనా తప్పుడు నిర్ణయం అయ్యుండాలి. ఇటువంటి ఉదంతాలు పార్లమెంటు ప్రతిష్టకు తిలోదకాలు ఇవ్వటంలేదనే భావించాలా? తప్పుడు నిర్ణయాలు తీసుకునే చట్టసభలు ఎవరికి జవాబుదారీ?

అన్నాను పక్కన పెట్టటానికి, అన్నా ఉద్యమంతో ప్రభావితులైన ప్రజలను మభ్య పెట్టటానికి లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టటం తప్ప గత్యంతరంలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. మన చేతులకు మనం సంకెళ్ళు వేసుకోవటమా అంటూ లాలు యాదవ్, తదితరులు తమ తమ ప్రేలాపనలతో నిస్సిగ్గుగా లోక్ పాల్ ను వ్యతిరేకిస్తున్నామని చెప్పగలిగితే, ఆ మాత్రం ధైర్యం చేయలేని పాలక, ఇతర ప్రతిపక్షాలు పార్లమెంటులో లోక్ పాల్ బిల్లుకు శల్య సారధ్యం వహించటానికి నిశ్చయించాయని ఇప్పుడు స్పష్టమౌతున్నది.

పౌర సమాజం చేసిన ప్రతిపాదనలను కనీసమాత్రంగా కూడా చర్చించకుండానే తుంగలో తొక్కేసినప్పుడే లోక్ పాల్ పై ప్రభుత్వపు నిజాయితీ తెలిసొచ్చింది. ఆపైన, ప్రతిపక్షాలు వ్యతిరేకత చూపించే అంశాలు (రాష్ట్రాలలో లోకాయుక్త, లోక్ పాల్ నియామకంలో రిజర్వేషనులు) చొప్పించి లోక్ పాల్ బిల్లుకు మరోసారి పురిటిలోనే సంధి కొట్టించింది ఈ ప్రభుత్వం. నిజానికి, లోక్ సభలో బిల్లు పాసైనందుకు బెంగపడి ఉంటాడు ప్రధాని. అదృష్టం కొద్దీ కాగల కార్యాన్ని పెద్దల సభ తీర్చేసి ఆ బెంగను కూడా తీర్చేసింది.

ఏదేమైనా కర్రా విరగలేదు, పాము చావలేదు. పార్లమెంటు పంజరంలో ప్రజాస్వామ్యం బందీగానే మిగిలిపోయింది.