ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

బీహారు – రోగమో! భోగమో!!

Like-o-Meter
[Total: 0 Average: 0]

అన్నీ సాగితే రోగమంత భోగం ఉండదని బీహారీయులకు తెలుసు. అందుకే ఎంచగ్గా రోగాన్నే ఎన్నుకున్నారనేది నిజమే అయినా, మొత్తానికి బీహారులో జరిగిన ఓ పెద్ద పరీక్షలో మోడీ నేతృత్వంలోని భా.జ.పా. మట్టి కరచిందనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఢిల్లీలో జరిగిన పరాభవం కన్నా ఇది ఎన్నో రెట్లు ఎక్కువనేది కూడా నిజమే. ఎందుకంటే, మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, భా.జ.పా.లకు ప్రత్యామ్నాయంగా ఆ.ఆ.పా.ని ప్రజలు గెలిపించారని అనుకున్నా, ఇప్పటి బీహారు ఎన్నికలలో పదేళ్ళ పరిపాలన తరువాత కూడా నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి గెలవటం భా.జ.పా. తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. బీహారులోని కుల సమీకరణాల రాజకీయాలే ఓటమికి కారణంగా భా.జ.పా. కళ్ళకు గంతలు కట్టుకుంటే, ఇటువంటి పరాభవమే రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కూడా జరిగే అవకాశాలున్నాయి. బీహారు ఎన్నికల ఫలితాలను ఆ రాష్ట్ర కుల సమీకరణాల ఆధారంగా నిర్ధారించటం అవివేకం. ఎందుకంటే, ఆ రాష్ట్ర ప్రజలే మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో భా.జ.పా.ను అత్యధికమైన సీట్లతో గెలిపించారనేది విస్మరించరాని విషయం. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధే నినాదంగా ఎన్నికల ప్రచారం చేసిన భా.జ.పా. బీహారులో ఆ నినాదం మర్చిపోయి, వైరిపక్షం వేసిన రొంపిలో కూలబడటం కూడా మరో కారణం.

తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కా దిగా సరిపోయిందన్నట్లు, ప్రధాని మోడీ గారికి విదేశాలకు ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటే సరిపోయింది కానీ, దేశం గురించి తగినంత తీరిక దొరకలేకపోయింది. ఈ ఎన్నికల ఫలితాలు 18 నెలల మోడీ పరిపాలనపై ప్రజల అభిప్రాయంగా పరిగణించరాదని అంటున్నా, ఈ విషయాన్ని ప్రస్తావించక తప్పటంలేదు. ఒక ప్రధానిగా పరిపాలనలో మార్పులు తీసుకువస్తూనే ఉండి ఉండవచ్చు. కానీ, సామాన్యులెవరికీ ఆ మార్పులు ఇప్పటిదాకా అయితే కనిపించటంలేదు. మంచి రోజులు కాకపోయినా, పాత రోజులే నయమనిపించే విధంగా పరిపాలన నడుస్తున్నదనేది నిష్టూరమైన నిజం. పప్పులు ఉప్పులు తాళాలు వేసుకుని వాడాల్సిన పరిస్థితి. పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించామని గొప్పలు చెప్పుకోవటమే కానీ, పర్యవసానంగా తగ్గాల్సిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనందుకు మాత్రం బాధ్యత వహించటంలేదు ఈ ప్రభుత్వం. అగ్నికి ఆజ్యంలా ఇప్పుడు స్వచ్ఛభారత్ పన్నొకటి వేస్తున్నారట! పద్ధెనిమిది నెలలైనా, చేసిన వాగ్దానాలు కార్యరూపం దాల్చటంలేదంటే లోపం ఎవరిది? ఇక అవినీతి నల్లధనం గురించైతే నీళ్ళు నములుతున్నారంటే అతిశయోక్తి కాదు.

 

అధికార మదం ఎంతటివాడినైనా అంధకారంలో పడేస్తుంది. బీహారులో ఎన్నికలు కాబట్టి, ఆ రాష్ట్రానికి లక్షా పాతికవేల కోట్ల ప్యాకేజీలా, జమ్మూ కాశ్మీరులో తమ ప్రభుత్వం కాబట్టి, ఆ రాష్ట్రానికి ఎనభైవేల కోట్ల ప్యాకేజీయా! కొత్త రాష్ట్రంగా ఏర్పడి, రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పాపం ఏమిటి? ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు ప్రజలు గమనించలేదనుకుంటే పెద్ద పొరబాటే. కేవలం భా.జ.పా.కు లాభిస్తుందనుకుంటేనే ఆయా రాష్ట్రాలకు సహాయం చేయటం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఆంధ్రుల అరచేతిలో బెల్లం పెడుతున్నామని నమ్మిస్తూ మోచేతులు నాకిస్తున్నారు. ఈ అనౌచిత్యాన్ని ప్రశ్నించిన ఆంధ్రుల మీద వెంకయ్య నాయుడు గారు ఎలా నోరుచేసుకున్నదీ ఆంధ్రులు చూసారు. ఈ అహంకారమే పదేళ్ల యు.పి.ఎ. ప్రభుత్వానికి సమాధి కట్టిందనేది మరచిపోతే భా.జ.పా.కే నష్టం.

కేవలం 44 మంది ఎం.పీ.లతో ప్రభుత్వ ఏజెండాను, పార్లమెంటు ఏజెండాను కాంగ్రెస్ నిర్దేశిస్తున్నదంటేనే, ఈ ప్రభుత్వపు చేవలేనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కొన్ని మీడియా ఛానళ్ళు చెప్పులోని రాళ్ళలా, చెవిలోని జోరీగల్లా రొద పెడుతుంటే, ఏమీ చేయలేని చవటలా ప్రభుత్వం నీళ్ళు నములుతూ దిక్కులు చూస్తున్నది. 2014 ఎన్నికల వరకూ, అయ్యో పాపం మోడీని కాంగ్రెస్ దన్నుతో ఈ మీడియా ఎన్ని వెతలు పెట్టిందని జాలిపడ్డారు ప్రజలు. అదీ ఒక కారణంగా ప్రజలు వోట్లు వేసి మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం జరిగింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత బీహారు ఎన్నికల ముందు కూడా ఇదే పాట పాడితే, తమ చేతగానితనానికి ప్రజలు మళ్ళీ వోట్లు వేస్తారని అనుకుంటే ఎలా? తోచీతోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళినట్లు, అధికారంలో ఏం చేయాలో తెలియని ఆపార్టీ నేతలు కొందరు సమయం సందర్భం లేకుండా అడ్డదిడ్డంగా చేస్తున్న వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు పరిస్థితికి ఏమాత్రమూ దోహదపడేవి కావు. దాద్రీలో జరిగిన హత్యకు మతపరమైన బూచిని కారణంగా చూపించిన విపక్షాలను రాజకీయంగా ధీటుగా ఎదుర్కోలేని భా.జ.పా. నేతలు చేసిన అధిక ప్రసంగాలు అనవసరమైన రాద్ధాంతాన్నే సృష్టించాయి. దాద్రీ, అవార్డ్ వాపసీ లాంటి విషయాలను ప్రతిపక్షాలు చిలికి చిలికి గాలివాన చేస్తున్నప్పుడైనా, నేతలంతా పార్టీపరంగా రక్షణాత్మక ధోరణితో మాట్లాడటమేంటి? ప్రధాని మాట్లాడకపోయినా ఫర్వాలేదు,  ప్రభుత్వపరంగా ఎటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు?

ఎన్నో దశాబ్దాల తర్వాత ఏక పార్టీ పాలన కోరుకుంటూ గద్దెనెక్కించిన ప్రజలకు ఏం కావాలనేది భా.జ.పా.కు ఇంకా అర్ధమైనట్లు లేదు. మైనారిటీ ముసుగులో జరిగే దాష్టీకాలను నిరశిస్తున్నారంటే, కాషాయీకరణ సమర్ధిస్తున్నారని కాదు. గోహత్య నిరశిస్తున్నారంటే, హైందవ సామ్రాజ్యం స్థాపించమన్నారని కాదు. హిందు దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం నిరశిస్తున్నారంటే, మసీదులు చర్చులను కూడా ప్రభుత్వం దోచుకోవాలని కాదు. నిజమైన లౌకికవాదంతో అందరినీ కలుపుకొని అభివృద్ధే ఏజెండాగా దేశాన్ని ముందుకు నడిపించమని.