ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మన సంక్రాంతి పండుగ

Like-o-Meter
[Total: 4 Average: 4.3]

 

ఆరుగాలం శ్రమించే రైతాంగమే మన భారతావనికి జీవగర్ర. బీడు భూమిని జాతి జీవనాడిగా మార్చి, పౌష్యలక్ష్మి పూజకై, పొంగళ్ళ పొంగుల్ని ప్రతి ఇంటా కూర్చేందుకు రైతన్న తన పొలానికై కదలేప్పటి వైభవాన్ని కళ్ళారా చూడగలగడం ఒక గొప్ప అనుభూతి. ఆ అనుభూతిని అందిస్తూ, అంబరాన్ని తాకే సంబరాల సమాహారం “సంక్రాంతి.”

 

@@@@@@

 

వెచ్చని సూర్య కిరణాలతో మేలుకొనే పంట చేను…

 

కోతలు కోసి కుప్పలు పోసిన వరి చేలు…

 

మోసు వేసిన మొక్కజొన్న పొత్తి…

 

వరుస గింజలతో పలుకరించే జొన్నకంకి…

 

గెంతులేసే లేగదూడలు…

 

తొలి దిగుబడి చేతికందిన సంతోషంతో రైతు సోదరులు…

 

పెద్దలను, పిల్లలను, పశువులను, ప్రకృతిని సాకల్యంగా కూర్చిన అద్భుత దృశ్యమే “సంక్రాంతి” పండుగ.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

@@@@@@

 

అడుగడుగునా పలకరించే రంగవల్లికలు…అలరించే గొబ్బెమ్మలు…వీధి వీధినా భోగి మంటలు…

హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు…

పెద్దలకు పెట్టడానికని తెచ్చిన కొత్త బట్టలు…

కోలాటాలు, కోలాహలంగా చిందులు వేసే చిన్నారులు, ఎడ్ల పందాలు…

ఇలా ఎన్నెన్నో అపూర్వ సందర్భాలను ఒక పూమాలలా కూర్చి ఇస్తుంది “సంక్రాంతి”

 

@@@@@@

 

సంక్రాంతి అంటేనే కుటుంబ ఉత్సవం. చల్లటి ప్రకృతి ఒడిలో, వెచ్చటి భోగి మంటలు వేసి, చెరకు ముక్కల తియ్యదనాన్ని ఆస్వాదిస్తూ, పట్టణాల నుండి పల్లెకు తరలివచ్చి ఇంటిల్లిపాది ఒకచోట చేరి చేసుకునే సంబరం పేరే సంక్రాంతి. అందుకే ఈ పండుగ సంబరాల సంక్రాంతి అయింది.

 

@@@@@@

 

మసక చీకటిలో హరిదాసుల సంకీర్తనలు అలలు అలలుగా తేలివస్తుండగా …

తెల్లవారక ముందే ఇళ్ళ ముందు భోగి మంటలు చిటపటలాడుతుండగా…

చలిమంటలు కాచుకొంటూ, కేరింతలు కొడుతూ, భోగి మంటల చుట్టూ ఆటలాడే చిన్నారులు…

ముందురోజు రాత్రే గోరింటాకు నూరి చేతులకు పెట్టుకుని అది పండే వరకు నిద్రపోకుండా మేల్కొన్న యువతులు… తమ చేతి గాజుల గలగలలతో, గోరింట పండిన చేతులతో ముగ్గులు వేసి వాటి మధ్య గొబ్బెమ్మలను పెడుతుంటే నడిరాతిరి భువిపై హరివిల్లు విరబూసినట్టుగా కనిపించే పండుగ…మన “సంక్రాంతి” పండుగ!

 

@@@@@

 

ధాన్యలక్ష్మితో నిండిన తమ ఇళ్ళకు ఎలాంటి దృష్టిదోషాలు తగలకుండావుండాలని / పాత వస్తువుల్ని పోగు చేసి / వేసే /భోగి మంటలు.

 

ఆ భోగి మంటలలోనే కాచిన వేడినీటితో చిన్నారులకు తలంటు పోయడం ద్వారా అరిష్టాలు తొలగిపోతాయని భావించే తల్లిదండ్రులు.

 

సాయంత్రం వేళ చిన్నారులను సింగారించి చేసే భోగి పేరంటం. రేగుపండ్లు, చెరకు ముక్కలు, నాణ్యాలు, బంతిపూలు కలిపి చిన్నారుల పై పోసి పెద్దలు ఆశీర్వదించే అపూర్వ దృశ్యమే / భోగిపళ్ళు.

 

@@@@@

 

ముగ్గులు మన సంస్కృతిలో విడదీయలేని భాగాలు.

 

ముగ్గువేయడం అనే అపురూప కళను అమ్మ, అత్త, బామ్మల వద్ద నేర్చుకునే యువతులు…

 

సంక్రాంతి రోజున, సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి, ఇంటి ముంగిళ్ళనే వేదికలపై రంగురంగుల రంగవల్లికలను తీర్చిదిద్దే  ముద్దుగుమ్మలు…

 

రంగవల్లుల మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు, పసుపు కుంకుమలతో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి.

 

ఉమ్మెత్త, బంతి, గుమ్మడి, చామంతి, మందార పువ్వుల సింగారాలతో మెరిసే గొబ్బిళ్ళు. ఆ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాడుతూ ఆడే పడుచులు…

 

ముగ్గుల మధ్యలో ఉంచే పెద్ద గొబ్బిని శ్రీకృష్ణ పరమాత్మగాను, చుట్టూ వున్న గొబ్బిళ్ళను గోపికలుగాను భావిస్తూ పాడే గొబ్బి పాటలు…

 

ఇలా ఆధ్యాత్మిక, కళా, సంస్కృతుల అపూర్వ సమ్మేళనం – మన “సంక్రాంతి” సంబరం.

 

@@@@@@




ముగ్గును సంస్కృతంలో “రంగవల్లి” అంటారు. “రంగవల్లి” అంటే మనసును రంజింపజేసే తీగ అని అర్థం. రకరకాల ఆకారాల్లో చుక్కలను పెట్టి, ఒక క్రమపద్ధతిలో ఆ చుక్కల్ని కలిపి / అద్భుతమైన రంగవల్లులు తీర్చిదిద్దుతారు తెలుగింటి ఆడపడచులు. బ్రహ్మదేవుడు నుదుటి రాతను గీతలుగా వ్రాసినట్టే ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటిలోని వారి సంస్కృతిని, సంస్కారాన్ని తెలుపుతుందంటారు. చుక్కల చుట్టూ మెలికలు తిరుగుతూ సాగే వంపుసొంపుల ముగ్గుల్లో ఉన్న ఆకర్షణ తనివి తీరనిది, మరపురానిది.

 

కుటుంబం ముగ్గు పిండైతే, కుటుంబ సభ్యులు చుక్కలు. ఆ చుక్కల్ని కలిపే ముచ్చటైన గీతే మన ’సంక్రాంతి’ పండుగ.

 

@@@@@

 

పంటలు విస్తారంగా పండడానికి అనువైన సమయం గనుక సంక్రాంతి వేళకు పొలాలన్నీ పచ్చగా వెలిగిపోతూ కోతలకు సిద్ధమైవుంటాయి. ఎండనక, వాననక పనిచేసే రైతన్నల చెమట చుక్కల స్పర్శకు భూమితల్లి పులకరించి, వెనువెంటనే కనికరించి, కరుణిస్తుంది. భూమితల్లి దయవల్ల పొలాలన్నీ పచ్చగా కళకళలాడుతాయి. మట్టి నుండి మొలచిన ఆకుపచ్చని రతనాల పంట రైతు కళ్ళల్లో వెచ్చటి ఆనంద బాష్పాలను జలజల రాలుస్తుంది. ప్రతి రైతు ముంగిట ధాన్యపు రాశులు తీరివుంటాయి. ప్రతి ఇంటిలోనూ సంబరమే సంబరం. ఆ సంబరాల వెలుగు నిండిన అంబరం మన ’సంక్రాంతి.’

 

 

@@@@@

సంక్రాంతి పర్వదినాల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక జానపద కళారూపాలు కొన్ని ఉన్నాయి. జంగమ దేవరలు, హరిదాసులు, బుడబుక్కలవారు, డూడూ బసవన్నలను ఆడించే గంగిరెద్దులవారు ఈ సంక్రాంతి నాడే మనకు కనబడతారు.

 

వైష్ణవ దీక్షను పొంది హరినామ సంకీర్తనల ద్వారా గ్రామ గ్రామాన, ఇంటింటా ఆధ్యాత్మిక చైతన్యాన్ని వ్యాప్తి చేసే వారే హరిదాసులు. రైతుల ఆనందం కోసం వారి ఇళ్ళ ముందు నిలబడి “అంబ పలుకు జగదంబ పలుకు” అంటూ చేతిలోవున్న చిన్న ఢమరుకంతో వింత శబ్దాల్ని సృష్టిస్తూ సాగే బుడబుక్కల వాళ్ళు! విలక్షణ రీతిలో అలంకరించబడ్డ బసవన్నలు, వాటిని నైపుణ్యంగా ఆడించే గంగిరెద్దుల వారంటే ఊరువాడ, పెద్దపిన్నా అందరికీ అభిమానమే!  మరి మన సంక్రాంతి అంటే ఇదే కదా!

 

వృత్తి కళలకు, కళా రూపాలకు, అచ్చతెనుగు సంస్కృతికి పట్టిన అద్దం…మన సంక్రాంతి!

 

@@@@@

(Script written for S.V. Bhakti Channel for 2016 Sankranti special program)