ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆంధ్రాకు బాబు మాత్రమే…

Like-o-Meter
[Total: 6 Average: 3.8]

 

 

లోటు బడ్జెట్టు.

రాజధాని లేదు.

ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే.

చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు.

మౌలిక వసతులు లేవు.

సమైక్య రాష్ట్రం నుంచి అంటించబడ్డ అప్పులు, అందజేయని ఆదాయాలు. అన్నిటికన్నా ముఖ్యంగా, నేతలపై ప్రజలలో రగులుతున్న అపనమ్మకం. పార్లమెంటులో అప్పటి ప్రధాని ప్రకటించిన ప్రత్యేక హోదా ఒక్కటే, కొసప్రాణానికి ఊపిరులూది ఆంధ్రులకు ఓ నమ్మకాన్ని కలిగించింది. సమస్యలను ఎదుర్కొనే సాహసాన్ని రగిలించింది. 2014 నాటికి, పాతపేరుతో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి స్థూలంగా ఇది.

 

అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు…

రాజకీయలబ్ది కోసం హడావుడిగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ అయినా, ఆ గంతకు తగ్గ బొంతలా విభజన పాపంలో పాలుపంచుకొన్న భాజపా అయినా, రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళలాంటివన్న తెదేపా అయినా, తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించాయే కానీ, ఆంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోలేదనేది యధార్థం. ఆంధ్రాకు ఆలంబనగా నిలవాల్సిన అవసరాన్ని ఏ పార్టీ గుర్తెరగలేదు. ప్రత్యేక హోదాపై సరైన ప్రస్తావన లేకుండానే విభజన బిల్లు ఆమోదించారు. తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా, అప్పటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించటమే కాకుండా, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరు కూడా మంత్రిమండలి సమావేశంలో తీర్మానించి ఆమోదించారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో రాష్ట్రానికి ఓ సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని ప్రజలకు తెలుసు. దాదాపు ఒక దశాబ్దం పాటు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలనాదక్షుడుగా పేరుపొందిన బాబు మీద ఆశలన్నీ నిలుపుకున్నారు. అంతేకాక, బాబుకు తోడుగా ఉంటూ, రాష్ట్రానికి నీడలా ఉండి, ప్రత్యేక హోదా ఇచ్చి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రాని తీర్చిదిద్దే ప్రయత్నంలో నేను కూడా భాగస్వామినౌతాననే నరేంద్రమోడీని నమ్మారు. అరమరికలు లేకుండా, ఆంధ్రులు వేసిన వోటుతో ఎన్.డి.ఏ. భాగస్వామిగా తెదేపా ఘన విజయం సాధించింది.

 

అయ్యవారు అంతంత, అయ్యవారి పెళ్ళాం ముంతంత…

ముందుగా, ప్రత్యేక హోదా విభజన బిల్లులో లేదు అంటూ మీనమేషాలు లెక్కించారు. ఆనక, ప్రత్యేక హోదా చట్రంలో ఆంధ్రప్రదేశ్ ను ఇరికించలేమని తేల్చారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నసిగారు ఇంకొన్నాళ్ళు. ప్రత్యేక ప్యాకేజీ కూడా చట్టబద్ధం చేయలేమని గునుస్తూ చేతులెత్తేసారు. కావాలంటే, ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని కుండ బద్దలు కొట్టేసారు… అయ్యవారు.

బీహార్ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి ప్రకటించిన లక్షకోట్ల సాయంలాగా, కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి ప్రకటించిన మూడు లక్షల కోట్ల సాయంలాగా, ప్రత్యేక సాయం మాత్రమే చేస్తారట! కొత్తగా ఏర్పడ్డ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో పోలికేమిటనేది మనకు అర్ధం కాదు. పోనీ విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ చేసారా అంటే అదీ లేదు. ఉదాహరణకు; దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోను, రాయలసీమ ఉక్కు కార్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, పోలవరం, విశాఖ మెట్రో తదితరాలు. ఇకపైగా, వాటి సంభావ్యత గురించి మాత్రమే విభజన చట్టంలో ఉన్నదనే ముక్తాయింపు.

[amazon_link asins=’9387146588,B078MQ9QBY,B07C878QQH,B01N6G1DZ4′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’03e6a88e-a388-452d-922f-98601b817bf7′]

అర ఘడియ భోగం, ఆర్నెల్ల రోగం అన్నట్లు…

ఎన్.డి.ఏ. భాగస్వామిగా తెదేపా బావుకున్నది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే, మోడీలాంటి ఓ చపలచిత్తునితో సఖ్యత తెదేపా అస్థిత్వానికే ముప్పు తెచ్చిపెట్టింది. దేశప్రధాని హోదాలో ఒక కొత్త రాష్ట్ర రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన మోడీ గుప్పెడు మట్టి, చెంబెడు నీళ్ళు ఇస్తాడని బహుశా బాబు కూడా ఊహించి ఉండడు. మొహమాటానికైనా చేయబోయే సాయం గురించైనా ఓ ప్రకటన చేస్తాడని ఆశించి భంగపడి ఉంటాడు.

పోనీ ఓ బాధ్యతగల ప్రధానిగా, అయిదు కోట్ల ఆంధ్రులకు ప్రత్యేక హోదా విషయంపై వివరణ ఇచ్చారా అంటే,అదీ లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులతో అడ్డుతెరల వెనక అంటకాగుతూ, ప్రత్యేక హోదా విషయంలో బాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయటం! ఇకపైగా, ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ నేత జగన్ పెట్టిన  త్తిళ్ళకు బాబు భయపడ్డాడని ప్రకటనలు చేయించటం. ప్రత్యేకహోదా ప్రత్యేక ప్యాకేజిలా మారినప్పుడు, ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక సాయంలా మారినప్పుడు బాబుతో చర్చలు జరిపారా లేదా? బాబు ఒప్పుకుని ఉంటే, ఆ చర్చల వివరాలు బయటపెట్టాలిగా? ఆ పని చేయలేదంటే ఏమని అర్ధం చేసుకోవాలి? అదేమైనా రెండు పార్టీల మధ్య జరిగే లోపాయికారి ఒప్పందమా లేక అయిదుకోట్ల ఆంధ్రులతో ముడిపడ్డ విషయమా? నిజానికి కేంద్రంలోని భాజపాతో తెదేపా సఖ్యత రాష్ట్రానికి వీసమెత్తు ఉపయోగం లేకపోగా తెదేపాకి తీవ్ర నష్టాన్ని మాత్రం కలిగించింది.

 

అత్తపేరు పెట్టి కూతురిని కొట్టినట్లు…

దరిమిలా బాబుకున్న మూడో కన్ను తెరుచుకుంది. సామరస్యంతో పొత్తులో కొనసాగి, రాష్ట్రానికి మేలు చేయగలమనే నమ్మకానికి తూట్లు పడ్డాయి. తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాడు. తెగదెంపులు చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలేసాడు. అప్పటిదాకా, కేంద్ర సాయం మురిగిపోయిన లడ్లుగా తీసిపారేసిన పవన్, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తామని గర్జించిన జగన్ ఒక్కసారిగా చల్లబడ్డారు. ఆ పోరాటానికి సంఘీభావం తెలుపకుండా, అన్ని మాటలు మార్చిన తెదేపాని మేము నమ్మం అని ఎక్కెసెక్కాలాడారు. పిల్ల పార్టీలు కాబట్టి, వారి రాజకీయ విజ్ఞత వారికే వదిలేద్దాం. మరి భాజపా చేసిందేమిటి?

రాష్ట్రానికి నిధులు ఇవ్వటం లేదంటే, యు.సి.లు ఇవ్వట్లేదని అబద్ధాలు చెప్పింది. ఫలానా ఆసుపత్రులు, కళాశాలలు కట్టలేదంటే, రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదని నెపం బాబు మీదకు తోసింది. ఫలానా ప్రాజెక్టు గురించి వివరణ కోరితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వలేదని అబద్ధాలు చెప్పింది. సాక్షాత్తు దేశ ప్రధాని, పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యు.సి.లు ఇవ్వలేదని ప్రకటించాడంటే తిమ్మినిబమ్మి చేయాలనే భాజపా కుటిల ప్రయత్నాలు మనకు తెలిసివస్తాయి. మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ఆర్ధిక శాఖకు నీతి ఆయోగ్ వ్రాసిన లేఖలో చాలా స్పష్టంగా యు.సి.లు ఉన్నాయని చెప్పినా, మోడీ ఈ దుర్మార్గపు అబద్ధాలు చెప్పటం మానలేదు. ఆర్ధికశాఖ సహాయమంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం కూడా మోడీ అబద్ధాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. అతిపెద్ద వింత ఏమిటంటే, ఇటుపక్క ఆంధ్రరాష్ట్రాన్ని అవినీతిమయమైన తెదేపా నాశనం చేస్తున్నదని భాజపా నాయకులు విమర్శిస్తుంటే, అటుపక్క వివిధ కేంద్రప్రభుత్వ సంస్థలు ఆయా శాఖలలో సాధించిన ప్రగతికి ఆంధ్రా రాష్ట్రానికి వందల సంఖ్యలో అవార్డులు ఇస్తున్నాయి!

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను పక్కదారి పట్టించటం నుంచి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలను నియంత్రించటం వరకు, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం అనే అర్ధంపర్ధంలేని విమర్శల నుంచి రాష్ట్ర మంత్రులు, తెదేపా నాయకుల మీదకు దర్యాప్తు సంస్థలను పురిగొల్పటం వరకు, అన్నిరకాల దండోపాయాలని ఉపయోగించి విఫలమైంది మోడీ ప్రభుత్వం. మొత్తానికి బాబు మీది తన పగను, రాష్ట్రం మీద చూపిస్తున్నాడు మోడీ.

 

నంగనాచి చీర నడివీధిలో ఊడినట్లు...

ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో నరేంద్రమోడీ నిజాయితీలేమి నిలువెత్తు నగ్నంగా ఆవిష్కృతమయ్యింది. పట్టుమని పదిమంది సభ్యుల మద్దతు లేక జగన్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం కూలబడితే, బాబుకు చేయూతనందిస్తూ వందకుపైగా సభ్యులు చేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కూడా మోడీ సిద్ధం కాలేకపోయాడు. ఎట్టకేలకు తలవొగ్గి చర్చ ప్రారంభించినా, ఆరుకోట్ల ఆంధ్రుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలాడు. ఎన్.టీ.ఆర్.ను బాబు వెన్నుపోటు పొడిచినట్లుగా పరోక్షంగా ప్రస్తావించిన పెద్దమనిషి, ఆ బాబుతో ఎన్నికల పొత్తు ఎందుకు పెట్టుకున్నాడనే ప్రశ్నకు ఈనాటివరకూ సమాధానం ఇవ్వలేకపోయాడు.

*****

2014 ఎన్నికల ముందు, మోడీ-బాబుల కూటమి దేశానికి రాష్ట్రానికి చక్కని దిశానిర్దేశం చేస్తుందని ఆశించినవాళ్ళలో నేను ఒకడిని. ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రానికి కేంద్రం మొండి చేతులు చూపిస్తున్నా కిమ్మనకుండా కూర్చున్న బాబును విమర్శించిన రోజులు చాలా ఉన్నాయి. తన ప్రభుత్వ అసమర్ధత, అవినీతి కారణంగా పెదవి మెదపకుండా ఉన్నాడనే అందరిలా భావించా కానీ ఓ దార్శనికుడుగా సహనంతో వేచి చూస్తున్నాడని భావించలేదు. అసలు పొత్తే లేకుండా ఉన్నా, 2015 నాటికే పొత్తు నుంచి బాబు దూరమైనా రాష్ట్రం అధోగతిలో ఉండేది. ఏటికి ఎదురీదుతూనే, తన గమ్యాన్ని నిర్దేశించుకుంటూ బాబు చేస్తున్న ప్రయాణం నిజంగా ఓ అద్భుతం. ఎట్టకేలకు రాష్ట్రం ఓ గాడిన పడిందనే నమ్మకం కలుగుతున్నది.

అన్నం పెట్టినవాడిని, తన్నులు తన్నినవాడిని ఆంధ్రులు అంత తేలికగా మరచిపోరు. ఏదేమైనా, తెలివితక్కువగా విభజన చేసి ఆంధ్రులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అయితే, ఆసరాగా నిలబడతారనుకున్న భాజపా ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచి, నోటిలో మట్టి కొట్టింది. ఆదాయం లేకున్నా, ప్రకృతి విపత్తులు చుట్టుముట్టినా, మిత్రులే శత్రువులుగా మారినా, సంక్షోభాలెన్ని చుట్టుముట్టినా, రాష్ట్ర సంక్షేమానికి బాబు కృషి చేస్తున్నాడనేది నిజం. బాబులాంటి రాజకీయ దురంధరుడికే చెమటలు పోస్తున్న పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్, జగన్ వంటివాళ్ళతో రాబోయే కేంద్ర ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటాయనేది నిష్టూరమైన నిజం.

2019లో ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో బాబు ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. రాష్ట్ర భవిష్యత్తును 2019 ఎన్నికలు నిర్దేశించబోతున్నాయని ఆంధ్రులు గ్రహించాలి. జాతీయ పార్టీలను పెకిలించి వేయాలి. రాష్ట్రానికి బాబు మాత్రమే అవసరం.

*****