ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

రెడ్డొచ్చె మొదలాడా?

Like-o-Meter
[Total: 4 Average: 4.5]

 

ఎట్టెకేలకు ఎన్నికల యుద్ధం ముగిసింది. దాదాపు 40 రోజులకు పైగా కొనసాగిన ఈ యుద్ధ ఫలితాలు, దేశ ప్రజల తీర్పులోని విలక్షణతకు, విచక్షణతకు అద్దం పట్టింది. పెద్దనోట్ల రద్దు, జి.ఎస్.టి. అమలు, నల్లధన వ్యవహారంలోని వైఫల్యాల మధ్య కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజపా మరోసారి గద్దెనెక్కింది. చాలామంది విశ్లేషకుల అంచనాల ప్రకారం సర్జికల్ స్ట్రైక్స్ వల్ల ఈ అద్భుతమైన విజయం దక్కిందిట! ఆశ్చర్యం ఎందుకంటే, మునుపు వాజ్‌పేయి నేతృత్వంలో కార్గిల్ యుద్ధం గెలిచిన తర్వాత కూడా భాజపా 200 సీట్లు కూడా తాకలేకపోయింది. ఈసారి, కేవలం సర్జికల్ స్ట్రైక్స్ వల్ల 303 సీట్లు గెలుచుకోవటం ఆశ్చర్యమే కదా! ఎన్నెన్నో ఒడుదుడుకుల మధ్య, మరెన్నో ఆశల మధ్య 2014లో ఏర్పడిన భాజపా ప్రభుత్వం  చెప్పుకోదగ్గ విజయాలేమీ లేకుండానే 2019లో విజయబావుటా ఎగరవేసిందనేది వాస్తవం.

ఇక ఆంధ్రా విషయానికి వస్తే, చాలామందికి కలిగే అనుమానం ఒక్కటే. దేశస్థాయిలో మోడీ చేసిందేమిటి, రాష్ట్రస్థాయిలో బాబు చేయనిదేమిటి? రాష్ట్ర విభజన దరిమిలా జరిగిన 2014 ఎన్నికల సమయానికి, ఆంధ్ర రాష్ట్రం నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుమొక్కులేక దైన్యంగా నడిరోడ్డు మీద నిలబడి ఉంది. సమైక్య రాష్ట్రంలో ఒక దార్శనికుడుగా నిలచిన బాబుకు, గుజరాత్ దార్శనికుడుగా పేరు గడించిన మోడీ అండగా నిలబడతాననే వాగ్దానానికి ప్రజలు ఉప్పొంగి రాష్ట్రంలో బాబును గెలిపించారు. ఆ తర్వాతి సంఘటనల నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అటక ఎక్కింది. దాదాపు నాలుగు సంవత్సరాలు నలిగిన తెలుగుదేశం, భాజపాల సంబంధం కూడా చివరికి ఊపిరి వదిలింది.

ఈ వైఫల్యానికి తప్పొప్పులు వెదికే సందర్భం కాకపోయినా కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పదు. ప్రత్యేక హోదా విషయంలో ఇటు భాజపా బాబును మోసం చేస్తే, ఆంధ్రాలోని ప్రతిపక్షాలు బాబును మోసగాడిగా చిత్రించే ప్రయత్నాలు చేసాయి. నలువైపులా వస్తున్న ఒత్తిళ్ళ మధ్య చివరికి భాజపాతో బాబుకు తెగదెంపులు చేసుకోక తప్పలేదనేది మరో వాస్తవం. బాబు ఎన్.డి.ఏ.లో ఉంటే, ఇప్పుడు గెలిచి ఉండేవారా? బయటకు రావటం వల్ల ఓడిపోయారా? అనే ప్రశ్నలు విశ్లేషణకు అందనివి. ఎందుకంటే, ఒకవేళ ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా, బాబు భాజపాతోనే అంటకాగి ఉంటే, అప్పటికే ప్రత్యేకహోదా కోసం ఉద్యమాలు లేవదీసిన పార్టీలు, ఇది మరింత అనువుగా తీసుకొని ఉండేవి.

Anveshi – An Explorer’s Journey. SUBSCRIBE. SHARE. SUPPORT
 

మరి, కూటమి నుండి బయటకు వచ్చి ప్రత్యేకహోదా కోసం పోరాడినా తెలుగుదేశం ఎందుకు ఓడిందనేదానికి ఏం సమాధానం చెబుతారు?  ప్రజలు మార్పు కోరుకున్నారనే సమాధానం ఒక్కటే సరిపోయే అవకాశం ఉంది. బాబు నేతృత్వంలో తీసుకురాలేకపోయిన ప్రత్యేకహోదా, బహుశా జగన్ తీసుకువచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు భావించి ఉంటారని చెప్పుకోవచ్చేమో! ఏదేమైనా, పట్టిసీమ పూర్తిచేసినా, కేంద్రప్రభుత్వం సరైన తోడ్పాటు అందించకపోయినా పోలవరం, అమరావతి నిర్మాణాలకి పూనుకున్నా, ఎన్నెన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాగలిగినా, ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, ప్రజలు మాత్రం బాబుకు విరామాన్ని ఇచ్చారు.

మరి, ప్రజలు ఏ మాశించి జగన్‌కు ఓట్లు వేసారు? బాబు అసమర్ధతను భరించలేకనా? బాబు ప్రభుత్వంలోని అవినీతి భరించలేకనా? మరి జగన్ సమర్ధత గురించి ఎలా అంచనా వేసి ఉంటారు? జగన్ మీద ఉన్న అక్రమ సంపాదన కేసులు మర్చిపోయారనుకోవాలా? నాకు తెలిసీ, ప్రైవేటుగా చాలామంది ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పుకునే విషయం ఏమిటంటే, బాబు రాష్ట్రాన్ని సరైన పథంలో నిలబెట్టాడు. అభివృద్ధికి సరైన బాటలు పరిచాడు. కానీ, కేంద్రంతో సయోధ్య లేని కారణంగా అనుకున్నంత వేగంగా అభివృద్ధి జరగలేకపోతున్నది అని. బహుశా, ఆ ఉద్దేశ్యంతోనే, ప్రజలు జగన్‌కు ఓటు వేసి ఉంటారు.

అమరావతి నిర్మాణాన్ని అటక ఎక్కించటం ద్వారా, పోలవరం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పరచటం ద్వారా, నదుల అనుసంధానాన్ని నిలిపేయాలనుకోవటం ద్వారా, హైద్రాబాదులోని ఆంధ్ర రాష్ట్ర భవనాలు అప్పనంగా తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించటం ద్వారా, జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వటంలేదు. రెడ్డొచ్చె మొదలాడు అన్నట్లుగా, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని అడ్డుకొని మళ్ళీ మొదటి నుంచి మొదలేయాలనుకునే అడ్డగోలు నిర్ణయాలవల్ల నష్టపోయేది రాష్ట్రమే. ఇప్పటికే, కేంద్రప్రభుత్వ వివక్ష వల్ల, రాష్ట్రం విలువైన సమయాన్ని కోల్పోయింది. మరింత దగా జరిగే అవకాశం కూడా త్రోసిపుచ్చలేం. కాబట్టి, ఇప్పటికే బాబు వేసిన పునాదుల మీద ఆంధ్రుల భవిష్యత్తును రూపుదిద్దే అవకాశం కల్పించిన ప్రజల అంచనాలకు, ఆశలకు జగన్ తూగగలడనే ఆశిద్దాం. ఒక చారిత్రాత్మక అవకాశాన్ని వృధా చేయడనే ఆశిద్దాం.

@@@@@

Buy this book on Amazon