ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆహారానికి ఆరు గుణాలు

Like-o-Meter
[Total: 1 Average: 5]

సనాతన ధర్మం పాక విధిని (ఆహారాన్ని వండే విధానాన్ని) సైతం స్పృశించి మానవాళికి మనిషి ఉన్నతిని, తిర్యక్ జీవులతో (ఇతర జీవరాశితో) ఉన్న భేదాన్ని చూపడం కోసం ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించింది. 

విష్ణు సహస్ర నామం హరిని భోక్త గాను యజ్ఞభుక్ గాను కీర్తించింది. దీని ఆంతర్యం ఇంకా విశదంగా చెప్పడం కోసం కృష్ణ పరమాత్మ స్వయంగా పాండవ మధ్యమునకు “అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః” అనే శ్లోకం లో జీవులలోని వైశ్వానరుడిగా (ఆకలి) నేనే ఉంటానని చెప్పాడు. అందుకే మన పూర్వీకులు భోజన విధిని “వైశ్వానర యజ్ఞం” గా ఎంతో పవిత్రమైనదిగా తెలుసుకొని శ్రద్ధతో భోజనాన్ని స్వీకరించేవారు. మనం మన నోటిలోకి వేసే ప్రతి పదార్ధమూ ముందుగా ఈశ్వరునికి నివేదించి తద్వారా ప్రసాదంగా మారి మనలోనికి వెళుతుంది. అంటే ప్రసాద స్వీకారమే భోజనం.

మనకందరకూ తెలుసు భగవంతునికి నివేదన చేసే పదార్ధం శుద్ధ సాత్వికమైనదిగా ఉంటుంది. అట్టి పదార్ధం నివేదనా యోగ్యమని మనకు తెలుసు.  కాని మనలో ఆ వైశ్వానరునిగా ఉన్న భగవానునికి మాత్రం మన జిహ్వ కోరింది మాత్రమే నివేదన చేస్తాం.  ఇంకా వాస్తవంగా చెప్పాలంటే మనం జిహ్వకు సమర్పించుకుంటాం.  “యద్భావం తద్భవతి” అన్నా ఆర్యోక్తిని బట్టి మనం తినే భావనలోనే విధానంలోనే మన ఆహారపు శక్తి దాగి ఉంటుంది. భావన, విధానం సరిగా ఉంటె మనం తీసుకొనే ప్రతి పదార్ధమూ అమృత తుల్యమై చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది.


ఈ దిగువన తెలిపిన పాక విధులు చదివితే మనకు తప్పక ఆశ్చర్యం కలుగక మానదు:

హరి స్మరణతో వంట ప్రారంభం కావాలి. అందువల్ల హరి నామ మహిమ మనం వాడే పదార్ధాలలో ప్రవేశిస్తుంది.  ఇందుకు సమకాలీన శాస్త్ర విజ్ఞానం ఆధారంగా ప్రత్యక్ష ప్రమాణం చూపలేము కాని కిర్లియన్ ఫోటోగ్రఫి ద్వారా రుజువు చేయగలం (aura of the food). హరి స్మరణ వలన రోజూ చేసే వంట కార్యక్రమం తాలుకూ యాంత్రికత (Fatigue) సమసిపోయి చైతన్యం కలుగుతుంది. బ్రహ్మర్షి వశిష్టుడు “స్నిగ్ధం పథ్యం తథా శుద్ధం శుభ్రం రుచ్యం మనోహరం, పజయే దోదన్ద్యంతు జయతే నియతేంద్రియ” (వశిష్ట సంహిత) అని ఆహారానికి ఉండవలసిన ఆరు గుణాలను వివరించారు:
౧. స్నిగ్ధం: మన ముందు తినమని ఉంచిన ఆహారం అది తయారు చేసిన వ్యక్తి యొక్క విశిష్టతను తెలుపుతుంది. అందుకే వైదికులు భోజన శాలల్లో (హోటళ్ళలో) తినరు. ఎందుకంటే వారి అనుష్టానానికి అది వ్యతిరేకం కనుక. హోటళ్ళలో వండిన పదార్ధాలు ఎటువంటి శుచితో, మనసుతో, విశ్వాసంతో, అలవాట్లతో, నైతికతతో, ఉద్వేగంతో వండితే ఆ మానసిక స్థితులన్నీ పదార్ధపు ప్రాణశక్తి తో మిళితమై మనం తినడం ద్వారా మనలో చేరతాయి. మనం తినే ఆహారంలో ఐదవ వంతు మన మనసుగా మారుతుందని మన ఆయుర్వేద విజ్ఞానం తెలుపుతుంది.  కనుక ఆహారానికి స్నిగ్ధత (మనతో స్నేహభావం) కేవలం వండిన వ్యక్తీ మానసిక స్థితి పైనే ఆధారపడి ఉంటుంది.  అందుకే ప్రపంచంలో అందరకూ అమ్మ వండిన ఆహారం అంత అద్భుతంగా ఉంటుంది . ఇదే స్నిగ్ధత. ఈ స్నిగ్ధత కేవలం వండిన వ్యక్తీ తన కుటుంబ సభ్యులలో వైశ్వానరుడిగా ఉంది ఆ శ్రీహరి స్వయంగా తింటున్నాడనే విశ్వాసంపై భక్తి పై పారవశ్యంపై ఆధారపడి ఉంటుంది. భావనా మాత్రంచేత ఇది సాధ్యం. తద్వారా ఈ ఆహారం సాత్వికతను పొంది భోక్తలకు అమృతతుల్యమౌతుంది. ఈ స్నిగ్ధత లోపించిన ఆహారం గురించి వివరించనవసరం లేదు.

౨. పథ్యం: పథ్యం అంటే మనకు అనుకూలత కలిగి ఉండుట.  మనం తినే ఆహారం అందుకే మన అమ్మ పిల్లలకు ఒకలా, పెద్దలకు ఒకలా చేసి పెడుతుంది.  అలాగే ఋతువుకు అనుకూలంగా ఉండేలా చూస్తుంది.  ఊరగాయలు, వడియాలు, పొడులు, మొదలగు పదార్థాలు ఋతువులను అనుసరించి అమ్మ వాడుతుంది. ఇది ఒక అపురూపమైన ప్రేమతో కూడిన విజ్ఞానం. పాచిపోయిన పదార్ధాలు, అతిగా నిల్వ చేసినవి మన పూర్వీకులు అసలు ఇళ్లలోనే ఉంచేవారు కారు. ఏ పదార్ధం దేనితో కలుపకూడదో ఉదా: పాలను పెరుగుతో కలిపి భుజించ కూడదు. తేనని నేతితో కలుపకూడదు ఇత్యాదులు.  మన సనాతన వంట విధానాలలో ఎంతో పాక శాస్త్రం దాగి ఉంది . ఏది పత్యమో అది అపత్యమో అనే విజ్ఞానాన్ని  తరాలుగా అమ్మ కుటుంబంలో కొనసాగానివ్వడానికి తనకు తెలియకుండానే దోహదపడుతుంది. ఈ పథ్యం అన్నా గుణం ఉన్న ఆహారమే దేహికి మోదాన్ని ఇస్తుంది చిత్తానికి స్థిరత్వాన్ని ఇస్తుంది.

౩.శుద్ధత: ఆహరం విషయంలో శుద్ధత కేవలం సాత్వికత వలెనే సిద్ధిస్తుంది. ఏది మనలో సాత్విక స్వాభాన్ని పెంపొందిస్తుందో అదే శుద్ధమైన ఆహారం. తామస, రాజస ఆహారాలు ఆయా స్వభావాలనే ప్రచోదనం చేస్తాయి. దేహమనే రథాన్ని అధిరోహించి ఆత్మ చేసే భౌతిక ప్రపంచ ప్రయాణంలో సాత్విక ఆహారం ఎంతో ఉపకరిస్తుంది.  మనం సాధారణంగా రాత్రి ప్రయాణం చేయవలసి వస్తే మనకు తెలియకుండానే శుద్ధ సాత్విక పదార్ధాన్ని తీసుకుంటాం. ఎందుకంటే అది సులభంగా అరిగిపోయి మన ప్రయాణానికి ఎలాటి ఆటంకము మనకు ఏ అస్వస్థత కలుగకుండా సహకరిస్తుంది.  ఈ భౌతిక ప్రపంచంలో చేసే ప్రయాణాలకే ఇంత జాగ్రత్త తీసుకొనే మనం మన పారలౌకిక ప్రయాణంలో కూడా జాగరూకత పాటించవలసి ఉంటుంది అంటే ఎందుకు నమ్మలేము?  అందుకే శుద్ధ సాత్విక స్వరూపమైన శ్రీహరి స్మరణ ఆహార విషయంలో ఆద్యంతమూ అంతర్గతమైనది.  అందుకే ఆయనకు అంతర్యామి అని పేరు!

౪. శుభ్రం: మానసిక మాలిన్యత భౌతిక శుభ్రతను సైతం కలుషితం చేస్తుంది. అందుకే భౌతిక శుభ్రతతో పాటు మానసిక శుభ్రత ఉండవలసిని ప్రధాన లక్షణం.   కామ ప్రచోదనం కలిగి చేసిన వంట ఆ కామాన్నే ప్రచోదనం చేస్తుంది అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని వేశ్యా వాటికలలో విటుల కోసం  ప్రత్యేకమైన పదార్ధాలను పూర్వం వండేవారు. కామం అంటే కేవలం శృంగార కోరికే కాదు ఒక బలమైన ఇచ్ఛ. అది ఏ విషయంపైన అయినా ఉండవచ్చు.  ఈ కామ పూరిత బుద్ధితో వండిన ఆహరం శుద్ధతను సంతరించుకొంటుంది.  సమాజంలో నేర ప్రవృత్తి పెరగడానికి ప్రధాన కారణాలలో ఆహారం కూడా ఒకటి. You are what you eat! ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది.  అది వండే సమయంలో ఉండవలసిని ఆరోగ్యకరమైన ఆలోచనల పరంపర. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. మనం మౌనంగా చేసే సంకల్పాలు ఒకో సారి చాల తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి.  ఈనాటి డైనింగ్ హాళ్ళలో భోజనం చేస్తూ జరిగే చర్చలు, వచ్చే కోపతాపాలు, పంతాలు-పట్టింపులు, అలకలు, విసుర్లు, ఏవగింపులు మొదలైనవి అందరికీ తెలిసినవే.   మనం స్వీకరించే భోజనం తయారు చేసినపుడు కలగలిసిన మానసిక అసౌచాలే ఇందుకు కారణం.

౫. రుచ్యం: కేవలం స్నిగ్ధమై, శుద్ధమై, శుభ్రమైనంత మాత్రాన ఆహారం గొప్పది కాదు.  అది చక్కని రుచిని సంతరించుకోన్నపుడే అది గొప్పదిగా ఉంటుంది. జిహ్వకు ఉత్తేజం, మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. ప్రతిసారి భుజించే పదార్ధం ఒక విందు భోజనంలా ఉండాలంటే – ఉన్నంతలో మనకు – అసాధ్యం కాదని ఇప్పటికే మీకు అవగతమైంది. కనుక ఆరు రుచుల సమ్మేళనంగా మనకున్న సుగంధ ద్రవ్యాలను తగు రీతి వాడి వండి వడ్డిస్తే ఉండే మజా వండిన వాళ్లకు తిన్న వాళ్లకు అనిర్వాచనీయంగా ఉంటుంది.   అందుకు కేవలం మనం తినే ఆహారం శ్రీహరి ఉచ్చిష్టమై (ఎంగిలి) ఉండాలి.  అందుకే మన పూర్వీకులు ముందు ద్వాదశ స్తోత్రం చేసి సురభి మంత్రం చదివి నివేదన చేసే అప్పుడు వడ్డించేవారు. అప్పుడు పదార్ధం అమోఘమైన రుచిని సంతరించుకొంటుంది

౬. మనోహరం: ఆహారం కనులకు సైతం విందుగా ఉండాలి. Seasoning అనే ప్రక్రియ ఇందుకు ఉదాహరణ.  ఇది ప్రపంచం మొత్తం పాటిస్తుంది!!  కాని మనకు తెలియదు పైన తెలిపిన విషయాలు ఆ విందులో కలసినవో లేవో!  కేవలం కంటికి సొంపుగా మాత్రమే కాదు తిన్నాక కూడా మనోహరంగా ఉండాలి. తిన్నాక శరీరం, మనసూ ఎంతో ఉత్తేజంగా ఉండాలి. అప్పుడే ఆ ఆహారం మనోహరమైనది.  ఇది కష్ట సాధ్యమా? కాదు, సులభసాధ్యమే.  ఉన్నంతలో తాజా సరకులను వాడడం,  తాజా గా తినడం, తాజాగా మంచి ఆలోచనలు చేస్తూ వండడం వలన సాధ్యం.  పూర్వం ఈ తాజాదనాన్నిచ్చే కొన్ని ద్రవ్యాలను వండిన తరువాతా పదార్ధాలపై ఉంచేవారు వీటిని మనం aromatic substances అంటాం. ఇవి కమ్మని నేయి, అప్పుడే తీసిన వెన్న, కర్పూరం, కేసరి, నిమ్మకాయ, చంపక పువ్వు, దానిమ్మ, కమలాలు మొ. నవి. వీటిని లేదా వీటి రసాలు gaarnishing  కోసం వాడతారు. ఇవి ఆహారానికి అద్భుతమైన గుబాళింపును ఇస్తాయి. దీనితో పాటు మరొక్క ముఖ్యమైన విషయం – మనం తినే ఆహారం ధర్మ బద్దంగా సంపాదించిన ధనంతో సమకూర్చుకున్నదైతేనే మనోహరం కాగలదు.   దుష్ట ద్రవ్యంతో సమకూర్చుకున్న ఆహరం మనోహరం కాజాలదు.

మీరే ఊహించండి – తూర్పు దిక్కును చూస్తూ ఉన్న వంటశాలలో పైన చెప్పిన విషయాలను తూ చ తప్పక పాటించి వండి సంతోషంగా వడ్డించ గలిగితే మన హోటళ్లు కూడా వైశ్వానర యజ్జ  వాటికలు కాగలవు అనడంలో సందేహం లేదు. ఇంకొక్క మాట ధర్మమైన ధరతో జోడించి.  ఈనాడు మనం ఎన్నో ప్రత్యేకతలతో కూడిన భోజన శాలలను చూస్తున్నాం వాటికి వెళ్లి భోజనం చేస్తున్నాం. కాని అవి మీకు నిజానికి మన భారతీయ సత్సాంప్రదాయ రీతిలో భోజనం చేయడానికి ఎంతవరకూ దోహద పడుతున్నాయి?  ఇప్పటి వ్యాపార వేత్తలకు ఇలాంటి హోటళ్లు ఏర్పాటు చేయడం కష్టమా?  మనసు, విశ్వాసం ఉంటె మార్గాలు ఎన్నో.

అన్నాన్ని (అన్న సూక్తం ప్రకారం) వ్యాపార వస్తువుగా చూడని సంస్కృతి మనది. ఉచిత భోజన సదుపాయం గల ధర్మ సత్రవులు ఉన్న దేశమిది. కాలం మారింది కాని కలి ప్రభావం పడని రీతిన భోజనం చేయగల బుద్ది మనకు ఉంది. కాని అది ఆచరణలో కి రావడం లేదు. ఇంతే ఉన్న తేడా. భారతీయ సనాతన ధర్మాన్ని ఆకళింపు చేసుకున్న ఒక్క వ్యాపారవేత్త ముందుకు వచ్చి ఇలాటి భోజన శాల ఒక్కటి ఏర్పాటు చేస్తే చాలు.  ప్రపంచం మొత్తం ఆహ్వానిస్తుంది ఈ అద్భుత మార్పును.

అన్నం వలన జీవులు ఉద్భవిస్తున్నారు అట్టి అన్నాన్ని పవిత్రం గా వండి వడ్దించగల సత్తా మన భారతీయ వ్యాపరవేత్తలలో నిద్రాణం గా ఉంది. అది జాగృతి పొందిన రోజు. మన దేశం ఒక ఆదర్శ వ్యాపార సూత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అనడంలో సందేహం లేదు. దేహం అన్నవికారం అయినా సాత్విక మైన అన్నం సాత్విక వికారాన్నే కలిగిస్తుంది. అంటే సాత్విక మైన ఆహరం వలన సమాజం సాత్వికమౌతుంది.