ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆహుతైపోతున్న విద్యార్ధులు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

ఒకరితో ఒకరు రాజీ చేసుకునే రాజకీయ నాయకుల
కోసం చచ్చిపోతున్నారు మన విద్యార్ధులు .

చదువు సంధ్యలు విడచిపెట్టి రాజకీయ పోరాటంలో
కీలు బొమ్మలవుతున్నారు మన విద్యార్ధులు .

కుటుంబ బాధ్యత,అమ్మనాన్నల్ని వదిలిపెట్టి నాయకుల చేతిలో
సమిధలవుతున్నారు మన విద్యార్ధులు .

పోరాటం ఏదైనా కావచ్చు రాజకీయ రణరంగంలో
పావులవుతున్నారు మన విద్యార్ధులు .

తల్లిదండ్రుల ఆశలు నీరుకార్చి వ్యర్ధ నేతల
పిలుపులతో బలైపోతున్నారు మన విద్యార్ధులు .

నవచైతన్యం పేరు మాటున ఉద్యమాల
నయవంచనకు గురవుతున్నారు మన విద్యార్ధులు .

వయసు మీరిన రాజకీయ జంబుకాల
మోచేతి నీరు తాగుతున్నారు మన విద్యార్ధులు .

విద్యలలో ఆరితేరి విజ్ఞానజ్యోతులు వెలిగించక
అజ్ఞానంలో మిగిలిపోతున్నారు మన విద్యార్ధులు .

సామాజిక బాధ్యత అర్ధాన్ని తెలుసుకోకనే అర్ధాంతరంగా
అసువులు బాస్తున్నారు మన విద్యార్ధులు .

భావిభారత ఆశావాహ నిర్మాతలు క్షణికావేశంలో భవిష్యత్తే లేకుండా
అగ్నికీలలకు ఆహుతైపోతున్న మన విద్యార్ధులు .

నాయకుల బిడ్డలు పాశ్చాత్య దేశంలో చదువుకుంటుంటే కనిపెంచిన
తల్లిదండ్రుల కన్నీరుకు కారణమవుతున్నారు మన విద్యార్ధులు .

ఓటు విలువ , జీవితపు విలువను గుర్తెరిగి …నవసమాజ నిర్మాణ
బాధ్యతలందుకోను సిద్ధమవ్వాలి మన విద్యార్ధులు .

********