ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అలుగుటలోని మర్మమేమి?

Like-o-Meter
[Total: 1 Average: 3]

 

 

కృతయుగ కాలంలోని ప్రహ్లాదుడు “చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!” అని ఓ పద్యం చెప్పాడు.

నవంబర్ 28, 2008 న ముంబైలో జరిగిన తీవ్రవాదుల దాడిపై పార్లమెంట్‍లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించిన లాల్ కృష్ణ అద్వానీ “వయం పంచాధికం శతం” (మనము నూటా ఐదుమందిమి) అన్న మహాభారతంలోని ధర్మరాజు మాటలను ఉటంకిస్తూ మాట్లాడారు. అక్కడి సందర్భమేమిటంటే, అధికార-విపక్షాలన్న భేదం లేకుండా మనమందరం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసిన అవసరమున్నదని, ఆ విషయంలో ప్రభుత్వం తీసుకొనే అన్ని చర్యలనూ సమర్ధిస్తామని ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటన చేసారు అద్వానీ. తన పార్టీని పాండవులతోను, కాంగ్రేసు సంకీర్ణాన్ని కౌరవులతోనూ పోల్చినప్పటికీ ఎలాంటి మనోవ్యాధికీ అవకాశమివ్వకుండా రాజనీతితో మాట్లాడినవాడు అద్వానీ.

అటువంటి అద్వానీ తన పక్షంలోనే, తనవారితోనే మోడీ విషయంలో ఎందుకు విభేదించినట్టు?

గతవారం ఇదే విషయంపై అలుగుటయే ఎరింగిన…. అన్న శీర్షికతో సాయికిరణ్ ఓ వ్యాసం వ్రాసారు. అందులో అద్వానీని బుద్ధిలేని లేక మతి తప్పిన ముసలివానిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని మరింత జోరుగా సాగించే క్రమంలో మోడీని భుజానకెత్తుకోవడమూ జరిగింది. ఇది మానవ సహజం. ఒకర్ని తిట్టాలనుకుంటే వారిని నేరుగా తిట్టడంతో బాటూ వారికి పడని వారిని జోరుగా పొగడ్డం ఓ మనస్తత్వ క్రీడ. క్రీనీడ.

విపర్యాసమేమిటంటే పొగడ్తల క్రీనీడల్లో అగుపడని అగడ్తలు బోలెడుంటాయి. ఉన్నాయి కూడా. బహుశా అద్వానీ ముసలి కన్నులకు అవే అగుపడివుంటాయి. లేకపోతే “వయం పంచాధికం” అన్నవాడు నేడు ఎందుకిలా కినుక వహిస్తాడు?

సాయికిరణ్ అన్నట్టుగా అధికార లాలసత్వమే లాల్ కృష్ణుడి అభిమతమైనట్టు నాకు కనబడ్డంలేదు. ఒకవేళ అదే ఆయన అభిమతమైవుంటే ఆయనే కట్టి, పెంచిన పార్టీలో “పాపం పెద్దవాడి చివరి కోరిక” అని మన్నించిగలిగే వారి సంఖ్య ఎక్కువగానే ఉండివుంటుంది. అందువల్ల, సాయి కిరణ్ పేర్కొన్నట్టు ’అధికార యావ’నే అద్వానీ చేత మోడీ వ్యతిరేక చర్యల్ని పురికొల్పుతోందని నమ్మలేక పోతున్నాను. ఈ విపర్యాసానికి అసలు కారణం బి.జె.పి తన మూలాల్ని మర్చిపోతూ, మార్చేసుకునే తత్వం ప్రబలడమేనని నా వాదన.

ఇలా ఎందుకు అనవలసి వస్తున్నదంటే తన పుట్టుకకు ముందు నుంచీ, భా.జ.పాది హిందూత్వ అజెండానే. ఆ అజెండానూ, కాషాయ జెండానూ బలంగా వినిపించింది, అలసిపొకుండా మోసిందీ ఈ అద్వానీనే. రథయాత్రలు, బాబ్రీ మసీదు కూల్చివేత – ఇలా సమస్తమైన సాహాసాలను చేసింది, పాపాల్ని మూటగట్టుకొన్నదీ ఈ అద్వానీనే. వాజపేయిలాంటి మితవాది (ఒద్దికైన హిందువు)ని తన బాసుగా స్వీకరించిందీ ఈ అద్వానీనే. అలాంటివాడు నేడు మోడీని మెచ్చకపోవడమెందుకు? గోధ్రా నరబలిలో నెంబర్లు తక్కువైనాయనా! లేక మరిన్ని గోధ్రాలను తయారు చేయలేకపోయాడనా?

ఇవేవీ కావు.


How The BJP Wins : Inside India’s Greatest Election Machine

అద్వానీ దుఃఖమంతా బి.జే.పికి తగ్గుతున్న ఓటుశాతం గురించేనని నా ఊహ.

అధోగతి పడుతున్న ఓటుశాతంకు మూల కారణం మోడీనే అని అద్వానీ కోపం. ఎందుకంటే గతంలో, అంటే మోడీ ఉత్థానానికి ఆరంభంలో, బాబ్రీ మసీదు కూల్చివేత, కాందహార్ విమాన హైజాక్ ఉదంతం, జిన్నాను పొగడ్డం వంటివి కూడా భా.జ.పా ఓట్లశాతాన్ని కుదేలు చేయలేదు. కానీ ఒక్క గోధ్రా సంఘటన తర్వాత ఆ క్షీణత మరింతగా పెరిగిందని అద్వానీ లెక్కాచారం. అంతేకాదు, మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోవడం ద్వారా ఎన్.డి.ఏ కు మిత్రులుగా ఉన్న ఇతర ’సెక్యులర్’ పార్టీల మద్దతను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలే తలవ్రాత మారిన ఈ కాలంలో ఒంటరిపోరుతో ఎలా నెట్టుకు రాగలమన్నది ఒక పార్టీ పెద్దగా, వ్యవస్థాపక సభ్యునిగా అద్వానీ మనసులో రేగుతున్న అనుమానం.

పైగా అద్వానీకి గుజరాతు వ్యవహారాలేవీ కొత్త గాదు. ఎందుకంటే అతను ఆ ప్రాంతం నుండే పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు గనుక. గుజరాతు రాష్టాన్ని మోడీనే ఉద్ధరించాడనుకోవడం ఓ పగటి కల. గమనించి చూస్తే భారత సైన్యంలో గుజరాతీలే అతి తక్కువ సంఖ్యలో కనబడతారు. కానీ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపారాల్లో అధిక సంఖ్యాకులు గుజరాతీయులే. కనుక సహజంగానే వ్యాపార దక్షతలున్న గుజరాతు సమాజానికి ఈరోజు మోడీ నేర్పాల్సిన కొత్త కిటుకులేవీ లేవు. అతను చేసినదల్లా ’గోధ్రా’ మచ్చ ఉన్నప్పటికీ పెట్టుబడుల్ని పట్టుకురావడం మాత్రమే. ఒక ముఖ్యమంత్రిగా ఆ మాత్రం చేయలేకపోతే ఆ స్థానానికే అవమానం. కాబట్టి ఈరోజు అందరూ పొగిడేస్తున్నట్టుగా మోడీ చేసిన ఇంద్రజాలమేమీ లేదు. పొగడదలిస్తే మోడి కంటే ధీరూ భాయ్ అంబానీనే పొగడాలి. ఎందుకంటే ఒక సామాన్యునిగా వ్యాపారం మొదలెట్టి దేశ రాజకీయాల్నే ప్రభావితం చేయగల స్థాయికి వెళ్ళిన వ్యక్తి అంబాని. కనుక ఒక ముఖ్యమంత్రిగా పెట్టుబడుల్ని తీసుకొచ్చిన మోడీ తన కనీస కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించాడన్నది అద్వానీ భావంలా తోస్తోంది.

ఇంకా బాగా గమనిస్తే, మోడీ నోటి నుండి హిందూత్వ నినాదాలేవీ రాలేదు. రాబోవు కూడా. ఎన్నో కష్టనష్టాలకు, దూషణ భూషణాలకు వెరవకుండా గత ఐదారు దశాబ్ద్దాలుగా తన భుజాలపై మోసుకు తిరిగిన హిందూత్వ వాదం, భా.జ.పా అంటే సిసలైన హిందూదేశ ప్రతినిధి అనే ముద్ర మోడీ దూకుడులో కొట్టుకుని పోతుండడం అద్వానీకి మింగుడు పడ్డం లేదు. ఇది కూడా అద్వానీ కినుక కారణం కావొచ్చు.

ఎవరు నమ్మినా నమ్మక పోయినా భా.జ.పా ఒక బ్రాహ్మణ్యపు భావజాలంతో, ఆ వెన్నుదన్నుతో పెరిగిన పార్టీ. మోడీ హయాం వస్తే ఈ విషయం కూడా మూలన బడే అవకాశాలున్నాయి.

ఇలా ఎన్ని రకాలుగా విశ్లేషించినా అద్వానీ చూపెడుతున్న మోడీ వ్యతిరేకతలో అధికార యావ కనబడ్డం లేదు. పైగా కూలిపోబోతున్న కుటుంబాన్ని రక్షించుకోలేని ఒక వృద్ధుని ఘోష మాత్రమే వినబడుతోంది. అంతేగాదు, మోడీ పట్ల గల తన వ్యతిరేతను బాహాటంగా ప్రదర్శించేందుకు కూడా వెనుకాడని అద్వానీ వ్యవహార శైలిలో బలమైన నిస్సహాయతే గోచరిస్తోంది.

ఏది ఏమైనా, అలుగుటయే ఎరింగిన అద్వానీ అలుకలోని మర్మాల్ని మనం తెలుసుకోగలమా? అన్నదే నాకున్న సంశయం.

 

The Saffron Tide