ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అలుగుటయే ఎరింగిన….

Like-o-Meter
[Total: 0 Average: 0]

జగమే మోడీ, పదవే ఊడి!
అద్వానీ గారు మరోసారి అలిగేసారు! మొన్నటికి మొన్న 2014 ఎన్నికల ప్రచార బాధ్యత మోడికి అప్పగించిన తర్వాత అలిగారు. నిన్నటికి నిన్న, మోడీని 2014 ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినందుకూ అలిగారు. ఈ అలుగుటకు కారణాలు; మోడీకి బాధ్యతలు ఇస్తున్నందుకా, తనకు ఇవ్వనందుకా అనేది మాత్రం అతి రహస్యం! అద్వానీ అలిగారంటే కారణం ఉంది. పార్లమెంటులో భా.జ.పా.ను ఒంటి అంకె పార్టీ స్థాయి నుంచి మూడంకెల పార్టీ స్థాయిదాకా చేర్చటంలో అద్వాని అతివాదం ఎంతో తోడ్పడిందనేది జగమెరిగిన సత్యం.

1999లో కూడా అద్వానీ వల్ల అతివాద పార్టీగా ముద్రపడ్డ భా.జ.పా. చెంత చేరటానికి సో కాల్డ్ లౌకిక పార్టీలు మొదట్లో మొరాయించాయి. ఎట్టకేలకు వాజ్ పేయి ముఖం చూసి లోపలి నుంచో బయట నుంచో మద్దతు ఇచ్చి ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఏర్పాటుకు దోహదపడ్డాయి. ఆ తర్వాత, 2004 లో ఉత్సవమూర్తిగా వాజ్ పేయిని రంగంలో దించినా, వయసు ప్రభావం వల్ల ఆయన్ని అటకెక్కేంచేసి ప్రధాని అభ్యర్ధిగా అద్వాని ముందుకు వస్తారనే ఊహాగానాలు అప్పట్లోనే వచ్చాయి. బాబ్రీ మసీదు విధ్వంసం మెడకు చుట్టుకోవటం వల్ల అప్పట్లో అద్వానీని చాలామంది వ్యతిరేకించారు. దానికితోడు నంబర్లు కూడా బలంగా లేకపోవటంతో ముఖం చాటు చేయాల్సివచ్చింది. 2009 లో మాత్రం అతివాదిగా ముద్రపడ్డ ఆ అద్వానీనే ప్రధాన మంత్రిగా సమర్ధిస్తూ ఎన్.డి.ఎ. కూటమి ఎన్నికల్లో పోరాడినా ఫలితం నాస్తి.

పి.ఎం ఇన్ వెయిటింగు గా పదేళ్ళ నుండి వెయిటింగ్ రూంలో మగ్గిపోతున్న అద్వానీ గారిని ఆదాటున అటకెక్కించేస్తే ఆయనకు మండదూ! అద్వానీ ఏడుపులు ఎలా ఉన్నా, ఆయన వ్యవహారశైలి మాత్రం భా.జ.పా.కు సమీప భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. సాథారణంగా అరవైలో, డెబ్భైలో దాటిన తర్వాత ఓ చాదస్తమో చపలచిత్తమో మనిషిని ఆక్రమిస్తుంది. ఇంటికి పెద్దగా నేను చెప్పిందే వేదం అనేస్తారు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళంటారు. అందులోని తప్పొప్పులు, కష్టనష్టాలు ఏకరవు పెట్టినా పట్టించుకోని ఓ మొండివైఖరికి లొంగిపోతారు. అద్వానీ కూడా ఆలాంటి ఓ మొండివైఖరికి లోనౌతున్నారు. మోడీ విషయంలో, పార్టీలో మెజారిటీ అభిప్రాయం కన్నా తను చెప్పిందే ఒప్పుకుతీరాలన్న పట్టుదల కనిపిస్తున్నది కానీ, సరైన కారణాలు మాత్రం కనిపించట్లేదు.

 

దానికితోడు పార్టీ అధ్యక్షుడికి వ్రాసిన లేఖలు లీకు చేయటం వంటి విపరీత చేష్టల వల్ల, కాంగ్రెస్ కు దిగ్విజయ్ సింగ్ చేస్తున్న రీతిలోనే భా.జ.పా.కు అద్వాని అపకారం చేస్తున్నానని గ్రహించటంలేదు. బహుశా ప్లాన్ బి. లాగా, రేపు ఎటుపోయి ఎలా వస్తుందో అన్న ఉద్దేశ్యంతో భా.జ.పా. నే అద్వానీతో ఆడిస్తున్న నాటకంలా అనుమానించటానికి కూడా ఆస్కారం కనిపించటంలేదు ఆయన ప్రవర్తనలో! ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ పక్ష మీడియా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అద్వానీ మోడీల విభేదాలని మరింత రచ్చ చేస్తున్నదన్న విజ్ఞత కూడా ఆ పెద్దాయనకు లేకపోవటం! తనకి దక్కకపోతే మరెవరికీ దక్కరాదన్న సంకుచిత మనస్తత్వం మరింతగా బట్టబయలౌతున్నా ఏమాత్రమూ తగ్గకపోవటం, ఇకపైగా, తన పార్టీలోనే తనను బలిపశువు చేస్తున్నారన్న అభిప్రాయాన్ని నలుగురికి కలిగించటం!

దాదాపు 2002 నుండి మీడియాకు, కుహానా లౌకికవాదులకు మోడీ ఓ మొద్దబ్బాయిలా దొరికాడు. అయినదానికి కానిదానికి, చేసిన దానికి చేయని దానికి, చూసిన దానికి చూడని దానికి, విన్నదానికి విననిదానికి చిలవలుపలవలు కల్పించి, మసిపూసి మారేడు కాయ చేసి, మోడీ చేత మూడు చెరువుల నీళ్ళు తాగించాలని, పోయించాలని వీరంతా గత దశాబ్దకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిజానికి, మోడీని పీడించినంతగా మరెవరినీ వీరు పీడించలేదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడిదో యూనివర్సిటీ ఆయన్ని ఓ ఉపన్యాసం ఇవ్వటానికి పిలిచినా తూర్పారబెట్టేవాళ్ళు. ఆ ఆహ్వానాన్ని ఆ యూనివర్సిటీ రద్దుచేసినా అదే తీరు. ఆయనకు అమెరికా వీసా నిరాకరించినా పెద్ద న్యూసే, పిలిచి ఇస్తామని ఇంగ్లాండు చెప్పినా న్యూసే.

పరమగురుడు మెచ్చినవాడె పీఎమ్ము కాడురా!
ఆయనకు అమెరికా వీసా ఇవ్వొద్దని చివరికి, మన పార్లమెంటు సభ్యులే సంతకాలు చేసి మరీ ఒబామాకు వినతిపత్రం సమర్పించారంటేనే మోడీని ఎంతగా వేధించటానికి కంకణాలు కట్టుకున్నారో తెలుస్తుంది. నానా రకాల అవినీతి రొచ్చుల్లో కూరుకుపోయిన ములాయంలు, లాలూలు, మాయవతులకు కూడా మోడీ అంటరానివాడే! కానీ ప్రజలు అలా భావిస్తున్నారా అనే విషయం వీరెవరికీ అక్కరలేదు. గోథ్రా మారణహోమం తర్వాత గుజరాత్ లో పెచ్చరిల్లిన మతన్మాదానికి మోడీని కారణభూతుడిని చేస్తూ చాలా మంది చాలారకాలుగా ఆయనకు “రాజధర్మాన్ని” బోధించారు. ఆ తర్వాత నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు ఆయనకు పట్టం కట్టటం వీళ్ళ బుర్రలకు ఎక్కదు!

గత పదేళ్ళుగా ప్రధానిగా “నియమింపబడిన” వ్యక్తి పరిపాలనే చూసాము కానీ, ప్రజలు “ఎన్నుకున్న” ప్రధానిని చూడలేదు. కనీసం ఇప్పుడైనా, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేట్లుగా ఉన్న భా.జ.పా. నిర్ణయాన్ని ఒక సీనియర్ నాయకుడుగా గౌరవించాల్సిన బాధ్యత అద్వానీపై ఉన్నది. గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్.డి.ఎ.కు సారథ్యం వహించినా గట్టెక్కించలేని అద్వానీని మూడోసారి అందలం ఎక్కించటంలో అర్ధం లేదనేది ఎంత వాస్తవమో, ప్రస్తుత పరిస్థితుల్లో భా.జ.పా.లోనే కాదు, దేశంలోనే మోడీని మించి ప్రజాకర్షణ ఉన్న నేతలు లేరనేది వాస్తవం. ఏదేమైనా, ఓట్లు రాలతాయా, సీట్లు వస్తాయా అనే విషయాన్ని 2014కు వదిలేసి, ప్రస్తుతానికి మోడీని సమర్ధించగలిగితేనే అద్వానీ పెద్దరికాన్ని ప్రజలు గౌరవిస్తారు. భా.జ.పా.కు అవకాశం ఇవ్వటానికి ఆలోచిస్తారు.