ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అంతమొందించేది అవినీతినా! అన్నా హజారేనా!!

Like-o-Meter
[Total: 0 Average: 0]

శిలా విగ్రహాలకు, గోడల మీద వ్రేలాడే పటాలకు మాత్రమే పరిమితం చేయబడ్డ మహాత్ముడు ఈరోజు అన్నాహజారే వల్ల చిరస్మరణీయుడయ్యాడు. చరిత్ర పాఠాల్లో తప్పించి గాంధీ గురించి ఏమాత్రమూ తెలియని ఈ తరానికి అన్నా హజారే ఓ నిలువెత్తు అద్భుతం. గాంధేయ మార్గంలో, అహింసాయుతంగా అన్నా హజారే కొనసాగిస్తున్న సహాయ నిరాకరణ, నిరాహార దీక్ష నేటి తరానికి సత్యాగ్రహపు సత్తాను చాటి చెబుతున్నాయి.

సమాజ సేవ పేరుతో అధికారం కోసం అర్రులు చాచే నేతలకు, ఎటువంటి రాజకీయ నేపధ్యము లేకుండానే సామాజిక సేవే పరమార్ధంగా ఉద్యమిస్తున్న అన్నా హజారేకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే జన నీరాజనాలందుకుంటున్నాడు ఈ జాతిరత్న. అధికార మదం తలకెక్కిన కీచకులు అవినీతి ఆరోపణలతో అన్నా హజారేకు మానహాని చేయబోయినా చిద్విలాసంగా ఉద్యమిస్తున్నాడు ఆ తరం సూరీడు.

ఎర్రకోట సాక్షిగా, రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా 15 ఆగస్టు నాడు అవినీతిని అంతమొందిస్తామని ప్రతిన పూనిన ప్రధాని, ఆ మర్నాడే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారేను అరెస్టు చేయించటం ప్రభుత్వపు నిజాయితీలోని డొల్లతనాన్ని బయటపెడుతుంది. అవినీతి ఊబిలో ఈదులాడుతున్న మండూకాల మధ్య అన్నా హజారేను బంధించటం ఈ ప్రభుత్వపు పైశాచిక ప్రవృత్తికి పరాకాష్ఠ!

ప్రజా ప్రతినిధులు పార్లమెంటుకు, ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని, ఆ పార్లమెంటులో ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులు రూపొందించే చట్టాలను నియంత్రించాలనే హక్కు ఎవరికీ లేదని, అన్నా హజారే ప్రభృతులు చేస్తున్నది బ్లాక్ మెయిలింగని హూంకరిస్తూ ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నది ప్రభుత్వం!

ఒక అవినీతిపరుడిని సి.వి.సి.గా నియమించినప్పుడు, లక్షల కోట్ల 2జి స్పెక్ట్రం కుంభకోణంలో, వేల కోట్ల కామన్ వెల్త్ కుంభకోణంలో దోషులపై విచారణకు మీనమేషాలు లెక్కించిన ప్రధాని, యు.పి.ఎ. ప్రభుత్వం ఈరోజు తాము పార్లమెంటుకు ప్రజలకే జవాబుదారి అని ఏ మొహం పెట్టుకొని చెబుతున్నారో తెలుసుకోలేనంత వెంగళాయిలు కాదు ప్రజలు.

పట్టపగలు ప్రజాస్వామిక విలువలను పరిహాసాస్పదం చేసిన ఈ ప్రభుత్వం ఏ సంజాయిషీలు ఇచ్చినా వినే దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇప్పటికైనా ఆ నిజమెరిగి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందనే నమ్మకమూ మరిక లేదు. ఎందుకంటే, ఏలికలు వారి సైనికులు కీచక మూకలే!