ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అనుభూతి కవిత్వం

Like-o-Meter
[Total: 0 Average: 0]

ప్రస్తుతం తెలుగుదేశంలో అనుభూతి కవిత్వం మీదా చాలానే అపోహలు ఉన్నాయి. భావకవిత్వాన్నే (కృష్ణశాస్త్రి పంథా) అనుభూతి కవిత్వంగా చాలామంది అపార్ధం చేసుకుంటున్నారు. అభ్యుదయవాదాన్ని తృణీకరించిన కవిత్వంగా అనుభూతి కవిత్వాన్ని పరిగణించటం కూడా జరుగుతున్నది. ముఖ్యంగా ఈ ఆరోపణలు గుప్పించేది మాత్రం అభ్యుదయవాద కవులమనుకునే వారు మాత్రమే.

ఆ మాట కొస్తే, కమ్యూనిజమే అభ్యుదయవాదంగానూ, ‘రక్తమాంస దాహాల’ పేరిట… ‘మార్ డాలో సాలే కో ‘ అంటూ వ్రాస్తేనే అభ్యుదయ కవిత్వంగానూ చలామణీ అవుతున్నది. ఇకపైగా, ధిక్కార స్వభావంతో వ్రాస్తేనే కవిత్వమౌతుందనే ప్రబుద్ధులూ తయరయ్యారు. అటువంటి కవిత్వానికి చాలా తెలుగు పోర్టల్సులో స్థానం కల్పించటం ద్వారా ముఖ్యంగా తెలుగు కవిత్వం దారితప్పుతోంది. కాదని విమర్శించే ధైర్యం చేస్తే, దగాపడ్డ వారికి ‘సంఘీభావం’ చూపటంలేదనే అపవాదులు వస్తుంటాయి. నా ప్రశ్నల్లా … అభ్యుదయవాద కవిత్వానికి అనుభూతి ప్రధానం కాదా? కవిత్వంలో సమకాలీనత ఉండాలనే విషయంలో ఎటువంటి అభిప్రాయబేధాలు లేవు. అలా అని, వార్తాపత్రికల్లో చదివిన ప్రతి వార్తకు స్పందించి ‘మార్ డాలో సాలే కో ‘ అని వ్రాస్తేనే అది కవిత్వమౌతుందా?



నిజానికి అనుభూతివాద కవులుగా ముద్రపడ్డ ఇస్మాయిల్ , తిలక్ లు కూడా సమకాలీనత ప్రధానంగా, అభ్యుదయపంథాలో కూడా వ్రాయటం జరిగింది. ఇప్పటి so called అభ్యుదయవాద కవులకు వారికి ఉన్న తేడా అల్లా వారు జెండాలు, నినాదాలు, రాజకీయ సిద్ధాంతాల ప్రమేయంగా వ్రాయటం జరిగింది.

“స్పందనం జీవలక్షణం” అన్నారు. జరిగిన దుశ్చర్యకు ప్రతిజీవి తనదైన తీరులో స్పందిస్తుంది. అందుకు అనుగుణంగానే రకరకాల అభిప్రాయాలతో కవిత్వాలు వార్తాపత్రికల్లోనూ వివిధ పోర్టల్సులోనూ వస్తున్నాయి. ఏ వాద కవిత్వమైనా, అనుభూతి నిబిడీకృతమై ఉండాలి. ప్రతిస్పందనాత్మకమైన అనుభూతి నుంచి వెలువడేదే కవిత్వం. మనిషిని మనిషిగానే స్పందింప చేయగలిగేది నిజమైన అనుభూతి కవిత్వం. అంతే కానీ, మనిషిని ఒక దళితుడిగానో, ఒక స్త్రీ గానో మాత్రమే స్పందింపజేసేది అసలు కవిత్వమే కాదు.

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, కవికి జీవికి ఉన్న తేడా ఏమిటి? జీవికి సహజంగా కలిగే స్పందనకు రససిద్ధిని కలిగించగలిగింది ఒక్క కవే. ఆ రససిద్ధి కలిగించ కలిగింది ‘అనుభూతి ప్రధానమైన’ కవిత్వమే. కాబట్టి, కవిత్వానికి ఎన్ని అడ్డుగోడలు కట్టినా, అనుభూతి ప్రధానంగా ఉంటేనే కవిత్వం ఆస్వాదించగలుగుతాము.



అనుభూతి ప్రధానమైన కవిత్వంతో తెలుగు కవిత్వానికి మేలు చేస్తారని శుభం పలుకుతూ….