గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాచీన కట్టడాలు కూలిపోతున్నాయి. విగ్రహాలు విరిగిపోతున్నాయి. గత సంవత్సరం మే నెలలో శ్రీకాళహస్తీశ్వరాలయ రాజగోపురం కూలిపోయింది. నిన్న, కుమారస్వామి విగ్రహం విరిగిపోయింది. అధికారుల అలసత్వానికి తోడుగా భక్తుల అత్యుత్సాహం, మితిమీరిన భక్తి తోడవడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంది.
పాత కట్టడాలు అన్న తర్వాత ఎప్పుడోకప్పుడు కూలిపోవలసిందే అని వేదాంతం చెప్పేవారు ఉంటారు. కానీ 500-600 ఏళ్ళ కట్టడాలు ఏమంత పాతది కాదు కూలిపోనివ్వడానికని ఆలోచించేవారు తక్కువే ఉంటారు.
గ్రీసుదేశంలో ఒకటో శతాబ్దంలో కట్టిన కొల్లోజియం ఈనాటికీ మనం చూడవచ్చు. అలాగే క్రీస్తుపూర్వం 400-450లో కట్టిన ఏథెన్స్ పార్థినాన్ ఇప్పటికీ సజీవంగా కనబడుతుంది. రెండువేల సంవత్సరాల పైబడ్డ వయసువున్న ఈ కట్టడాలు అక్కడక్కడా కూలిపోవడానికి లెక దెబ్బతినడానికి అక్కడి వారి నిర్లక్ష్యం కారణం కాదని భీకరమైన భూకంపాలు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలే కారణమని చరిత్ర చెబుతోంది. కానీ కాళహస్తి, శ్రీశైలం లో జరిగిన ప్రమాదాలు మాత్రం పూర్తిగా మానవ నిర్లక్ష్యమే! ఇక్కడే మనకు తెలుస్తుంది చరిత్ర పట్ల మనకు ఉన్న శ్రద్ధ.
తిరుచానూరు నుండి పళ్ళిపట్టుకు వెళ్ళేదారిలో రోడ్డుకు ఎడమవైపు ఒక కొండ, దానిపై ఒక శిధిలాలయం కనబడుతుంది. ఆ ఆలయం గురించి చరిత్ర ఎవ్వరికీ తెలీదు. స్థానికులు “వకుళమాల” గుడి అని చెబుతారు. వకుళమాల వేంకటేశ్వర స్వామికి తల్లివంటిది. వల్మీకంలో తపస్సు చేసుకొంటున్న వేంకటేశుడిని చోళరాజు వద్ద పనిచేసే పశుపాలుడు గొడ్డలితో కొడతాడు. రక్తంధారలతో తిరుమల అడవుల్లో తిరిగుతూ వకుళమాల కుటీరానికి చేరుకొని, అక్కడే ఆవిడ కొడుకుగా ఉండిపోతాడు వేంకటేశ్వరుడు. ఆ కట్టడాన్ని చూస్తే దాదాపు 500-600 ఏళ్ళ పురాతనమైనదనే అనిపిస్తుంది. దూరం నుంచే చూపుల్ని ఆకట్టుకునే ముచ్చటైన రాతి కట్టడం అది. కానీ ఇప్పుడు ఆ గుడికి చేరుకోవడం దాదాపు అసాధ్యం. బిల్డింగులు కట్టడానికి అవసరమయ్యే కంకర కోసం ఆ గుడి చుట్టూ ఉన్న కొండను తోడేసారు. అదృష్టవశాత్తు ఆ గుడిని కూలగొట్టకుండా వదిలేసారు.
అదే రోడ్డులో ఇంకాస్త ముందుకు వెళితే కృష్ణదేవరాయలు నిర్మించాడని చెప్పే పెద్ద చెరువు వస్తుంది. ఆ చెరువు కూడా సరైన నిర్వహణకు నోచుకోవడంలేదు.
హంపీలోని ప్రతి కట్టడం కొక్కిరి రాతలు, love symbols, పేర్లు వగైరాలతో నిండిపోయి ఉంటుంది. తిరుమలకు నడిచివెళ్ళే దారిలో కూడా ఇలాంటి వెకిలి రాతలు మనం చూడవచ్చు.
చంద్రగిరి కోట గోడలు ఇళ్ళు కట్టుకొనే రభసలో కూలిపోతున్నాయి. కొన్నాళ్ళ క్రితం ఆదోని (కర్నూలు
జిల్లా)లో ఉన్న కోటను చూశాను. అది కూడా ఆక్రమణలకు గురై, డెబ్బై శాతం కూలిపోయిన స్థితిలో ఉంది.
మనమే మన చరిత్రను, వారసత్వ సంపదను ఇలా అవమానిస్తే ఎలా అన్న ప్రశ్న చాలామందికి కలగదు. ఇది నిజంగా విచారించదగ్గ విషయం.
ఇంతకూ పురాతన కట్టడాలను ఎందుకు రక్షించుకోవాలి?
ఇది అర్థం చేసుకోవడం చాలా సులువు. మీరొక ఖాళీ జాగాను కొని, అందులో కష్టపడి ఒక ఇంటిని కట్టారనుకోండి. అది మీకు ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతుంది. మీకు, కుటుంబానికి నీడనివ్వడంతో బాటు రక్షణను ఇస్తుంది. అలాగే ఆర్థికపరంగా అదొక asset అవుతుంది. ఆ ఇంటిని మీరు మీ అభిరుచి కొద్దీ అలంకరించితే మీ తర్వాతి తరంవాళ్ళు ఆ అభిరుచిని కాపాడుకొని వస్తారు. ఎందుకంటే మీ అభిరుచి మీ వరకే పరిమితం కాకుండా మీ తర్వాతి తరంవాళ్ళకూ నచ్చి ఒక వారసత్వంగా వచ్చింది.
అలానే మన పూర్వీకులు నిర్మించిన ప్రతి కట్టడం వెనుక వారి శ్రమ, తెలివి, అభిరుచి, కళాత్మక నైపుణ్యం మొదలైనవి ఉన్నాయి. పూర్వంలో మహరాజులు, మంత్రులు, దండనాయకులు, జమీందారులు తమతమ వ్యక్తిగత విలాసాల కోసం కట్టుకొన్న మహళ్ళు కానీ లేక సమాజం కోసం కట్టిన దేవాలయాలు, చావళ్ళు, మొదలైనవి గానీ తర్వాతి తరాల వారికి వారసత్వ సంపద (cultural assets)గా మిగులుతాయి. కాబట్టి వాటిల్ని మనం తప్పకుండా కాపాడుకోవాలి.
వారసత్వమంటే తెలుగు సినిమాల్లో చూపించే విధంగా మీసాలు మెలేసి, మెడలు నరికే మనస్తత్వం కాదు. మెదడుకు పదునుబెట్టి, కళ్ళకు విందు చేసి, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వివిధ కళా రూపాలే సిసలైన వారసత్వం. ఆ విషయంలో మన పూర్వీకులు తెలుగువాళ్లకు ఎంతో మిగిల్చివెళ్ళారు. కాకిపిల్ల కాకికైనా ముద్దొస్తుందేమో గానీ మన కళా వారసత్వం మనకే ముద్దు రావడం లేదు. అది కొత్త తరాలు చేసుకొన్న పాపమే!
@@@@@
pay per click