ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

‘చేతి’లో… చీపురేసి చెప్పు ఆ.ఆ.పా!

Like-o-Meter
[Total: 1 Average: 3]

 

చేతిలో… చీపురేసి చెప్పు ఆ.ఆ.పాచేసినన్ని బాసలు చెరిగిపోవనీ, మరచిపోననీ…

 

కాపురం చేసే కళ కాలు పెట్టిన రోజే తెలుస్తుందని… ‘చేతికి’ చీపురిచ్చిన ఆమ్ఆద్మీ ఢిల్లీని ఏదో ఉద్ధరిస్తుందనుకోవటం భ్రమల్లో బతకటమే! కాంగ్రెస్ ఊదే గాలితో ఆమ్ఆద్మీ బూర ఎన్నాళ్ళుంటుందో ఊహించటం సాధ్యం కాదు. ఢిల్లీ ఓటర్లు 35 శాతం ఓట్లు 31 సీట్లతో భా.జ.పా.నూ, 30 శాతం ఓట్లు 28 సీట్లతో ఆ.ఆ.పా.నూ గెలిపించటానికి ముఖ్యకారణం ఢిల్లీని కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి విడిపించాలనే!

 

ఇన్నాళ్ళూ అవినీతికి వ్యతిరేకమంటూ వచ్చిన ఆమ్ఆద్మీ, ఈరోజు అధికారానికి దాసోహం అనటం ఆ పార్టీ విశేషంగా ఆకర్షించిన మధ్యతరగతి వర్గానికి చెంపపెట్టు. దానికితోడు, ఏ కాంగ్రెస్‌నైతే సాగనంపారో, అదే కాంగ్రెస్ దొడ్డితలుపులు తీసుకొని రాగలదని, ఆమ్ఆద్మీనే ఆ తలుపులు తీసిపెడతాడని ఊహించి కూడా ఉండరు!

 

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే, ఆ.ఆ.పా. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బేషరతు మద్దతు ఇస్తామని తరీక్ అహ్మద్ ప్రకటిస్తే, ఆమ్ఆద్మీని చూసి చాలానే నేర్చుకోవాలని రాహుల్ ప్రకటించాడు. ఆమ్ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యిందనే వార్తల మధ్య, తమ మద్దతు బేషరతు కాదనీ, అంశాలవారీ మద్దతేనని షీలాదీక్షిత్ ప్రకటించటం, ఆమ్ఆద్మీకి మద్దతు నిరసిస్తూ, ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలు, రాబోయే కాలంలో ఆడబోయే నాటకాలకు నాందీ వాక్యం పలకటమే!

 

రోజుకో మాటతో రాజకీయ నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నాలలో అరవింద్‌కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్‌కు తీసిపోలేదు. కాంగ్రెస్, భా.జ.పా.లు రెండు అవినీతి పార్టీలని, ఆ రెంటికి దూరంగా ఉంటామని ప్రకటించి పది రోజులు కాకుండానే ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని నిర్ణయించటం ఢిల్లీలోని ఆమ్‌జనతాకు మింగుడుపడదు. పేలవమైన పద్ధెనిమిది షరతులతో ఆ రెండు పార్టీలకు పత్రాలు పంపటం కూడా ప్రజలను మభ్యపెట్టటానికే అన్నది ఇప్పుడు తేటతెల్లం. ఆ పద్ధెనిమిది షరతుల్లో ముఖ్యమైన కరెంటు బిల్లులో 50 శాతం కోత, రోజుకు 700 లీటర్ల మంచినీటి సరఫరా లేకపోవటం ఆశ్చర్యకరం. నిర్ణయాలలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తున్నామని చూపించటానికే, తీసుకోబోయిన ఆ నిర్ణయానికి 25 లక్షలమందితో సర్వేలని, ఎస్సెమ్మెస్‌లనే నాటకానికి కూడా తెరదీసాడు. రాజకీయాల్లో పారదర్శకత మీద లెక్చర్లు ఇచ్చిన పెద్దమనిషి తమ ఈ నిర్ణయాన్ని మాత్రం ఏమాత్రమూ పారదర్శకత లేకుండా తీసుకున్నాడనేది కూడా నిజం.

 

ఇలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆ.ఆ.పా. కామన్‌వెల్త్ కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ చేయించగలదా? ఒకవేళ చేసినా, ఆ.ఆ.పా. ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు కొనసాగించగలదా? మద్దతు విరమిస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఎలాగూ ఏర్పడుతుంది కదా! ఆ ఎన్నికలేవో ఇప్పుడే వెంటనే తేలిస్తే సరిపోదా? ఆ.ఆ.పా. చింతనా శిబిరాలలో ఇవేమీ చర్చించలేదా? మొన్నటి ఒక ఇంటర్వ్యూలో ఆ.ఆ.పా. నేత ప్రశాంత్ భూషణ్ కాంగ్రెస్ ఇచ్చే సమర్ధన ఎన్నాళ్ళు కొనసాగుతుందో అనే అనుమానాన్ని అప్పటికే వెలిబుచ్చాడు. అయినా, కాంగ్రెస్ మద్దతు తీసుకోవటంలోని ఆంతర్యం ఏమిటి?

 

ఇవన్నీ చూస్తుంటే, అసలు ఆమ్ఆద్మీపార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, ప్రజలకు అర్ధవంతమైన పరిపాలన ఇవ్వాలని మొదలుపెట్టారా, లేక రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లోనయినా నరేంద్రమోడీ గెలవకుండా ఉండటానికి కాంగ్రెస్ రచించిన వ్యూహంలో భాగమా అనే అనుమానాలు పొడచూపుతున్నాయి. నోటి తీట తీర్చుకోటానికి నరేంద్రమోడీని ఎన్ని మాటలైనా అనటానికి సాహసించే దిగ్విజయ్‌సింగే మోడీ ప్రభుత్వంలో అవినీతి మంత్రులు ఉన్నారని అన్నాడే కానీ, మోడీయే అవినీతిపరుడని ఏనాడూ అనలేదు! 2002 ను బూచిలా చూపించి, నరేంద్ర మోడీ మతవిద్వేషాన్ని ప్రదర్శిస్తాడనే అన్ని పార్టీలు అంగలారుస్తూ ఉన్నాయి కానీ, మోడీ అవినీతిపరుడని అవి ఎప్పుడూ అనలేదు. అటువంటిది, నరేంద్ర మోడీ అవినీతిపరుడని మొట్టమొదటిసారిగా ప్రకటించింది ఆ.ఆ.పా.! అలానే, ఢిల్లీ ఎన్నికల్లో 28 సీట్లు నెగ్గగానే, రాబోయే ఎన్నికల్లో గుజరాత్‌లోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని అరవింద్‌కేజ్రీవాల్ ప్రకటించాడు కానీ, మరే ఇతర రాష్ట్రాన్ని ప్రస్తావించలేదు.

 

తననో లౌకికవాదిగా నిరూపించుకోటానికి ఢిల్లీ ఎన్నికల ముందు మౌలానా తకీర్ రాజాతో సమావేశమవ్వటం నుంచి, ఓ స్టింగ్ఆపరేషనులో చిక్కిన తన అనుయాయులను రక్షించుకోటానికి అంతర్గత కమిటీ ఏర్పాటు వరకు, ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్-భా.జ.పా. దొందూదొందే అనటం నుంచి, నేడు కాంగ్రెస్ మద్దతు కూడగట్టటం వరకూ, అరవింద్‌కేజ్రీవాల్ వేస్తున్న ప్రతి అడుగు కాంగ్రెస్ బాటలోనే! ఇవి కాకతాళీయమా, లేక మరేవైనా ‘ప్రధాన’ కారణాలున్నాయా? ఏదేమైనా, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా భావించబడ్డ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి అవినీతి అంశాన్ని అటకెక్కించి, చిలుకపలుకుల్లా లౌకికవాదాన్ని పలవరించినా ఆశ్చర్యంలేదు. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పక్షంగా మారినా ఆశ్చర్యం అంతకన్నా ఉండబోదు.