ఎందుకు? ఎందుకిలా జరుగుతోంది? సమాజం ఎటువైపు పోతోంది?
మగవాడి నైచ్యానికి అంతే లేదా? వయసుకు తగినట్లు మనసు పెరగదా? కామప్రకోపాలకు హద్దులేదా?
అతనిలోని మానవత్వం చచ్చిపోయిందా? లేక అసలు మానవత్వమే లేదా? ఎంచుకున్న వృత్తి ఏమిటి? చేస్తున్న పని ఏమిటి?
ఇంక ఇటువంటి ఉపాధ్యాయులు ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించగలడు ? పిల్లల్లో నైతిక విలువలు ఎలా పెంపొందింప చేయగలడు? ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఎలా చేపట్టగలడు?
అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు
వాడి పిల్లల వయసున్న పిల్లలను కామంతో ఎలా చూస్తున్నాడు? ఆ పసిపిల్లలను చూస్తుంటే మనోవికార చేష్టలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి? తరగతి గదిలోని ఆడపిల్లలు కామప్రతీకలా వాడికి? వాడి శరీరానికి ఆటవస్తువులా? ఆ కామాంధుని చేతికి చిక్కిన చేపపిల్లలా? పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు?వయసుకు తగిన ప్రవర్తన సాధ్యం కాదా?
ఇటువంటి ఉపాధ్యాయుడుంటే తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని చదివించడానికి పాఠశాలకు పంపిస్తారా? ఆడపిల్లల భవిష్యత్తు ఏమైపోతోంది? అసలు వారికి భవిష్యత్తు ఉంటుందా ? ఆడపిల్లల్ని చదివించుకోవాలనే కోరిక కూడా అత్యాశేనా? ముందు ముందు ఆడపిల్లలు గడప దాటే అవకాశాలు కూడా ఈ సంఘటనలవల్ల మృగ్యమైపోతాయేమో?
తల్లి, తండ్రి, అన్న, తాతయ్య, మామయ్య, బాబాయి – ఇలా ఎవరు వెంట ఉన్న ఆడపిల్లలను కాపాడుకోలేక పోతున్నారు ఎందుకు? కౄరమృగాల మధ్య సంచరిస్తున్నామా ? లేక సమాజంలోనే ఉన్నామా ? వాడి పిల్లల్నైతే పసిపిల్లల్లా భావిస్తాడే ? వాడి పిల్లలైతే చల్లగా ఉండాలే ? వాడి పిల్లల వంక ఎవరైనా చూస్తే కళ్ళెర్ర బడతాయే ?వారిపై వువ్వెత్తునలేచి మండిపడతాడే ? వాడి అక్క,చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలే ? వాడి భార్య పవిత్రంగా ఉండాలే ? మరి ఇతరులు ?
వాడి నీచ ఉద్ధేశ్యానికి ప్రత్యక్ష సాక్షి వాడి అంతరాత్మే కదా? ఏం సాధించడానికి ఈ నికృష్టపు చేష్టలు ? ఇటువంటి వాడి చొక్కా చింపి,
చెప్పులతో కొడితే సరిపోతుందా ? చెరసాలలో పెడితే సరిపోతుందా? సస్పెండ్ చేస్తే సరిపోతుందా ? తమ సహచర ఉపాధ్యాయుడు ఇటువంటివాడా ? అని తోటి ఉపాధ్యాయినులు అసహ్యించుకోరా ? వాడి భార్య ఆ ఆడపిల్లల స్థానంలో తన పిల్లలను ఊహిస్తే ఎలా స్పందిస్తుంది ? తన భర్త అని చెప్పుకోవడానికి సిగ్గు పడదా ? మా అన్న అని చెప్పుకోవడానికి ఆ అక్కచెల్లెళ్ళు సిగ్గుపడరా ? అతని కుటుంబ సభ్యులు నిజాయితీగా ఆలోచిస్తే వారి ముందు నిలబడగలడా ? నా కొడుకే అని చెప్పుకోవడానికి ఆ తల్లి మనసు ఎంత క్షోభిస్తుందో కదా ?
వాడి నికృష్ట చేష్టలకు వాడిపోయిన ఆ ఆడపిల్లల్ని చూసి వాడి తల్లి నిష్పక్షపాతంగా ఓ తల్లిలా నిలబడితే, వాడి కుత్తుక నరికే మొదటి వ్యక్తి వాడి తల్లి కాక మరెవరు ? ఆ తల్లే ” మదరిండియ” కాదా ? తల్లీ !ఈ భూమి మీది బిడ్డలందరూ నీ బిడ్డలనే భావిస్తావు కదూ ?
*********
దొరికితే దొంగలు -దొరకకుండా
దొరల్లా మిగిలిన వారెంతమందో కదా ?
బయటకు చెప్పుకోకుండా ఉన్న
ఆడపిల్లల్లెంత మందో కదా ?
******