ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఎన్నికలు – మరో ప్రహసనం

Like-o-Meter
[Total: 0 Average: 0]

దాదాపు నెల రోజుల క్రితం అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే ఉద్యమం మొదలేసారు. దాదాపు అదే సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగించాయనేది నిర్వివాదాంశం.

 

గత్యంతరంలేని పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలు అన్నా హజారేకు మద్దతు తెలపడం, వెను వెంటనే కేంద్ర ప్రభుత్వం అన్నా కోర్కెలకు అనుగుణంగా స్పందించటం జరిగిపోయాయి. ఎన్నికల ఫలితాలు గమనిస్తే, ఒక్క అస్సాం మినహాయించి, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆయా రాష్ట్రాలలోని అధికార పార్టీలకు తిలోదకాలు ఇచ్చేసారు.

అయితే, ఈ ఎన్నికల ఫలితాలు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వేసిన ఓట్లుగా భావించాలా అంటే చెప్పటం కష్టం. ఎందుకంటే, పశ్చిమ బెంగాల్ లో యు.పి.ఎ. భాగస్వామ్య పార్టీ తృణమూల్ ను ప్రజలు ఆదరిస్తే, తమిళనాడులో డి.ఎం.కె.ను ప్రజలు తీసి అవతల పడేసారు. అస్సాంలో కాంగ్రెస్ కు మళ్ళీ పట్టం కడితే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంటు ఆటూ ఇటూ దేకి చిట్టచివరికి అధికారం కైవసం చేసుకున్నామనిపించింది బొటాబొటీ మెజారిటీతో.

కేంద్రంలో అవినీతిమయమైన యు.పి.ఎ. ప్రభుత్వాని కన్నా, రాష్ట్రంలోని అవకాశవాద, అసమర్ధ కమ్యూనిస్టు ప్రభుత్వమే అత్యంత ప్రమాదకారిగా భావించి పశ్చిమ బెంగాల్ ప్రజలు కమ్యూనిస్టుల భరతం పట్టారనుకుంటే,, కేంద్రంలో బందిపోట్ల మాదిరిగా దోచుకున్న కరుణానిధి పార్టీకన్నా, రాష్ట్రంలో జేబుదొంగలాంటి జయలలిత పార్టీనే మేలని తమిళనాడు ప్రజలు అభిప్రాయపడినట్లు అనుకోవచ్చేమో.

ఏది ఏమైనా, ఎన్నికలు మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టకుండా ఓ ప్రహసనంలా మాత్రం తయరయ్యాయని చెప్పవచ్చు. ఒక రూపాయికి కిలో బియ్యం ఇస్తామని ఒక పార్టీ ప్రకటిస్తే, అదే రూపాయికి అయిదు కిలోలు బియ్యం ఇస్తామని మరో పార్టీ ప్రకటించటం; ఒక పార్టీ కొందరికి కంప్యూటర్లు ఇస్తామంటే, మరో పార్టీ అందరికీ ఇస్తామని ప్రకటించటం ఎన్నికలను పరిహాసాస్పదం చేసేవే. పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలు, ఉచిత వరాలందించే కరపత్రాలుగా తయారయ్యాయి.

ఇన్ని ఉచితంగా అందించే ప్రభుత్వాలు, పెరుగుతున్న ధరలను ఎందుకు నియంత్రించలేవో మనం అడగం! ఈ విషయంలో పార్టీలను విమర్శించటం కన్నా, ప్రజలుగా మన దివలాకోరుతనాన్ని మనం ముందుగా ప్రశ్నించుకోవాలి.

మన దురదృష్టం కొద్దీ, ప్రస్తుత పార్టీలన్నీ కాంగ్రెస్ తానులో గుడ్డలే. ప్రజల మేలు కోరే ప్రధానులు, ముఖ్యమంత్రుల కన్నా, వారి వారి పదవులను, ప్రభుత్వాలను కాపాడుకొనే “మేధావులే” ఎక్కువ. అవినీతి వల్ల, ఈసారి పదవులు కోల్పోయినా, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వపు అవినీతికి వ్యతిరేకంగా మళ్ళీ మనకు పట్టం కడతారనే ఈ పార్టీల ధీమా కూడా!

మన ఆలోచనా ధోరణులలో విప్లవాత్మకమైన మార్పులు రానంతవరకూ ఈ పార్టీలు మనని, మన ప్రజాస్వామ్యాన్ని పరిహాసాపాత్రంగా దిగజారుస్తూనే ఉంటాయి.