హైదరాబాద్ లోనే అన్నీ కావాలి కాని ఇప్పుడు ఇక్కడ నీరు లేదు. అందుకోసం నీటిని వందల కి.మీ. దూరం నుండి తరలించాలి., చేసిన తప్పుకు ఇంకొక తప్పు. నదులు ఉన్న చోట అభివృద్ది జరగాలి అది జరగడం లేదు కానీ నీరు లేని చోట అభివృద్ది !! మానవ నాగరికతకు నదులు ఆధారాలు / మాతృకలు వాటికి దూరంగా ఉన్న నగరాలలో నాగరికత మనం సాధించిన ఘనత!!!
నదులను కలుషితం చేయడం లో మనం సాధించిన ప్రగతి అనన్య సాధ్యం. పూర్వం అసురులు సైతం చేయలేని స్థాయిలో మనం కలుషితం చేసాం. ఎందుకంటే అసురులు చేసిన కాలుష్యం కేవలం మల మూత్రాలు, రక్త మాంసాలు, మొ.లగు పాంచభౌతిక వస్తువులే వాడారు కాని మనం ఎంత ప్రగతి సాధించామంటే భౌతికంగా అవి పంచభూతాలలో కలవడానికి వీలులేని పదార్ధాలను సృష్టించి విర్రవీగుతున్నాం. ఇది మన నాగరికత. ఇదే మన అభివృద్ధి!
అభివృద్ది అనేది లక్షల ఉద్యోగాల కల్పనా, పావలా వడ్డీలలో మాత్రమే ఉండేది కాదు. మన సహజ వనరులను కాపాడుకొంటూ వాటిని ఆధారం చేసుకొని జీవించగలగడంలో అసలైన అభివృద్ధి ఉందనేది నా గట్టినమ్మకం. చుక్క నీరులేని నాడు, పిడికెడు నీడ దొరకని నాడు ఈ కాంక్రీటు మిద్దెలలో, ఏసీ గదుల్తో మనం బావుకునేదేముంది? గనుల త్రవ్వకం పేరుతో అడవుల్ని ధ్వంసం చేసాక, ప్రకృతి అంటే కంప్యూటర్ స్క్రీన్ సేవర్లలోనే చూసుకోవాలేమో!
ఏది సులభమో, ఏది సహజమో అది మనకు గిట్టదు. ఏది క్లిష్టమో ఏది అసహజమో అదే మనకు కావాలి. ఉదా: మట్టి కప్పులు, గిన్నెలు మనం వాడం. మనకు ప్లాస్టిక్ వస్తువులే కావాలి. ఆఖరికి మన బతుక్కి ప్లాస్టిక్ పువ్వులూ, చెట్లూ ఇళ్ళలో ఉంచుకోవడానికి ఎంతో ధనం వెచ్చించి కొనుక్కోగలగడం గొప్ప ఐపోయింది. ప్రభుత్వమెమో ప్లాస్టిక్ సంచుల్ని బ్యాన్ చేస్తుంది. తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాల్లో ప్లాస్టిక్ నిషేధం పై పెద్దపెద్ద బోర్డులు పెట్టి మరీ చెప్పాల్సివస్తోంది.
- మురుగునీటి వ్యవస్థను రాష్ట్రమంతా పగడ్బందీ గా నిర్మించి, అమలు చేసి, శుద్ది చేసే ప్రక్రియలను విజయవంతంగా నడిపి తద్వారా మొక్కల పెంపకానికి ఉద్యానవన నిర్వహణకు శుద్ది చేసిన నీటిని వాడి పరిమితమైన నీటి వనరుల్ని సద్వినియోగం చేయడం.
- రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులలో కాలుష్యాన్ని నివారించడం తద్వారా మన నదులను గౌరవించి, దేశం మెచ్చదగ్గా రీతిలో మన రాష్ట్రాన్ని మార్చడం.
- రాష్ట్రంలో ఉన్న ప్రతి నీటి వనరుని (కాలువలు, చెరువులు, బావులు మొ.వాటిని ) పరిరక్షించి తద్వారా అధికంగా నీరు లభ్యమయ్యేలా చూడడం. నీటి నిలువలను పెంచి భూగర్భ జలాల స్థాయిని పెంచడం.
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములలో సామాజిక వనాలను, పండ్ల మొక్కలను, కూరగాయలను – భూసారాన్ని పర్యావరణ సమతౌల్యాన్ని అనుసరించి – స్థానిక సభ్యుల సహకార కమిటీ ల ద్వారా పెంచి పోషించడం/విక్రయించడం. రాష్ట్రంలో వినియోగంలో లేని రైల్వే భూములను రైల్వే శాఖ తో ఒప్పొందం కుదుర్చుకొని సద్వినియోగంలోకి తేవడం.
- పటిష్టమైన రీతిలో వ్యక్తిగత మరుగు దొడ్లను ప్రతి ఇంటికి ఏర్పాటు చేసి బహిర్భూమి అనే భావనను తెలుగు ప్రజల మనోభావలనుండి విడుదల చేయడం తద్వారా తెలుగు గౌరవాన్ని పరిరక్షించడం. నగరాలలో శుచి తో కూడిన మరుగు దొడ్లను నిర్మించి చక్కగా నిర్వహించడం.
- తాగు నీటికి మైల్లకొలదీ నడిచే అగత్యాన్ని రాష్ట్రం మొత్తం మీద నివారించడం తాగు నీటి లభ్యత జన్మ హక్కు గా పరిగణించడం.
- నగరాలలో అధిక శాతంలో సామాజిక వనాలను పెంచడం. ఇందుకోసం ప్రస్తుతమున్న ఇరుకు కాంక్రీట్ అరణ్యాలను కుదించి (అనగా కొన్ని నివాసాలను కూల్చి వారికి అదే చోట అపార్ట్మెంట్లు కట్టించి ఇచ్చి) తద్వారా సామాజిక వనాలను పెంచి నీరు భూగార్భంలోకి వెళ్ళేలా చూడడం . ఇది ప్రభుత్వ నిర్భంధ వ్యవస్థ మార్చి అవినీతి లేని రీతిలో అమలు చేసి మన ఇరుకు, మురుగు, పట్టణ రూపు రేఖల్ని మార్చడం . దీనికి ఒక సమగ్ర చట్టాన్ని చేసి అమలు చేయడం.
- అభివృద్ది సమతౌల్యాన్ని సాధించడం. ఇకపై రాజధాని నగరంలో ఏ విధమైన పరిశ్రమ కూ అనుమతి ఇవ్వక ఇతర పెద్ద పట్టణాలలో అనుమతులు చాల ఆకర్షణీయమైన రాయతీలతో ఇవ్వడం
- వచ్చే 5 సం. లో ఈ సమతౌల్యతను గణనీయమైన రీతిలో సాధించడం.
- ప్రతి పల్లెలో అన్ని మౌలిక వసతులు రహదారులు నిర్మించి వాటిని దగ్గరలోని పట్టణాలకు చక్కగా అనుసంధానం చేయడం తద్వారా పల్లెలకు తిరిగి పదవీ విరమణ అనంతరం వచ్చి నివసిన్చేదుకు ఆకర్షణ కలిగేలా చేయడం.
- వృద్ధులైన తల్లిదండ్రులతో జీవనం సాగించే వారికి వివిధ పన్ను రాయతీలు ఇవ్వడం తద్వారా వృద్ధులకు చరమ దశలో గౌరవ ప్రదమైన ప్రేమపూరితమైన జీవితాన్ని ఇవ్వడం.
ఔను ఎప్పుడో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆలోచించాల అని చాల మంది అనుకుంటారు. మనం తాత్కాలిక ఆలోచన కేవలం ఎన్నికల సమయంలోనే దేశం / రాష్ట్రం / జిల్లా / మండలం / పట్టణం / గ్రామం గురించి తొందర తొందరగా ఆలోచించి వోట్ వేయడానికి సమాయత్త మౌతాము. ఈ బలహీనతే మన రాజకీయ నాయకులకు చక్కని ఆలంబనమై, కలసి వచ్చిన అదృష్టం గా దశాబ్దాలుగా సామాజిక అసమానతలకు మాతృక అయింది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలు ఏ విధం గా గొప్పవో మనం వాటి ఫలితాలు వచ్చాక తెలుసుకుంటాము. ఈ నేపధ్యం లో ఈ వ్యాసం ద్వారా కనీసం కొందరితోనైనా నా ఆలోచనల్ని పంచుకోవాలనే నా ప్రయత్నం.