Like-o-Meter
[Total: 1 Average: 4]
వేదభూమి అయిన భారతదేశంలో పాలన, భోగభూములలో జరిగే పాలనకు సమాంతరంగా ఉండాలని చేసే ప్రయత్నంలో దేశంలో భ్రష్టాచారం వేళ్ళూనుకొనిపోయి మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మారి మన సంస్కృతీ సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చే రీతిన దిగజారిపోయింది. ఇది ఎంత స్థాయికి పోయిందో మన ప్రభుత్వ పాలన లేశమాత్రంగా గమనిస్తే తెలుస్తుంది. ఇందుకు మనం మన జాతీయ దినాలను ఒక సారి పరిశీలిద్దాం.
- జనవరి 26 మనం గణతంత్ర దినం
- ఆగస్టు 15 మనకు స్వతంత్రం లభించిన దినం
- అక్టోబర్ 2 మన జాతి పిత గాంధి జయంతి.
ఈ మూడు మన జాతీయ సెలవు దినాలు.
ఇకఅంబేద్కర్ జయంతి, బాబు జగ్జీవన్ రాం జయంతి జాతీయ సెలవు దినాలు గా ప్రకటించక పోనప్పటికి ప్రతి సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వం వాటిని సెలవు దినాలుగానే ప్రకటిస్తూ వస్తుంది.
మన దౌర్భాగ్యం ఏమంటే ఈ భారత జాతి మనుగడకు వేదజ్ఞాన విస్తరణకు తద్వారా సనాతన ధర్మ పరిరరక్షణకు ముఖ్యంగా ఒక మనిషి ఎలా ధర్మబద్ధంగా జీవనాన్ని గడపాలో తెలియజేయడానికి భగవానుడు స్వయంగా మానవుడిగా అవతరించి, తను ఆచరించి ఇతరులకు బోధించినన అవతారం రామావతారం. ఈ రోజు మన భారతజాతి యావత్తు ఈ అవతార ప్రాధాన్యతను గుర్తించలేని స్థితికి వెళ్ళిపోయింది. అందుకే రాముడి పుట్టినరోజు కూడా మన జాతి అంత విలువైన దినంగా భావించడంలేదు.
ముఖ్యంగా మనం సృష్టించుకున్న పాలనా వ్యవస్థ మన సనాతన వ్యవస్థను మరచిపోయేలా చేస్తుంటే దానికి తోడు మన కుహనా లౌకికవాదం మన ఉనికికే ప్రశ్నార్థకంగా మారుస్తున్న తరుణంలో మన భారతజాతి యావత్తు ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి.
ఇందుకు మనం ముఖ్యంగా ప్రపంచానికి చాటవలసింది మన క్రియల ద్వారానే . అందులో భాగంగా మన జాతీయ సెలవు దినాలను 5 గా మార్చాలి. శ్రీ రామ నవమి, శ్రీ కృష్ణాష్టమి మన భారత జాతి యావత్తు ఘనం గా జరుపుకోవాలి.
ఇందుకు మనం ముఖ్యంగా ప్రపంచానికి చాటవలసింది మన క్రియల ద్వారానే . అందులో భాగంగా మన జాతీయ సెలవు దినాలను 5 గా మార్చాలి. శ్రీ రామ నవమి, శ్రీ కృష్ణాష్టమి మన భారత జాతి యావత్తు ఘనం గా జరుపుకోవాలి.
మనుష్యజన్మనెత్తి ఒక మనిషి ఎలా సత్యంగా, ధర్మంగా, సువిద్యను గురుముఖతః అభ్యసించి రాశీభూతమైన ధర్మంగా మసలవచ్చో చూపించిన అవతారం శ్రీ రామావతారం. రామాయణం ఒక కథగా దానిలో రాముడు ఒక కథానాయక పాత్రగా జాతిని భ్రమింపజేసే పాలనా వ్యవస్థ శ్రీ రామ నవమి ఉత్కృష్టతను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైనది అని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. ఈ జాతి జాగృతమయ్యే రోజు ఎప్పడంటే మనం ఎన్నుకొని పాలించమన్న రాజకీయ నాయకులు మన సనాతన సాంప్రదాయాలను ముఖ్య తిధులను గుర్తెరిగి తగురీతి వాటిని మన జనజీవన స్రవంతిలో భాగంగా చేయగలిగినప్పుడే.
ఇందుకు మనం ప్రతి సంవత్సరం తప్పనిసరి జాతీయ సెలవు దినాలుగా ప్రకటించ వలసిన తిథులు శ్రీ రామనవమి మరియూ శ్రీ కృష్ణాష్టమి.
జగద్గురువై మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో అర్జునునికి గీతోపదేశం చేయడం ద్వారా మానవజాతి ఎదుర్కొనే అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని మనిషిగా తెలుసుకోవలసిన జ్ఞానాన్ని సాక్షాత్తూ భగవానుడే కృష్ణావతారాన్ని ఆధారంగా చేసుకొని ఉపదేశించాడు. అటువంటి అవతార ఆవిర్భావ దినమైన ఆ అష్టమి తిధిని మన భారత జాతి ఘనంగా జరుపుకోవాలి.
మన గురు పరంపరకు మన వేదజ్ఞాన పరిరక్షణకు మూలస్తంభమైన సాక్షాత్తు విష్ణువు యొక్క అంశయైన వేదవ్యాస జనన తిథిని మన గురు పూజ్యోత్సవ దినంగా భావించి జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి.
పునర్జన్మను, భాగవత పురాణాన్ని ప్రామాణికంగా తీసుకున్న మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి మనం ముఖ్యంగా మన పితృదేవతల పట్ల గల మన శ్రద్ధను ప్రకటించడానికి పాటించవలసిన మరొక్క తిథి భీష్మ ఏకాదశి. భీష్మునకు తర్పణలు ఇవ్వడం ద్వారా మనం మన పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తాము.
వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, విజయదశమి, దీపావళి ఎలాగూ మనం పాటిస్తాము కనుక వాటిని కొత్తగా మన జాతీయ సెలవు దినాలలో చేర్చనవసరం లేదు. పైగా భారతీయుడిగా, వేదం ప్రమాణంగా భావించే ప్రతి వ్యక్తికి ఈ పండుగలు చేసుకోవడానికి సెలవు తీసుకొనే హక్కు ఉంది.
ఇది చాల మంది భారతీయుల ఆకాంక్ష అని అందరకూ తెలుసు.